ఆసిఫాబాద్ : ఆదివాసీల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని శనివారం రాత్రి ఆసిఫాబాద్‌లోని ఏపీటీడబ్ల్యూ(జి) బాలికల గురుకుల కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రామన్నకు కళాశాల విద్యార్థులు ఆదివాసీ సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, ఆదివాసీల వెనుకబాటుకు గత పాలక ప్రభుత్వాలే కారణమన్నారు.
గత ప్రభుత్వం ఆదివాసీ హక్కులను కాలరాసిందని, 60 ఏళ్లలో చేయని అభివృద్ధిని ఐదేళ్లలో చేసేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం కంకణం కట్టుకుందని వివరించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మన ఊరు-మన ప్రణాళిక చేపట్టిందని గుర్తు చేశారు. గిరిజన యూనివర్సిటీని జిల్లాలోని ఉట్నూర్‌లో నెలకొల్పుతామని, దీనిపై జిల్లా ప్రజలకు ఎలాంటి ఆందోళన వద్దని అన్నారు.
దీనిని సంబంధించిన ఫైల్ ఢిల్లీకి పంపినట్లు పేర్కొన్నారు. ఆదివాసీలు విద్యావంతులు కావాలని ఆకాంక్షించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎస్టీలకు 6 నుంచి 12 శాతం రిజర్వేషన్ పెంచిందని, దీంతో ఆదివాసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారని ధీమా వ్యక్తం చేశారు. కలెక్టర్ జగన్మోహన్ మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆదివాసీలకు అందేలా కృషి చేస్తానన్నారు.
త్వరలో గోండు లిపిలో విద్య
ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో ప్రశాంత్ పాటిల్ మాట్లాడుతూ, ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా నార్నూర్ మండలం గుంజాలలో గోండు లిపిని ప్రారంభించామని, త్వరలో దేశంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలోని 15 పాఠశాలల్లో గోండి లిపి విద్యా విధానాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. ఆసిఫాబాద్, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ, గిరిజనుల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
మంత్రి రామన్న, అధికారులు, ప్రజా ప్రతినిధులను పాఠశాల విద్యార్థినులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు ప్రదర్శించిన గిరిజన సంప్రదాయ నృత్యాలు, పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. ఆటల్లో రాణించిన విద్యార్థినులకు మంత్రి ప్రశంసా పత్రాలు అందజేశారు. కళాశాల ప్రిన్సిపాల్ పురాణం రాజేశ్వర శర్మ, టీఆర్‌ఎస్ తూర్పు జిల్లా అధ్యక్షుడు పురాణం సతీశ్‌కుమార్, జెడ్పీటీసీ కొయ్యల హేమాజీ, ఎంపీపీ బదావత్ తారాబాయి, సర్పంచ్ గోవిందు, గిరిజన సంఘాల నాయకులు సిడాం అర్జు, మడావి శ్రీనివాస్, సంకె కిష్టయ్య, సిడాం శంకర్, గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. కాగజ్‌నగర్ డీఎస్పీ సురేశ్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు.
మంత్రికి వినతులు
గిరిజన గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, వేతనాలు పెంచాలని మంత్రి రామన్నకు వినతిపత్రం అందజేశారు. ఆసిఫాబాద్‌ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని బీజేపీ జిల్లా కార్యదర్శి చెర్ల మురళి, గిరిజన నాయకుడు కిషన్‌రావు వినతిపత్రం ఇచ్చారు.
ఆదివాసీల అభివృద్ధికి కృషి
Published Sun, Aug 10 2014 2:40 AM | Last Updated on Sat, Sep 2 2017 11:38 AM
Advertisement
Advertisement