ఉట్నూర్ : ఏజెన్సీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు(పీహెచ్‌సీ) అంబులెన్సు సౌకర్యం ఆగస్టు 1 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో ప్రశాంత్ పాటిల్ పీహెచ్‌సీలకు అంబులెన్సు సౌకర్యం కోసం ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం ఏజెన్సీ పీహెచ్‌సీల అంబులెన్సులను గత జనవరి నుంచి ఎత్తి వేసిన తీరును, అద్దె అంబులెన్సులకు విడుదల చేసిన రూ.80 లక్షల నిధులు ఉపయోగాన్ని వివరిస్తూ ‘సాక్షి’ జిల్లా ప్రధాన సంచికలో జూన్ 26న ‘ఎడ్లబండే.. అంబులెన్సు..’, జూలై 25న ‘జ్వర వలయం’ అనే శీర్షికలతో కథనాలు ప్రచురితమయ్యాయి.
దీంతో స్పందించిన అధికారులు వ్యాధుల సీజన్ అయిన ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మూడు నెలలపాటు అద్దె ప్రతిపాదికన అంబులెన్సుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. మూడు నెలల తర్వాత పరిస్థితిని బట్టి మరో మూడు నెలలు పొడిగించే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.
28 పీహెచ్‌సీలకు అద్దె అంబులెన్సులు
ఏజెన్సీ ప్రాంతంలోని 31 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సీజనల్ వ్యాధుల ప్రభావం అంతగా ఉండని మందమర్రి, తాళ్లపెట్, దండేపల్లి పీహెచ్‌సీలను మినహాయించి మిగతా 28 పీహెచ్‌సీలకు అంబులెన్సు సౌకర్యం ఆగస్టు 1 నుంచి కల్పించనున్నారు. శ్యాంపూర్, జైనూర్, సిర్పూర్(యు), గిన్నెధరి, అంకొళి పీహెచ్‌సీలకు ఎన్‌ఆర్‌హెచ్‌ఎంకు చెందిన అంబులెన్సులు ఉండటంతో వీటికి మాత్రం నెలకు డీజిల్ ఖర్చు కింద రూ.10 వేలు చెల్లించనున్నారు. మిగతా పీహెచ్‌సీల అంబులెన్సులకు నెలకు అద్దె కింద రూ.24 వేలు చెల్లిస్తారు.
మాక్స్, ట్రాక్‌స వంటి అంబులెన్సు సౌకర్యం సమకూర్చుకునే బాధ్యతను సంబంధిత పీహెచ్‌సీ వైధ్యాధికారికి అప్పగించారు. జనవరిలో అంబులెన్సులు ఎత్తివేసిన సమయంలోనే వైద్యశాఖ ప్రత్యామ్నాయంగా అద్దె అంబులెన్సులు సమకుర్చుకునేందుకు సంవత్సరం కోసం రూ.80 లక్షలు విడుదల చేసిన విషయం విధితమే. ఐటీడీఏ నిర్లక్ష్యం వల్ల పీహెచ్‌సీలకు అద్దె అంబులెన్సులు లేకపోవడంతో ఆరోగ్య రక్షణకు చర్యలు తీసుకొవడంలో వైద్య సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎట్టకేలకు ‘సాక్షి’ కథనాలతో ఐటీడీఏ అధికారులు స్పందించి పీహెచ్‌సీలకు అద్దె అంబులెన్సుల సౌకర్యం కల్పించడంతో గిరిజనులకు అత్యవసర వైద్యం అందుబాటులోకి రానుంది.
అంబులెన్సులు వస్తున్నాయి..
Published Thu, Jul 31 2014 2:56 AM | Last Updated on Sat, Aug 18 2018 2:18 PM
Advertisement
Advertisement