'నన్ను వాడుకోవడం ఆ పార్టీకి తెలియదు'
ఒకవైపు తమ్ముడు రాకెట్ వేగంతో ప్రచారంలో దూసుకుపోతున్నాడు. ఎక్కడ చూసినా అతనే కనిపిస్తున్నాడు. అదే సమయంలో అన్న రాజకీయాల్లో మచ్చుకు కూడా కనిపించడం లేదు. ఎక్కడా ఏ ప్రచారంలోనూ ఆయన ప్రస్తావన లేదు. ఆయన ఊసే లేకుండా ఇప్పుడు తమిళనాడులో డీఎంకే ఎన్నికల ప్రచారం జరుగుతోంది. ఆ అన్నదమ్ములే ఎంకే స్టాలిన్, ఎంకే అళగిరి.
ఓవైపు తమ్ముడు స్టాలిన్ డీఎంకేకు అన్నీ తానై ప్రచారంలో దూసుకుపోతుండగా.. అళగిరి మాత్రం ఇంటికి పరిమితమై.. రాజకీయాల్లో దూరంగా ఉండిపోయారు. 90 ఏళ్ల కరుణానిధి ఏకంగా 13వసారి తమిళనాడు ఎన్నికల బరిలోకి దిగి.. పార్టీ అధికారంలోకి వస్తే తాను ముఖ్యమంత్రినని స్పష్టం చేశారు. అదేసమయంలో తనకు ఏమైనా అయితే తన చిన్న కొడుకు స్టాలిన్‌నే కాబోయే సీఎం అని తేల్చి పారేశారు. ఈ ప్రకటన పర్యవసానం ఏమిటో అళగిరికి చాలాబాగా తెలుసు. కరుణ వారుసుడిగా ఎవరు డీఎంకే పగ్గాలు చేపట్టబోతున్నారు కూడా ఆయనే పసిగట్టే ఉంటారు. అందుకే ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నారు.
అంతేకాకుండా ఈసారి ఎన్నికల్లో తాను ఏ పార్టీకి ఓటు వేయబోనని ఆయన స్పష్టం చేశారు. మరీ, ఈసారి ఎన్నికల్లో డీఎంకే గెలుస్తుందా? అంటే ఆయన నేరుగా సమాధానం చెప్పలేదు. స్టాలిన్ తనతో మాట్లాడక దాదాపు మూడేళ్లు అవుతుందని, ఈ మూడేళ్లకాలంలో తన సవతి సోదరి కనిమొళి కూడా తనతో మాట్లాడలేదని ఆయన చెప్పారు.
1980లోనే అళగిరిని మధురైకి పంపారు కరుణానిధి. అప్పటి నుంచి ఈ జిల్లాను తనకు పెట్టనికోటగా మార్చుకున్న అళగిరి.. ఈసారి మధురైలో డీఎంకే పరిస్థితి ఏమిటంటే కాస్తా నిర్వేదంగా సమాధానమిచ్చారు. తనను వాడుకోవడం డీఎంకేకు తెలియదని, ఆ పార్టీ మధురై జిల్లాలో ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేదని అన్నారు.