మళ్లీ వార్తల్లోకి అళగిరి
డీఎంకే బహిష్కృత నేత ఎంకే అళగిరి మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. తన సోదరుడు, డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్‌పై తనలో ఇంకా ఆవేశం రగులుతున్నట్టు చాటుకున్నారు. అధినేత కరుణానిధి లేకుంటే, డిఎంకే ఇక లేనట్టేనని వ్యాఖ్యానించారు.
చెన్నై : డిఎంకే అధినేత ఎం కరుణానిధి తనయులు ఎంకే అళగిరి, ఎంకే స్టాలిన్‌ల మధ్య ఏళ్ల తరబడి వార్ సాగుతూ వస్తున్న విషయం తెలిసిందే. వారసత్వ సమరంలో గెలుపు ఎవరిదోనన్నంతగా పరిస్థితుల గతంలో నెలకొన్నాయి. లోక్ సభ ఎన్నికల ముందు అన్నదమ్ముళ్ల మధ్య వివాదం ముదరడంతో చివరకు స్టాలిన్ వెనుక అధినేత ఎం. కరుణానిధి నిలబడక తప్పలేదు. అలాగే, పార్టీ నుంచి ఎంకే అళగిరిని బహిష్కరించారు. ఈ బహిష్కరణతో తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు సాగిస్తూ వచ్చిన అళగిరి కొంత కాలంగా మౌనం వహించే పనిలో పడ్డారు. కుటుంబ పెద్దలు అన్నదమ్ముళ్ల మధ్య సంధి కుదిర్చే ప్రయత్నాలు సాగుతున్నట్టుగా సంకేతాలు వెలువడ్డాయి.
అదే సమయంలో అళగిరి మౌనంగా ఉండటం, అన్నయ్యకు వ్యతిరేకంగా స్టాలిన్ స్పందించక పోవడంతో ఇక వీరి వివాద పరిష్కారం కొలిక్కి వస్తుందన్న ప్రచారం బయలు దేరింది. అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల ద్వారా అధికార పగ్గాలు చేపట్టి తీరాలన్న కాంక్షతో ఉన్న కరుణానిధికి అళగిరి రూపంలో ఏలాంటి చిక్కులు వస్తాయోనన్న ఉత్కంఠ సైతం డిఎంకే వర్గాల్లో నెలకొని ఉందని చెప్పవచ్చు. అయితే, అళగిరి మీడియాకు దూరంగా ఉండటంతో వ్యాఖ్యల వివాదాలకు ఆస్కారం లేకుండా వ చ్చింది. ఈ పరిస్థితుల్లో బుధవారం చెన్నైకు వచ్చిన అళగిరి మీడియా కంట పడడంతో తనకు స్టాలిన్ మీదున్న కోపం, ఆవేశం చల్లరాదలేదని చాటుకున్నారని చెప్పవచ్చు. స్టాలిన్‌పై సంధించిన ప్రశ్నకు తీవ్రంగానే స్పందించడం బట్టి చూస్తే, ఈ అళగిరి లో ఉన్న ఆక్రోశం అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకేకు ముచ్చెమటలు పట్టిస్తాయన్న బెంగ ఆపార్టీ వర్గాల్లో బయలు దేరి ఉన్నది.
కలలు కంటున్నాడు
ఉదయం మదురై నుంచి చెన్నైకు వచ్చిన అళగిరిని మీడియా చుట్టముట్టింది. ప్రశ్నల వర్షం కురిపించింది. అన్నింటికీ సమాధానం ఇస్తూ తనలో ఉన్న ఆక్రోశాన్ని వెల్లగక్కారు. ఇటీవల ఓ సంస్థ నిర్వహించిన సర్వే గురించి ప్రస్తావిస్తూ, డిఎంకే అధికారంలోకి వచ్చేనా..? అని ప్రశ్నించగా, ఏ సర్వే...? అంటూ ఎదురు ప్రశ్న వేశారు. స్టాలిన్ సీఎం పదవికి అర్హుడన్న ప్రచారం ఉందే, ఆయనకు డిఎంకే అధిష్టానం ఆ బాధ్యతలు అప్పగిస్తుందా..? అని ప్రశ్నించగా, స్టాలిన్ కలలు కంటున్నాడని మండిపడ్డారు.
సీఎం కావాలని ఆయన కంటున్న కలలు కల్లేనని వ్యాఖ్యానించారు. డిఎంకే అధికారంలోకి రావాలంటే, అధినేత కరుణానిధి నేతృత్వం తప్పని సరిగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. డిఎంకే అంటే కరుణానిధి మాత్రమేనని వ్యాఖ్యానించారు. కరుణానిధి ఉన్నంత వరకే డిఎంకే ఉంటుందని, ఆయన లేకుంటే డీఎంకే లేదు అంటూ ముందుకు సాగడం గమనార్హం.