ఉట్నూర్ : ఏజెన్సీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు ఐటీడీఏ పీవో ఆదేశాలు బేఖాతరు చేస్తున్నారు. ఏజెన్సీలో వ్యాధుల సీజన్ ప్రారంభం అవ్వడంతో ప్రభుత్వం పీహెచ్‌సీలకు అద్దె ప్రాతిపదికన అంబులెన్సుల ఏర్పాటుకు ఐటీడీఏ ద్వారా చర్యలు చేపట్టింది. దీనిపై ఇన్‌చార్జి పీవో ప్రశాంత్ పాటిల్ ప్రత్యేక దృష్టి సారించి ఆయా వైద్యాధికారులు పీహెచ్‌సీలకు ట్రాక్స్ లేదా మాక్స్‌లాంటి అంబులెన్సులను అద్దె ప్రాతిపదికన సమకూర్చుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
అంతేకాకుండా ఏజెన్సీలోని 27 పీహెచ్‌సీలకు రూ.5.78 లక్షలు జూలై 26న పీహెచ్‌సీల ఖాతాల్లో జమ చేశారు. అయినా.. సదరు వైద్యాధికారులు మారుమూల ప్రాంతాలకు అంబులెన్సులు వెళ్లలేవు అనే సాకుతో ఆటోలనే అద్దె ప్రాతిపదికన వినియోగిస్తామని మెలిక పెడుతున్నారు. ఫలితంగా గిరిజన గ్రామాల నుంచి వ్యాధిగ్రస్తులను, జ్వరపీడితులను తరలించేందుకు అంబులెన్సులు లేక గిరిజనులకు ఎండ్లబండ్లే దిక్కవుతున్నాయి.
అంబులెన్సులు ఎత్తివేసి అద్దె అంబులెన్సులకు నిధులు..
1999లో ఐటీడీఏ పరిధిలోని పీహెచ్‌సీల్లో గిరిజనులకు అత్యవసర వైద్యం అందించడానికి ఏన్‌ఎస్‌ఏఫ్‌డీసీ (నేషనల్ షెడ్యూల్డ్ ట్రైబల్ ఫైనాన్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) ద్వారా ఏజెన్సీ పీహెచ్‌సీలకు ఉన్న అంబులెన్సులను ప్రభుత్వం గత అక్టోబర్ నెలలో రద్దు చేసింది. అదే సమయంలో వైద్యశాఖ ప్రత్యామ్నాయంగా ఏజెన్సీలోని 31 పీహెచ్‌సీల పరిధిలో గిరిజన గ్రామాల నుంచి పీహెచ్‌సీలకు గిరిజనులను తరలించడానికి అద్దె ప్రాతిపాదికన అంబులెన్సుల ఏర్పాటుకు రూ.80 లక్షలు విడుదల చేసింది.
ఈ ఆగస్టు నెల నుంచి మూడు నెలలపాటు ఏజెన్సీలో వ్యాధుల సీజన్. దీంతో వ్యాధులు, జ్వరాల తీవ్రత అంతగా లేని దండేపల్లి, ఈజ్‌గాం, తాళ్లపేట, మందమర్రి పీహెచ్‌సీలు మినహా మిగతా వాటికి ఆగస్టు 1 నుంచి అంబులెన్సులు సమకూర్చుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అంకోళి, గిన్నెధరి, సిర్పూర్(యు), జైనూర్, శ్యాంపూర్ పీహెచ్‌సీలకు ప్రభుత్వ అంబులెన్సు ఉండటంతో వీటికి నెలకు పది వేల చొప్పున, అంబులెన్సులు లేని దంతన్‌పల్లి, హస్నాపూర్, ఇంద్రవెల్లి, పిట్టబొంగరం, నార్నూర్, జరి, గాదిగూడ, లింగపూర్, కెరమెరి, అడ, వాంకిడి, నే రడిగొండ, ఇచ్చోడ, బజార్‌హత్నుర్, నర్సాపూర్(టి), గుడిహత్నూర్, భీంపూర్, సైద్‌పూర్, కాసిపేట, లోన్‌వెల్లి, తిర్యాణి, రోంపల్లి పీహెచ్‌సీలకు నెలకు రూ.24 వేల చొప్పున చెల్లించేందుకు సిద్ధమైంది. అయితే.. పీహెచ్‌సీల వైద్యాధికారులే ట్రాక్స్ లేదా మాక్స్ లాంటి వాహనాలు సమకూర్చుకోవాలని ఆదేశాలు జారీ చేసి జూలై 26న ఆగస్టు నెలకు సంబంధించిన అద్దె రూ.5 లక్షల 78 వేలు ఆయా పీహెచ్‌సీల ఖాతాల్లో జమ చేశారు. నిధులు జమ అయి నెల గడుస్తున్నా ఇంతవరకు అద్దె అంబులెన్సులు కానరవడం లేదు.
అద్దె కక్కుర్తికేనా..?
పిట్టబొంగరం పీహెచ్‌సీ వైద్యాధికారులు మినహా ఇతర పీహెచ్‌సీల వైద్యాధికారులు అద్దె అంబులెన్సులు ఏర్పాటు చేసుకోలేదు. పైగా మారుమూల గ్రామాలకు అంబులెన్సులు వెళ్లలేవని సమాధానమిస్తున్నారు. అదీకాక రూ.24 వేల అద్దెకు ఎవరూ ముందుకు రావడం లేదని మెలికలు పెడుతున్నారు. దీనికితోడు ఆటోల ద్వారా ఏ ప్రాంతానికైనా వెళ్లొచ్చని ఉచిత సలహాలు సైతం ఇస్తున్నారు. దీనికి పై అధికారులు ససేమిరా అంటున్నారు. 20 రోజులపాటు అంబులెన్సులు గ్రామాల్లో తిప్పి మరో పది రోజులు ఆటోలో వెళ్లాలని సూచిస్తున్నారు. అయినా.. వైద్యాధికారులు పట్టించుకోవడం లేదు.
అయితే.. అంబులెన్సులు కాకుండా ఆటోలు అద్దెకు పెట్టుకోవడం ద్వారా గ్రామాల నుంచి రోగులను తరలించడం సాధ్యం కాదు. ఆటోలో ఎలాంటి వైద్య సదుపాయాలు కూడా ఉండవు. దీంతో రోగులకు అత్యవసర వైద్యం అందకుండా పోతుంది. అంబులెన్సులో అయితే.. ఒకేసారి ఇద్దరు లేదా ముగ్గురు రోగులనైనా తరలించొచ్చు. ఇదిలా ఉంటే.. ఆటోలకైతే రూ.24 వేలు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఎంతో కొంత ముట్టజెప్పి మిగతా మొత్తాన్ని జేబులో వేసుకోవచ్చని ఆయా పీహెచ్‌సీ వైద్యాధికారులు యోచిస్తుండడం గమనార్హం.
అంబులెన్సులు వద్దట.. ఆటోలే ముద్దట..
Published Thu, Aug 28 2014 3:03 AM | Last Updated on Sat, Aug 18 2018 2:15 PM
Advertisement
Advertisement