Thalaivii Movie Review And Rating In Telugu: Jayalalitha Biopic Movie Telugu - Sakshi
Sakshi News home page

Thalaivii Review: ‘అమ్మ’గా కంగనా మెప్పించిందా? లేదా?

Published Fri, Sep 10 2021 2:36 AM | Last Updated on Fri, Sep 10 2021 1:18 PM

Thalaivii Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌ : తలైవి
జానర్‌: బయోపిక్‌
నటీనటులు :  కంగన రనౌత్, అరవింద్ స్వామి, నాజర్, భాగ్యశ్రీ, సముద్రఖని, మధుబాలా తదితరులు 
నిర్మాణ సంస్థలు: విబ్రి మీడియా, కర్మ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్
నిర్మాతలు :  విష్ణు వర్ధన్ ఇందూరి
కథ: విజయేంద్ర ప్రసాద్‌
దర్శకత్వం : ఏఎల్ విజయ్ 
సంగీతం : జీవీ ప్రకాష్ కుమార్ 
విడుదల తేది : సెప్టెంబర్‌ 10,2021

లేడి ఓరియెంటెండ్‌ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తోంది బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌.  వ‌రుస‌గా నాయికా ప్రాధాన్య‌మున్న సినిమాలు చేస్తూ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ భామ తాజాగా నటించిన మరో లేడి ఓరియెంటెండ్‌ మూవీ ‘తలైవి’. నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవితాధారంగా దర్శకుడు ఎ.ఎల్‌. విజయ్‌ రూపొందించిన చిత్రమిది. టైటిల్ పాత్రని కంగనా పోషించగా.. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్‌ (ఎంజీఆర్‌) పాత్రలో అరవింద్‌ స్వామి నటించారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం సెప్టెంబరు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ‘తలైవి’ప్రేక్షకుల మనసును ఏ మేరకు దోచుకుందో రివ్యూలో చూద్దాం.


‘తలైవి’కథేంటంటే:
దర్శకుడు ముందుగా చెప్పినట్టే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత సినీ జీవితం ప్రారంభం నుంచి ఆమె సీఎంగా బాధ్యతలు చేపట్టే వరకు సాగే కథే ‘తలైవి’. ఓ పెద్దింటి కుటుంబంలో పుట్టినా జయలలిత(కంగనా రనౌత్‌) కొన్ని పరిస్థితుల కారణంగా పేదరికంలోకి వస్తుంది. అయితే వాళ్లమ్మ మాత్రం ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేస్తుంది.  16 ఏళ్ల వయసులోనే జయను హీరోయిన్‌ను చేస్తుంది. అతి చిన్న వయసులోనే ఎంజీ రామ‌చంద్ర‌న్ అలియాస్  ఎంజీఆర్‌ (అర‌వింద్ స్వామి) లాంటి స్టార్‌తో నటించే అవకాశం చేజిక్కించుకుంటుంది. ఆ తర్వాత కోలీవుడ్‌లో వాళ్లది సూపర్ హిట్ జోడీ అయిపోతుంది. ఈ క్రమంలో ఎంజీఆర్‌తో జయలలితకు ఎలాంటి అనుబంధం ఏర్పడుతుంది? సినీ నటిగా వరుస సినిమాలతో బిజీగా ఉన్న జయ.. రాజకీయాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది? తను ఎంతో అభిమానించే ఎంజీఆర్‌ మరణం తర్వాత తమిళనాడు ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి? జయలలిత ముఖ్యమంత్రి పీఠం చేప‌ట్టే క్ర‌మంలో ఎలాంటి స‌వాళ్లు ఎదుర‌య్యాయి?  తెలియాలంటే ‘తలైవి’ చూడాల్సిందే.

ఎవరెలా చేశారంటే..
జ‌య‌ల‌లిత పాత్ర‌లో కంగ‌న ఒదిగిపోయారు. తెరపై జయలలిత కనిపిస్తుందే తప్ప.. కంగాన రనౌత్‌ ఏ మూలాన కనిపించదు. ఆమెను జాతియ ఉత్తమ నటి అని ఎందుకు అంటారో ఈ సినిమా చూస్తే అర్థమవుతంది. ఎంజీఆర్‌తో దూరమయ్యే సన్నివేశాల్లో చక్కటి భావోద్వేగాన్ని పలికించింది. ఇక కంగన తర్వాత ఈ చిత్రంలో బాగా పండిన పాత్ర అరవింద్‌ స్వామిది. ఎంజీఆర్‌ పాత్రలో ఆయన జీవించేశాడు. స్టార్‌ హీరోగా, రాజకీయ నాయకుడిగాను ప్రత్యేక హావభావాలను పలికించాడు. ఎంజీఆర్‌ అనుచరుడు వీరప్పన్ పాత్రకు సముద్రఖని ప్రాణం పోశాడు. కరుణ పాత్రలో నాజర్‌ మరోసారి తన అనుభవాన్ని తెరపై చూపించాడు. జయ తల్లి పాత్రలో అలనాటి నటి భాగ్య శ్రీ, ఎంజీఆర్‌ భార్య పాత్రలో మధుబాల, శశికల పాత్రలో పూర్ణతో మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. 

ఎలా ఉందంటే..?
‘అమ్మ’గా తమిళ ప్రజల గుండెల్లో పదిలమైన చోటు దక్కించుకున్న దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం తలైవి. జయ జీవితంలో అతి కీలకమైన 1965 నుంచి మొదటి సారి ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన 1991 మధ్య జరిగే కథను మాత్రమే తెరపై చూపించాడు దర్శకుడు  ఏఎల్ విజయ్.  ఓ  సినిమాకి కథ ఎంపికతోపాటు క్యారెక్టర్ సెలక్షన్ కూడా చాలా ముఖ్యం. ఇదే సినిమా సక్సెస్‌ను నిర్ణయిస్తుంది. ఎప్పుడైతే జయలలిత పాత్రకు జాతీయ ఉత్తమ నటి కంగనాను ఎంపిక చేశారో.. అప్పుడే ఈ సినిమా సగం సక్సెస్ సాధించింది. ఫస్టాఫ్‌లో జయ లలిత సినీ జీవితాన్ని చూపించిన దర్శకుడు.. సెకండాఫ్‌ మొత్తం ఆమె రాజకీయ జీవితాన్ని చూపించాడు. ఎంజీఆర్‌ పాత్రను హైలైట్‌ చేస్తూనే.. అదే సమయంలో జయలలిత పాత్ర ప్రాధాన్యత తగ్గకుండా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు.

జయ-ఎంజీఆర్‌ మధ్య ఉన్న బంధాన్ని కూడా తెరపై చాలా చక్కగా చూపించారు. రాజకీయాలే వద్దనుకున్న జయ.. పాలిటిక్స్‌లోకి ఎందుకు రావాల్సి వచ్చిందో తెలిపే సీన్స్‌ని చాలా చక్కగా డిజైన్‌ చేసుకున్నాడు. అలాగే జయలలితను తమిళ ప్రజలు ‘అమ్మ’అని ఎందుకు ముద్దుగా పిలుసుకుంటారో తెలియజేసే సీన్‌ కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దాడు. ఒక రాజకీయాల్లో వచ్చి తర్వాత జయ జీవితం ఎలాంటి మలుపు తిరిగిందే విషయాన్ని కూడా ఉన్నది ఉన్నట్లు చూపించారు. సొంత పార్టీ నేతలే జయపై కుట్ర చేయడం, ఆమెను రాజ్య సభకి పంపడం లాంటి సీన్స్‌ కూడా హత్తుకునేలా తీర్చి దిద్దారు. ఎంజీఆర్‌ మరణం తర్వాత చోటు చేసుకునే పరిణామాలను ఉత్కంఠభరితంగా తెరకెక్కించారు.  ‘నమ్మి వస్తే అమ్మ.. లేదంటే ఆదిశక్తి’ అంటూ జయలో ఉన్న రెండో కోణాన్ని కూడా తెరపై చూపించారు. ఈ సినిమాకు మరో ప్రధాన బలం  జీవి ప్రకాశ్ కుమార్ సంగీతం. పాటలు అంతగా ఆకట్టుకోలేవు కానీ, నేపథ్య సంగీతం అదిరిపోయింది. విశాల్ విట్టల్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటింగ్‌ పర్లేదు. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్స్‌కి కత్తెర పడాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్టుగా ఉన్నాయి. 
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement