ఆయన నిజమైన లెజెండ్‌ | special story to life histroy from tamilnadu ex cm karunanidhi | Sakshi
Sakshi News home page

ఆయన నిజమైన లెజెండ్‌

Published Wed, Aug 8 2018 2:26 AM | Last Updated on Wed, Aug 8 2018 11:00 AM

special story to life histroy from tamilnadu ex cm karunanidhi - Sakshi

ఓ రాజకీయ చాణక్యుడు.. ఓ ద్రవిడ పోరాట యోధుడు.. ఓ సాహితీ దిగ్గజం.. కథకుడు.. కళాకారుడు.. పాత్రికేయుడు.. ఒక్కడిలో ఇన్ని కోణాలా?  అవును.. ఆయనది చిన్నతనం నుంచే పోరాట పంథా.. ధిక్కార స్వభావం.. సవాళ్లకు ఎదురొడ్డి నిలిచే తత్వం.. వెరసి తమిళ చరిత్ర పుటల్లో ఓ చెరగని అధ్యాయం! అందుకే ఆయన తమిళుల మదిలో చెరగని ముద్ర వేసిన కలైజ్ఞర్‌  చిన్నతనం నుంచేధిక్కార స్వభావం అద్భుత వాగ్ధాటితో అందరి మన్ననలు పెరియార్‌ పరిచయంతోమలుపు తిరిగిన జీవితం.. 


పేరు దక్షిణామూర్తి.. అందరికీ తెలిసిన పేరు ఎం.కరుణానిధి. ఓ తెలుగు సంగీత కళాకారుల కుటుంబంలో జన్మించిన కరుణానిధి తమిళుల గుండెల్లో కలైజ్ఞర్‌గా చిరస్థాయిగా నిలిచిపోయారు. తమిళనాడు వంటి సంక్లిష్ట రాజకీయాల్లో పదమూడు సార్లు ఎమ్మెల్యేగా, ఐదుసార్లు ముఖ్యమంత్రిగా సేవలందించిన ఆయన జీవిత ప్రస్థానంలో ఎన్నెన్నో మలుపులు.. మరెన్నో సంఘర్షణలు.. 

కలైజ్ఞర్‌గా... 
తన పేరు కంటే కలైజ్ఞర్‌(నటుడు)గానే అభిమానులకు, ప్రజలకు కరుణానిధి ప్రసిద్ధులు. కలైజ్ఞర్‌ కరుణానిధి అంటూ ఆయన ఇంటి పేరుగా మారిన ఈ పదం నిజానికి బిరుదు. ఉడన్‌ పెరప్పు కడిదం (నాతోబుట్టువులకు లేఖ) నినాదంతో కరుణ రాసిన ఓ రచన అప్పట్లో ప్రజల మదిని దోచుకుంది. దీని తర్వాత తూక్కుమేడై (ఉరి కంబం) నాటికను కరుణ రచించి.. నటించారు. ఈ నాటికను చూసి మంత్రముగ్ధుడైన నటుడు ఎంఆర్‌ రాధా (నటి రాధిక తండ్రి) ఆయనకు కలైజ్ఞర్‌ బిరుదును ప్రదానం చేశారు. ఆ బిరుదే నేడు కలైజ్ఞర్‌...కలైజ్ఞర్‌ అంటూ ప్రజల మదిలో నిలిచిపోయింది.

హెడ్‌మాస్టర్‌తో కొట్లాట
తిరుక్కువలై గ్రామంలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదువుకున్న కరుణానిధి.. తర్వాత తిరువారూరులోని ఉన్నత పాఠశాలలో చేరేందుకు వెళ్లారు. అయితే ఆరో తరగతిలో సీటు ఇచ్చేందుకు ప్రధానోపాధ్యాయుడు కస్తూరి అయ్యంగార్‌ నిరాకరించారట. దీంతో ఆయనను బెదిరించి మరీ సీటు దక్కించుకున్నారట కరుణానిధి. తన తొలి పోరాటాన్ని ఆనాడే ప్రారంభించారాయన.

చచ్చిపోయాడని వదిలేశారు..
1945లో పుదుక్కోట్టైలో జరిగిన ద్రవిడ మహానాడుకు వెళ్లి.. కవి భారతి దాసన్, కంచి కల్యాణ సుందరంతో కలసి వస్తున్న కరుణానిధిని ఓ ముఠా చుట్టుముట్టింది. శివగురు నాటికలో తమ వారిని కించపరిచే వ్యాఖ్యలు చేశారంటూ కరుణ మీద దాడి చేసింది. స్పృహ కోల్పోయిన కరుణను చూసి మృతి చెందారనుకుంది ఆ ముఠా. ఆయనను తీసుకెళ్లి ఓ బురద కుంటలో పడేసి వెళ్లిపోయింది. మరుసటి రోజు కరుణ మారువేషంలో పెరియార్‌ వద్దకు వెళ్లి జరిగింది వివరించారు. తర్వాత పుడి అరసు అనే వార పత్రికలో సంపాదకుడిగా పనిచేస్తూ రాజకీయ పోరాటల్లో చురుగ్గా పాల్గొనడం మొదలెట్టారు. మదురైలో జరిగిన ఓ పోరాటంలో ప్రభుత్వ చట్టానికి సంబంధించిన ప్రతులను తగల పెట్టడంతో కరుణ మీద తొలి కేసు నమోదైంది.

సొంతూరంటే ప్రాణం
నాగపట్నం జిల్లాలోని తిరుకువలైలో కరుణ జన్మించారు. ఒకప్పుడు కుగ్రామమైన ఆ ఊరు.. ఇప్పుడు తాలుకాగా మారింది. చూడటానికి నేటికీ చిన్న గ్రామంగానే కనిపిస్తున్నా అక్కడ అభివృద్ధి ఘనమే. సొంత ఊరిలో ఆస్పత్రులు, విద్యాలయాలు నెలకొల్పారు కరుణ. అన్ని రకాల వసతులే కాదు, తాను పుట్టిన ఇంటినీ గ్రంథాలయంగా మార్చేశారు. అందుకే 2011, 2016 ఎన్నికల్లో సొంత గడ్డ నుంచి పోటీ చేసి అసెంబ్లీ మెట్లెక్కారు. ఆరోగ్యంగా ఉన్నపుడు స్వస్థలానికి ఏడాదిలో ఒకటి రెండు సార్లయినా వెళ్లేవారు. తిరుకువలై నుంచి ఎవరొచ్చినా కరుణ నివాసం గోపాలపురం ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి.  

చిన్నతనం నుంచే అద్భుత వాగ్ధాటి 
1924 జూన్‌ 3న తిరువారూరు జిల్లా తిరుక్కువలై గ్రామంలో ముత్తువేల్, అంజుగమ్మ, దంపతులకు జన్మించిన కరుణానిధి అదే ఊరిలో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు చదివారు. తర్వాత తిరువారూరులోని ఉన్నత పాఠశాలలో అడుగుపెట్టారు. ఇక్కడ్నుంచే ఆయన పోరాట పటిమను అలవర్చుకున్నారు. 1938లో సహచర విద్యార్థులను వెంటేసుకుని హిందీ వ్యతిరేక పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు. ఎనిమిదో తరగతి చదువుతున్న సమయంలో ఓ సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా సహచర విద్యార్థులకు వాక్‌ చాతుర్యంపై పట్టు సాధించేందుకు శిక్షణ అందించారు. 1942లో తమిళ విద్యార్థి సంఘం వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం కోసం తన వద్ద ఉన్న బంగారం చైన్‌ను కుదవపెట్టి మరీ వేడుకల్ని దిగ్విజయం చేశారు. ఇందులో ఆయన చేసిన ప్రసంగంతో యువత, జనం మంత్రముగ్ధులయ్యారు. అదే ఏడాదిలో ద్రవిడనాడు మూడో వార్షికోత్సవానికి కరుణ రాసిన ఓ కవిత అందరి మన్ననల్ని అందుకుంది. రాజకీయ అరంగేట్రానికి ఈ కవితే నాంది పలికిందని చెప్పవచ్చు. తిరువాయూర్‌లో జరిగిన ఓ వేడుకకు హాజరైన అన్నాదురై ఈ కవితను చూసి అబ్బురపడ్డారు. కరుణను పిలిపించి మరీ అభినందించారు. అదే ఏడాది మురసోలి అనే మాసపత్రికను స్థాపించిన కరుణానిధి ‘చేరన్‌’ పేరిట వ్యాసాలు రాయడం మొదలెట్టారు. 

పెరియార్‌తో పయనం.. 
1944లో తిరువారూరులోని బేబి టాకీస్‌లో పళనియప్పన్‌ అనే నాటిక ప్రదర్శనతో కరుణానిధి నాటక రంగంలోకి అడుగుపెట్టారు. ఈ నాటకాన్ని తానే రచించి దర్శకత్వం వహించారు. ఈ సమయంలో ఆరూర్‌లో జరిగిన  ‘స్వీయ మర్యాద’ సంఘం వార్షికోత్సవానికి హాజరైన పెరియార్‌ దృష్టిలో పడ్డారు. మురసోలి పత్రికల్లో వస్తున్న కథనాల్ని చూసిన పెరియార్‌.. కరుణలో ఉన్న ప్రతిభను గుర్తించారు. అప్పట్నుంచి పెరియార్‌తో కలిసి వేదికలపై కరుణ ప్రసంగాలు సాగాయి. ఇదే రాజకీయాల వైపు అడుగులు పడేందుకు దోహదం చేసింది. అదే ఏడాది ద్రవిడ నటుల సంఘాన్ని ఏర్పాటు చేíయడంతో పాటు విల్లుపురంలో పళనియప్పన్‌ అనే నాటకాన్ని ప్రదర్శించి, అందులో ముఖ్య పాత్రను కరుణ పోషించారు. అదే ఏడాది పద్మావతి అమ్మాళ్‌ను వివాహం చేసుకున్నారు. 

డీకే పార్టీలో చురుగ్గా.. 
1945లో పుదుకోట్టైలో జరిగిన ద్రవిడ మహానాడుకు వెళ్లి వస్తుండగా ఓ ముఠా కరుణపై దాడి చేసింది. ఈ ఘటన తర్వాత పెరియార్‌ వద్దకు వెళ్లి కరుణ జరిగిన విషయాన్ని వివరించారు. అదే రోజు నుంచి కరుణ జీవితం పూర్తిగా రాజకీయాలకు అంకితమైంది. పుడి అరసు అనే వార పత్రికలో సంపాదకుడిగా పనిచేస్తూ రాజకీయ ఉద్యమాల్లో దూసుకెళ్లడం మొదలెట్టారు. మదురైలో జరిగిన ఓ ఆందోళనలో అప్పటి ప్రభుత్వం జారీ చేసిన ఓ చట్టానికి సంబంధించిన ప్రతులను తగలబెట్టారు. ఇందుకు కరుణపై తొలి కేసు నమోదైంది. 1946లో ద్రవిడ కళగం(డీకే) పార్టీ పతకానికి చిహ్నం రూపొందించిన కరుణానిధి తొలిసారిగా పార్టీ కార్యక్రమాల్లో క్రియా శీలక పాత్ర పోషించారు. అదే సమయంలో ‘రాజకుమారి’ చిత్రానికి కథ, మాటలు రాసి సినీరంగంపై కూడా దృష్టి పెట్టారు. పద్మావతి అమ్మాళ్‌ మరణానంతరం 1948లో దయాళు అమ్మాల్‌ను కరుణ రెండో వివాహం చేసుకున్నారు. 1949లో సేలం మోడరన్‌ థియేటర్‌లో రికార్డింగ్‌ సందర్భంగా అప్పటి నటుడు ఎన్‌ఎస్‌ కృష్ణన్‌తో ఏర్పడ్డ పరిచయం స్నేహింగా మారి సినీ రంగంలో స్థిరపడేందుకు కరుణకు మార్గాన్ని చూపింది. అదే ఏడాది మైనర్‌ అయిన మునియమ్మను పెరియార్‌ పెళ్లి చేసుకోవడంతో ద్రవిడ కళగం పార్టీలో చిచ్చు రగిలింది. 

డీఎంకే ఆవిర్భావం 
ద్రవిడ కళగం పార్టీలో వివాదం డీఎంకే ఆవిర్భావానికి దారి తీసింది. పెరియార్‌కు శిష్యుడిగా ఉన్న కరుణానిధి అన్నాదురై వెంట నడిచారు. అన్నాకు తమ్ముడిగా డీఎంకే ఏర్పాటుతో కరుణ పూర్తిగా రాజకీయాలకు అంకితమయ్యారు. పార్టీ ప్రచార కార్యదర్శి బాధ్యతల్ని భుజాన వేసుకుని తిరుచ్చి, తంజావూరుల్లో జరిగిన ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారు. నాటి ప్రధాని రాజాజీకి వ్యతిరేకంగా నల్ల జెండా ఎగురవేసి అందరి దృష్టిలో పడ్డారు. తంజావురులో అప్పట్లో తుపాన్‌ బాధితుల్ని ఆదుకోవడం కోసం ప్రత్యేకంగా  నిధుల్ని సేకరించారు. 

తొలిసారి అసెంబ్లీలోకి అడుగు.. 
1957లో జరిగిన ఎన్నికల్లో తిరుచ్చి జిల్లా కులితలై నియోజకవర్గం నుంచి పోటి చేసి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. రామనాథపురంలో జరిగిన డీఎంకే మహానాడులో ‘ఉదయ సూర్యన్‌’ (ఉదయించే సూర్యుడు) నాటకాన్ని రచించిన కరుణ ఆ తర్వాత ఓటమి అన్నది లేకుండా ముందుకు సాగారు. 1962లో తంజావూరు నుంచి పోటీ చేసి విజయం సాధించిన కరుణ శాసనసభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వర్తించారు. 1963లో కరుణ ఉద్యమ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ అన్నాదురై ‘వీర’ కత్తిని బహూకరించారు. 1965లో అప్పటి భారత రక్షణ చట్టం కేసులో అరెస్టు అయిన కరుణను పాళయం కోట్టై జైల్లో బంధించారు. అక్కడ్నుంచే ఆయన కాంగ్రెస్‌ అరాచకాల్ని ఎండగడుతూ ‘కాగిత పువ్వు’ నాటకాన్ని రచించారు. 1967లో జరిగిన ఎన్నికల్లో  చెన్నై సైదాపేట నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి విజయం సాధించిన ఆయన్ను మంత్రి పదవి వరించింది. 

తొలిసారి సీఎంగా.. 
అన్నాదురై మరణంతో 1969 మార్చిలో తొలిసారి ముఖ్యమంత్రిగా కరుణానిధి పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాత జరిగిన పార్టీ రాష్ట్ర మహానాడులో డీఎంకే అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. (అప్పటి నుంచి ఇప్పటివరకు పార్టీకి ఆయనే అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు) నాటి పాండిచ్చేరి (పుదుచ్చేరి)లో డీఎంకే పార్టీ కార్యకలాపాలకు శ్రీకారం చుట్టారు. చెన్నై మెరీనా తీరంలో అన్నాదురై సమాధిని సుందరంగా తీర్చిదిద్దారు. 1971లో బ్రిటన్, ప్రాన్స్, జర్మనీ, రోమ్, అమెరికాలో పర్యటించి అక్కడి సభల్లో ప్రసంగించారు. అదే ఏడాది సైదాపేట నియోజకవర్గం నుంచి మళ్లీ ఎన్నికై, రెండోసారి సీఎంగా పగ్గాలు చేపట్టారు. 

ఒకే గూటిలో రెండు సింహాలు
కరుణ(vs)ఎంజీఆర్‌
సాక్షి ప్రతినిధి, చెన్నై: డీఎంకేను రాజకీయంగా పరుగులు పెట్టించిన కరుణానిధి.. ఎంజీ రామచంద్రన్‌ (ఎంజీఆర్‌) నేతృత్వంలోని అన్నాడీఎంకే పుట్టుకకూ పరోక్షంగా కారణమయ్యారు. డీఎంకేలో అన్నాదురై తర్వాత కరుణానిధికి అంతటి ప్రాధాన్యం ఉండేది. అయితే సినిమా హీరోగా అప్పటికే విపరీతమైన క్రేజున్న ఎంజీఆర్‌ అన్నాదురై సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడై.. 1953లో డీఎంకేలో చేరి కోశాధికారి పదవి నిర్వర్తించారు. ఈ క్రమంలో ఓసారి తిరుచ్చిరాపల్లిలో డీఎంకే బహిరంగ సభ జరిగింది. వేదికపై అన్నాదురై, కరుణానిధి తదితర ప్రముఖులున్నారు. అంతవరకు స్తబ్ధుగా ఉన్న జనం.. ఎంజీఆర్‌ రాగానే ఉత్సాహం ప్రదర్శించారు. తర్వాత నుంచి పార్టీ శ్రేణులు, ప్రజలు ఎంజీఆర్‌ను ‘ముజీబ్‌ ఆఫ్‌ తమిళనాడు’అని కీర్తించడం మొదలైంది. కానీ ఎంజీఆర్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టడం కరుణకు ఇబ్బందిగా మారింది. ఒకే బోనులో (పార్టీలో) రెండు సింహాల్లా ఆధిపత్య పోరు మొదలైంది. క్రమేపీ ఇద్దరి మధ్య దూరం పెరిగింది. 1969లో అన్నాదురై మరణం తర్వాత పార్టీ పగ్గాలు కరుణ చేతుల్లోకి రావడంతో మనస్పర్థలు మరింత పెరిగాయి. కరుణపై అవినీతి ఆరోపణలు చేయడమే గాక, 1972లో జరిగిన పార్టీ జనరల్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని బహిష్కరించాలని పార్టీ శ్రేణులకు ఎంజీఆర్‌ పిలుపునివ్వడంతో ఆయనను జనరల్‌ కౌన్సిల్‌ నుంచి కరుణ సస్పెండ్‌ చేశారు. ఇదే అదనుగా డీఎంకే నుంచి బయటకు వచ్చిన ఎంజీఆర్‌.. 1972 అక్టోబర్‌ 17న అన్నాడీఎంకేను స్థాపించారు. డీఎంకే పుట్టుకతో తమిళనాడులో కాంగ్రెస్‌ పార్టీకి కాలం చెల్లిపోగా.. అన్నాడీఎంకే ఆవిర్భావంతో డీఎంకేకు గట్టి పోటీ మొదలైంది. ఎంజీఆర్‌ ఉన్నంత కాలం అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే మెజార్టీ సాధించలేకపోయింది.   

ఎమర్జెన్సీలో కుప్పకూలిన ప్రభుత్వం 
1975లో ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించడంతో కరుణ ప్రభుత్వం కుప్పకూలింది. దీంతో కరుణ.. ఇందిర ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిసూ పెద్ద ఉద్యమాన్నే నడిపి జైలు పాలయ్యారు. తర్వాత కొత్త ఫ్రంట్‌ ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులతో పార్టీ ఓటమి పాలైంది. 1989లో జరిగిన ఎన్నికల్లో పార్టీ విజయఢంకా మోగించడంతో 3వ సారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 1996 ఎన్నికల్లో చెన్నై చేపాక్కం నుంచి గెలుపొంది నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 

చివరి రోజుల్లో...
కరుణానిధి 2006 ఎన్నికల్లో విజయదుందుభి మోగించి ఐదోసారి సీఎంగా పదవీ ప్రమాణం చేశారు. ఉచిత పథకాలతో ప్రజల్ని ఆకర్షించారు. 2011, 2016 అసెంబ్లీ ఎన్నికలు మాత్రం కరుణకు నిరాశ మిగిల్చాయి. 2011 ఎన్నికల్లో అయితే ప్రధాన ప్రతి పక్ష హోదా కూడా దక్కలేదు. వయోభారంతో బాధ పడుతున్నా, అధికారం చేతిలో లేకున్నా, పార్టీ కేడర్‌కు అందుబాటులో ఉండేలా నిత్యం రాష్ట్ర పార్టీ కార్యాలయం అన్నా అరివాలయానికి కరుణ వచ్చేవారు. చివరిసారిగా అక్టోబర్‌లో పార్టీ ఆఫీసుకు వచ్చారు.  

కరుణ ప్రస్థానమిలా..
►1924  జూన్‌ 3 తిరుక్కువలైలో జననం

►1938 జస్టిస్‌ పార్టీలో చేరిక. తర్వాత ద్రవిడ కజగం పార్టీలోకి.

►1949 అన్నాదురైతో కలసి డీఎంకే స్థాపన

►1957కులితలై నుంచి తొలిసారి తమిళనాడు అసెంబ్లీకి ఎన్నిక.

►1967అన్నాదురై కేబినెట్‌లో ప్రజాపనుల శాఖ మంత్రిగా బాధ్యతలు.

►1969అన్నాదురై మరణం అనంతరం  సీఎంగా .. 

►1977అధికారంలోకి వచ్చిన ఏఐఏడీఎంకే. 13 ఏళ్లపాటు ప్రతిపక్షంలోనే కరుణ

►1989ఎంజీఆర్‌ మరణం. తర్వాతి ఎన్నికల్లో అధికారంలోకి డీఎంకే

►2001అవినీతి ఆరోపణలతో కరుణ, స్టాలిన్, మారన్‌లను అరెస్టు చేసిన జయలలిత ప్రభుత్వం

►2006 ఐదోసారి సీఎంగా ఎన్నిక

►2013తన వారసుడిగా స్టాలిన్‌ను ప్రకటించిన కరుణ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement