కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
సాక్షి, వరంగల్ : ట్విట్టర్ వేదికగా మామునూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని పెన్షన్‌పురకు చెందిన డిగ్రీ విద్యార్థి సయ్యద్ సోహెల్ హుస్సెన్ చేసిన వాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. శుక్రవారం సాయంత్రం సయ్యద్ సోహెల్ హుస్సెన్ అర్బన్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌పై చేసిన కామెంట్లు అభ్యంతరకరంగా ఉన్నాయి. ట్విట్టర్‌లో తీవ్ర పదజాలంతో దూషించాడు. ఆ మాటలను రాష్ట్రంలోని ఇతర అధికారులు ట్యాగ్ చేయగా ఇప్పటికే లక్షల మంది నెటిజన్లు చూశారు. దీనికి తోడు సోహెల్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలోనూ చక్కర్లు కొట్టాయి. పరువుకు సంబంధించిన విషయాలు కావడంతో జిల్లా అధికారులు, పోలీసులు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు.
రంగంలోకి దిగిన పోలీసులు
ట్విట్టర్ వ్యాఖ్యల వ్యవహారం వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ రవీందర్‌కు తెలియడంతో స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగి సయ్యద్ సోహెల్ హుస్సెన్ చిట్టాను బయటకు తీసినట్లు తెలిసింది. ట్విట్టర్ వ్యాఖ్యలపై శనివారం రాత్రి జిల్లా రెవెన్యూ అధికారి పి.మోహన్‌లాల్ ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన సుబేదారి పోలీసులు సయ్యద్ సోహెల్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆ యువకుడిపై 189, 294/బీ, 504 ఐపీసీ సెక్షన్లతో పాటు ఇతర యాక్టుల కింద కేసు నమోదు చేసినట్లు సుబేదారి ఇన్‌స్పెక్టర్ పి.సదయ్య తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment