Tribal Development
-
రూ.6,929 కోట్లతో గిరిజనాభివృద్ధి
సాక్షి, అమరావతి/దొండపర్తి (విశాఖ దక్షిణ): రాష్ట్రంలో రూ.6,929 కోట్ల వ్యయంతో గిరిజనాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర తెలిపారు. సీఎం వైఎస్ జగన్ గతేడాది కంటే.. ఈ ఏడాది ఎస్టీ సబ్‌ప్లాన్‌కు రూ.784 కోట్లు అధికంగా కేటాయించారని వివరించారు. ఈ నిధులను సద్వినియోగం చేస్తూ.. గిరిజనుల అభివృద్ధికి కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర సబ్‌ప్లాన్ నిధుల వినియోగాన్ని సమీక్షించారు. అన్ని రంగాల్లోనూ గిరిజనులు అభివృద్ధి సాధించాలన్నదే వైఎస్ జగన్ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. అందుకే గతేడాది కంటే ఈ ఏడాది అధిక నిధులను కేటాయించారని చెప్పారు. 2022–23లో ఎస్టీ సబ్‌ప్లాన్‌కు రూ.6,144.90 కోట్లు మంజూరు చేయగా.. ఈ ఏడాది రూ.6,929.09 కోట్లు కేటాయించారని పేర్కొన్నారు. ఈ నిధులను పూర్తిగా గిరిజన సంక్షేమానికే వినియోగించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నిధుల సద్వినియోగంలో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. గిరిజన గూడేలకు రహదారులు, తాగునీటి సరఫరా, విద్యా సంస్థల్లో సౌకర్యాలను మెరుగుçపరచాలని సూచించారు. సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే, డైరెక్టర్ జె.వెంకటమురళి, ట్రైకార్ ఎండీ రవీంద్రబాబు, జీసీసీ ఎండీ సురేశ్ తదితరులు పాల్గొన్నారు. జీసీసీ సేవల విస్తృతానికి కొత్త వెబ్సైట్ గిరిజనులు, వినియోగదారులు, ఉద్యోగులకు అవసరమైన శీఘ్ర సేవలు, సమగ్ర సమాచారాన్ని అందించడంతో పాటు జీసీసీ సహజ ఉత్పత్తుల మార్కెట్‌ను మరింత విస్తృతం చేసేందుకు గిరిజన సహకార సంస్థ(జీసీసీ) నూతన వెబ్సైట్ దోహదపడుతుందని డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర తెలిపారు. మంగళవారం గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జీసీసీ నూతన వెబ్‌సైట్‌ను రాజన్నదొర ప్రారంభించారు. సీఎం జగన్ సారథ్యంలో నాలుగేళ్లలో గిరిజన సాధికారత సాధనలో జీసీసీ అనూహ్యమైన, మంచి ఫలాలను గిరిజనులకు అందించిందని వివరించారు. గిరిజనులకు డీఆర్ డిపోల ద్వారా రేషన్ సరుకుల సరఫరా, పెట్రోల్ బంకుల ఏర్పాటు, వివిధ రాష్ట్రాల్లో రిటైల్ ఔట్లెట్ల ద్వారా ఉత్పత్తుల విక్రయాలు, వన్‌ధన్ వికాస కేంద్రాల ఏర్పాటు, అరకు వ్యాలీ కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడంలో విశేషమైన కృషి చేస్తూ సత్ఫలితాలు సాధిస్తోందని వెల్లడించారు. ఈ సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖ సిబ్బందిని ఆయన అభినందించారు. గిరిజన సంక్షేమ శాఖ నేతృత్వంలో జీసీసీ చేస్తున్న కార్యక్రమాలను సమగ్రంగా అందుబాటులోకి తీసుకురావడంతో పాటు జీసీసీ సహజ ఉత్పత్తుల మార్కెట్‌ను మరింతగా విస్తరించేందుకు ఈ వెబ్సైట్ విశేషంగా దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జీసీసీ వైస్‌చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జి.సురేష్ కుమార్ మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో జీసీసీ అందిస్తున్న సేవలు, ఖర్చు చేస్తున్న నిధులు, ప్రణాళికలు, ఫలితాలు వంటి వివరాలు అన్నీ గణాంకాలతో సహా నూతన వెబ్సైట్లో పొందుపరిచినట్లు తెలిపారు. జీసీసీ సహజ ఉత్పత్తుల విక్రయానికి ఆన్లైన్ షాపింగ్‌తో పాటు సోషల్ మీడియా వేదికలను ఈ నూతన వెబ్‌సైట్‌తో అనుసంధానించినట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జీసీసీ ప్రధాన కార్యాలయం సహా ప్రాంతీయ కార్యాలయాలు, ఉద్యోగుల వివరాలను సమగ్రంగా అందుబాటులో ఉంచడంతో పాటు, పారదర్శకత, జవాబుదారీతనం పెంచే చర్యల్లో భాగంగా జీసీసీ సిబ్బంది బదిలీలు, ఉత్తర్వుల వివరాలతో పాటు టెండర్లు, నోటీసులు, ప్రకటనలు సమగ్రంగా ఈ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని వివరించారు. గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్ దాండే, గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ జె.మురళి, జీసీసీ వైస్‌చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జి.సురేష్ కుమార్, ట్రైకార్ ఎండీ రవీంద్రబాబు, గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీరింగ్ చీఫ్ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
గిరిజనుల గుండె చప్పుడు సీఎం జగన్
బీచ్ రోడ్డు (విశాఖ తూర్పు): దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా గిరిజనుల అభివృద్ధి కోసం అనేక పథకాలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తూ వారి గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించారని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. గిరిజన స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకుంటూ బిర్సా ముండా జయంతి సందర్భంగా మంగళవారం విశాఖలో గిరిజన గౌరవ దిన వారోత్సవాలను రాజన్నదొర ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గిరిజనులకు 2 లక్షల పుడక భూములను పంపిణీ చేసిన ఘనత సీఎం జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. గిరిజన నాయకులు, సమరయోధుల గురించి, గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాల గురించి ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అంతకుముందు గిరిజన కార్నివాల్‌ను ప్రారంభించారు. తమ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నృత్యాలు చేస్తూ సాగర తీరాన్ని హోరెత్తించారు. జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర, ఎమ్మెల్యేలు చెట్టి పాల్గుణ, భాగ్యలక్ష్మి, కళావతి, జీసీసీ చైర్పర్సన్ స్వాతిరాణి పాల్గొన్నారు. -
గిరిసీమలో ప్రకృతి సాగు
సాక్షి, అమరావతి: ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ప్రకృతి వ్యవసాయాన్ని ఏజెన్సీలోని అన్ని గ్రామాలకూ దశలవారీగా విస్తరించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఇందుకోసం మూడేళ్ల పాటు పక్కా ప్రణాళికను అమలు చేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ ప్రోత్సాహంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోని పలు గ్రామాలు సహజసిద్ధమైన సాగు పద్ధతులను అనుసరిస్తున్నాయి. ఈ ఐదు జిల్లాల్లోని 42 ఏజెన్సీ మండలాల్లో ఉన్న 424 గ్రామాల్లో ఇప్పటికే 1.64 లక్షల ఎకరాల్లో 76,329 మంది గిరిజన రైతులను ప్రభుత్వం ప్రకృతి సేద్యం వైపు ప్రోత్సహించింది. తాజాగా చేపట్టిన మూడేళ్ల ప్రణాళికతో మరో 530 గిరిజన గ్రామాల్లో 1.75 లక్షల మంది రైతులు పూర్తిస్థాయి ప్రకృతి సేద్యం చేయనున్నారు. తద్వారా 4.25 లక్షల ఎకరాల్లో రసాయన ఎరువులు, పురుగుమందుల సాగుకు చెల్లుచీటి పలకనున్నారు. వీరిని ప్రకృతి సేద్యం వైపు ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రూ.187 కోట్లు ఖర్చు చేయనుంది. ప్రకృతి సేద్యం ఏజెన్సీకి వరం.. విపత్తులు, పర్యావరణ మార్పుల వల్ల సున్నితమైన గిరిజన ప్రాంతాల్లో పంటలు దెబ్బతింటుంటాయి. దీనికితోడు రసాయన ఎరువులు, పురుగు మందులకు అధిక పెట్టుబడులు పెట్టి సాగు చేస్తే.. గిరిజన రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముంది. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడిని తగ్గించే ప్రకృతి సేద్యం వీరికి నిజంగా వరమేనని ప్రకృతి సాగు నిపుణులు చెబుతున్నారు.. సీఎం జగన్ దార్శనికతకు ఇదో నిదర్శనం ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించి గిరిజన రైతులను పంట నష్టాల నుంచి గట్టెక్కించడమే కాకుండా మేలైన ఉత్పత్తులు సాధించేలా చర్యలు చేపట్టిన సీఎం వైఎస్ జగన్ దార్శనికతకు ఇది మరో నిదర్శనం. ఏజెన్సీలోని వ్యవసాయ, అటవీ ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా డిమాండ్ ఉంది. ఈ ప్రాంతంలో ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో గిరిజన ప్రాంతాల్లోని వ్యవసాయ ఉత్పత్తులకు కూడా మరింత క్రేజ్ ఏర్పడుతుందనడంలో సందేహంలేదు. – పాముల పుష్ప శ్రీవాణి, ఉప ముఖ్యమంత్రి ప్రకృతి సేద్యంతో మేలైన ఫలితాలు రైతులను రసాయన ఆధారిత సాగు నుంచి ప్రకృతి సేద్యం వైపు ప్రోత్సహించడంలో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉంది. రాష్ట్రంలో 7.50 లక్షల ఎకరాలకు సంబంధించి సుమారు 6,50,000 మంది రైతులు ప్రకృతి సేద్యం చేసేందుకు నమోదు చేసుకున్నారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లోనూ ప్రకృతి సేద్యం విస్తరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రైతు సాధికార సంస్థ, ఆర్బీకేలు, స్థానిక సంస్థలను సమన్వయం చేసి ఏజెన్సీ గ్రామం, మండలం, జిల్లా యూనిట్లుగా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాం. ప్రకృతి సేద్యానికి గిరిజన రైతులను సన్నద్ధం చేసేలా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ నిధులను ఖర్చు చేయనున్నాం. – టి.విజయకుమార్, రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ -
విశాఖలో ట్రైబల్ రీసెర్చ్ మిషన్ సిద్ధం
సాక్షి, అమరావతి: గిరిజన జాతులపై అధ్యయనం, వారికి సంబంధించిన సంక్షేమ పథకాల మూల్యాంకనం తదితరాల కోసం విశాఖపట్నంలోని రుషికొండ వద్ద నిర్మిస్తున్న ట్రైబల్ రీసెర్చ్ మిషన్ భవనాల నిర్మాణం పూర్తయింది. ఇప్పటివరకు ఈ విభాగం రాష్ట్ర కార్యాలయంలో ఉండేది. రాష్ట్ర విభజన తరువాత ట్రైబల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూషన్ నుంచి ట్రైబల్ రీసెర్చ్ మిషన్‌ను వేరుచేశారు. దీనిని విశాఖలో ఏర్పాటు చేసేందుకు వీలుగా అప్పట్లో ఆదేశాలు జారీచేశారు. దీంతో అక్కడ రూ.17.50కోట్లతో 1.19 ఎకరాల్లో మిషన్ భవనాలు రూపుదిద్దుకున్నాయి. ఇక్కడ ఒక్కో బ్లాక్‌లో మూడంతస్తుల చొప్పున మూడు బ్లాక్‌లు ఉన్నాయి. ఒక బ్లాక్‌లో పరిపాలన, రెండో బ్లాక్‌లో మిషన్ డైరెక్టర్ క్యాంపు కార్యాలయం, మరో బ్లాక్‌లో స్టాఫ్ క్వార్టర్స్ ఉంటాయి. ప్రారంభోత్సవానికి రెడీగా.. ప్రస్తుతం అన్ని హంగులతో పనులు పూర్తికావడంతో ఈ భవనాలు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. అలాగే, అరకులో అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అక్కడ కూడా పనులు మొదలయ్యాయి. గిరిజనులు ఎక్కువగా ఈ ప్రాంతాల్లో నివసిస్తున్నందున వారి సంస్కృతీ సంప్రదాయాలు గురించి తెలుసుకునేందుకు వీలుగా ఈ భవనాలు ఉపయోగపడనున్నాయి. సంక్షేమ పథకాలపై అధ్యయనం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గిరిజనాభివృద్ధికి ఎలా ఉపయోగపడుతున్నాయనే విషయాన్ని రీసెర్చ్ మిషన్‌లో అధికారులు మూల్యాంకనం చేస్తారు. పథకాల అమలుతీరును విశ్లేషించడం ద్వారా వీరికి అవి ఎలా లబ్ధిచేకూర్చాయో తేలుస్తారు. అలాగే, ఈ ట్రైబల్ రీసెర్చ్ మిషన్ ఇప్పటివరకు 20 మానవజాతి అధ్యయనాలు పూర్తిచేసింది. గిరిజన సంస్కృతిని ప్రతిబింబించే వీడియో డాక్యుమెంటేషన్‌ను కూడా రూపొందించింది. 2019 డిసెంబరులో చత్తీస్‌ఘడ్‌లోని రాంచీలో జరిగిన నృత్యోత్సవంలో బైసన్ నృత్యానికి (కొమ్ము నృత్యం) ఏపీకి జాతీయస్థాయిలో మూడోస్థానం సాధించింది. కాగా, ఈ రీసెర్చ్ మిషన్‌లో గిరిజన సంతతులపై అధ్యయనానికి నిపుణులైన ప్రొఫెసర్లు ఉంటారు. ఇక్కడ కార్యకలాపాలు పూర్తిస్థాయిలో ప్రారంభం కాగానే మరికొంతమందిని డిప్యుటేషన్ లేదా కాంట్రాక్టు పద్ధతిపై ప్రభుత్వం నియమిస్తుంది. గిరిజన సంస్కృతి ప్రతిబింబించేలా.. ఈ ట్రైబల్ రీసెర్చ్ మిషన్ కార్యాలయం గిరిజన సంస్కృతిని ప్రతిబింబించేలా ఉంటుంది. వారి సంస్కృతీ సంప్రదాయాలు, జీవన విధానానికి సంబంధించిన కళారూపాలు ఆకర్షణీయంగా ఉండేలా ఏర్పాటుచేస్తాం. ఇకపై ఇక్కడ నిత్యం అధ్యయనాలు జరుగుతాయి. కొత్త అంశాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం గుర్తించి వారి జీవన సరళిలో తగిన మార్పులు తీసుకురావడానికి కృషిచేస్తుంది. – ఇ. రవీంద్రబాబు, మిషన్ డైరెక్టర్, గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ మిషన్ -
అర్జీల పరిష్కారానికి అందుబాటులో ఉంటా
సాక్షి, ఉట్నూర్(ఖానాపూర్): సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారిగా నాలుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత గిరిజనుల సంపూర్ణ అభివృద్ధికి అందుబాటులో ఉంటూ గిరిజన సంక్షేమానికి కృషి చేస్తానని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి భవేశ్ మిశ్రా అన్నారు. శనివారం సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ 53వ ప్రాజెక్టు అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రాజెక్టు అధికారిగా ఏజెన్సీ ప్రాంత గిరిజనులందరికీ అందుబాటులో ఉంటూ విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల గిరిజనుల అభివృద్ధి కేంద్రంగా ఉన్న ఐటీడీఏ ద్వారా గిరిజనుల సంపూర్ణ అభివృద్ధికి పాటుపడుతానని చెప్పారు. అన్నీ శాఖల అధికారుల సమన్వయంతో ముందుకు సాగుతానని చెప్పారు. గతంలో భద్రాచలం షెడ్యూల్ ప్రాంతంలో విధులు నిర్వహించిన అనుభవంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ ఫలాలు అర్హులకు అందిస్తానన్నారు. గిరిజన సమస్యలపై ఏ సమయంలోనైనా ఫోన్, వాట్సాఫ్ ద్వారా ఎవరైన సంప్రదించవచ్చన్నారు. ప్రభుత్వ ఆర్థిక చేయూత పథకాల ఫలాలు గిరిజన లబ్ధిదారులకు అందించడంతో పాటు అర్జీదారుల సమస్యలు పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఐటీడీఏలో ఆయా విభాగాల అధికారులు సమయపాలనా పాటిస్తూ విధులు సక్రమంగా నిర్వహించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఉద్యోగి బయో మెట్రిక్ పాటించడంతో పాటు తమ ఐడీ కార్డుల్లో బ్లడ్ గ్రుప్‌తో సహా వివరాలు అన్ని పొందుపర్చుకోవాలని తెలిపారు. అటవీ హక్కుల చట్టం హక్కు పత్రాలపై అధికారులతో సమీక్షా అనంతరం అర్హులకు న్యాయం జరిగేలా చర్యలుంటాయన్నారు. అనంతరం ఐటీడీఏ కార్యాలయంలోని పలు విభాగాలను పరిశీలించారు. ఆయా కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న అధికారుల పనుల తీరుపై ఆరా తీశారు. నూతన పీవో రావడంతో ఐటీడీఏ, వివిధ విభాగాల అధికారులు పీవోకు స్వాగతం పలుకుతూ పుష్పగుచ్ఛం అందించారు. -
గిరిజనుల పక్షపాతి.. సీఎం వైఎస్ జగన్
సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గిరిజనుల పక్షపాతి అని, గిరిజనుల అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టారని ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి కొనియాడారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విశాఖ జిల్లా అరకు లోయలో శుక్రవారం రాష్ట్ర స్థాయి ఉత్సవాన్ని ఆమె ప్రారంభించారు. అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పుష్పశ్రీవాణి మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వచ్చాక నాలుగున్నరేళ్ల వరకూ గిరిజనులకు మంత్రి పదవి కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇచ్చిన దుర్మార్గ ప్రభుత్వం కూడా చంద్రబాబుదేనని దుయ్యబట్టారు. తనకు వెన్నుదన్నుగా ఉన్న గిరిజనులకు సీఎం వైఎస్ జగన్ అండగా నిలిచారని తెలిపారు. రూ.66 కోట్లను కేటాయించి పాడేరుకు వైద్య కళాశాలను బహుమతిగా ఇచ్చారన్నారు. 2019–20 బడ్జెట్లో రూ.4,988 కోట్లు కేటాయించారని చెప్పారు. ప్రతి గిరిజన పోస్టుమెట్రిక్ విద్యార్థికి భోజనం, వసతి కోసం ఏటా రూ.20 వేల చొప్పున అందించేందుకు రూ.132.11 కోట్లు కేటాయించారన్నారు. 45 ఏళ్ల వయసు దాటిన గిరిజన మహిళలకు నాలుగు దశల్లో రూ.75 వేల మొత్తాన్ని అందించేందుకు రూ.971 కోట్ల నిధులు ఇచ్చారని వెల్లడించారు. షెడ్యూల్డ్ తెగల ప్రాంతాల్లో గిరిజన యువతకు నూరు శాతం రిజర్వేషన్లను వర్తింపజేసి గ్రామ సచివాలయాల్లో దాదాపు 4,706 పోస్టులను వారికే కేటాయించారన్నారు. వివాహం చేసుకునే గిరిజన వధువులకు రూ.లక్ష చొప్పున సహాయం చేస్తామన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజనులకు రూ.100 కోట్ల మేర ఆర్థిక సహాయాన్ని పుష్పశ్రీవాణి అందజేశారు. రూ.43 కోట్ల అంచనా వ్యయంతో తలపెట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆమె ప్రారంభించారు. రాష్ట్ర పర్యాటక, యువజన సరీ్వసుల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ అరకు, పాడేరు ప్రాంతాలను పర్యాటక ప్రదేశాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజన ఆశ్రమ పాఠశాలలు, గురుకుల విద్యాలయాల విద్యార్థినులు ప్రదర్శించిన జానపద, గిరిజన నృత్య రూపకాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, పాడేరు ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ, మాజీ మంత్రి మత్స్యరాస మణికుమారి, మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు, జిల్లా కలెక్టర్ వి.వినయ్‌చంద్, ఐటీడీఏ పీవో డీకే బాలాజీ, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు. పాడేరులో గిరిజన వైద్య కళాశాల ఆదివాసీలకు సీఎం జగన్ శుభాకాంక్షలు సాక్షి, అమరావతి: ఆదివాసుల కోసం పాడేరులో గిరిజన వైద్య కళాశాల ఏర్పాటు చేస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెల్లడించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీ గిరిజనులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ.. ఈ విషయాన్ని వెల్లడించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ట్విట్టర్లో పేర్కొంది. ‘ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివాసీ గిరిజనులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఆదివాసుల కోసం పాడేరులో గిరిజన మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నామని, ఎన్నికల ముందు చెప్పిన ప్రతి హామీ అమలు దిశగా అడుగులేస్తున్నామన్నారు’ అని సీఎంవో ట్వీట్ చేసింది. -
ఆదివాసీలకు సీఎం జగన్ శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి : ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివాసీ గిరిజనులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదివాసులకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించేందుకు విశాఖపట్నం జిల్లా పాడేరులో గిరిజన మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. ఎన్నికల ముందు చెప్పిన ప్రతి హామీ అమలు దిశగా అడుగులేస్తామని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. అలాగే ఆదివాసీలకు అండగా ఉండేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం వివిధ కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా రూ. 300 కోట్ల విలువైన వరాలను ప్రభుత్వం ప్రకటించనుంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే కార్యక్రమాల్లో రూ. 100 కోట్ల విలువైన సబ్సిడీ రుణాలు, ఇతర ఉపకరణాలను పంపిణీ చేయనుంది. సంపదను దోచుకునేందుకు చంద్రబాబు కుట్ర : జంగా గిరిజనుల్లో పేదరికాన్ని తోలగించి, వారిని ఉన్నత విద్యవంతులుగా చేయడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తెలిపారు. శుక్రవారం ఆయన మట్లాడుతూ.. ఏపీ సహజ వనరులకు పుటినిల్లు అని.. ఆ సంపదను దోచుకోవాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుట్రలు పన్నారని విమర్శించారు. గిరిజనుల హక్కులు కాపాడటం కోసం సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారని అన్నారు. గిరిజనుల అభివృద్ధి కోసం సీఎం వైఎస్ జగన్ అనేక కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. గిరిజన మహిళకు ఉప ముఖ్యమంత్రి పదివి ఇచ్చి గౌరవించారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పనులు, పదవుల్లో 50 శాతం కేటాయించారని గుర్తుచేశారు. -
చరిత్రకు దర్పణం.. గిరిజన జీవనం
స్వచ్ఛమైన సెలయేళ్లు.. దట్టమైన అడవులు.. గంభీరమైన కొండలు.. పక్షుల కిలకిలారావాలు.. పచ్చని ప్రకృతి అందాలు... వీటి మధ్య శతాబ్దాల సంస్కృతులకు గుర్తుగా, వెనకబాటుతనానికి సజీవ సాక్ష్యంగా.. పాలకుల ఆలనకోసం ఎదురు చూస్తూ అమాయక ఆదివాసీ జనం నివసిస్తోంది. అడవితల్లి బిడ్డలుగా.. ప్రకృతి ఒడే ఆవాసంగా.. దశాబ్దాలుగా పోడు వ్యవసాయం చేసుకుని.. ప్రకృతి ప్రసాదిత ఫలాలతో సహవాసం చేస్తోంది. విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాలకు నోచుకోని గూడేలెన్నో కనిపిస్తాయి. ఇప్పుడిప్పుడే వారి జీవితాల్లో వెలుగులు నింపే సర్కారు వచ్చింది. వారి కష్టాలు తీర్చేందుకు బృహత్తర కార్యక్రమాలు అమలు చేస్తోంది. సాక్షి, విజయనగరం: దశాబ్దాలుగా గిరిజనులు సమస్యలతోనే సహవాసం చేస్తున్నారు. పాలకుల నిర్లక్ష్యానికి బలైపోయారు. కానీ ఇప్పుడిప్పుడే వారి సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి. వారి జీవితాల్లో మార్పు కోసం తాజా సర్కారు నడుం బిగించింది. గిరిజనులకు పాలనలో పెద్దపీట వేసింది. ఏకంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టి సముచిత గౌరవం కల్పించింది. ఇప్పుడు అదే మంత్రి చేతుల మీదుగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జిల్లాలో జరుపుకునే అవకాశాన్నిచ్చింది. జిల్లాలో గిరిజన ప్రాంత స్వరూపం ట్రైబుల్ సబ్‌ప్లాన్ మండలాలు (గుమ్మలక్ష్మీపురం, కురుపాం, జియమ్మవలస, కొమరాడ, పార్వతీపురం, మక్కువ, సాలూరు, పాచిపెంట) 8 మొత్తం గిరిజన జనాభా 5.20 లక్షలు పురుషులు 90,948 మహిళలు 96,881 గ్రామ పంచాయతీలు 77 గ్రామాలు 289 గిరిజన ఆవాసాలు 773 జియోగ్రాఫికల్ ఏరియా(జిల్లా విస్తీర్ణంలో 34.4 శాతం) 2383 చదరపు కిలోమీటర్లు గిరిజన తెగలు జటపూస్, కొండదొర, సవర, గదబ జాతులు..భాషలు జిల్లాలో 2.36 లక్షల మంది గిరిజనులున్నారు. వీరిలో ట్రైబల్ సబ్‌ప్లాన్ మండలాల్లో నివసించే వారి సంఖ్య 1.87 లక్షలుగా ఉంది. గిరిజనుల్లో 36 జాతులున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో సవర, కొండదొర, గదబ, వాల్మీకి, జాతాపు, కోయ, భగత జాతులు ప్రధానమైనవి. సవర భాష శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒకేలా ఉంటుంది. వీరి అభ్యున్నతికి ఏర్పాటైన ఐటీడీఏకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు కేటాయిస్తున్నాయి. సగటున ఒక్కో ఐటీడీఏకి ఏటా రూ.300 కోట్ల నిధులు వస్తున్నాయి. కానీ అందులో గిరిజనులకు ఈ నిధుల్లో చేరేది నామమాత్రమే. నిక్కచ్చిగా ఈ నిధులన్నీ గిరిజనులకే ఖర్చుచేసి ఉంటే గిరిజనుల బతుకులు ఎప్పుడో మారిపోయి ఉండేవి. సజీవ సంప్రదాయాలకు నిలయం గిరిజన జీవనం విభిన్నంగా ఉంటుంది. సంబరాలు, వివాహ వేడుకలు, ఆరాధనల ఆచారాలు, మనిషి మూలాలను తేటతెల్లం చేస్తుంటాయి. తరాలు మారినా వారి అలవాట్లు, కట్టుబాట్లు ఇప్పటికీ మారలేదు. ఇక్కడ జరిగే వివాహ వేడుకల్లోని సంప్రదాయాల్లో భాగంగా చెట్టును ఆరాధిం చే విధానాలు ప్రపంచ శాంతి సౌభాగ్యానికి సందేశాన్ని పంపుతుంటాయి. పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని ఏ పల్లెకు వెళ్లినా సవరజాతి గిరిజనుల సంబరాలు, పండుగ సందడులన్నీ ఒకే రకంగా కొనసాగితే పెళ్లిళ్లు మాత్రం ప్రకృతి ఆరాధనతో ముడిపడి ఉంటాయి. ప్రాణాధారమైన నీరు, అది లభించడానికి అవసరమైన చెట్టు చుట్టూనే వారి తంతు తిరుగుతుంది. సవర భాషలో పాటలు, థింసా నృత్యాలు ఇక్కడి గిరిజనుల పండుగలు, శుభకార్యాల్లో భాగం.ఆడవేషంలోవున్న యజ్జుడు అనే వ్యక్తి పురోహితుని పాత్రలో పెళ్లితంతు నిర్వహిస్తుంటే వధూవరులను మేనమామలు భుజాలపై ఎక్కించుకొని నృత్యం చేస్తూ ఊరేగించడం నేటికీ కొనసాగుతున్న సంప్రదాయం. కనీస సౌకర్యాలు కరువు నేటికీ గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాలు లేవు. కనీసం తాగునీరు, రోడ్డు మార్గం లేదు. వైద్య సదుపాయాలు లేక ఏటా వందలాది మంది మృత్యువాత పడుతున్నారు. గర్భిణులు, వృద్ధులు అత్యవసర సమయాల్లో వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నారు. నేటికీ వైద్యం కోసం, విద్య కోసం గిరిజనులు కొండలు గుట్టలు దాటి కాలినడకనచ, డోలీ సాయంతో మైదాన ప్రాంతా లకు రావాల్సిందే. వీరి తండాలకు విద్యుత్ సౌకర్యం లేదు. ఉండటానికి ఇళ్లు లేవు. ఇవ్వాల్సినవి ఇవ్వకపోగా వారి వనరులను లాక్కుంటున్నారు. క్వారీలు నడుపుతూ ఖనిజ సంపదను కొల్లగొడుతున్నారు. బాక్సైట్, గ్రానైట్ దోచుకుంటున్నారు. కొండలు పిండిచేసి గిరిజనులకు పోడు వ్యవసాయం చేసుకునే అవకాశం లేకుండా చేస్తున్నారు. ఈ పరిస్థితులను మార్చేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పించారు. జగనన్నతోనే మార్పు మొదలు గిరిజనుల జీవితాల్లో మార్పునకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. కురుపాం, సాలూరు గిరిజన రిజరŠడ్వ్ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్టు ఇచ్చారు. ఎన్నికల్లో గెలిచిన వెంటనే తన తొలి కేబినెట్లో కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణికి స్థానం కల్పించారు. గిరిజన శాఖ మంత్రి పదవిని ఇవ్వడంతో పాటు ఉపముఖ్యమంత్రి హోదానిచ్చి ఉన్నత స్థానం కల్పించారు. సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొరకు ప్యానెల్ స్వీకర్ పదవినిచ్చారు. గత ప్రభుత్వాలు ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను ఇతర ఖర్చులకు వాడేసేవి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నెల్లూరులో దళితతేజం సభ నిర్వహణకు సబ్ ప్లాన్ నిధులు ఖర్చుచేశారు. ఇలాంటి వాటిని అరికట్టడానికి స్థానిక అధికారం గిరిజనుల చేతుల్లో ఉండాలి. గిరిజనులకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాలని గిరిజనులు ఎప్పటి నుంచో కోరుతుండేవారు. సాంఘిక సంక్షేమ శాఖలో మిళితమై ఉండటంవల్ల గిరిజనులకు అన్యాయం జరుగుతుందని వేడుకునేవారు. వారి గోడువిన్న జగన్ గిరిజనులకు ప్రత్యేక మంత్రిని ఇచ్చారు. గిరిజనుల బతుకులు బాగుచేయాలనే ఉద్దేశంతో గిరిజన సలహామండలిని ఉపముఖ్యమంత్రి నేతృత్వంలో, గిరిజన ఎమ్మెల్యేల భాగస్వామ్యంతో సీఎం ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వంలో అప్పటి పాలకులు పదవిలో ఉన్నన్నాళ్లూ గిరిజన సలహా మండలి ఊసెత్తలేదు. ప్రజా సంకల్ప యాత్రలో ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ అందిస్తానని హామీ ఇచ్చి, సీఎంగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే దానిని నెరవేర్చారు. 200 యూనిట్ల వరకూ విద్యుత్ వినియోగాన్ని ఉచితం చేశారు. దీనివల్ల జిల్లాలో 70వేల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతోంది. గిరిజన ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్యాన్ని శ్రద్ధగా చూసుకునే 1415 మంది సామాజిక ఆరోగ్య కార్యకర్తలకు గత ప్రభుత్వ హయాంలో నెలకు కేవలం రూ.400 మాత్రమే భృతి ఇచ్చేవారు. కానీ గిరిజనుల ఆరోగ్యం దృష్ట్యా సీఎం జగన్మోహన్రెడ్డి ఆ వేతనాన్ని పదిరెట్లు పెంచి నెలకు రూ.4వేలు చేశారు. అందుకే ఈ ఆదివాసీ దినోత్సవాన్ని తొలిసారిగా గిరిజనులు సంతోషంగా జరుపుకుంటున్నారు. -
ఆదివాసీలకు అండగా..
సాక్షి, అమరావతి/విశాఖపట్నం : ఆదివాసీలకు అండగా ఉండేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం వివిధ కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. శుక్రవారం ‘ప్రపంచ ఆదివాసీ దినోత్సవం’ సందర్భంగా రూ.300 కోట్ల విలువైన వరాలను ప్రకటించబోతోంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే కార్యక్రమాల్లో రూ.100 కోట్ల విలువైన సబ్సిడీ రుణాలు, ఇతర ఉపకరణాలను పంపిణీ చేయనుంది. ప్రధానంగా అరకు లోయలో నిర్వహించే రాష్ట్రస్థాయి సభలో పలువురికి సాయాన్ని అందిస్తారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకుల సొసైటీ, ఆశ్రమ పాఠశాలలు, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ తదితర 27 స్కూల్ భవనాలను ఆదివాసీ దినోత్సవం రోజున ప్రారంభిస్తారు. అధునాతన సౌకర్యాలు గల వీటిని రూ.44 కోట్లతో నిర్మించారు. మరోవైపు రూ.15 కోట్ల విలువైన వ్యవసాయ పరికరాలు, ఇతర సామగ్రిని కాఫీ తోటలు పెంచుతున్న రైతులకు అరకు, పాడేరు ప్రాంతాల్లో పంపిణీ చేస్తారు. ఇతర ప్రాంతాల్లో కాఫీ తోటలు పండిస్తున్న గిరిజనులకు కూడా రూ.10 కోట్లను కేటాయించారు. ఈ మొత్తాలను వారికి చెక్కుల రూపంలో అందజేస్తారు. గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాలు, ఆశ్రమ పాఠశాలల్లో రూ.16 కోట్లతో ఆర్వో ప్లాంట్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. పర్యవేక్షణ లేక పాడైన ప్లాంట్లకు మరమ్మతులు చేపడతారు. మరిన్ని సదుపాయాలు గిరిజనులు సేకరించే ఫలాలు, పండించే పంట ఉత్పత్తుల్ని నిల్వ చేసుకునేందుకు వీలుగా సంతలు నిర్వహించే ప్రాంతాల్లో గోడౌన్లు నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. రూ.19.97 కోట్లతో చేపట్టే ఈ పనులకు ఆదివాసీ దినోత్సవం రోజున శంకుస్థాపన చేస్తారు. గిరిజన సంతల్లో ప్లాట్‌ఫారాల నిర్మాణం కూడా చేపడతారు. మరోవైపు గిరిజన గూడేల్లో ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా ‘గిరి సేవా కేంద్రాలు’ ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు ప్రపంచ బ్యాంక్ రూ.60 కోట్లు విడుదల చేసింది. ప్రస్తుతానికి 200 గ్రామ సచివాలయాల్లో వీటిని నిర్మించేందుకు శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. ఒక్కోసేవా కేంద్రం నిర్మాణానికి రూ.30 లక్షల చొప్పున సర్కారు ఖర్చు చేస్తోంది. ఇదిలావుంటే.. ఆదివాసీ పిల్లలకు హక్కుల్ని తెలియజేయటం, ఆదివాసీల పూర్తి డేటా సేకరించడం, వివిధ శాఖలతో సమన్వయం ద్వారా సౌకర్యాల కల్పనకు అజీం ప్రేమ్‌జీ ఫిలాంత్రఫిక్ ఇన్స్టిట్యూట్ రూ.25 కోట్లు వెచ్చించనుంది. 70 రోజుల్లో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు వైఎస్సార్సీపీ అధికారం చేపట్టిన తరువాత 70 రోజుల్లో ఆదివాసీలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసింది. 12,293 మంది గిరిజనులకు వార్డు, పంచాయతీ సచివాలయాల్లో శాశ్వత ఉద్యోగాలు కల్పించేందుకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పటికే 23,970 మందిని వలంటీర్లుగా నియమించారు. ఎస్టీ సబ్‌ప్లాన్ కింద 2019–20 సంవత్సరానికి రూ.4,988 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. 2018–19తో పోలిస్తే రూ. 811 కోట్లు ఎక్కువ నిధులు ఇచ్చింది. గిరిజన సంక్షేమ శాఖకు ఈ బడ్జెట్లో రూ.2,153 కోట్లు కేటాయించింది. ఇది గత సంవత్సర బడ్జెట్ కంటే రూ.24 కోట్లు ఎక్కువ. నవరత్నాలలో భాగంగా పోస్టు మెట్రిక్ చదువుకుంటున్న 66 వేల మంది గిరిజన విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.20 వేల వంతున రూ.132.11 కోట్లు కేటాయించింది. వైఎస్సార్ పెళ్లి కానుక కింద గిరిజన వధువుకు ఇచ్చే సాయాన్ని రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంచింది. ఇందుకోసం ఈ ఏడాది రూ.53 కోట్లు కేటాయించింది. గిరిజన కుటుంబాలకు గతంలో 100 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వగా, ప్రస్తుతం 200 యూనిట్లకు పెంచింది. ఇందుకోసం బడ్జెట్లో రూ.139 కోట్లు కేటాయించింది. దీనివల్ల 4.78 లక్షల గిరిజన కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతోంది. గిరిజనుల కోసం పాడేరులో మెడికల్ కాలేజీ మంజూరు చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం బడ్జెట్లో రూ.66 కోట్లు మంజూరు చేసింది. విజయనగరంలో తాత్కాలిక క్యాంపస్ ఏర్పాటు చేస్తూ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని ప్రారంభించింది. ఇందుకోసం రూ.8 కోట్లు మంజూరు చేసింది. గిరిజనుల్లో ఎవరైనా ప్రమాద వశాత్తు మరణిస్తే వైఎస్సార్ ప్రమాద బీమా కింద ఆ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించేందుకు ఆదేశాలు జారీ అయ్యాయి. గిరిజన రైతుల కోసం వ్యవసాయ బోర్లు వేసేందుకు రూ.20 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ఆదివాసీ ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి అరకు లోయలో శుక్రవారం నిర్వహించే రాష్ట్రస్థాయి ఆదివాసీ ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి ప్రారంభించే ఉత్సవాలకు రూ.75 లక్షలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. గిరిజనుల సంప్రదాయ నృత్య ప్రదర్శనలతో పాటు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. గిరిజనుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై అవగాహన కల్పించేలా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్న సంక్షేమ పథకాలపైనా అవగాహన కల్పించనున్నారు. -
అడవికాసిన నిధులు
అక్కడ ఎవరికైనా జబ్బు చేస్తే డొల్లలు.. కావడే దిక్కు.. లేదా రోగిని మంచానికి కట్టుకొని ప్రధాన రహదారి వరకు మోసుకుంటూ వెళ్లాలి.. ఈలోపు పరిస్థితి విషమించితే ప్రాణాలు కోల్పోవాల్సిందే!ఆ గూడేల్లో ఎవరికైనా పురిటి నొప్పులొస్తే జీవన్మరణ సమస్యే.. అంబులెన్సులు అందుబాటులో ఉండవు.. ఉన్నా అవి వచ్చేందుకు రోడ్డు ఉండదు.. అష్టకష్టాలు పడి ఆసుపత్రికి వెళ్లినా డాక్టర్ ఉండడు.. నొప్పులతో ఆసుపత్రికి వెళ్తూ మార్గం మధ్యలోనే కన్నుమూసిన అభాగినులు ఎందరో..!!అభివృద్ధి పేరిట కోట్లకు కోట్లు నిధులు వెచ్చిస్తారు.. కానీ ఖర్చంతా కాగితాలకే పరిమితం.. రోడ్లు.. విద్యుత్.. విద్య.. వైద్యం.. తాగునీరు వంటి మౌలిక వసతులు ఇప్పటికీ గగనమే!!! – సాక్షి నెట్వర్క్ దట్టమైన అడవులు, కొండకోనల్లో నాగరిక ప్రపంచానికి దూరంగా బతుకుతున్న గిరిజనుల అభివృద్ధి కోసం నెలకొల్పిన సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ)లు వారి జీవితాల్లో వెలుగులు నింపలేకపోతున్నాయి. ఏటా కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నా గిరిజన ఆవాసాలు కనీస మౌలిక వసతులకు నోచుకోలేక తల్లడిల్లుతున్నాయి. ఐటీడీఏలు నెలకొల్పి మూడు దశాబ్దాలు పూర్తయినా గిరిజనుల బతుకులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడ అన్న చందంగానే ఉన్నాయి. రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్, జయశంకర్ జిల్లా ఏటూరునాగారం, భద్రాద్రి జిల్లా భద్రాచలం, నాగర్‌కర్నూల్ జిల్లా మన్ననూర్లలో నాలుగు ఐటీడీఏలు ఉన్నాయి. వీటికి గ్రూప్–1 లేదా ఐఏఎస్ కేడర్ అధికారులను ప్రాజెక్టు అధికారి (పీవో)గా నియమించి వారి పర్యవేక్షణలో పథకాలను అమలు చేస్తున్నారు. విద్య, వైద్యం, ఇంజనీరింగ్, ఉద్యానవనం, ఇరిగేషన్, గిరిజన సహకార సంస్థ, పట్టుపరిశ్రమ, వ్యవ సాయం తదితర విభాగాలను ఏర్పాటు చేసి పథకాలు అమలు చేస్తు న్నారు. నిధుల లేమి, సిబ్బంది కొరత, పర్యవేక్షణ లోపం, పాలకుల పట్టింపులేనితనం, అవినీతి అక్రమాలు వంటి కారణాలతో పథకాల ఫలాలు గిరిజనులకు పూర్తిస్థాయిలో దక్కడం లేదు. గిరిజనుల కష్టాలు, వారి ఆవాసాల్లో వసతుల లేమిపై ఈవారం ఫోకస్... అందని ద్రాక్షగా హక్కు పత్రాలు అటవీ హక్కుల చట్టం–2006 ప్రకారం.. పోడు చేసుకుంటున్న గిరిజన రైతులకు భూమి హక్కు పత్రాలు ఇవ్వాలి. కానీ ఇది గిరిజనులకు అందని ద్రాక్షగానే మారింది. ఏటూరునాగారం ఐటీడీఏలో మొదటి దశ కింద 2010–11లో 14,016 మందికి 41,314.59 ఎకరాలకు హక్కు పత్రాలు జారీ చేశారు. వీఎస్ఎస్ కింద 134 మందికి 1,18,122 ఎకరాలకు పత్రాలు అందించారు. ∙భద్రాచలం ఐటీడీఏలో 31,961 మంది గిరిజనులకు 2.10 లక్షల ఎకరాలకు హక్కు పత్రాలు అందించారు. వైఎస్సార్ మరణం తర్వాత ఇప్పటివరకు 456 మంది గిరిజనులనే అర్హులుగా తేల్చారు. వారిలో ఇప్పటివరకు 265 మందికే పట్టాలను పంపిణీ చేశారు. ∙మన్ననూర్ ఐటీడీఏ పరిధిలో వైఎస్సార్ హయాంలో దాదాపు 2,630 కుటుంబాలకు 4,412 ఎకరాల భూమికి హక్కు పత్రాలు జారీ చేశారు. 2008–09లో 291 మంది గిరిజనులు 864 ఎకరాల కోసం దరఖాస్తు చేసుకుంటే ఇప్పటికీ హక్కు కల్పించలేదు. ఇంకా తండాల్లో 5 వేల కుటుంబాలు పోడు భూములు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నాయి. అటవీ అధికారులు దాడుల పేరిట వారి పంటలను నాశనం చేçస్తూ కేసులు పెడుతున్నారు. ∙ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలో 56,358 వేల మంది 2,25,569.82 ఎకరాల పోడు భూములపై హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 37,712 మందినే అర్హులుగా గుర్తించి 1,35,997.85 ఎకరాలకు హక్కు పత్రాలు అందించారు. అటవీ ఉత్పత్తులకు ధర ఏది? గిరిజనులు సేకరించే వివిధ రకాల అటవీ ఉత్పత్తులను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి, వారి ఆర్థికాభి వృద్ధికి దోహదపడేందుకు ఏర్పాటు చేసిన గిరిజన సహ కార మార్కెటింగ్ సొసైటీ (జీసీసీ)లు పూర్తిగా నిర్వీర్యమయ్యాయి. మన్ననూర్ ఐటీడీఏ పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతం అటవీ ఉత్పత్తులకు పుట్టినిల్లు. ఈ ప్రాంత గిరిజనులు జిగురు, తేనె, కుంకుడుకాయలు, కరక్కాయలు, సుగంధ పాలవేర్లు, చీపుర్లు, విషముష్టి గింజలు, కానుగ పలుకు, చింతపండు, మైనం, నర్రమామిడి చెక్క, మారెడు గడ్డలు, జిల్ల గింజలు, సారెపప్పు, చింతగింజలు వంటి వివిధ రకాల అటవీ ఉత్పత్తులు సేకరిస్తున్నారు. ఉట్నూర్, ఏటూరునాగారం ఐటీడీఏల పరిధిలో ఇప్పపువ్వు, తేనె, చీపుర్లు ఎక్కువగా సేకరిస్తుంటారు. కానీ వీటికి సరైన ధర రావడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానరాని వైద్య సేవలు గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు అధ్వానంగా మారాయి. ఐటీడీఏల ఆధ్వర్యంలో వైద్య విభాగం పనిచేస్తున్నా ఎక్కడా తగిన సౌకర్యాలు లేవు. డిప్యూటీ డీఎంహెచ్‌వో స్థాయి అధికారి పరిధిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్‌సెంటర్లు ఉన్నాయి. అయితే చాలాపోస్టులు ఖాళీగా ఉండడం, కొన్నిచోట్ల ఉన్నా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల గిరిజనుల ప్రాణాలకు భరోసా లేకుండా పోతోంది. కాంట్రాక్టు పద్ధతిన నియమితులైన వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అత్యవసర సమయాల్లో రోగులను ఆసుపత్రులకు తరలించేందుకు ఏర్పాటు చేసిన అంబులెన్స్‌లను సైతం అద్దెకు నడుపుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. పైపెచ్చు వాటిని వైద్య సేవలకు వాడినట్లుగా రికార్డులు సృష్టించి బిల్లులను తీసుకుంటున్నారు. ఏటూరు నాగారంలో గతంలో ఓ అంబులెన్స్‌ను ఇలాగే బయట అద్దెకు నడుపుతుండగా అధికారులు పట్టుకొని కేసు నమోదు చేశారు. ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలో 3 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 32 పీహెచ్‌సీలు, 186 సబ్‌సెంటర్లు ఉన్నాయి. వాటిలో 795 పోస్టులకుగాను 150 వరకు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే వైద్య విధాన పరిషత్ అధీనంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో రెగ్యులర్ వైద్యాధికారులు లేక కాంట్రాక్ట్ ఎంబీబీఎస్‌లతో వైద్యం అందిస్తున్నారు. 16 అంబులెన్స్‌లు అరకొరగా సేవలందిస్తున్నాయి. భద్రాచలం ఐటీడీఏ పరిధిలో నాలుగు ఏరియా వైద్యశాలలు, ఐదు సీహెచ్‌సీలు, 38 పీహెచ్‌సీలు, 340 ఉపకేంద్రాలు ఉన్నాయి. వాటిలో 24 గంటలు పనిచేసే పీహెచ్‌సీలు 21 ఉన్నా.. ఒక్కదానికి కూడా అంబులెన్స్ సదుపాయం లేదు. 108 వాహనాలు 16, 104 వాహనాలు 15 ఉన్నా వాటి నిర్వహణ అధ్వానంగా ఉంది. 24 గంటల ఆస్పత్రి.. ఒక్కరే వైద్యాధికారి ఇది భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలోని చర్ల మండలం సత్యనారాయణ పురంలో 24 గంటలపాటు పనిచేసే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. దీని పరిధిలో వాస్తవానికి ఇద్దరు వైద్యులు, ముగ్గురు స్టాఫ్‌నర్సులు, పీహెచ్ఎస్, హెచ్వీ, సూపర్వైజర్, ఏపీఎంఓ, డీపీఎంఓ, ఫార్మసిస్టు, ల్యాబ్ టెక్నీషియన్‌తోపాటు ఆస్పత్రి పరిధిలో ఉన్న ఆరు సబ్ సెంటర్లలో ఆరుగురు ఫస్ట్ ఏఎన్ఎంలు, మరో ఆరుగురు సెకండ్ ఏఎన్ఎంలు ఉండాలి. కానీ చాలా పోస్టులు ఖాళీ ఉన్నాయి. పీహెచ్సీలో ఇద్దరు వైద్యాధికారులకు ఒక్కరే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సబ్ సెంటర్ల పరిధిలో సెకండ్ ఏఎన్ఎంలే ఉన్నారు. సారథుల్లేరు.. పోస్టులు ఖాళీ - ఐటీడీఏల్లో ప్రాజెక్టు అధికారితోపాటు పలు కీలక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏళ్ల తరబడి ఖాళీలు భర్తీ చేయకపోవడంతో కార్యకలాపాలు స్తంభించి పోతున్నాయి. రాష్ట్రంలో 4 ఐటీడీఏలు ఉంటే ఇందులో మూడింటికి ఇన్చార్జి పీవోలే కొనసాగు తుండడం గమనార్హం. ఉట్నూర్ ఐటీడీఏ పీవోగా ఉన్న ఐఏఎస్ అధికారి ఆర్వీ కర్ణన్‌ను కొత్తగా ఏర్పడిన మంచిర్యాల జిల్లాకు కలెక్టర్‌గా నియమించారు. ఐటీడీఏ ఇన్చార్జి పీవో బాధ్యతలనూ ఆయనకే అప్పగించారు. కలెక్టర్‌గా బిజీగా ఉండే కర్ణన్ ఐటీడీఏకు సమయం కేటాయించలేకపోతు న్నారు. - భద్రాచలం ఐటీడీఏలోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ పీవోగా ఉన్న రాజీవ్‌గాంధీ హన్మంతును కొత్తగా ఏర్పడిన జిల్లాకు కలెక్టర్‌గా నియమించారు. ప్రస్తుతం ఆయనే ఐటీడీఏ ఇన్చార్జి పీవోగా వ్యవహరిస్తున్నారు. - మన్ననూర్ ఐటీడీఏ కూడా ఇన్చార్జి పీవోతో నడుస్తోంది. గ్రూప్–1 అధికారి అయిన మంగ్యానాయక్ డీటీడీవోగా బాధ్యతలు నిర్వహిస్తూనే పీవోగా వ్యవహరిస్తున్నారు. ఏటూరునాగారంలో మాత్రమే చక్రధర్‌రావు రెగ్యులర్ పీవోగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. - ఐటీడీఏల్లో అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏటూరునాగారం ఐటీడీఏ లో అన్ని విభాగాల్లో 1,532 పోస్టులు ఉండగా.. 1,127 పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇంకా 408 పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి. - భద్రాచలం ఐటీడీఏలో 152 పోస్టు లకు 42 ఖాళీలుగా ఉన్నాయి. పశు సంవర్థక శాఖ, పట్టు పరిశ్రమ, మత్స్యశాఖలను ఐటీడీఏ నుంచి తరలించారు. కొండరెడ్ల విభాగానికి అధికారి లేరు. జిల్లాల విభజన తర్వాత ఐటీడీఏకు నిధుల కొరత తీవ్రంగా ఉంది. - ఉట్నూర్ ఐటీడీఏ ప్రధాన కార్యాలయంలో 107 పోస్టులుండగా 76 ఖాళీలున్నాయి. - మన్ననూర్ ఐటీడీఏ కార్యాలయంలో 20 పోస్టులకు 17 ఖాళీగానే ఉన్నాయి. ఆర్థిక చేయూత ఏదీ? గిరిజనులకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు ప్రవేశపెట్టిన ‘ఎకనామికల్ సపోర్ట్ స్కీం’ (ఈఎస్ఎస్) వారిని ఏమాత్రం ఆదుకోవడం లేదు. ఈ పథకం కింద స్వయం ఉపాధి కోసం కిరాణాలు, జిరాక్స్ సెంటర్లు, టెంట్‌హౌజ్‌లు, ఫొటో స్టూడియోలు, బుక్‌స్టాళ్లు, చికెన్ సెంటర్, వాహనాలు ఇస్తుంటారు. రైతులకు దుక్కిటెద్దులు, మేకలు, గొర్రెల పెంపకం, పాడి గేదెల యూనిట్లు మంజూరు చేస్తారు. అలాగే ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు, వ్యవసాయ బోర్లు, కరెంట్ మోటార్లు, పైపులైన్లు అందజేస్తారు. ఏటా వందల సంఖ్యలో యూనిట్లు కేటాయిస్తున్నా.. వాటిలో సగం కూడా గ్రౌండింగ్ చేయకుండా సంవత్సరాల తరబడి పెండింగ్ పెడుతున్నారు. మత్స్య, పట్టు పరిశ్రమలు నిర్వీర్యం ఉట్నూరు ఐటీడీఏ పరిధిలో 14 గిరిజన మత్స్య సహకార సంఘాలున్నాయి. చేపల పెంపకం శిక్షణ కేంద్రం పదేళ్ల కిందట మూతపడింది. ట్రైకార్ యాక్షన్ ప్లాన్‌లో ప్రభుత్వం ఏటా నిధులు మంజూరు చేస్తున్నా.. ఐటీడీఏ ఖర్చు చేయడం లేదు. పట్టు పరిశ్రమ విభాగం ప్రధాన కార్యాలయం చెన్నూరుకు తరలిపోయింది. ఏటూరునాగారంలో పట్టుగూళ్ల పెంపకం పూర్తిగా బంద్ అయ్యింది. మిగిలినచోట్ల కూడా ఇదే పరిస్థితి ఉంది. రోడ్డు లేక ప్రాణాలు పోతున్నయ్ మా ఊరి రోడ్డులో రాజుగూడ వద్ద ఉన్న కల్వర్టు వానలకు కొట్టు కుపోయినప్పటి నుంచి దారిలేక ఇబ్బందులు పడుతున్నాం. మేలో ఐటీడీఏ ఎదుట ఆందోళన కూడా చేశాం. జూన్ 28న పెందోర్ సోంబాయి అనే గర్భిణికి పురుటి నొప్పులు వచ్చాయి. అంబులెన్సు లేక ఆమె ప్రాణాలు వదిలేసింది. ఆ ఘటన తర్వాత ప్రభుత్వం దొంగచింత, సోనాపూర్ గ్రామాల మధ్య రోడ్డు నిర్మించేందుకు రూ.89 లక్షలు మంజూరు చేసినా పనులు ప్రారంభం కాలేదు. – కె. జుగాదిరావ్, దొంగచింత పటేల్, ఉట్నూర్ మండలం దశాబ్దాలుగా అభివృద్ధి శూన్యం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం ఏటా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా ఆశించిన ఫలితాలు రావడం లేదు. గిరిజన గ్రామాల్లో విద్య, వైద్యంతో పాటు ఇతర మౌలిక వసతులు కల్పించిననాడే అభివృద్ధి సాధ్యం. ఐటీడీఏలు ఏర్పాటు చేసి ముప్పయ్యేళ్లు గడుస్తున్నా గిరిజనుల అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న విధంగానే ఉందంటే పాలకుల చిత్తశుద్ధి ఏపాటిదో తెలుస్తోంది.. – జాదవ్ రమణనాయక్, ఎల్‌హెచ్‌పీఎస్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు హక్కు పత్రాలు ఇచ్చినా దక్కని భూమి ఈయన పేరు బొద్దిల సమ్మయ్య, ఏటూరునాగారం మండలం ఎక్కెల గ్రామం. ఈయనకు ఆర్ఓఎఫ్ఆర్ కింద ఎకరం పది గుంటల స్థలం ఇచ్చారు. అటవీ హక్కుల చట్టం కింద హక్కుపత్రం అందజేశారు. ఇందులో ఇరవై గుంటల స్థలం అటవీశాఖ అధీనంలోనే ఉంది. భూసర్వే సక్రమంగా చేయకపోవడంతో ఇరవై గుంటలను కోల్పోవాల్సి వచ్చింది. చేసేదేమీలేక ఉన్న భూమినే సాగు చేసుకుంటున్నాడు. సాగుకు సాయమేదీ? ఏటూరు నాగారం పరిధిలో ఇంది ర జలప్రభ పథకం కింద 673 మంది రైతులు పొలాల్లో బోర్లు వేసుకున్నా విద్యుత్ మోటా ర్లు, త్రీఫేజ్ కరెంటు కనెక్షన్ ఇవ్వక నిరుపయోగంగా మారాయి. జిల్లా నీటి యాజమాన్య సంస్థ ద్వారా తాడ్వాయి, మంగ పేట, ఏటూరునాగారం, కొత్తగూడ, గూడూరు, గోవిందరావుపేట మండలాలకు నాలుగేళ్ల కిందట రూ.55.45 కోట్లతో చెక్‌డ్యాం పనులు మంజూరైనా నిర్మాణానికి నోచుకోలేదు. భద్రా చలం ఐటీడీఏ పరిధిలోని మండలాల్లో ఐటీడీఏ గిరిజనులకు సబ్సిడీ విత్తనాలు ఇవ్వటం లేదు. -
అభివృద్ధా... అణచివేతా?
విశ్లేషణ ఆర్థికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా దేశంలో మొదటి వరుసలో నిలబెట్టాలంటే కొందరు త్యాగాలు చేయక తప్పదంటున్నారు పాలకులు. కానీ అభివృద్ధి అంటే కార్పొరేట్ సంస్థలకు పట్టంగట్టి ఆదివాసులను తుడిచిపెట్టేయడం కాదుగా... భూమి గుండ్రంగా ఉందన్నట్లు ప్రపంచంలో ఏమూలకు పోయినా ఇదే పరిస్థితా.. ప్రపంచంలో ఏమూల విలువైన ఖనిజ సంపద, సహజ వనరులు ఉంటే అక్కడ వాలిపోయే కార్పొరేట్ గుత్తా్తధిపత్య సంస్థల ఏలు బడిలోని ప్రభుత్వాల చేతిలో అక్కడి ప్రజలు మాడిమసై పోవలసిందేనా.. మరీ ముఖ్యంగా మూలవాసులు.. మూలవాసులు, ఆదివాసులు, గిరిజనులు.. మనం ఎలా పిలుస్తున్నప్పటికీ రానురానూ వారి జీవనం, వారి భూమి ప్రమాదాల్లోకి వెళ్ళిపోతోంది. ఆయా తెగల జీవన శైలులు ప్రమాదపుటంచున కొట్టుమిట్టాడుతున్నాయి. సహజవనరుల వినియోగం కోసం పెట్టుబడి సంస్థలు మూలవాసుల జీవన ప్రదేశాలపై కన్నేశాయి. ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థల చేతుల్లో కీలుబొమ్మలుగా మారాయి. మూలవాసుల వైవిధ్య జీవన విధానంలోకి, జీవన ప్రదేశాల్లోకి చొచ్చుకొచ్చే గద్దలు, డేగలు వారిని కబళించేస్తున్నాయి. వారిని అభివృద్ధి పథకాల కోసం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి బలవంతంగా తరలించినప్పుడు సాంస్కృతికంగా, సమాజపరంగా కొత్త చోట ఉన్న సమూహాలతో, సమాజాలతో కలిసిపోవడానికి ఎంత ఒత్తిడి ఎదుర్కోవలసి వస్తోందో వారిమాటల్లోనే చూద్దాం. సెప్టెంబర్ 12వ తేదీ ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక తరఫున 45 మంది రచయిత్రుల బృందం పోలవరం ముంపు, పునరావాస గ్రామాలను సందర్శించింది. ఈ సందర్భంగా మేం పర్యటించిన కొత్త దేవరగొండు, కొత్త రామయ్యపేట, తదితర గ్రామాలలో పిన్నలను పెద్దలను పలకరించాము.. ‘ఉన్న ఊళ్ళో వ్యవసాయము చేసుకునే వాళ్ళము.. ఆప రాలూ అవీ ఇవీ పండిచ్చుకు తినేవాల్లము సంతకెళ్తే ఉల్లిపా యలూ.. అప్పుడప్పుడూ పచ్చి మిరపకాయలూ కొనుక్కునే వాళ్ళం. ఇప్పుడు అన్నీ కొనుక్కోవటమేగా.. వాళ్ళిచ్చే వెయ్యి రూపాయలు దేనికొత్తయ్యి.. ఉప్పు, పప్పు, కూరగాయలు, పుల్లలు అన్నీ కొనుక్కోవటమేగా.. కొండకెల్లి పండో.. పచ్చ నాకో తెచ్చుకునేవాళ్లం.. ఇప్పుడేదీ.. అన్నిటికీ కరువేగా..’‘ఆ ఎలచ్చన్లప్పుడోత్తారు అదిచ్చేత్తాం పెద్దమ్మా ఇది చేత్తాం పెద్దమ్మా అంటూ.. ఈ తడవ రానీ చెప్తా.. నా అసొంటోళ్లేవయి పొవాల్నో అడ్గుతా.. వాళ్ళిచ్చే వెయ్యిరూపాయిలు నా మందు లకే సాలట్లా.. ఇక్కడ ఓ ఆకా.. పసరా.. అన్నిటికీ దిక్కు మాలిన మందులేగా.. అంది దాదాపు డెబ్బయ్యేళ్లున్న నర్సమ్మ, కొత్త దేవరగొందు ‘దూడలు మేపుకునే వాళ్ళము.. కొండెక్కి అటూ ఇటు తిరిగొచ్చేయి.. కోళ్ళు, మేకలూ అన్నీ అమ్మేసుకుచ్చేసాం. ఏవీ లేకపోతే కొండకొమ్ములు, వెదురు బియ్యం అయినా తెచ్చుకునే వాళ్ళం. ఈడతిని కూకుంటే ఎక్కడనుంచొత్తయి.. వాళ్ళిచ్చిన సొమ్ములు నిండుకున్నాయి. ‘సుబ్బరంగా పడగొట్టేశారు సీతా ఫలం మొక్కలూ, ఇంతింత లావు మామిడి మొక్కలూ.. అన్ని టిమీదా.. ఇళ్లమీదా మట్టోసేసారు.. మట్టి దిబ్బనాగుందిప్పుడు మా ఊరు’–సింగారమ్మ, కొత్తదేవరగొందు. ‘ఏవేవో ఇచ్చేత్తావని నమ్మిచ్చి గొంతుకోశారు. వచ్చాక అడిగితే సమాధానం లేదు. ఎవడి దగ్గరకెళ్ళినా ఒక రూపాయి పుట్టట్లేదు. ఇల్లు మాత్రం ఇచ్చింది. ఇల్లొకటి ఉంటే సరిపోతదా .. ఎంత బాధ.. ఖర్మ.. ఏమ్చేత్తాం.. కాలం ఎటు తీసుకుపో తుందో..’ – ఓ రైతు, కొత్తరామయ్యపేట. నర్మదానదిపై కట్టిన సర్దార్ సరోవర్ ప్రాజెక్టు కింద 1000 ఆదివాసీ గూడేలు జల సమాధి అయితే పోలవరం కింద 3 లక్షల మంది ఆదివాసీల జీవనశైలి, సంస్కృతి జలసమాధి అవుతున్నాయి. అదే విధంగా గత జనవరిలో పీఓడబ్ల్యూతో కలసి కొత్తగూడెం సమీపంలోని మొండి చెలక, బంగారు చెలక వంటి గిరిజన గ్రామాలకు వెళ్లాము. విమానాశ్రయం కోసం 2500 ఎకరాలలో సర్వే నిర్వ హిస్తున్న అధికారులు, పోలీసు బృందంతో అక్కడి మహిళలు మాట్లాడిన మాటలు విందాం. ఇది నా పిల్లలు పుట్టిన గడ్డ, నేను పుట్టిన మట్టి, మేమే కాదు నా తల్లిదండ్రులు, వారి తల్లిదండ్రులు, వాళ్ళ తాత ముత్తాతలు.. ఇంకా ముందటి నుండి మేం బతుకుతున్న నేల, గాలి ఇదే.. ఇది మీది కాదు సర్కారుదే అంటే మేమెట్లా ఒప్పు తం. ఇదే మా గుర్తింపు. మీరిప్పుడొచ్చిన్రు. కానీ మేమట్లా కాదు.. ఆ... ఈ జల్ జంగల్, జమీన్ మాది అంటూ ఎలాంటి భయం లేకుండా పోలీసు అధికారులను నిలదీసింది ఓ యువతి. రెండేళ్ల క్రితం అరకులోయలో బాక్సైట్ నిధుల కొండ గాలికొండకు ప్రరవే తరఫున వెళ్ళాం. అక్కడా అంతే. 1940లో హైమండార్ఫ్ అనే యూరోపియన్ ఆంథ్రో పోలో జిస్ట్ మొదట మనదేశపు కొన్ని మూలవాసుల తెగలపై పరి శోధన చేశారు. ఆ తర్వాత 1970లో కూడా అయన పరిశోధన కొనసాగించారు. స్వాతంత్య్రానికి ముందు స్వాతంత్య్రానం తరం ఆయన చేసిన పరిశోధన తేల్చిందేమంటే వారి జీవన స్థితి గతులు దిగజారిపోయాయని. ఇప్పుడు నూతన ఆర్థిక విధా నాల్లో అధఃపాతాళంలోకి జారాయని చెప్పొచ్చు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఆదివాసీలను ప్రాంతాల వారీగా విడగొట్టి వారి హక్కుల్ని కాలరాస్తూ, వారి ఐక్యతను చిన్నాభిన్నం చేస్తూ, అభివృద్ధిపేరిట ఆదిమ జాతులను అంతం చేస్తూ వారి సమాధులపై నిర్మించే అభివృద్ధిని దేశప్రజలు కోరు కోవడంలేదని సర్కారుకు తెలియనిదా..? ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి పేరిట జరుగుతున్న మైనింగ్, ప్రాజెక్టులు , పరిశ్రమలకు వ్యతిరేకంగా విధ్వంసానికి గురవుతున్న నేటివ్ ప్రజలు తమ హక్కులను కాపాడుకోవడం కోసం ఆందోళనలు, పోరాటాలు చేయడం జరుగుతూనే ఉంది. అయితే, జీవన విధ్వంసానికి గురవుతున్న మూలవాసుల పక్షాన అండగా నిలబడిన వారిని దేశద్రోహులుగా పరిగణిం చడం లేదా చట్టవ్యతిరేక కార్యక్రమాలు నెరపుతున్నారన్న నెపం వేసి అరెస్ట్ చేసి జైళ్లలో కుక్కడం లేదా నక్సలైట్ మావోయిస్టు ముద్రవేసి ఎన్కౌంటర్ పేరుతో మట్టుపెట్టడం లేదా మాయం చేయడం మాత్రం మనదేశంలోనే జరుగుతోంది. (వ్యాసకర్త వి. శాంతిప్రబోధ ప్రరవే జాతీయ సమన్వయకర్త ఈమెయిల్ : vsprabodha@gmail.com) -
గిరిజనాభివృద్ధి కాగితాలకే పరిమితం
శ్రీశైలం ప్రాజెక్టు (కర్నూలు) : గిరిజనాభివృద్ధి కాగితాలకే పరిమితమైందని శాసనసభ్యులు, గవర్నింగ్ బాడీ కమిటీ సభ్యులు ఆరోపించారు. శ్రీశైలం ఐటీడీఏ కార్యాలయంలోని సీఎంఆర్‌సీ భవనంలో శనివారం రాష్ట్రస్థాయి గవర్నింగ్‌బాడీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ ఉదయలక్ష్మి, ప్రకాశం, కర్నూలు జిల్లాల ఎమ్మెల్యేలు హాజరయ్యారు. పలు అంశాలపై సమావేశంలో వాడివేడిగా చర్చ సాగింది. ట్రైబల్స్ సబ్‌ప్లాన్ కింద గూడేల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని చెంచులు కోరారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్లు, వైద్యసిబ్బంది నిరంతరం సేవలందించే విధంగా చర్యలు చేపట్టాలని, అదేవిధంగా అదనపు అంబులెన్స్‌లు ఏర్పాటు చేయాలని అన్నారు. సామాజిక పింఛన్లను గూడేల్లో పంపిణీ చేయాలన్నారు. ప్రాథమిక పాఠశాలలను అప్‌గ్రేడ్ చేయడంతోపాటు టీచర్లను నియమించాలన్నారు. దీనిపై స్పందించిన కమిషనర్.. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు గిరిజన ప్రాథమిక పాఠశాలల్లో టెట్ పాసైన గిరిజనులనే నియమించాల్సి ఉందన్నారు. అర్హత కలిగినవారు లేకపోవడంతో పోస్టులను భర్తీ చేయలేకపోతున్నామన్నారు. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని అన్ని గిరిజన గూడేల్లో మంచినీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రకాశం జిల్లాలోని 11 గూడేలకు త్వరలోనే విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. కొన్ని గూడేల్లో విద్యుద్ధీకరణ చేపట్టేందుకు, రోడ్లు నిర్మించేందుకు అటవీశాఖ అనుమతి రావాల్సి ఉందన్నారు. చెంచు గిరిజనులకు వయోపరిమితి లేకుండా సామాజిక పింఛన్ ఇవ్వాలని, వికలాంగులకు పూర్తిశాతం అంగవైకల్యం లేకున్నా.. రూ.1,500 పింఛన్ ఇవ్వాలని గవర్నింగ్‌బాడీ కమిటీ సభ్యులు అంజయ్య, కొండయ్య, మూగన్న కోరారు. ఇళ్లు లేనివారికి తక్షణం గృహాలు నిర్మించాలని, పశువుల మేతకు ప్రత్యేక నిధులు కేటాయించాలన్నారు. దీనిపై స్పందించిన అధికారులు గిరిజనులకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రకాశం జిల్లా పాలుట్ల గూడేనికి రోడ్డు సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, ఐజయ్య, డేవిడ్‌రాజు, అశోక్‌రెడ్డి, జంకె వెంకటరెడ్డి అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ప్రాజెక్టు అధికారి ప్రభాకర్‌రెడ్డి, ఇంజినీర్ ఇన్‌చీఫ్ బాబు రాజేంద్రప్రసాద్, అన్ని జిల్లాల వైద్యారోగ్య శాఖాధికారులు, హౌసింగ్ అధికారులు, అటవీ అధికారులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. అనంతరం 26 మంది చెంచు గిరిజనులకు కమిషనర్ ఉదయలక్ష్మి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి ఏఏవై కార్డులు పంపిణీ చేశారు. -
మూడు గంటల్లో మమ..!
సీతంపేట: ప్రతిసారీ ఉదయం నుంచి సాయంత్రం వరకు సుదీర్ఘంగా జరిగే సీతంపేట ఐటీడీఏ(సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ) పాలకవర్గ సమావేశం ఆదివారం మాత్రం మొక్కుబడిగా జరిగింది. సంస్థ పరిధిలో అమలవుతున్న అన్ని పథకాలు, శాఖల పనితీరుపై సమగ్రంగా చర్చించాల్సిన ఈ సమావేశాన్ని మూడంటే మూడు గంటల్లో ముగించేశారు. ఉదయం 11.30కు మొదలై మధ్యాహ్నం 2.30 గంటలకు ముగిసింది. ఎమ్మెల్యేలతో సమానంగా ప్రశ్నించే హక్కు ఉన్న ఎంపీపీలు, జెడ్పీటీసీలకు మాట్లాడే అవకాశమే లేకుండా పోయింది. తాము ఎన్నికైన తర్వాత తొలిసారి జరుగుతున్న ఈ సమావేశంలో తమ పరిధిలోని ప్రజల సమస్యలు ప్రస్తావించాలని ఎంతో ఉత్సాహంతో హాజరైన వీరంతా సమావేశం జరిగిన తీరుతో నిరుత్సాహం చెందారు. తక్కువ వ్యవధిలోనే సమావేశాన్ని ముగించడంపై ఎమ్మెల్యే కలమట వెంకటరమణ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందిస్తూ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వెళ్లాల్సి ఉన్నందున ఒక్కపూటకే పరిమితం చేశామని, ఇక ముందు రెండుపూటలా నిర్వహించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. టీడీపీ ఎమ్మెల్యేల గైర్హాజరు సమావేశానికి టీడీపీ ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. జిల్లాలో పది నియోజకవర్గాలుండగా రాజాం, శ్రీకాకుళం ఎమ్మెల్యేలు తప్ప మిగతా వారందరూ హాజరు కావాల్సి ఉంది. కానీ టీడీపీకి చెందిన ఇచ్ఛాపురం, ఎచ్చెర్ల, నరసన్నపేట, పలాస ఎమ్మెల్యేలు బి.అశోక్, కళా వెంకట్రావు, బగ్గు రమణమూర్తి, గౌతు శివాజీలు రాలేదు. గిరిజన మంత్రి కిశోర్‌బాబు, కార్మిక మంత్రి కె.అచ్చెన్నాయుడు, విప్ కూన రవికుమార్, అరుకు ఎంపీ కొత్తపల్లి గీతలు మాత్రమే హాజరయ్యారు. ఫలితంగా ఆయా నియోజకవర్గాల సమస్యలు ప్రస్తావనకు నోచుకోలేదు. ఎమ్మెల్సీలు కూడా గైర్హాజరయ్యారు. వైఎస్ఆర్సీపీకి చెందిన పాతపట్నం, పాలకొండ ఎమ్మెల్యేలు కలమట వెంకటరమణ, విశ్వాసరాయి కళావతిలు మాత్రమే హాజరై తమ నియోజకవర్గాల పరిధిలోని సమస్యలపై స్పందించారు. అధికారులను ప్రశ్నించారు. కొన్ని శాఖలపై చర్చే లేదు సమయాభావం కారణంగా కొన్ని శాఖలపై చర్చే జరగలేదు. కీలకమైన ట్రాన్స్‌కో, చిన్న నీటివనరులు, మలేరియా విభాగం, గిరిజన సహకార సంస్థ, హౌసింగ్ తదితర శాఖలు అసలు ప్రస్తావనకే రాలేదు. వ్యవసాయం, గిరిజన సంక్షేమం, ఇంజనీరింగ్ విభాగం, వైద్యశాఖలపైనే చర్చ సాగింది. అది కూడా నామమాత్రంగానే జరిగింది. కాగా ఇటీవల మంత్రి అచ్చెన్న జరిపిన సమీక్షలో తీసుకున్న నిర్ణయాల అమలుపై కొంత చర్చ జరిగింది. ఆ నిర్ణయాలు పూర్తిస్థాయిలో అమలు కాకపోవడంపై మంత్రులు అసహనం వ్యక్తం చేశారు. -
ఆదివాసీల అభివృద్ధికి కృషి
ఆసిఫాబాద్ : ఆదివాసీల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని శనివారం రాత్రి ఆసిఫాబాద్‌లోని ఏపీటీడబ్ల్యూ(జి) బాలికల గురుకుల కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రామన్నకు కళాశాల విద్యార్థులు ఆదివాసీ సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, ఆదివాసీల వెనుకబాటుకు గత పాలక ప్రభుత్వాలే కారణమన్నారు. గత ప్రభుత్వం ఆదివాసీ హక్కులను కాలరాసిందని, 60 ఏళ్లలో చేయని అభివృద్ధిని ఐదేళ్లలో చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కంకణం కట్టుకుందని వివరించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మన ఊరు-మన ప్రణాళిక చేపట్టిందని గుర్తు చేశారు. గిరిజన యూనివర్సిటీని జిల్లాలోని ఉట్నూర్‌లో నెలకొల్పుతామని, దీనిపై జిల్లా ప్రజలకు ఎలాంటి ఆందోళన వద్దని అన్నారు. దీనిని సంబంధించిన ఫైల్ ఢిల్లీకి పంపినట్లు పేర్కొన్నారు. ఆదివాసీలు విద్యావంతులు కావాలని ఆకాంక్షించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్టీలకు 6 నుంచి 12 శాతం రిజర్వేషన్ పెంచిందని, దీంతో ఆదివాసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారని ధీమా వ్యక్తం చేశారు. కలెక్టర్ జగన్మోహన్ మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆదివాసీలకు అందేలా కృషి చేస్తానన్నారు. త్వరలో గోండు లిపిలో విద్య ఐటీడీఏ ఇన్చార్జి పీవో ప్రశాంత్ పాటిల్ మాట్లాడుతూ, ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా నార్నూర్ మండలం గుంజాలలో గోండు లిపిని ప్రారంభించామని, త్వరలో దేశంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలోని 15 పాఠశాలల్లో గోండి లిపి విద్యా విధానాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. ఆసిఫాబాద్, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ, గిరిజనుల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మంత్రి రామన్న, అధికారులు, ప్రజా ప్రతినిధులను పాఠశాల విద్యార్థినులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు ప్రదర్శించిన గిరిజన సంప్రదాయ నృత్యాలు, పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. ఆటల్లో రాణించిన విద్యార్థినులకు మంత్రి ప్రశంసా పత్రాలు అందజేశారు. కళాశాల ప్రిన్సిపాల్ పురాణం రాజేశ్వర శర్మ, టీఆర్ఎస్ తూర్పు జిల్లా అధ్యక్షుడు పురాణం సతీశ్‌కుమార్, జెడ్పీటీసీ కొయ్యల హేమాజీ, ఎంపీపీ బదావత్ తారాబాయి, సర్పంచ్ గోవిందు, గిరిజన సంఘాల నాయకులు సిడాం అర్జు, మడావి శ్రీనివాస్, సంకె కిష్టయ్య, సిడాం శంకర్, గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. కాగజ్‌నగర్ డీఎస్పీ సురేశ్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. మంత్రికి వినతులు గిరిజన గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, వేతనాలు పెంచాలని మంత్రి రామన్నకు వినతిపత్రం అందజేశారు. ఆసిఫాబాద్‌ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని బీజేపీ జిల్లా కార్యదర్శి చెర్ల మురళి, గిరిజన నాయకుడు కిషన్‌రావు వినతిపత్రం ఇచ్చారు. -
ఆదివాసీల అభివృద్ధికి కృషి: స్వామిగౌడ్
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పినట్లుగా ఆదివాసీల అభివృద్ధికి కృషి చేస్తుందని శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ తెలిపారు. శనివారం బంజారా భేరి వ్యవస్థాపక అధ్యక్షులు ఎమ్మెల్సీ ఎస్. రాములు నాయక్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులు, ఆదివాసీలు, లంబాడీలు, చెంచులు.. అంత రించి పోయే దశలో ఉన్న అవూయుక గిరిజన జాతుల అభివృద్ధి కోసం కంకణబద్ధులై పని చేస్తామన్నారు. గిరిజన గ్రామాలను పంచాయతీలను చేసి సీఎం కేసీఆర్ మాట నిలబెట్టుకున్నారని చెప్పారు. ఎంపీ సీతారాం నాయక్ మాట్లాడుతూ గిరిజన, ఆదివాసీ జాతుల్లోని అన్ని తెగలవారం ఒక్కటి కాకపోతే జాతి క్షమించదని, ఏదీ సాధించలేమని అన్నారు. ప్రపంచంలో పన్నెండున్నర కోట్ల మంది మాట్లాడే భాష ఒక్క బంజారా భాషేనని చెప్పారు. హైదరాబాద్ పాలనాధికారాలు గవర్నర్‌కు కట్టబెట్టే ప్రయత్నాలు తిప్పికొడదామన్నారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ ప్రభుత్వం, పాలకుల కుట్రలో భాగమే పోలవరం అని చెప్పారు. 400 గూడేల జీవనం పోలవరంతో విచ్ఛిన్నం అవుతుందన్నారు. టీఆర్ఎస్ నేత నోముల నరసింహయ్య మాట్లాడుతూ మేధోమథనం ద్వారా అణగారిన వర్గాల వారికి సహాయం చేద్దామన్నారు. బంజారా జాతికి చెందిన ఆచార్యులందరికీ సన్మానం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎస్. రాములు నాయక్, ప్రొఫెసర్ సూర్య ధనంజయ్, గిరిజన విద్యార్థి నేతలు కృష్ణా నాయక్ పాల్గొన్నారు. -
ఇన్చార్జీలు @ ఐటీడీఏ
రెగ్యులర్ అధికారుల్లేక కుంటుపడుతున్న పాలన * గిరిజనులకు అందని సంక్షేమ ఫలాలు * దీర్ఘకాలిక సెలవులో పీవో * ఇన్చార్జి పీవో ఆసిఫాబాద్‌కే పరిమితం * ముందుకు కదలని అభివృద్ధి ఫైళ్లు * ఆందోళనలో గిరి‘జనం’ ఉట్నూర్ : జిల్లా గిరిజనం అభివృద్ధే లక్ష్యంగా ఐటీడీఏ ఏర్పాటు చేసినా..వారికి సంక్షేమ ఫలాలు అందించాలనే లక్ష్యంగా ప్రత్యేక శాఖ రూపొందించినా.. గిరిజనులకు మాత్రం సంక్షేమ ఫలాలు అందకుండా పోతున్నాయి. నిత్యం అందుబాటులో ఉండి.. గిరిజనుల అభివృద్ధికి తోడ్పడాల్సిన అధికారుల పోస్టులు ఖాళీగా ఉండడంతో పథకాల ఉనికి ప్రశ్నార్థకమైంది. ఐటీడీఏకు పెద్ద సారైన ప్రాజెక్టు అధికారి (పీవో) జనార్దన్ నివాస్ దీర్ఘకాలిక సెలవులపై వెళ్లడంతో పాలనా వ్యవస్థను పర్యవేక్షించే వారు కరువయ్యారు. ముఖ్యమైన శాఖల ఇన్చార్జి బాధ్యతలన్నీ ఒకే అధికారికి ఉండడంతో ఆయన ఏ శాఖకూ పూర్తి న్యాయం చేయలేకపోతున్నారు. దీనికితోడు ఐటీడీఏ ఇన్చార్జి పీవోగా బాధ్యతలు స్వీకరించిన ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ ఇక్కడి పాలనా వ్యవహారాలపై దృష్టి సారించకపోవడం అభివృద్ధికి అవరోధంగా నిలిచింది. 44 మండలాలు.. 4.95 లక్షల జనాభా.. జిల్లావ్యాప్తంగా 44 మండలాల్లో 4,95,794 మంది గిరిజనులు నివసిస్తున్నారు. వీరందరి అభివృద్ధికి బాటలు వేయాల్సిన బాధ్యత ఐటీడీఏపై ఉంది. ఇలాంటి ఉన్నతమైన కార్యాలయం ప్రస్తుతం ఇన్చార్జి అధికారులతో కాలం వెళ్లదీస్తుండడం శోచనీయం. పలు విభాగాలకు పూర్తిస్థాయి అధికారులు లేకపోవడం.. ఉన్న ఇన్చార్జి అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో గిరిజనాభివృద్ధి కుంటుపడుతోంది. అధికారులు, సిబ్బంది ఇష్టారీతిన వ్యవహరిస్తురనే ఆరోపణలు ఉన్నాయి. గతేడాది జూన్‌లో పీవోగా బాధ్యతలు తీసుకన్న జనార్దన్ నివాస్ విధి నిర్వహణలో కఠినంగా వ్యవహరిస్తారనే పేరు తెచ్చుకున్నారు. అందుకనుగుణంగా ఐటీడీఏ పాలనపైనా పట్టుసాధించి తనదైన రీతిలో దూసుకెళ్తూ పాలనను గాడిలో పెట్టారు. అయితే.. ఆయన గత జూన్ నుంచి రెండు నెలల పాటు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. ఇన్‌చార్జీలే దిక్కు.. ప్రస్తుతం ఐటీడీఏ ఇన్చార్జి అధికారుల పాలనకు కేరాఫ్‌గా మారింది. పీవో మొదలుకొని డీడీటీడబ్ల్యూ, డీఈవో, ఏడీఎమ్అండ్హెచ్వో, ఎస్డీసీ, ఏపీవో(జనరల్), ఏఏవో, సీఏఫ్సీ ఇలా ముఖ్య విభాగాల్లో ఇన్చార్జి అధికారులు విధులు నిర్వహిస్తుండడంతో అభివృద్ధి ఫైళుల ముందుకు కదలడం లేదు. ఐటీడీఏ పరిపాలనాధికారిగా విధులు నిర్వర్తిస్తున్న పెందోర్ భీంకు ఏపీవో(జనరల్)గా, డీడీటీడబ్ల్యూగా, ఏఏవోగా, వాంకిడి సీఎఫ్సీగా నాలుగు ముఖ్య విభాగాలకు ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. వీటితోపాటు ఐటీడీఏ పరిపాలనాధికారిగా విధులు నిర్వర్తించాల్సి రావడంతో ఆయన ఏ విభాగానికీ పూర్తిస్థాయిలో న్యాయం చేయలేని పరిస్థితి నెలకొంది. అదీగాక కొన్ని రోజుల క్రితం ఆయన అనారోగ్యానికి గురికావడంతో ఐటీడీఏలో పాలన ఎటు పోతోందో తెలియని పరిస్థితి. ఇన్చార్జి పీవో ఐటీడీఏకు రాక పలు అభివృద్ధి పనుల ఫైళ్లు ఆసిఫాబాద్ తీసుకెళ్లి తీసుకురావడం ఇబ్బందిగా మారడమే కాకుండా సమయం కూడా వృథా అవుతోందని పలువురు అధికారులు వాపోతున్నారు. ఆర్థిక ఫలాల జాడే లేదు 2013-14 అర్థిక సంవత్సరం ముగిసి మూడు నెలలు కావస్తోంది. గత అర్థిక సంవత్సరంలో ట్రైకార్ యాక్షన్ ప్రణాళిక ద్వారా గిరిజనుల అభివృద్ధికి 893 రకాల యూనిట్లు మంజూరు చేస్తూ దాదాపు రూ.10.51 కోట్ల ప్రణాళికలు చేసి ఐటీడీఏ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. అయితే.. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ ప్రణాళికల మొత్తం విడుదల నిలిచింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర పాలనలోనైనా నిధులు విడుదల చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
