ఉట్నూర్, న్యూస్‌లైన్ : జిల్లా వ్యాప్తంగా రైతులు 62,300 ఎకరాల్లో టమాటా సాగు చేశారు. మంచి ధర పలకడం, స్వల్పకాలిక పంటకావడంతో రైతులు మొగ్గు చూపారు. జిల్లాలోని ఇంద్రవెల్లి, జైనథ్, కెరమెరి, గుడిహత్నూర్, ఉట్నూర్, సిర్పూర్(యు), బజార్‌హత్నూర్, నార్నూర్, జైనూర్, బోథ్, తాంసి, తలమడుగు, ఇచ్చోడ, నేరడిగొండ మండలాల్లో టమాటా సాగవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంద్రవెల్లి మండలం టమాటా సాగులో పేరు గాంచింది. ఇక్కడ ఈసారి దాదాపు 5 వేల హెక్టార్లలో పంట సాగు చేస్తున్నారు. టమాటాకు మంచి ధర పలకడంతో ఆశించిన లాభాలు వస్తాయని రైతులు భావించారు. కానీ వర్షాలు, వరదలు నట్టేట ముంచాయి.
నిండాముంచిన వర్షాలు.. పొగమంచు..
వర్షాలు, వరదలు టమాటా రైతులను నిండా ముంచాయి. పది రోజుల క్రితం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, పై-లీన్ తుపాన్ ప్రభావంలో టమాటా సాగుపై పండింది. అధిక వర్షాలతో చేలలో నీరు నిల్వ ఉండటంతో మొక్కల వేర్లు మురిగిపోయాయి. దీనికి తోడు టమాటా కాయలు బురదలో వేలాడటంతో మురిగిపోయాయి. రైతులు చేలలోకి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో బ్యాక్టిరియా సోకి కాయలకు నల్లమచ్చలు ఏర్పడ్డాయి. ఇటువంటి టమాటాలను ఏరివేస్తున్నా ఫలితం ఉండటం లేదని రైతులు పేర్కొంటున్నారు. టమాటా దిగుబడి పెరగాలంటే పొగమంచు అదుపులో ఉండాలి. కానీ, ఆకాల వర్షాలు తగ్గినప్పటి నుంచి వేకువజామున పొగమంచు విపరీతంగా కురుస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పొగమంచు పెరగడంతో కాత, పూత రాలడం.. కాయ ఎదుగుదల లేకుండా పోయి దిగుబడి తగ్గుతోంది. పొగమంచు తగ్గుముఖం పడితే గాని దిగుబడి పెరిగే అవకాశం లేదని రైతులు తెలుపుతున్నారు. టమాటా సీజన్ కావడంతో సాధారణంగా ఈ సీజన్‌లో కిలో టమాటా ధర రూ. 10 నుంచి రూ.20 మధ్య ఉంటుంది. కానీ, వర్షాలు, పొగమంచు కారణంగా దిగుబడి తగ్గడంతో మార్కెట్‌లో ప్రస్తుతం కిలో టమాటా ధర రూ.40పైగా పలుకుతోంది. మార్కెట్‌లో ధర ఉండటం, పంట దిగుబడి లేక రైతులు అల్లాడుతున్నారు.
నష్టాల ఊబిలో రైతులు
ఎకరం టమాటా పంట సాగు చేయాలంటే రైతుకు రూ.20 వేల నుంచి రూ.25వేల వరకు పెట్టుబడికి ఖర్చవుతుంది. ఎకరం సాగులో వారానికి 20 క్యారెట్ల టామాటాను మార్కెకు తరలిస్తే రైతులకు లాభాలు వస్తాయి. ఈసారి వర్షాలు, పొగమంచు కారణంగా దిగుబడి తగ్గి ఎకరం చేనులో వారానికి మూడు లేదా నాలుగు క్యారెట్ల టమాటా కూడా మార్కెట్‌కు తరలించడం లేదు. కానీ, గతేడాది దిగుమతి పెరిగి.. ధర లేక నష్టపోయామని రైతులు పేర్కొంటున్నారు. ఈ మూడు, నాలుగు క్యారెట్ల టమాటా కాయలపై కూడా నల్లమచ్చలు ఉండటంతో ధర రావడం లేదని రైతులు వాపోతున్నారు.
ప్రస్తుతం క్యారెట్ ధర రూ.700 నుంచి రూ.1,300 వరకు పలుకుతుంది. ఈ సమయంలో టమాటా దిగుబడి ఆశించిన విధంగా ఉంటే లాభాలు వచ్చేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వర్షం దెబ్బ
Published Fri, Nov 1 2013 1:39 AM | Last Updated on Sat, Sep 2 2017 12:10 AM
Advertisement
Advertisement