సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లా రైతాంగానికి ఖరీఫ్ సీజన్ నిరాశే మిగిల్చింది. సీజన్ ప్రారంభంలో కొత్త ఆశలతో సాగు పనులకు ఉపక్రమించిన శ్రమజీవులకు అంతంతమాత్రమే ఫలితం దక్కింది. సాగు విస్తీర్ణం భారీగా పతనం కాగా.. దిగుబడులపైనా తీవ్ర ప్రభావాన్ని చూపింది. 2014 ఖరీఫ్ సీజన్లో జిల్లాలో 1,84,778 హెక్టార్లలో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ ప్రణాళిక రూపొందించి అమలు చేసింది.
కానీ సీజన్ మొదట్లోనే వర్షాల జాడలేకపోవడంతో సాగు చతికిలపడింది. జూన్ మొదటివారంలోనే సాగు పనులు ఊపందుకోవల్సి ఉండగా.. ఆగస్టు రెండో వారం వరకు కూడా మందకొడిగా సాగాయి. ఆగస్టు చివర్లో కురిసిన వర్షాలు కొంత ఊరటనివ్వడంతో 1,58,811 హెక్టార్లలో పంటలు సాగైనట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. తాజాగా ఖరీఫ్ ముగియగా.. బుధవారం నుంచి రబీ సీజన్ ప్రారంభం కానుంది.
వాణిజ్య పంటల పతనం..
సాగునీటి ప్రాజెక్టులు లేనందున జిల్లా రైతాంగం వర్షాధార పంటలపైనే ఆధారపడింది. ఇందులో భాగంగా అత్యధికంగా కంది, జొన్న, మొక్కజొన్న, పత్తి పంటలు సాగవుతాయి. కానీ ఖరీఫ్‌లో వాతావరణం అనుకూలించకపోవడంతో వాణిజ్యపంటల సాగు భారీగా పతనమైంది. జిల్లాలో జొన్నపంట సాధారణ విస్తీర్ణం 13,456 హెక్టార్లు కాగా.. ఖరీఫ్ సీజన్లో కేవలం 5,866 హెక్టార్లలో మాత్రమే సాగైంది. ప్రధాన పంటైన కంది సైతం భారీగా తగ్గింది.
38,144 హెక్టార్లు సాగు కావాల్సి ఉండగా.. 30వేల హెక్టార్లకు పడిపోయింది. 8,032 హెక్టార్లకు సాగు కావాల్సిన పెసలు కేవలం 4,175 హెక్టార్లకు తగ్గింది. మినుములు 6,726 హెక్టార్లకుగాను 4,170 హెక్టార్లకు పతనమైంది. 3,903 హెక్టార్లలో సాగయ్యే ఆముదం పంట భారీగా తగ్గి.. 726 హెక్టార్లకు పరిమితమైంది. ఇలా దాదాపు వాణిజ్యపంటల సాగు పడిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనలో పడిపోయారు.
ఆగస్టు చివర్లో కురిసిన వర్షాలతో మొక్కజొన్న, పత్తి పంటలు గట్టెక్కాయి. మొక్కజొన్న పంట విస్తీర్ణం సాధారణం కంటే మూడు వేల హెక్టార్లు పెరిగి 38,160 హెక్టార్లకు చేరింది. అదేవిధంగా పత్తి పంట కూడా 5వేల హెక్టార్ల విస్తీర్ణం పెరిగి 49 వేలకు చేరింది. అయితే రెండు పంటలు మొలకెత్తిన తర్వాత వానలు కురవడంలో జాప్యం ఏర్పడటంతో దిగుబడి భారీగా తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
వరి.. ఉక్కిరిబిక్కిరి..
ఖరీఫ్ సీజన్ వరి రైతును ఉక్కిరిబిక్కిరికి గురి చేసింది. జిల్లాలో 27,200 హెక్టార్లలో వరి సాగు కావాల్సి ఉంది. కానీ 20,235 హెక్టార్లతోనే ఆగిపోయింది. బోరుమోటార్లపై ఆధారపడి సాగవుతున్న వరిపంట.. ప్రస్తుతం ఆందోళనకరంగానే ఉంది. ఊహించిన స్థాయిలో వానలు కురవకపోవడంతో భూగర్భజలాల పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది.
ప్రస్తుతం వరికి నీటి సరఫరా కీలకం కాగా.. ఒకవైపు కరెంటు కోతలు.. మరోవైపు భూగర్భ జలాల లభ్యత పడిపోవడంతో వరి పంట చేతికొచ్చేవరకు రైతు బిక్కుబిక్కుమనాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో వరి పంట వరదనీటి పాలైంది. దాదాపు వెయ్యి హెక్టార్లలో వరి దెబ్బతిన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి.
నిరాశే మిగిల్చింది!
Published Wed, Oct 1 2014 12:19 AM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM
Advertisement
Advertisement