పుష్పగుచ్ఛం అందిస్తున్న అధికారులు
సాక్షి, ఉట్నూర్(ఖానాపూర్): సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారిగా నాలుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత గిరిజనుల సంపూర్ణ అభివృద్ధికి అందుబాటులో ఉంటూ గిరిజన సంక్షేమానికి కృషి చేస్తానని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి భవేశ్ మిశ్రా అన్నారు. శనివారం సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ 53వ ప్రాజెక్టు అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రాజెక్టు అధికారిగా ఏజెన్సీ ప్రాంత గిరిజనులందరికీ అందుబాటులో ఉంటూ విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు.
ఉమ్మడి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల గిరిజనుల అభివృద్ధి కేంద్రంగా ఉన్న ఐటీడీఏ ద్వారా గిరిజనుల సంపూర్ణ అభివృద్ధికి పాటుపడుతానని చెప్పారు. అన్నీ శాఖల అధికారుల సమన్వయంతో ముందుకు సాగుతానని చెప్పారు. గతంలో భద్రాచలం షెడ్యూల్ ప్రాంతంలో విధులు నిర్వహించిన అనుభవంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ ఫలాలు అర్హులకు అందిస్తానన్నారు. గిరిజన సమస్యలపై ఏ సమయంలోనైనా ఫోన్, వాట్సాఫ్ ద్వారా ఎవరైన సంప్రదించవచ్చన్నారు.
ప్రభుత్వ ఆర్థిక చేయూత పథకాల ఫలాలు గిరిజన లబ్ధిదారులకు అందించడంతో పాటు అర్జీదారుల సమస్యలు పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఐటీడీఏలో ఆయా విభాగాల అధికారులు సమయపాలనా పాటిస్తూ విధులు సక్రమంగా నిర్వహించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఉద్యోగి బయో మెట్రిక్ పాటించడంతో పాటు తమ ఐడీ కార్డుల్లో బ్లడ్ గ్రుప్‌తో సహా వివరాలు అన్ని పొందుపర్చుకోవాలని తెలిపారు. అటవీ హక్కుల చట్టం హక్కు పత్రాలపై అధికారులతో సమీక్షా అనంతరం అర్హులకు న్యాయం జరిగేలా చర్యలుంటాయన్నారు. అనంతరం ఐటీడీఏ కార్యాలయంలోని పలు విభాగాలను పరిశీలించారు. ఆయా కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న అధికారుల పనుల తీరుపై ఆరా తీశారు. నూతన పీవో రావడంతో ఐటీడీఏ, వివిధ విభాగాల అధికారులు పీవోకు స్వాగతం పలుకుతూ పుష్పగుచ్ఛం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment