The start of the season
-
నిరాశే మిగిల్చింది!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లా రైతాంగానికి ఖరీఫ్ సీజన్ నిరాశే మిగిల్చింది. సీజన్ ప్రారంభంలో కొత్త ఆశలతో సాగు పనులకు ఉపక్రమించిన శ్రమజీవులకు అంతంతమాత్రమే ఫలితం దక్కింది. సాగు విస్తీర్ణం భారీగా పతనం కాగా.. దిగుబడులపైనా తీవ్ర ప్రభావాన్ని చూపింది. 2014 ఖరీఫ్ సీజన్లో జిల్లాలో 1,84,778 హెక్టార్లలో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ ప్రణాళిక రూపొందించి అమలు చేసింది. కానీ సీజన్ మొదట్లోనే వర్షాల జాడలేకపోవడంతో సాగు చతికిలపడింది. జూన్ మొదటివారంలోనే సాగు పనులు ఊపందుకోవల్సి ఉండగా.. ఆగస్టు రెండో వారం వరకు కూడా మందకొడిగా సాగాయి. ఆగస్టు చివర్లో కురిసిన వర్షాలు కొంత ఊరటనివ్వడంతో 1,58,811 హెక్టార్లలో పంటలు సాగైనట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. తాజాగా ఖరీఫ్ ముగియగా.. బుధవారం నుంచి రబీ సీజన్ ప్రారంభం కానుంది. వాణిజ్య పంటల పతనం.. సాగునీటి ప్రాజెక్టులు లేనందున జిల్లా రైతాంగం వర్షాధార పంటలపైనే ఆధారపడింది. ఇందులో భాగంగా అత్యధికంగా కంది, జొన్న, మొక్కజొన్న, పత్తి పంటలు సాగవుతాయి. కానీ ఖరీఫ్‌లో వాతావరణం అనుకూలించకపోవడంతో వాణిజ్యపంటల సాగు భారీగా పతనమైంది. జిల్లాలో జొన్నపంట సాధారణ విస్తీర్ణం 13,456 హెక్టార్లు కాగా.. ఖరీఫ్ సీజన్లో కేవలం 5,866 హెక్టార్లలో మాత్రమే సాగైంది. ప్రధాన పంటైన కంది సైతం భారీగా తగ్గింది. 38,144 హెక్టార్లు సాగు కావాల్సి ఉండగా.. 30వేల హెక్టార్లకు పడిపోయింది. 8,032 హెక్టార్లకు సాగు కావాల్సిన పెసలు కేవలం 4,175 హెక్టార్లకు తగ్గింది. మినుములు 6,726 హెక్టార్లకుగాను 4,170 హెక్టార్లకు పతనమైంది. 3,903 హెక్టార్లలో సాగయ్యే ఆముదం పంట భారీగా తగ్గి.. 726 హెక్టార్లకు పరిమితమైంది. ఇలా దాదాపు వాణిజ్యపంటల సాగు పడిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనలో పడిపోయారు. ఆగస్టు చివర్లో కురిసిన వర్షాలతో మొక్కజొన్న, పత్తి పంటలు గట్టెక్కాయి. మొక్కజొన్న పంట విస్తీర్ణం సాధారణం కంటే మూడు వేల హెక్టార్లు పెరిగి 38,160 హెక్టార్లకు చేరింది. అదేవిధంగా పత్తి పంట కూడా 5వేల హెక్టార్ల విస్తీర్ణం పెరిగి 49 వేలకు చేరింది. అయితే రెండు పంటలు మొలకెత్తిన తర్వాత వానలు కురవడంలో జాప్యం ఏర్పడటంతో దిగుబడి భారీగా తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వరి.. ఉక్కిరిబిక్కిరి.. ఖరీఫ్ సీజన్ వరి రైతును ఉక్కిరిబిక్కిరికి గురి చేసింది. జిల్లాలో 27,200 హెక్టార్లలో వరి సాగు కావాల్సి ఉంది. కానీ 20,235 హెక్టార్లతోనే ఆగిపోయింది. బోరుమోటార్లపై ఆధారపడి సాగవుతున్న వరిపంట.. ప్రస్తుతం ఆందోళనకరంగానే ఉంది. ఊహించిన స్థాయిలో వానలు కురవకపోవడంతో భూగర్భజలాల పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. ప్రస్తుతం వరికి నీటి సరఫరా కీలకం కాగా.. ఒకవైపు కరెంటు కోతలు.. మరోవైపు భూగర్భ జలాల లభ్యత పడిపోవడంతో వరి పంట చేతికొచ్చేవరకు రైతు బిక్కుబిక్కుమనాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో వరి పంట వరదనీటి పాలైంది. దాదాపు వెయ్యి హెక్టార్లలో వరి దెబ్బతిన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. -
సాగు 84శాతమే!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఖరీఫ్ సీజన్ ముగిసింది. సీజన్ ప్రారంభంలో గంపెడాశలతో సాగు పనులకు ఉపక్రమించిన రైతులకు వాతావరణం అంతంతమాత్రం గానే అనుకూలించింది. జిల్లాలో రెండు లక్షల హెక్టార్లలో పంటలు సాగవుతాయని భావించిన జిల్లా వ్యవసాయశాఖ.. ఆ మేరకు చర్యలు చేపట్టింది. కానీ జూన్, జులై నెలల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా సాగుపనులు మందకొడిగా సాగాయి. ఆగస్టు తొలివారంలో మాత్రం వర్షాలు కొంత ఊరట ఇచ్చాయి. దీంతో ఖరీఫ్ సీజన్లో 1,55,370 హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. జిల్లాలో ఖరీఫ్ సాధార ణ విస్తీర్ణం 1,84,778 హెక్టార్లుకాగా.. సీజన్ చివ రినాటికి 84శాతం విస్తీర్ణంలో వివిధ పంటలు సాగవుతున్నట్లు వ్యవసాయశాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఆశాజనకంగా ఆ రెండు పంటలు సాగునీటి ప్రాజెక్టులు లేని కారణంగా జిల్లా రైతాంగానికి వర్షాధార పంటలే కీలకం. దీంతో ఖరీఫ్ సీజన్లో వాణిజ్యపంటల వైపే రైతులు మొగ్గు చూపుతున్నారు. ఈక్రమంలో మొక్కజొన్న, కంది, పత్తితో పాటు జొన్న పంటలు అధిక విస్తీర్ణంగా సాగవుతాయి. తాజా ఖరీఫ్ సీజన్లో రైతులు భారీ అంచనాలతో సాగుపనులు చేపట్టినప్పటికీ తీవ్ర వర్షాభావం కారణంగా పంటల విస్తీర్ణం భారీగా పడిపోయింది. అయితే జులై చివరివారం, ఆగస్టు తొలివారంలో కురిసిన వర్షాల వల్ల మెట్టపంటల సాగు పుంజుకుంది. పత్తి, మొక్కజొన్న పంటలు కొంత ఆశాజనకంగా సాగయ్యాయి. సాధారణ విస్తీర్ణాన్ని దాటుకుని కొంత మెరుగుపడ్డాయి. మొక్కజొన్న సాధారణ విస్తీర్ణం 35,729 హెక్టార్లకుగాను 38,159 హెక్టార్లలో సాగైంది. అదేవిధంగా పత్తి సాధారణ విస్తీర్ణం 44,084 హెక్టార్లకుగాను 49,335 హెక్టార్లలో సాగైనట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. కానీ గతేడాదితో పోలిస్తే ఈ విస్తీర్ణం తక్కువే. గత ఖరీఫ్ సీజన్లో ఈ రెండు పంటలు సాధారణ విస్తీర్ణాన్ని దాటుకుని అదనంగా 40శాతం విస్తీర్ణం పెరగగా.. ప్రస్తుతం సాధారణ విస్తీర్ణంతోనే సరిపెట్టుకోవల్సి వచ్చింది. అయితే సీజన్ ప్రారంభంలో కొందరు రైతులు ఉత్సాహంగా విత్తనాలు వేసినప్పటికీ.. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో పలు హెక్టార్లలో విత్తనాలు నేలలోనే మురిగిపోయాయి. ఈ నేపథ్యంలో కొంత నష్టం జరిగినట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. నిరాశే మిగిలింది.. పత్తి, మొక్క జొన్న పంటలు మినహాయిస్తే మిగతా పంటల సాగులో రైతులకు నిరాశే మిగిలింది. కీలకమైన కందిపంట విస్తీర్ణం భారీగా తగ్గింది. అదేవిధంగా వరి సాధారణ విస్తీర్ణం 27,199 హెక్టార్లకు గాను కేవలం 16,794 హెక్టార్లు మాత్రమే సాగైంది. వరి విస్తీర్ణం భారీగా తగ్గడం ఈ సారి బియ్యం ధరలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇక జొన్న తదితర పంటలన్నీ తగ్గుముఖం పట్టడంతో రైతులు ఈ సీజన్లో కూడా నష్టాల్నే చవిచూడాల్సి వచ్చింది. అధికారుల గణాంకాల ప్రకారం ఇప్పటివరకు 1,55,370 హెక్టార్లలో పంటలు సాగైనప్పటికీ.. ఇది జిల్లాలోని పరిస్థితులను ఎలా అధిగమిస్తోందో చూడాలి. -
అంబులెన్సులు వద్దట.. ఆటోలే ముద్దట..
ఉట్నూర్ : ఏజెన్సీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు ఐటీడీఏ పీవో ఆదేశాలు బేఖాతరు చేస్తున్నారు. ఏజెన్సీలో వ్యాధుల సీజన్ ప్రారంభం అవ్వడంతో ప్రభుత్వం పీహెచ్‌సీలకు అద్దె ప్రాతిపదికన అంబులెన్సుల ఏర్పాటుకు ఐటీడీఏ ద్వారా చర్యలు చేపట్టింది. దీనిపై ఇన్చార్జి పీవో ప్రశాంత్ పాటిల్ ప్రత్యేక దృష్టి సారించి ఆయా వైద్యాధికారులు పీహెచ్‌సీలకు ట్రాక్స్ లేదా మాక్స్‌లాంటి అంబులెన్సులను అద్దె ప్రాతిపదికన సమకూర్చుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఏజెన్సీలోని 27 పీహెచ్‌సీలకు రూ.5.78 లక్షలు జూలై 26న పీహెచ్‌సీల ఖాతాల్లో జమ చేశారు. అయినా.. సదరు వైద్యాధికారులు మారుమూల ప్రాంతాలకు అంబులెన్సులు వెళ్లలేవు అనే సాకుతో ఆటోలనే అద్దె ప్రాతిపదికన వినియోగిస్తామని మెలిక పెడుతున్నారు. ఫలితంగా గిరిజన గ్రామాల నుంచి వ్యాధిగ్రస్తులను, జ్వరపీడితులను తరలించేందుకు అంబులెన్సులు లేక గిరిజనులకు ఎండ్లబండ్లే దిక్కవుతున్నాయి. అంబులెన్సులు ఎత్తివేసి అద్దె అంబులెన్సులకు నిధులు.. 1999లో ఐటీడీఏ పరిధిలోని పీహెచ్‌సీల్లో గిరిజనులకు అత్యవసర వైద్యం అందించడానికి ఏన్ఎస్ఏఫ్డీసీ (నేషనల్ షెడ్యూల్డ్ ట్రైబల్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్) ద్వారా ఏజెన్సీ పీహెచ్‌సీలకు ఉన్న అంబులెన్సులను ప్రభుత్వం గత అక్టోబర్ నెలలో రద్దు చేసింది. అదే సమయంలో వైద్యశాఖ ప్రత్యామ్నాయంగా ఏజెన్సీలోని 31 పీహెచ్‌సీల పరిధిలో గిరిజన గ్రామాల నుంచి పీహెచ్‌సీలకు గిరిజనులను తరలించడానికి అద్దె ప్రాతిపాదికన అంబులెన్సుల ఏర్పాటుకు రూ.80 లక్షలు విడుదల చేసింది. ఈ ఆగస్టు నెల నుంచి మూడు నెలలపాటు ఏజెన్సీలో వ్యాధుల సీజన్. దీంతో వ్యాధులు, జ్వరాల తీవ్రత అంతగా లేని దండేపల్లి, ఈజ్గాం, తాళ్లపేట, మందమర్రి పీహెచ్‌సీలు మినహా మిగతా వాటికి ఆగస్టు 1 నుంచి అంబులెన్సులు సమకూర్చుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అంకోళి, గిన్నెధరి, సిర్పూర్(యు), జైనూర్, శ్యాంపూర్ పీహెచ్‌సీలకు ప్రభుత్వ అంబులెన్సు ఉండటంతో వీటికి నెలకు పది వేల చొప్పున, అంబులెన్సులు లేని దంతన్‌పల్లి, హస్నాపూర్, ఇంద్రవెల్లి, పిట్టబొంగరం, నార్నూర్, జరి, గాదిగూడ, లింగపూర్, కెరమెరి, అడ, వాంకిడి, నే రడిగొండ, ఇచ్చోడ, బజార్హత్నుర్, నర్సాపూర్(టి), గుడిహత్నూర్, భీంపూర్, సైద్పూర్, కాసిపేట, లోన్వెల్లి, తిర్యాణి, రోంపల్లి పీహెచ్‌సీలకు నెలకు రూ.24 వేల చొప్పున చెల్లించేందుకు సిద్ధమైంది. అయితే.. పీహెచ్‌సీల వైద్యాధికారులే ట్రాక్స్ లేదా మాక్స్ లాంటి వాహనాలు సమకూర్చుకోవాలని ఆదేశాలు జారీ చేసి జూలై 26న ఆగస్టు నెలకు సంబంధించిన అద్దె రూ.5 లక్షల 78 వేలు ఆయా పీహెచ్‌సీల ఖాతాల్లో జమ చేశారు. నిధులు జమ అయి నెల గడుస్తున్నా ఇంతవరకు అద్దె అంబులెన్సులు కానరవడం లేదు. అద్దె కక్కుర్తికేనా..? పిట్టబొంగరం పీహెచ్సీ వైద్యాధికారులు మినహా ఇతర పీహెచ్‌సీల వైద్యాధికారులు అద్దె అంబులెన్సులు ఏర్పాటు చేసుకోలేదు. పైగా మారుమూల గ్రామాలకు అంబులెన్సులు వెళ్లలేవని సమాధానమిస్తున్నారు. అదీకాక రూ.24 వేల అద్దెకు ఎవరూ ముందుకు రావడం లేదని మెలికలు పెడుతున్నారు. దీనికితోడు ఆటోల ద్వారా ఏ ప్రాంతానికైనా వెళ్లొచ్చని ఉచిత సలహాలు సైతం ఇస్తున్నారు. దీనికి పై అధికారులు ససేమిరా అంటున్నారు. 20 రోజులపాటు అంబులెన్సులు గ్రామాల్లో తిప్పి మరో పది రోజులు ఆటోలో వెళ్లాలని సూచిస్తున్నారు. అయినా.. వైద్యాధికారులు పట్టించుకోవడం లేదు. అయితే.. అంబులెన్సులు కాకుండా ఆటోలు అద్దెకు పెట్టుకోవడం ద్వారా గ్రామాల నుంచి రోగులను తరలించడం సాధ్యం కాదు. ఆటోలో ఎలాంటి వైద్య సదుపాయాలు కూడా ఉండవు. దీంతో రోగులకు అత్యవసర వైద్యం అందకుండా పోతుంది. అంబులెన్సులో అయితే.. ఒకేసారి ఇద్దరు లేదా ముగ్గురు రోగులనైనా తరలించొచ్చు. ఇదిలా ఉంటే.. ఆటోలకైతే రూ.24 వేలు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఎంతో కొంత ముట్టజెప్పి మిగతా మొత్తాన్ని జేబులో వేసుకోవచ్చని ఆయా పీహెచ్సీ వైద్యాధికారులు యోచిస్తుండడం గమనార్హం.