ఇంటి గుట్టు రట్టు చేస్తా! | I will reveal details about the irregularities in DMK, says Alagiri | Sakshi
Sakshi News home page

ఇంటి గుట్టు రట్టు చేస్తా!

Published Sun, Jan 26 2014 3:23 PM | Last Updated on Sat, Sep 2 2017 3:02 AM

ఇంటి గుట్టు రట్టు చేస్తా!

ఇంటి గుట్టు రట్టు చేస్తా!

డీఎంకె పార్టీలో అన్నదమ్ముల మధ్య మొదలయిన వారసత్వ పోరు తారాస్థాయికి చేరింది. పెద్దాయిన తర్వాత పార్టీ పగ్గాలు ఎవరు చేపట్టాలనే దానిపై తమిళనాట రాజుకున్న రాజకీయ రగడ వీధికెక్కింది. దీంతో రంగంలోకి దిగిన రాజకీ య కురువృద్ధుడు కఠిన నిర్ణయం తీసుకున్నారు. పెద్ద కొడుకు అళగిరిపై వేటు వేయడం ద్వారా డీఎంకె అధినేత ఎం కరుణానిధి తన చిన్న కుమారుడు స్టాలిన్కు మార్గం సుగమం చేశారు. తన తర్వాత పార్టీ అధ్యక్షుడిగా చిన్న కుమారుడే బాధ్యలు చేపడతాడన్న సంకేతాలిచ్చారు.

అన్నదమ్ముల ఆధిపత్య పోరుకు ఎక్కడో ఒక చోట అడ్డుకట్ట వేయాలని భావించి కరుణానిధి అదునుచూసి పెద్ద కుమారుడికి చెక్ పెట్టారు. క్రమశిక్షణ ఉల్లంఘించారనే నెపంతో ఆళగిరిని పార్టీ నుంచి సాగనంపారు. ప్రాథమిక సభ్యత్వం సహా అన్ని పదవుల నుంచి ఉద్వాసన పలికారు. సినీ నటుడు విజయ్‌కాంత్ నేతృత్వంలోని డీఎండీకేతో పొత్తు ప్రతిపాదనకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఆయనపై ఈ చర్య తీసుకున్నట్టు తెలిపారు. అయితే ఈ ఎడబాటు తాత్కాలికమేనని మెలిక పెట్టారు.

ఆళగిరిపై వేటు వేయడం ద్వారా పార్టీ ముందు అందరూ సమానమే అని పెద్దాయన సంకేతాలిచ్చారు. అదే సమయంలో ఆళగిరికి పూర్తిగా తలుపులు మూసివేయకుండా జాగ్రత్త పడ్డారు. స్టాలిన్ నాయకత్వాన్ని అంగీకరిస్తే ఆళగిరికి మళ్లీ పార్టీలోకి ద్వారాలు తెరుచుకునే అవకాశాన్ని సజీవంగా ఉంచారు. ఆళగిరి సస్పెన్షన్తో అటు స్టాలిన్ కూడా వార్నింగ్ ఇచ్చారు. పార్టీ నిబంధనలు ఉల్లంఘిస్తే సొంత కొడుకులపై చర్య తీసుకునేందుకు వెనుకాడబోనన్న సంకేతాలిచ్చారు. తద్వరా అన్నదమ్ముల ఆధిపత్య పోరుకు తాత్కాలికం బ్రేకు వేశారు.

అయితే తనను అవమానించిన తండ్రి, సోదరుడుపై ఆళగిరి కారాలు-మిరియాలు నూరుతున్నారు. స్టాలిన్ చేతిలో కరుణానిధి కీలుబొమ్మగా మారారని ఘాటుగా విమర్శించారు. స్టాలిన్ పదవీ కాంక్షాపరుడు, అధికారం కోసం ఎంతకైనా తెగిస్తాడంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే మట్టి కరవడం ఖాయమని జోస్యం చెప్పారు. ఈ నెల 31న ప్రెస్‌మీట్ పెట్టి డీఎంకే లొసుగుల చిట్టా విప్పుతానన్నారని హెచ్చరించారు. తమిళనాడు రాజకీయాల్లో సుదీర్ఘ చరిత్ర కలిగిన డీఎంకే అధినేత సొంత సమస్యను ఎలా అధిగమిస్తారో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement