prashant patil
-
కలెక్టర్‌పై ట్విటర్లో అసభ్యకర పోస్టులు
సాక్షి, వరంగల్ : ట్విట్టర్ వేదికగా మామునూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని పెన్షన్‌పురకు చెందిన డిగ్రీ విద్యార్థి సయ్యద్ సోహెల్ హుస్సెన్ చేసిన వాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. శుక్రవారం సాయంత్రం సయ్యద్ సోహెల్ హుస్సెన్ అర్బన్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌పై చేసిన కామెంట్లు అభ్యంతరకరంగా ఉన్నాయి. ట్విట్టర్లో తీవ్ర పదజాలంతో దూషించాడు. ఆ మాటలను రాష్ట్రంలోని ఇతర అధికారులు ట్యాగ్ చేయగా ఇప్పటికే లక్షల మంది నెటిజన్లు చూశారు. దీనికి తోడు సోహెల్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలోనూ చక్కర్లు కొట్టాయి. పరువుకు సంబంధించిన విషయాలు కావడంతో జిల్లా అధికారులు, పోలీసులు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ట్విట్టర్ వ్యాఖ్యల వ్యవహారం వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ రవీందర్‌కు తెలియడంతో స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగి సయ్యద్ సోహెల్ హుస్సెన్ చిట్టాను బయటకు తీసినట్లు తెలిసింది. ట్విట్టర్ వ్యాఖ్యలపై శనివారం రాత్రి జిల్లా రెవెన్యూ అధికారి పి.మోహన్‌లాల్ ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన సుబేదారి పోలీసులు సయ్యద్ సోహెల్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆ యువకుడిపై 189, 294/బీ, 504 ఐపీసీ సెక్షన్లతో పాటు ఇతర యాక్టుల కింద కేసు నమోదు చేసినట్లు సుబేదారి ఇన్స్పెక్టర్ పి.సదయ్య తెలిపారు. -
ప్రతీ సమస్యపై దృష్టిపెట్టండి
సబ్ కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ ఆసిఫాబాద్‌లో అర్జీల స్వీకరణ ప్రజా ఫిర్యాదుల విభాగంలో ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు సబ్ కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ తెలిపారు. సోమవారం కార్యాలయంలో డివిజన్లోని ప్రజల నుంచి సమస్యలపై దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా కెరమెరి మండలం అనార్‌పల్లికి చెందిన రాథోడ్ వెంకట్రావు, కాగజ్‌నగర్ మండలం చింత గూడకు చెందిన జుమ్మిడి పోచయ్య భూమి నష్ట పరిహారం చెల్లించాలని, సిర్పూర్(టి)కి చెందిన ఐనబోయిన లక్ష్మీనారాయణ,మోసంకు చెందిన దిలీప్‌కుమార్ ఆర్వోఆర్ పట్టా పాస్‌బుక్ కోసం, వివిధ సమస్యలపై సబ్ కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. డీఏవో సూరిబాబు, అధికారులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ అర్బన్ : ప్రజలు వివిధ సమస్యలు పరిష్కరించాలంటూ వ్యయప్రయాసలకోర్చి ఇక్కడికి వచ్చి అర్జీలు అంద జేస్తారని, సంబంధిత అధికారులు వాటిపై ప్రత్యేక దృష్టిపెట్టాలని కలెక్టర్ ఎం.జగన్మోహన్ ఆదేశించారు. ప్రజల సమస్యనూ పరిగణలోకి తీసుకుని పరిష్కారం చూపాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల విభాగంలో కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి సమస్యను పరిశీలించి పరిష్కరించినట్లయితే ఆ సమస్యకు అప్పుడే ముగింపు ఉంటుందని తెలిపారు. చిన్న సమస్యలపైనా అధికారులు దృష్టి సారించకపోవడంతోనే ఒక్కో అర్జీదారు మళ్లీమళ్లీ కార్యాలయాలకు రావాల్సిన పరిస్థితి ఉంటోందని పేర్కొన్నారు. అధికారులు జవాబుదారీతనంతో పని చేయాలని సూచించారు. అనంతరం ఒక్కో అర్జీదారు నుంచి ఫిర్యాదులు స్వీకరించి ఆయా శాఖలకు చెందిన అధికారులకు అందజేశారు. అదనపు జేసీ ఎస్.ఎస్.రాజు, జిల్లా పరిషత్ సీఈవో అనితాగ్రేస్, సీపీవో షేక్మీరా, ఆర్డీవో సుధాకర్‌రెడ్డి, డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్‌రెడ్డి, డ్వామా పీడీ గణేశ్ జాదవ్, డీఎంహెచ్‌వో రుక్మిణమ్మ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. అర్జీలు సత్వరమే పరిష్కరించాలి ఉట్నూర్ రూరల్ : గిరిజన దర్బార్‌లో గిరిజనులు అందించే అర్జీలను సత్వరమే పరిష్కరించాలని ఐటీడీఏ ఏవో భీమ్ అ న్నారు. సోమవారం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన గిరిజన దర్బార్‌లో ఆయన జిల్లా నలుమూలల నుంచి వచ్చి న గిరిజనుల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ గిరిజన ద ర్బార్‌లో కాగజ్‌నగర్ మండల కేంద్రానికి చెందిన కుంర అరుణ్, ఆత్రం కిష్టు తాము సాగు చేస్తున్న భూములకు అటవీ హక్కు పత్రాలు మంజూరు చేయాలని కోరారు. ఇదే మండలానికి చెందిన సూర్పం చందు తాను పేదవాడినని, ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక స్థోమత లేదని, ఐటీడీఏ ద్వారా ఇల్లు మంజూరు చేయాలని అర్జీ పెట్టుకున్నారు. జైనూర్ మండలం పారా గ్రామానికి చెందిన కినాక ఆనంద్‌రావ్ తనకు 4 ఎకరా ల వ్యవసాయ భుమి ఉందని, అరటి తోటను పెంచుకునేం దుకు ఆర్థిక సహాయం చేయాలని దరఖాస్తు అందించాడు. బేల మండలం సోపడ్ గ్రామానికి చెందిన మడావి లక్ష్మి తా ను 40 ఏళ్లుగా సాగు చేస్తున్న భూమి ఇతరులు కబ్జా చేశారని, తన భూమి తనకు ఇప్పించాలని అర్జీ పెట్టుకుంది. నార్నూర్ మండలం గుంజాల గ్రామానికి చెందిన సూర్పం రాజు తన కు 3 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని వ్యవసాయం కోసం బోరు మంజూరు చేయాలని వేడుకున్నారు. దండేపల్లి మండలానికి చెందిన నారాయణ తన భూమికి సంబంధించి న కేసు ఐటీడీఏ కార్యాలయంలో పెండింగ్‌లో ఉందని దాన్ని పరిష్కరించాలని అర్జీ పెట్టుకున్నారు. అర్జీలను సంబందిత అధికారులు క్లుప్తంగా పరిశీలించి పరిష్కరించాలని ఏవో ఆదేశించారు. ఐటీడీఏ అధికారులు పాల్గొన్నారు. పీవో, డీడీలను వెంటనే నియమించాలి ఉట్నూర్ రూరల్ : ఐటీడీఏ కార్యాలయంలో రెగ్యులర్ పీవో, డీడీలను వెంటనే నియమించాలని పలువురు ఆదివాసీ సం ఘాల నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం ఐటీడీఏ కా ర్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ, ఐటీడీఏలో రెగ్యులర్ పీవో లేకపోవడంతో గిరిజన దర్బార్‌కు సైతం అధికారులు రావడం లేదన్నారు. జిల్లావ్యాప్తంగా సమస్యలు వివరించేందుకు వస్తున్న గిరిజనులు సరైన న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు వెడ్మ బొజ్జు, తుడుందెబ్బ జిల్లా గౌరవ అధ్యక్షుడు ఆత్రం తిరుపతి, తొటి సేవా సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కుడిమెత తిరుపతి పాల్గొన్నారు. -
మోడల్‌గా తీర్చిదిద్దుతా..
ఆసిఫాబాద్ : వారంతా ఆదిమ గిరిజన విద్యార్థులు. అందరూ గ్రామీణ వాతావరణం నుంచి వచ్చిన వారే. బిడ్డలు దూరంగా ఉన్నా సరే నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందుతుందనే ఉద్దేశంతో తల్లిదండ్రులు గురుకుల పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. కొందరు అధికారుల పర్యవేక్షణ లోపం.. సిబ్బంది నిర్లక్ష్యం వెరసి గురుకుల పాఠశాలు, వసతిగృహాల్లో సమస్యలు తిష్టవేస్తున్నాయి. కొన్ని చోట్ల మెనూ కూడా అమలుకు నోచుకోవడం లేదు. విద్యార్థులు చదువులోనూ వెనుకబడుతున్నారు. వీటితోపాటు విద్యార్థుల సమస్యలనూ వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేసింది ‘సాక్షి’. ఐటీడీఏ ఇన్చార్జి పీవో, ఆసిఫాబాద్ సబ్‌కలెక్టర్ ప్రశాంత్‌పాటిల్ ‘వీఐపీ రిపోర్టర్’ గా మారారు. ఆసిఫాబాద్‌లోని పీటీజీ గురుకుల పాఠశాలను సందర్శించారు. ఉపాధ్యాయులు, వార్డెన్ ఉంటే సమస్యలు చెప్పడానికి విద్యార్థులు భయపడుతారనే ఉద్దేశంతో వారిని బయటకు పంపించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సాధక, బాధకాలు తెలుసుకున్నారు. సమస్యలపై ఆరా తీశారు. మెనూ అమలు తీరు, విద్యార్థుల బస, సిలబస్, బోధన, ఆరోగ్యం, క్రీడలు ఇలా అన్నింటినీ తెలుసుకున్నారు. విద్యార్థులతో కలెక్టర్ సంభాషణ ఇలా సాగింది.. సబ్ కలెక్టర్‌ను గమనించిన విద్యార్థులు : నమస్కారం సార్.. సబ్ కలెక్టర్ : నమస్కారం... అక్కడున్న ఓ విద్యార్థితో ఏ వూరు బాబు విద్యార్థి పాండు : శాకన్గోంది సబ్‌కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ : ఏ క్లాస్ విద్యార్థి పాండు : టెన్త్ సబ్‌కలెక్టర్ : చదువు ఎలా ఉంది, భోజనం సరిపోతుందా..? విద్యార్థి పాండు : బావుంది. సరిపోతుంది సబ్‌కలెక్టర్ : సాయంత్రం స్నాక్స్ ఏమి ఇస్తుండ్రు విద్యార్థి పాండు : పల్లిపట్టి సబ్ కలెక్టర్ : అందరికీ ఇస్తుండ్రా విద్యార్థి : ఇస్తుండ్రు సబ్ కలెక్టర్ : గుడ్లు ఎప్పుడు ఇస్తుండ్రు విద్యార్థి : ప్రతి రోజు సబ్ కలెక్టర్ : ఈ రోజు మెనూ ఏమి ఇచ్చిండ్రు, రాత్రి ఏమి ఇస్తుండ్రు విద్యార్థులు : బాగా తినాలి సబ్ కలెక్టర్ : ఇక్కడ ఏమైనా ఇబ్బంది ఉందా, టీచింగ్ ప్రాబ్లం ఉందా, టీచర్లు సరైన సమయానికి వస్తుండ్రా విద్యార్థి : సరైన సమాధానం చెప్పలేదు అక్కడే ఉన్న ఉపాధ్యాయులందరినీ, వార్డన్‌ను బయటకు వెళ్లాలని, ప్రిన్సిపాల్‌ను పిలవాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు. సబ్ కలెక్టర్ : ఇప్పుడు చెప్పండి, మీకు భయం లేదు. రెగ్యులర్‌గా క్లాసెస్ జరుగుతున్నాయా. విద్యార్థులు : జరుగుతున్నాయి. సబ్ కలెక్టర్ : ఉదయం ఎప్పుడు నిద్ర లేస్తున్నారు విద్యార్థులు : 5 గంటలకు.. సబ్ కలెక్టర్ : బ్రేక్‌ఫాస్ట్ ఏమి ఇస్తున్నారు. ఎప్పుడు ఇస్తారు.. విద్యార్థులు : కిచిడి, ఆలు ఉదయం 7.15 గంటలకు ఇస్తారు సబ్ కలెక్టర్ : ఉపాధ్యాయులు రైట్ టైమ్‌కు వస్తారా, అందరూ వస్తారా విద్యార్థులు : వస్తారు సబ్ కలెక్టర్ : స్కూల్‌కు ఎప్పుడు వెళ్తారు విద్యార్థులు : 9 గంటలకు వెళ్తాం సబ్ కలెక్టర్ : రాత్రి పడుకునేటప్పుడు చెద్దర్లు ఉన్నయా.. విద్యార్థి ఎం.మారుతి : ఉన్నాయి కానీ కరెంటు పోతే ఇబ్బందవుతుంది.. సబ్ కలెక్టర్ : నైట్ స్పెషల్ క్లాసులు ఎప్పుడు స్టార్ట్ అవుతయి విద్యార్థి ఎం.మారుతి : రాత్రి 7 గంటలకు సబ్ కలెక్టర్ : టీచర్లు, ప్రిన్సిపాల్ అందరు వస్తరా విద్యార్థి ఎం.మారుతి : వస్తరు సార్ - అదే సమయంలో ప్రిన్సిపాల్ రాజేశ్వరశర్మ వచ్చారు.. సబ్ కలెక్టర్ : ఉదయం విద్యార్థులకు పాలు ఇస్తుండ్రా ప్రిన్సిపాల్ : పాలు, టీ ఇస్తున్నాం సబ్ కలెక్టర్ : విద్యార్థులకు టీ బంద్ చేయాలి. పాలు ఇస్తేనే వారి హెల్త్ బాగుంటుంది. సబ్ కలెక్టర్ : ఉదయం ఏం టిఫిన్ ఇస్తరు విద్యార్థి ఎం.మారుతి : ఇడ్లి, పూరి సబ్ కలెక్టర్ : మధ్యాహ్నం ఎగ్స్ ఇస్తుండ్రా విద్యార్థి : ఇస్తుండ్రు సబ్ కలెక్టర్ : ఎంతమంది విద్యార్థులున్నారు.. ప్రిన్సిపాల్ : 500 మందికి ఈ రోజు 471 మంది ఉన్నారు. మరో విద్యార్థితో.. సబ్ కలెక్టర్ : టెన్త్‌లో పాసైతమని భరోసా ఉందా, మ్యాథ్స్ ఎవరు చెప్తారు.. విద్యార్థి ఉపేందర్ : ఉంది. మ్యాథ్స్ శ్యాంసార్ చెప్తారు. సబ్ కలెక్టర్ : ఎలా చెప్తాడు విద్యార్థులు : బాగా చెప్తాడు సబ్ కలెక్టర్ : మీరు ఏ సబ్జెక్ట్‌లో వీక్ విద్యార్థులు : ఇంగ్లిష్ సబ్ కలెక్టర్ : వాట్ ఈజ్ యువర్ నేమ్ విద్యార్థి : నరేశ్ సబ్ కలెక్టర్ : వాట్ ఈజ్ యువర్ హాబీ విద్యార్థి నరేశ్ : : రైటింగ్ సబ్ కలెక్టర్ : హాబీ అంటే ఖాళీ సమయంలో చేసే పని. ఆటలు ఆడటం, పుస్తకాలు చదవడం, సినిమా చూడడం కూడా హాబీయే. సబ్ కలెక్టర్ : హాస్టల్లో మీరు సంతోషంగా ఉన్నారా. కప్పుకునేందుకు రగ్గులున్నాయా, మీకు ఇంకా ఏం కావాలి విద్యార్థి మారుతి : రగ్గులున్నాయి సబ్ కలెక్టర్ : టాయిలెట్లు ఉన్నయా విద్యార్థి మారుతి : ఉన్నయి కానీ సరిపోతలేవు, వాటర్ప్రాబ్లం ఉంది. సబ్ కలెక్టర్ : ఈ విషయం మీ ప్రిన్సిపాల్‌కు చెప్పారా విద్యార్థి మారుతి : చెప్పాం. ప్రిన్సిపాల్ : టాయిలెట్లు మరమ్మతుకు డబ్బులు లేవు. స్కూల్ నుంచి వచ్చే ఫండ్స్ సరిపోవడం లేదు. సబ్ కలెక్టర్ : ఐటీడీఏ నుండి టాయిలెట్లు మరమ్మతు చేయిస్తా. సబ్ కలెక్టర్ : స్పెషల్ క్లాసెస్ తీసుకోవాలి. బాగా ప్రాక్టీస్ చేయాలి విద్యార్థులు : చేస్తం సార్ సబ్ కలెక్టర్ : స్పెషల్ క్లాస్ ఎప్పుడు తీసుకుంటారు విద్యార్థులు : రాత్రి 7 నుండి 8 గంటల వరకు సబ్ కలెక్టర్ : నిన్న ఏమి ఇచ్చారు, హోంవర్క్ చేస్తున్నారా విద్యార్థులు : చేస్తున్నం సార్ సబ్ కలెక్టర్ : పరీక్షలు వస్తున్నయి కాబట్టి టైంటేబుల్ తయారు చేసుకోవాలి. ఈ యేడాది ఎస్ఎస్సీ పరీక్షల విధానం మారింది. చూచి రాసే అవకాశం లేదు. గదుల్లో సీసీ కెమెరాలు పెడ్తరు కాబట్టి కాపీ కొట్టే అవకాశం లేదు. మంచిగా చదవాలి విద్యార్థులు : సరే సార్ సబ్ కలెక్టర్ : మీకు తెలుసా నేను సబ్ కలెక్టరని విద్యార్థులు : తెలుసు సార్ పార్ట్ టైం ఉపాధ్యాయుల సమస్యలు అక్కడే ఉన్న పార్ట్ టైం ఉపాధ్యాయులు తమ గోడు సబ్ కలెక్టర్‌కు మొరపెట్టుకున్నారు. పార్ట్ టైం ఉపాధ్యాయులు : సార్ మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. రెగ్యులర్ ఉపాధ్యాయులతో సమానంగా పని చేస్తున్నం. గతేడాది నెలకు రూ.ఏడున్నర వేలు ఇవ్వగా, ఈ యేడాది రూ.ఐదు వేలకు తగ్గించారు. విద్యార్థులు అనారోగ్యానికి గురైతే మేమే హైదరాబాద్, కరీంనగర్ ఆస్పత్రులకు తీసుకెళ్తున్నం. సబ్ కలెక్టర్ : ఇది నా చేతుల్లో లేదు. పాలసీ మ్యాటర్. జిల్లా కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకెళ్తా. ఈ సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ఉంది కదా.. మళ్లీ విద్యార్థులతో మాట్లాడుతూ.. సబ్ కలెక్టర్ : డాక్టర్లు వస్తున్నారా విద్యార్థులు : వస్తున్నారు. సబ్ కలెక్టర్ : మందులు ఏమి ఇస్తున్నరు వద్యార్థులు : జ్వరం ఉన్నవాళ్లకు టాబ్లెట్స్ ఇస్తుండ్రు. సబ్ కలెక్టర్ : మీ ఫ్రెండ్స్‌కు జ్వరం వస్తే వెంటనే ప్రిన్సిపాల్‌కు చెప్పాలి విద్యార్థులు : చెప్తం సార్ సబ్ కలెక్టర్ : స్కూల్లో గేమ్స్ ఆడిస్తరా, విద్యార్థులు : ఆడిస్తరు. సబ్ కలెక్టర్ : స్పోర్ట్స్ మెటీరియల్ ఉందా విద్యార్థులు : లేదు సబ్ కలెక్టర్ : నేను ప్రొవైడ్ చేస్తా అక్కడి నుండి కిచెన్‌కు వెళ్లి పరిశీలించారు. సబ్ కలెక్టర్ : కిచెన్ ఫ్లోరింగ్ సరిగా లేదు. ఏం ప్రాబ్లమ్ ప్రిన్సిపాల్ : ఫండ్స్ లేవు. సంవత్సరానికి రూ.4 వేలు వస్తయి. ఈయేడాది రాకపోతే నేనే రూ.10 వేలతో మరమ్మతులు చేయించా సబ్ కలెక్టర్ : ఏం పరవాలేదు. రెండు మూడు నెలల్లో మోడల్ పాఠశాలగా అభివృద్ధి చేస్తా. సబ్ కలెక్టర్ : మోటార్ నడుస్తుందా ప్రిన్సిపాల్ : నడుస్తుంది సబ్ కలెక్టర్ : తాగడానికి ఏ నీరు వాడుతున్నారు విద్యార్థులు : ఆర్వో ప్లాంట్ ఉంది సార్ సబ్ కలెక్టర్ : సరిగా పని చేస్తుందా విద్యార్థులు : కొన్ని రోజులు పని చేయలేదు. ఇప్పుడు పని చేస్తుంది. ప్రిన్సిపాల్ : సార్ స్టాఫ్ క్వార్టర్స్ కూలిపోతున్నాయి. సబ్ కలెక్టర్ : ఎన్ని క్వార్టర్స్ ఉన్నయి ప్రిన్సిపాల్ : 16 క్వార్టర్లకు రెండు మాత్రమే బాగున్నయి. సబ్ కలెక్టర్ : ఉపాధ్యాయులు క్యాంపస్‌లోనే ఉంటే విద్యార్థులు బాగు పడతారు. ఉపాధ్యాయులు : విద్యార్థులకు షూస్ రాలేదు. సబ్ కలెక్టర్ : షూ కోసం ప్రాబ్లం లేదు. నేను ఇప్పిస్తా. -
అంబులెన్సులు వద్దట.. ఆటోలే ముద్దట..
ఉట్నూర్ : ఏజెన్సీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు ఐటీడీఏ పీవో ఆదేశాలు బేఖాతరు చేస్తున్నారు. ఏజెన్సీలో వ్యాధుల సీజన్ ప్రారంభం అవ్వడంతో ప్రభుత్వం పీహెచ్‌సీలకు అద్దె ప్రాతిపదికన అంబులెన్సుల ఏర్పాటుకు ఐటీడీఏ ద్వారా చర్యలు చేపట్టింది. దీనిపై ఇన్చార్జి పీవో ప్రశాంత్ పాటిల్ ప్రత్యేక దృష్టి సారించి ఆయా వైద్యాధికారులు పీహెచ్‌సీలకు ట్రాక్స్ లేదా మాక్స్‌లాంటి అంబులెన్సులను అద్దె ప్రాతిపదికన సమకూర్చుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఏజెన్సీలోని 27 పీహెచ్‌సీలకు రూ.5.78 లక్షలు జూలై 26న పీహెచ్‌సీల ఖాతాల్లో జమ చేశారు. అయినా.. సదరు వైద్యాధికారులు మారుమూల ప్రాంతాలకు అంబులెన్సులు వెళ్లలేవు అనే సాకుతో ఆటోలనే అద్దె ప్రాతిపదికన వినియోగిస్తామని మెలిక పెడుతున్నారు. ఫలితంగా గిరిజన గ్రామాల నుంచి వ్యాధిగ్రస్తులను, జ్వరపీడితులను తరలించేందుకు అంబులెన్సులు లేక గిరిజనులకు ఎండ్లబండ్లే దిక్కవుతున్నాయి. అంబులెన్సులు ఎత్తివేసి అద్దె అంబులెన్సులకు నిధులు.. 1999లో ఐటీడీఏ పరిధిలోని పీహెచ్‌సీల్లో గిరిజనులకు అత్యవసర వైద్యం అందించడానికి ఏన్ఎస్ఏఫ్డీసీ (నేషనల్ షెడ్యూల్డ్ ట్రైబల్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్) ద్వారా ఏజెన్సీ పీహెచ్‌సీలకు ఉన్న అంబులెన్సులను ప్రభుత్వం గత అక్టోబర్ నెలలో రద్దు చేసింది. అదే సమయంలో వైద్యశాఖ ప్రత్యామ్నాయంగా ఏజెన్సీలోని 31 పీహెచ్‌సీల పరిధిలో గిరిజన గ్రామాల నుంచి పీహెచ్‌సీలకు గిరిజనులను తరలించడానికి అద్దె ప్రాతిపాదికన అంబులెన్సుల ఏర్పాటుకు రూ.80 లక్షలు విడుదల చేసింది. ఈ ఆగస్టు నెల నుంచి మూడు నెలలపాటు ఏజెన్సీలో వ్యాధుల సీజన్. దీంతో వ్యాధులు, జ్వరాల తీవ్రత అంతగా లేని దండేపల్లి, ఈజ్గాం, తాళ్లపేట, మందమర్రి పీహెచ్‌సీలు మినహా మిగతా వాటికి ఆగస్టు 1 నుంచి అంబులెన్సులు సమకూర్చుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అంకోళి, గిన్నెధరి, సిర్పూర్(యు), జైనూర్, శ్యాంపూర్ పీహెచ్‌సీలకు ప్రభుత్వ అంబులెన్సు ఉండటంతో వీటికి నెలకు పది వేల చొప్పున, అంబులెన్సులు లేని దంతన్‌పల్లి, హస్నాపూర్, ఇంద్రవెల్లి, పిట్టబొంగరం, నార్నూర్, జరి, గాదిగూడ, లింగపూర్, కెరమెరి, అడ, వాంకిడి, నే రడిగొండ, ఇచ్చోడ, బజార్హత్నుర్, నర్సాపూర్(టి), గుడిహత్నూర్, భీంపూర్, సైద్పూర్, కాసిపేట, లోన్వెల్లి, తిర్యాణి, రోంపల్లి పీహెచ్‌సీలకు నెలకు రూ.24 వేల చొప్పున చెల్లించేందుకు సిద్ధమైంది. అయితే.. పీహెచ్‌సీల వైద్యాధికారులే ట్రాక్స్ లేదా మాక్స్ లాంటి వాహనాలు సమకూర్చుకోవాలని ఆదేశాలు జారీ చేసి జూలై 26న ఆగస్టు నెలకు సంబంధించిన అద్దె రూ.5 లక్షల 78 వేలు ఆయా పీహెచ్‌సీల ఖాతాల్లో జమ చేశారు. నిధులు జమ అయి నెల గడుస్తున్నా ఇంతవరకు అద్దె అంబులెన్సులు కానరవడం లేదు. అద్దె కక్కుర్తికేనా..? పిట్టబొంగరం పీహెచ్సీ వైద్యాధికారులు మినహా ఇతర పీహెచ్‌సీల వైద్యాధికారులు అద్దె అంబులెన్సులు ఏర్పాటు చేసుకోలేదు. పైగా మారుమూల గ్రామాలకు అంబులెన్సులు వెళ్లలేవని సమాధానమిస్తున్నారు. అదీకాక రూ.24 వేల అద్దెకు ఎవరూ ముందుకు రావడం లేదని మెలికలు పెడుతున్నారు. దీనికితోడు ఆటోల ద్వారా ఏ ప్రాంతానికైనా వెళ్లొచ్చని ఉచిత సలహాలు సైతం ఇస్తున్నారు. దీనికి పై అధికారులు ససేమిరా అంటున్నారు. 20 రోజులపాటు అంబులెన్సులు గ్రామాల్లో తిప్పి మరో పది రోజులు ఆటోలో వెళ్లాలని సూచిస్తున్నారు. అయినా.. వైద్యాధికారులు పట్టించుకోవడం లేదు. అయితే.. అంబులెన్సులు కాకుండా ఆటోలు అద్దెకు పెట్టుకోవడం ద్వారా గ్రామాల నుంచి రోగులను తరలించడం సాధ్యం కాదు. ఆటోలో ఎలాంటి వైద్య సదుపాయాలు కూడా ఉండవు. దీంతో రోగులకు అత్యవసర వైద్యం అందకుండా పోతుంది. అంబులెన్సులో అయితే.. ఒకేసారి ఇద్దరు లేదా ముగ్గురు రోగులనైనా తరలించొచ్చు. ఇదిలా ఉంటే.. ఆటోలకైతే రూ.24 వేలు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఎంతో కొంత ముట్టజెప్పి మిగతా మొత్తాన్ని జేబులో వేసుకోవచ్చని ఆయా పీహెచ్సీ వైద్యాధికారులు యోచిస్తుండడం గమనార్హం. -
ఆదివాసీల అభివృద్ధికి కృషి
ఆసిఫాబాద్ : ఆదివాసీల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని శనివారం రాత్రి ఆసిఫాబాద్‌లోని ఏపీటీడబ్ల్యూ(జి) బాలికల గురుకుల కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రామన్నకు కళాశాల విద్యార్థులు ఆదివాసీ సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, ఆదివాసీల వెనుకబాటుకు గత పాలక ప్రభుత్వాలే కారణమన్నారు. గత ప్రభుత్వం ఆదివాసీ హక్కులను కాలరాసిందని, 60 ఏళ్లలో చేయని అభివృద్ధిని ఐదేళ్లలో చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కంకణం కట్టుకుందని వివరించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మన ఊరు-మన ప్రణాళిక చేపట్టిందని గుర్తు చేశారు. గిరిజన యూనివర్సిటీని జిల్లాలోని ఉట్నూర్‌లో నెలకొల్పుతామని, దీనిపై జిల్లా ప్రజలకు ఎలాంటి ఆందోళన వద్దని అన్నారు. దీనిని సంబంధించిన ఫైల్ ఢిల్లీకి పంపినట్లు పేర్కొన్నారు. ఆదివాసీలు విద్యావంతులు కావాలని ఆకాంక్షించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్టీలకు 6 నుంచి 12 శాతం రిజర్వేషన్ పెంచిందని, దీంతో ఆదివాసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారని ధీమా వ్యక్తం చేశారు. కలెక్టర్ జగన్మోహన్ మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆదివాసీలకు అందేలా కృషి చేస్తానన్నారు. త్వరలో గోండు లిపిలో విద్య ఐటీడీఏ ఇన్చార్జి పీవో ప్రశాంత్ పాటిల్ మాట్లాడుతూ, ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా నార్నూర్ మండలం గుంజాలలో గోండు లిపిని ప్రారంభించామని, త్వరలో దేశంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలోని 15 పాఠశాలల్లో గోండి లిపి విద్యా విధానాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. ఆసిఫాబాద్, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ, గిరిజనుల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మంత్రి రామన్న, అధికారులు, ప్రజా ప్రతినిధులను పాఠశాల విద్యార్థినులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు ప్రదర్శించిన గిరిజన సంప్రదాయ నృత్యాలు, పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. ఆటల్లో రాణించిన విద్యార్థినులకు మంత్రి ప్రశంసా పత్రాలు అందజేశారు. కళాశాల ప్రిన్సిపాల్ పురాణం రాజేశ్వర శర్మ, టీఆర్ఎస్ తూర్పు జిల్లా అధ్యక్షుడు పురాణం సతీశ్‌కుమార్, జెడ్పీటీసీ కొయ్యల హేమాజీ, ఎంపీపీ బదావత్ తారాబాయి, సర్పంచ్ గోవిందు, గిరిజన సంఘాల నాయకులు సిడాం అర్జు, మడావి శ్రీనివాస్, సంకె కిష్టయ్య, సిడాం శంకర్, గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. కాగజ్‌నగర్ డీఎస్పీ సురేశ్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. మంత్రికి వినతులు గిరిజన గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, వేతనాలు పెంచాలని మంత్రి రామన్నకు వినతిపత్రం అందజేశారు. ఆసిఫాబాద్‌ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని బీజేపీ జిల్లా కార్యదర్శి చెర్ల మురళి, గిరిజన నాయకుడు కిషన్‌రావు వినతిపత్రం ఇచ్చారు. -
అంబులెన్సులు వస్తున్నాయి..
ఉట్నూర్ : ఏజెన్సీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు(పీహెచ్సీ) అంబులెన్సు సౌకర్యం ఆగస్టు 1 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ఐటీడీఏ ఇన్చార్జి పీవో ప్రశాంత్ పాటిల్ పీహెచ్‌సీలకు అంబులెన్సు సౌకర్యం కోసం ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం ఏజెన్సీ పీహెచ్‌సీల అంబులెన్సులను గత జనవరి నుంచి ఎత్తి వేసిన తీరును, అద్దె అంబులెన్సులకు విడుదల చేసిన రూ.80 లక్షల నిధులు ఉపయోగాన్ని వివరిస్తూ ‘సాక్షి’ జిల్లా ప్రధాన సంచికలో జూన్ 26న ‘ఎడ్లబండే.. అంబులెన్సు..’, జూలై 25న ‘జ్వర వలయం’ అనే శీర్షికలతో కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో స్పందించిన అధికారులు వ్యాధుల సీజన్ అయిన ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మూడు నెలలపాటు అద్దె ప్రతిపాదికన అంబులెన్సుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. మూడు నెలల తర్వాత పరిస్థితిని బట్టి మరో మూడు నెలలు పొడిగించే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. 28 పీహెచ్‌సీలకు అద్దె అంబులెన్సులు ఏజెన్సీ ప్రాంతంలోని 31 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సీజనల్ వ్యాధుల ప్రభావం అంతగా ఉండని మందమర్రి, తాళ్లపెట్, దండేపల్లి పీహెచ్‌సీలను మినహాయించి మిగతా 28 పీహెచ్‌సీలకు అంబులెన్సు సౌకర్యం ఆగస్టు 1 నుంచి కల్పించనున్నారు. శ్యాంపూర్, జైనూర్, సిర్పూర్(యు), గిన్నెధరి, అంకొళి పీహెచ్‌సీలకు ఎన్ఆర్హెచ్ఎంకు చెందిన అంబులెన్సులు ఉండటంతో వీటికి మాత్రం నెలకు డీజిల్ ఖర్చు కింద రూ.10 వేలు చెల్లించనున్నారు. మిగతా పీహెచ్‌సీల అంబులెన్సులకు నెలకు అద్దె కింద రూ.24 వేలు చెల్లిస్తారు. మాక్స్, ట్రాక్స వంటి అంబులెన్సు సౌకర్యం సమకూర్చుకునే బాధ్యతను సంబంధిత పీహెచ్సీ వైధ్యాధికారికి అప్పగించారు. జనవరిలో అంబులెన్సులు ఎత్తివేసిన సమయంలోనే వైద్యశాఖ ప్రత్యామ్నాయంగా అద్దె అంబులెన్సులు సమకుర్చుకునేందుకు సంవత్సరం కోసం రూ.80 లక్షలు విడుదల చేసిన విషయం విధితమే. ఐటీడీఏ నిర్లక్ష్యం వల్ల పీహెచ్‌సీలకు అద్దె అంబులెన్సులు లేకపోవడంతో ఆరోగ్య రక్షణకు చర్యలు తీసుకొవడంలో వైద్య సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎట్టకేలకు ‘సాక్షి’ కథనాలతో ఐటీడీఏ అధికారులు స్పందించి పీహెచ్‌సీలకు అద్దె అంబులెన్సుల సౌకర్యం కల్పించడంతో గిరిజనులకు అత్యవసర వైద్యం అందుబాటులోకి రానుంది. -
‘కోల్‌యార్డు’లకు నోటీసులు
తాండూర్, న్యూస్‌లైన్: కోల్యార్డులతో దుమ్ము, ధూళి రావ డం, ప్రజల అవస్థలు, ధ్వంసమవుతున్న పర్యావరణం, పంటలపై ప్రభావాన్ని ‘సాక్షి’ దినపత్రిక ఈనెల 9న ‘బతుకు బొగ్గు’ శీర్షిక కథనాన్ని ప్రచురించింది. ఈ కథనాల క్లిప్పింగ్‌లను సదరు గ్రామాల ప్రజలు సబ్ కలెక్టర్ ప్రశాంత్ పాటిల్‌కు చూపించారు. ఆయన స్పందించారు. తాండూర్ మండలం బోయపల్లిలోని గుప్తా, అన్నవేణి శ్రీనివాస్, శ్రీనివాస్ గౌడ్, రఘువీర్, నరేష్ గుప్తా కోల్‌యార్డు యాజమాన్యాలకు ప్రశాంత్‌పాటిల్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వీరితోపాటు ఏరియా సింగరేణి జీఎం, దక్షిణ మధ్య రైల్వే అడిషనల్ డివిజన్ మేనేజర్‌కు షోకాజ్ నోటీసులు వెళ్లాయి. వీరందరూ కూడా ఈ నెల 31న ఆసిఫాబాద్ సబ్‌కలెక్టర్ కార్యాలయంలోని సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ముందు హా జరై వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులో ఆదేశించారు.