![Central Medical and Health Team from Delhi visit Alluri Sitarama Raju district](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/phc.jpg.webp?itok=h_329Awu)
ముంచంగిపుట్టు సీహెచ్‌సీ, కిలగాడ పీహెచ్‌సీ తనిఖీ
ఆరోగ్య కేంద్రాల స్థితిగతులు, అందుతున్న వైద్యంపై ఆరా
ముంచంగిపుట్టు: ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర వైద్య, ఆరోగ్య బృందం ప్రతినిధులు అల్లూరి సీతారామరాజు జిల్లా, ముంచంగిపుట్టు మండల కేంద్రంలో మంగళవారం పర్యటించారు. స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను తనిఖీ చేశారు. మందుల స్టాక్, రికార్డులను పరిశీలించారు. అనంతరం రక్త పరీక్షల గదికి వెళ్లి నెల వారీగా నమోదవుతున్న మలేరియా, టైఫాయిడ్ కేసుల వివరాలను వైద్యాధికారులు సంతోశ్, ధరణిలను అడిగి తెలుసుకున్నారు.
కేసుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు కావడంలో జాప్యాన్ని గుర్తించి, ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు. వార్డుల్లో ఉన్న రోగులతో మాట్లాడి, అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. గ్రామాల నుంచి ఆరోగ్య కేంద్రాలకు మధ్య దూరం, రవాణా సౌకర్యం, రోడ్ల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిక్ న్యూబోర్న్ కేర్ యూనిట్ (ఎస్‌ఎన్‌సీయూ)ను, పుట్టిన బిడ్డలు, బాలింతల ఆరోగ్య పరీక్షలు, అధికంగా నమోదవుతున్న కేసులను పరిశీలించి పలు సూచనలు చేశారు.
కర్రిముఖిపుట్టు, దార్రెల గ్రామాల్లో ఉన్న సబ్ సెంటర్లు, వెల్‌నెస్ సెంటర్లు, అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. గర్భిణులకు, బాలింతలకు, చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారంపై ఆరా తీశారు. అనంతరం కిలగాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. రికార్డులు తనిఖీ చేశారు. రక్తహీనత కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వ్యాక్సినేషన్ తీరుపై ఆరా తీశారు.
మందులను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుకోవాలని సూచించి, నిల్వ లేని మందుల వివరాలు నమోదు చేసుకున్నారు. సీహెచ్‌సీ, పీహెచ్‌సీ, సబ్‌సెంటర్ల నిర్వహణలో లోపాలను సరిదిద్దుకోవాల్సిందిగా ఢిల్లీకి చెందిన కేంద్ర సచివాలయ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ అరుణ్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment