సాక్షి, చెన్నై: తాను కూడా రాజకీయాల్లోకి వస్తున్నానని హీరో, దక్షిణ భారత నటీనటుల సంఘం కార్యదర్శి, తమిళ నిర్మాతల మండలి ఆధ్యక్షుడు విశాల్ వెల్లడించారు. ఆయన ఇంతకు ముందు ఆర్కే.నగర్ ఉప ఎన్నికల్లో పోటీకి నామినేషన్ దాఖలు చేసి, ఆ తరువాత నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో భంగపడ్డ విషయం తెలిసిందే. విశాల్ గురువారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. తానూ రాజకీయాల్లోకి వస్తానని చెప్పారు. ఇటీవల ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో తన నామినేషన్ విషయంలో జరిగిన అన్యాయం, అవకతవకలే తానీ నిర్ణయం తీసుకోవడానికి కారణంగా ఆయన పేర్కొన్నారు.
తానా ఎన్నికల్లో ఒక రాజకీయవాదిగా పోటీ చేయలేదని, ఆ ప్రాంత ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే ఎన్నికల బరిలోకి దిగానని తెలిపారు. తన రాజకీయ నిర్ణయానికి కారణం అయిన వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని అన్నారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో పెను మార్పు తథ్యం అని విశాల్ పేర్కొన్నారు. తాను ఒక రాజకీయవాదిగా ఈ విషయాన్ని చెప్పడం లేదని, ప్రజల ప్రతినిధిగా చెబుతున్నానని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment