ముగ్గురు భార్యలతో కరుణానిధి
సాక్షి, చెన్నై: డీఎంకే అధినేత కరుణానిధి కుటుంబం చాలా పెద్దది. ఆయనకు ముగ్గురు భార్యలు. తొలి భార్య పద్మావతి అమ్మాళ్, రెండో భార్య దయాళు అమ్మాళ్, మూడో భార్య రాజాత్తి అమ్మాళ్. వీరిలో పద్మావతి అమ్మాల్ జీవించి లేరు. పద్మావతి అమ్మాల్, కరుణకు ఓ కుమారుడు.. ముక్కా ముత్తు. ఈయనే కుటుంబానికి పెద్ద కుమారుడు. అయితే, ఈయన కరుణానిధికి పూర్తి వ్యతిరేకం. గాయకుడిగా, డ్యాన్సర్‌గా పేరు సంపాదించిన ముత్తు కరుణ సహా ఇతర కుటుంబానికి దూరంగానే ఉంటున్నారు. గతంలో అన్నాడీఎంకేలో చేరి వ్యతిరేక ప్రచారం నిర్వహించారు. దయాళు అమ్మాల్‌కు ఎంకే అళగిరి, ఎంకే స్టాలిన్, తమిళరసన్.. ముగ్గురు కుమారులు, సెల్వి కుమార్తె. వీరిలో అళగిరి, స్టాలిన్ రాజకీయంగా అందరికీ సుపరిచితులే. రాజాత్తి అమ్మాల్‌కు ఒకే కుమార్తె కనిమొళి.
గారాల పట్టిగా కనిమొళికి కరుణ హృదయంలో ప్రత్యేక స్థానముంది. డీఎంకే మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా, ఎంపీగా వ్యవహరిస్తున్నారు. ఇక, కరుణానిధికి అరివునిధి, దురై దయానిధి, ఉదయనిధిలు మనవళ్లు. వీరిలో అరివునిధి ముత్తు తనయుడు. దయానిధి అళగిరి కుమారుడు. ఇక, డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ కుమారుడే ఉదయనిధి. ఈయన సినీ హీరోగా, నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక, అళగిరి కుమార్తె కయల్ వెలి, స్టాలిన్ కుమార్తె సెంతామరైలు కరుణానిధికి మనవరాళ్లు. అలాగే, మేనల్లుడు దివంగత మురసోలి మారన్‌పై కరుణానిధికి ప్రేమ ఎక్కువే.
అందుకే ఆయన కుమారులు దయానిధి మారన్, కళానిధి మారన్‌ను తన కుటుంబీకులతో సమానంగానే చూసుకుంటూ వచ్చారు. మనవళ్లు, మనవరాళ్లనే కాదు, మునిమనవళ్లతో ఆడుకున్న కరుణ, ఇటీవల మనోరంజిత్ అనే మునిమనవడి వివాహానికి పెద్దగా వ్యవహరించారు. రాజకీయంగా స్టాలిన్, అళగిరి మధ్య విభేదాలున్నా, కుటుంబ విషయానికి వచ్చేసరికి అందరికీ కరుణ మాటే వేదవాక్కు.
Comments
Please login to add a commentAdd a comment