గిరిజనులను ఆదుకుంటాం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్: పోలవరం ముంపు ప్రాంత గిరిజనులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకుంటుందని ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు అన్నారు. నీటిరంగ నిపుణుడు, పద్మభూషన్ అవార్డు గ్రహీత డాక్టర్ కె.ఎల్.రావు 112వ జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వ నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం అమీర్‌పేట కమ్మసంఘం హాల్లో నిర్వహించారు. కార్యక్రమానికి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలవరానికి జాతీయ హోదా రావడం గర్వకారణమన్నారు. కార్యక్రమంలో నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి సీఎం రెండు రోజుల పర్యటన: చంద్రబాబు బుధవారం నుంచి రెండు రోజులపాటు పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. -
గిరిజనుల అభివృద్ధికి మావోలే అడ్డంకి
పాడేరు ఏఎస్పీ బాబూజీ గిరిజనుల మేలు కోరితే జనజీవన స్రవంతిలో కలవాలి లొంగిపోతే జీవనానికి పోలీసుశాఖ సహాయం ఏజెన్సీలో ప్రతి ఫిర్యాదుకూ సకాలంలో న్యాయం పాడేరు: విశాఖ ఏజెన్సీలో గిరిజనుల అభివృద్ధికి మావోయిస్టులే అడ్డంకిగా మారారని పాడేరు ఏఎస్పీ అట్టాడ బాబూజీ విమర్శించారు. ఆంధ్రా-ఒడిశా రాష్ట్రాల సరిహద్దు సురక్షిత ప్రాంతం కావడంతో అక్కడ నుంచే మావోయిస్టులు కార్యకలాపాలు సాగిస్తున్నారని చెప్పారు. పాడేరు ఏఎస్పీగా గురువారం ఆయన విధుల్లో చేరారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ గిరిజనాభివృద్ధికి పూర్వం నుంచి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నా మావోయిస్టులు అడ్డుకుంటున్నారని చెప్పారు. ఈ అడ్డంకి లేకపోతే ఈపాటికే ఏజెన్సీ రూపురేఖలన్నీ మారిపోయి గిరిజనులు అభివృద్ధి పథంలో పయనించేవారని అభిప్రాయపడ్డారు. నిజంగా గిరిజనుల సంక్షేమాన్నే మావోయిస్టులు కోరుకుంటే వెంటనే జనజీవన స్రవంతిలో కలవాలని ఆయన సూచించారు. మావోయిస్టులు, మిలీషియా సభ్యులు లొంగిపోతే వారి జీవనానికి పోలీసుశాఖ అన్ని ఏర్పాట్లు చేస్తుందని అభయమిచ్చారు. మారుమూల ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టే కాంట్రాక్టర్లను, గిరిజనుల నుంచి అటవీ, వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేసే వ్యాపారులను మావోయిస్టులు బెదిరించి ఇబ్బందులకు గురి చేయడం భావ్యం కాదన్నారు. ఏజెన్సీలో మావోయిస్టులతో పాటు అసాంఘిక శక్తుల కార్యకలాపాలను ఉపేక్షించబోమన్నారు. గంజాయి వ్యాపారాన్ని పూర్తిగా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. పోలీసులు స్నేహపూర్వకంగానే వ్యవహరిస్తారని, ఏ కష్టమొచ్చినా గిరిజనులు వారికి చెప్పుకోవాలని సూచించారు. ప్రతి ఫిర్యాదుకూ సకాలంలో న్యాయం జరుగుతుందన్నారు. గిరిజన యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. బాలికలు, మహిళల రక్షణకు చర్యలు చేపడతామని ఏఎస్పీ చెప్పారు. పర్యాటకులకు కూడా సౌకర్యాలు మెరుగుపర్చడంతోపాటు భద్రతా చర్యలను చేపడతామని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రైవేటు వాహనాల ఆపరేటర్లు, డ్రైవర్లకు అవగాహన సద స్సులు నిర్వహిస్తామని వివరించారు. పాడేరు పోలీసు సబ్ డివిజన్లోని ప్రజలంతా పోలీసుశాఖ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఏఎస్పీ కోరారు. -
ముంపు..ముప్పు..
- రాష్ట్ర విభజనతో ఐటీడీఏకు తగ్గనున్న ప్రాధాన్యం - సంస్థలోని ప్రధాన శాఖలకూ కత్తెర - జూన్ 2 తర్వాత 205 గ్రామాలతో తెగిపోనున్న బంధం భద్రాచలం, న్యూస్‌లైన్, రాష్ట్ర విభజన ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు నుంచే రెండు రాష్ట్రాల సరిహద్దుల ఏర్పాటు, ఆస్తులు, ఉద్యోగుల పంపకాలు జరిగిపోనున్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ముంపు పరిధిలోకి వచ్చే 136 రెవెన్యూ గ్రామాలు(205 హ్యాబిటేషన్లు) తెలంగాణ నుంచి వేరు చేసి అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపేందుకు అధికారికంగా ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. అయితే ఈ ప్రాంతం నుంచి తమను వేరుచేసే నిర్ణయాన్ని ముంపు గ్రామాల ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రాధాన్యం కోల్పోనున్న ఐటీడీఏ.. ఏజెన్సీలోని గిరిజనుల అభివృద్ధి కోసమని భద్రాచలంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐటీడీఏ( సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ) రాష్ట్ర విభజనతో ప్రాధాన్యత కోల్పోయే ప్రమాదం ఉంది. జిల్లాలో మొత్తం 46 మండలాలు ఉండగా, ఇందులో 29 మండలాలు పాలన ఈ ఐటీడీఏ నుంచే సాగుతోంది. దీనిలో 19 మండలాలను ట్రైబల్ ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్‌గా గుర్తించి గిరిజనులకు ప్రత్యేక పథకాలు అందజేస్తున్నారు. అంతేకాకుండా భద్రాచలం డివిజన్లోని చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, వేలేరుపాడు, అశ్వారావుపేట, దమ్మపేట వంటి మండలాలను అత్యంత వెనుకబడిన ప్రాంతాలు(పీటీజీ)గా గుర్తించి వాటి అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు వెచ్చిస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ మండలాల్లోని గ్రామాలను తెలంగాణ నుంచి వేరుచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుపుతున్నారు. కూనవరం, వీఆర్‌పురం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాలు పూర్తిగానూ, చింతూరు, భద్రాచలం, బూర్గంపాడు మండలాల్లో కొన్ని గ్రామాలకు జూన్ 2 తరువాత జిల్లాతో సంబంధాలు తెగిపోనున్నాయి. ఫలితంగా ఏజెన్సీలో ఇప్పటి వరకూ ఐటీడీఏ ద్వారా పథకాలు అందుకున్న ఈ గ్రామాలన్నీ వేరు చేయబడతాయి. ఇలా రాష్ట్రంలోనే పెద్దదైన భద్రాచలం ఐటీడీఏ పరిధి తగ్గి ప్రాధాన్యం కోల్పోనుంది. ప్రధాన శాఖలకు కత్తెర... ఏజెన్సీలోని అత్యంత వెనుకబడిన మండలాలను జిల్లా నుంచి వేరు చేయటం ద్వారా ఐటీడీఏలోని ప్రధాన శాఖలను ఎత్తివేసే అవకాశాలు ఉన్నాయి. అధికారులు సైతం దీన్ని అంగీకరిస్తున్నారు. ఇప్పటివరకు పాలన సాగించిన ప్రభుత్వాలు గిరిజనాభివృద్దికి నిధుల కోత పెట్టడటంతో ఇప్పటకే పలు శాఖలకు పనిలేకుండా పోయింది. ఐటీడీఏలోని మత్స్యశాఖ, పశుసంవర్థక శాఖల విభాగాలకు అధికారులను తొలగించారు. అలాగే వ్యవసాయ, ఉద్యానవన శాఖలకు కూడా పని లేకుండా చేశారు. రాష్ట్ర విభజనతో వెనుకబడిన మండలాలు ఐటీడీఏ నుంచి వేరుకానుండటంతో ప్రస్తుతం ఉన్న కొండరెడ్ల(పీటీజీ) విభాగం కూడా ఎత్తి వేసే అవకాశం ఉంది. పీటీజీ మండలాల్లో ఇందిరాక్రాంతి పథ ం ద్వారా గిరిజనులకు న్యూట్రిషన్ సెంటర్లు, బాలబడులు వంటి ప్రయోగాత్మక కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. వీటన్నింటి కీ జూన్ 2 తరువాత తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ఐటీడీఏ నుంచి నిధులు కేటాయించే అవకాశం ఉంది. ఫలితంగా ఐటీడీలోని ప్రధాన శాఖలను ఎత్తివేసే ప్రమాదం ఉందని అధికారులు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 1242 రెవెన్యూ గ్రామాలు ఉండగా, వీటిలో 904 ఏజెన్సీలోనే ఉన్నాయి. రాష్ట్ర విభజనతో 136 రెవెన్యూ గ్రామాలు(205 హ్యాబిటేషన్లు) ఏజెన్సీ నుంచి వేరు చేయబడతాయి. అదే విధంగా జిల్లాలో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న 10 వేల మంది కొండరెడ్డి గిరిజనుల్లో దమ్మపేట, అశ్వారావుపేటలలో ఉన్న 1457 మందికి మినహా మిగతా వారందరికీ భద్రాచలం ఐటీడీఏతో సంబంధాలు తెగిపోనున్నాయి. ఐటీడీఏ తరలిపోనుందా..? భద్రాచలం ఐటీడీఏను వేరే ప్రాంతానికి తరలిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. గతంలో మాదిరే దీన్ని పాల్వంచ కేంద్రంగా ఏర్పాటు చేసే అవకాశాలు లేకపోలేదని కొందరు అధికారులు అంటున్నారు. రాష్ట్ర విభజనకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఐటీడీఏ అధికారులు, ఉద్యోగుల్లో దీనిపైనే చర్చసాగుతోంది. ఐటీడీఏ కార్యాలయాన్ని 1974-75 సంవత్సరంలో ఖమ్మంలో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1979 డిసెంబర్ 17న పాల్వంచకు మార్చారు. అక్కడ నుంచి 1993 ఫిబ్రవరి 9న భద్రాచలం తరలించారు. మళ్లీ ఇప్పుడు పాల్వంచకు మారుస్తారనే ప్రచారం జరుగుతోంది. భద్రాచలం డివిజన్లోని చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, భద్రాచలం మండలాల్లోని 98 రెవెన్యూ గ్రామాలు జిల్లా నుంచి వేరు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుపుతుండగా, ఈ నాలుగు మండలాల్లో నివసిస్తున్న 81,707 మంది తగ్గిపోనున్నారు. అదే ముంపు మండలాల ఆర్డినెన్స్‌కు కొత్తగా వచ్చే ప్రభుత్వం ఆమోదం తెలిపితే భద్రాచలం డివిజన్లోని నాలుగు మండలాలు(భద్రాచలం పట్టణం మినహా) కూడా వేరు చేయబడతాయి. అదే జరిగితే భద్రాచలం డివిజన్ నుంచి ఏకంగా 1,14,726 మంది తూర్పు గోదావరి జిల్లాకు వెళ్లాల్సి ఉంటుంది. దీంతో భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయాన్ని భవిష్యత్‌లో పాల్వంచకు తరలించే ప్రమాదముందని గిరిజన సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
గిరిజనాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
భద్రాచలం, న్యూస్‌లైన్ : జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో గల గిరిజనుల సర్వతోముఖాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు ఐటీ డీఏ ప్రాజెక్టు అధికారి జి. వీరపాండియన్ చెప్పారు. గణతంత్ర వేడుకల్లో భాగంగా ఆదివారం ఐటీడీఏ ప్రాంగణంలో ఆయన జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఐటీడీఏ ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. ఏజెన్సీ పరిధిలో 522 విద్యా సంస్థల ద్వారా ప్రతి ఏటా 50 వేలకు పైగా గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్యనందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. చదువు మధ్యలోనే మానేసిన వారికి ఉన్నత విద్యావకాశాలు కల్పించేందుకు కొండరెడ్డి విద్యార్థుల కోసం మైత్రి క్యాంపు పేరుతో ప్రత్యేక పాఠశాల నిర్విహ స్తున్నట్లు చెప్పారు. 29 మండలాల్లో ఉన్న 50 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా గిరిజనులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. గిరిజన రోగుల ఆరోగ్యపరమైన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు 297 మంది ఏఎన్ఎంలు, 41 మంది వైద్యులకు సెల్ఫోన్లను అందజేసినట్లు చెప్పా రు. మార్పు పథకంలో భాగంగా ప్రతీ కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రానికి రూ.5 లక్షల చొప్పున మెరుగైన వసతుల కల్పన కోసం మంజూరు చేసినట్లు తెలిపారు. అంతేకాకుం డా ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పా టు చేసి మాతా-శిశు సంరక్షణకు పాటుపడుతున్నట్లు చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8,744 మంది గిరిజన లబ్ధిదారులకు మేలు చేకూరే విధంగా రూ.17.01 కోట్లు సబ్సిడీని అందజేసేందుకు ప్రణాళిక తయారు చేసినట్లు తెలిపారు. వ్యవసాయాభివృద్ధికి 37 గ్రామ సమాఖ్యలకు 35ట్రాక్టర్లను అందజేశామన్నారు. కొండరెడ్ల అభి వృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నట్లు వెల్లడించారు. 4 గ్రామాలను మోడల్‌గా తీర్చిదిద్దేందుకు సీసీడీపీ నిధుల కింద రూ.1.72 కోట్లు మంజూరు చేసినట్లుగా తెలిపారు. చింతూరు, వీఆర్‌పురం గ్రామాల్లో వెదురు ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు సింగరేణి సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు. తాగునీటి సమస్య నివారణకు రూ.3.31 కోట్లతో రక్షిత మంచినీటి పథకాలను నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఏజెన్సీ పరిధిలో ఈ ఏడాది ప్రయోగాత్మకంగా ఏడు ఇసుక రీచ్‌లను గిరిజన మహిళా సొసైటీలకు అప్పగించటం ద్వారా రూ.18.83 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. గతంలో జరిగిన లోపాలను పూర్తి స్థాయిలో సమీక్షించిన మేరకు ఈ సారి వీటి నిర్వహణలో సమూల మార్పులు తీసుకొస్తున్నామని, ఆయా మండల ఎంపీడీవోలకు దీనిపై బాధ్యతలు అప్పగిస్తున్నట్లు తెలిపారు. గిరిజన ఉప ప్రణాళిక పై ప్రత్యేక దృష్టి... ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గిరిజన ఉప ప్రణాళికపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పీవో తెలిపారు. ఈ పథకం ద్వారా మంజూరైన రూ.189.36 కోట్లతో వివిధ శాఖల ద్వారా 1,271 అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఎల్‌డబ్ల్యూఈఏ కింద మంజూరైన రూ.85 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా అటవీ హక్కుల చట్టం ద్వారా భద్రాచలం ఏజెన్సీలో ఇప్పటి వరకూ 2,05,705 ఎకరాలకు సంబంధించి అర్హులైన గిరిజనులకు హక్కు పత్రాలను అందజేసినట్లు తెలిపారు. ఏజెన్సీలో మహిళా స మాఖ్యల అభివృద్ధి కోసం ఐకేపీ ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు వృత్తి నైపుణ్య శిక్షణ ఇప్పిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సం క్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా అధికారులు, సి బ్బంది చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. వేడుకల్లో భాగంగా వివిధ పాఠశాలల విద్యార్ధులు చేసిన సాంస్కృతిక కార్యక్ర మాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. విధి నిర్వహణలో తగు సేవలు అందించిన వారికి ఈ సందర్భంగా పీవో ప్రశంసా పత్రాలను అందజేశారు. కా ర్యక్రమంలో ఏపీవో శ్రీనివాస్, ఐటీడీఏ మేనేజర్ భీమ్రావ్, కొండరెడ్ల ప్రత్యేకాధికారిణి మల్లీశ్వరి, ఐకేపీ ఏపీడీ జయశ్రీ, గణాంకపు అధికారి చంద్రిక, జీసీసీ డీఎం వీరస్వామి, పబ్లిసిటీ విభాగం ఏపీవో మహ్మద్ మూర్తజా , అదనపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ పుల్లయ్య, ఇంజనీరింగ్ ఈఈ శంకర్ పాల్గొన్నారు. -
ఐక్యతతోనే ఆదివాసీల అభివృద్ధి
ఉట్నూర్, న్యూస్‌లైన్: ఆదివాసీలంతా రాజకీయాలకు అతీ తంగా ఏకమైతేనే అన్ని రకాలుగా అభివృద్ధి సాధించడంతో పాటు హక్కులు, చట్టాలు అందిపుచ్చుకోవడానికి అవకాశం ఉంటుందని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని గుస్సాడీ గుట్ట ఆవరణలో జిల్లా గోండ్వానా పంచాయత్ రాయ్‌సెంటర్ 27వ వార్షికోత్సవ సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అంతకుముందు ఆత్రం భీంరావ్, తుకారాం, కొమురం భీమ్ చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాయ్‌సెంటర్ అనేది సుప్రీంకోర్టు, హైకోర్టుల వలే అత్యంత ఉన్నతమైన వ్యవస్థ అని పేర్కొన్నారు. దీని పటిష్టతను కాపాడుకోవాలంటే ఆదివాసీలంతా రాజకీయాలకు అతీతంగా కృషి చేయాలని కోరారు. ఇటీవల బోథ్ ఎమ్మెల్యే ఆదివాసీల సమస్యలపై ఐటీడీఏ పీవోను కలవడానికి వచ్చి రెండు గంటల పాటు వేచి చూసినా ఆ అధికారి కలవకపోవడం బాధాకరమన్నారు. ఓ ప్రజా ప్రతినిధికే కలవని పీవో అడవి బిడ్డల సమస్యలు ఏం పట్టించుకుంటారో అర్థం కావడం లేదన్నారు. అనంతరం రాయ్‌సెంటర్ వ్యవస్థ ప్రారంభికుల్లో ఒకరైన మాజీ జిల్లా మేడి మడావి రాజు, పలువురు నాయకులు మాట్లాడుతూ, ఆదివాసీల్లో ఐక్యత లేకపోవడంతో జిల్లాలో వలసవాదులు పెరుగుతున్నారని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా, సభ ప్రారంభానికి ముందు ఇటీవల మృతిచెందిన సోంజీ వా ర్డెన్ ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పా టించారు. జిల్లా రాయ్‌సెంటర్ అధ్యక్షుడు మెస్రం దుర్గు, ప్ర ధాన కార్యదర్శి తొడసం దేవ్‌రావ్, ఆదివాసీ సంఘాల నాయకులు, సార్మేడిలు బొంత ఆశారెడ్డి, వసంత్‌రావ్, పెందూర్ ప్రభాకర్, వెడ్మా బొజ్జు, ఆత్రం తిరుపతి, కనక యాదవ్రావ్, సిడాం శంభు, పద్రం జైవంత్‌రావ్, మడావి రాజు, దివాకర్, కోట్నాక సుధాకర్, సిడాం అర్జు, భీంరావ్, జుగ్నాత్రావ్, నాగోరావ్, తులసీరాం, మొగిళి, విఠల్‌రావ్ పాల్గొన్నారు. -
గిరి సీమ సంపూర్ణ అభివృద్ధి కృషి
ఉట్నూర్, న్యూస్‌లైన్ : సమగ్ర గిరిజనాభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, ఐటీడీఏ ఆధీనంలోని 4.95లక్షల మంది ఆదివాసీ గిరిజనుల ప్రగతికి బాటలు వేసేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోందని ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్ అన్నారు. గురువారం 67వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఐటీడీఏ కార్యాలయంలో ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఐటీడీఏ ఆధ్వర్యంలో ఉన్న 905 ప్రాథమిక పాఠశాలల్లో 983 మంది ఉపాధ్యాయులతో 19,212 మంది విద్యార్థులకు ప్రాథమిక విద్య అందిస్తున్నట్లు చెప్పారు. మరో 256 మంది ఎస్జీటీల నియామకానికి చర్యలు తీసుకుంటున్నామని, ఆశ్రమ పాఠశాలల్లో ఉన్నత విద్యాభివృద్ధికి 577 మంది సీఆర్టీలను నియమించామని తెలిపారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 146 ఆశ్రమ, వసతి, కస్తూరిబా, గురుకుల, మినీ గురుకుల పాఠశాలలు, ఆరు గురుకుల కళాశాలలు, ఒక డిగ్రీ కళాశాల ద్వారా 42,493 మంది విద్యార్థులకు ఉన్నత విద్య అందిస్తున్నామని వివరించారు. పునాది, క్వెస్ట్, రూపాంతర్, దిశ కార్యక్రమాలతో మెరుగైన విద్యకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. హరివిల్లు కింద 137 పాఠశాలల్లో సర్వే నిర్వహించామని అన్నారు. గత సంవత్సరం పదో తరగతి ఫలితాల్లో 89.68 శాతం ఉత్తీర్ణత సాధించగా 92 మంది గిరిజన విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలల్లో ప్రవేశాలు కల్పించామని పేర్కొన్నారు. 31 పీహెచ్‌సీల్లో 186 ఉప కేంద్రాలు, 11క్లస్టర్ల ద్వారా గిరిజనులకు నిరంతరం వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపారు. పిన్ పాయింట్, ర్యాపిడ్ ఫీవర్ సర్వేల్లో గుర్తించిన జ్వర పీడితులు, రక్తహీనత, అతిసార, మలేరియా బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. 27 పీహెచ్‌సీలకు అంబులెన్స్ సౌకర్యం కల్పించామని, ఏజెన్సీలో వ్యాధుల నివారణకు టోల్‌ఫ్రీ నంబరు 18004255226 ఏర్పాటు చేశామన్నారు. నాలుగు డీఆర్‌డిపోల నిర్మాణానికి రూ.48.40 లక్షలు, 12 అంగన్వాడీ భవన నిర్మాణాలకు రూ.51 లక్షలు నాబార్డు నిధులు కేటాయించినట్లు చెప్పారు. ఐఏపీ పథకం కింద రూ.34.60 కోట్లతో 229 రకాల పనులు చేపట్టామన్నారు. అర్హులైన 37,589 మంది గిరిజనులకు 4,05,628.14 ఎకరాల భూములపై అటవీ హక్కు పత్రాలు అందజేశామని వివరించారు. ఆమ్ఆద్మీ, జనశ్రీ యోజన పథకాల కింద 1,085 మంది విద్యార్థులకు రూ.12.91 లక్షలు ఉపకార వేతనాలు పంపిణీ చెశారు. ఈ వేడుకల్లో ఐటీడీఏ ఏపీఓ(జనరల్) వెంకటేశ్వర్లు, మలేరియా అధికారి అల్హం రవి, ఈఈటీడబ్ల్యు శంకరయ్య, ఏఓ భీం, ఈజీఎస్ఏపీడీ(టీపీఏంయూ) నూరొద్దీన్, ఐటీడీఏ మేనేజర్ స్వామి, ఈజీఎస్ అంబుడ్సుమెన్ నాగోరావు, జన వికాస జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య, ఉట్నూర్ సర్పంచ్ బొంత ఆశరెడ్డి పాల్గొన్నారు