సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఖరీఫ్ సీజన్ ముగిసింది. సీజన్ ప్రారంభంలో గంపెడాశలతో సాగు పనులకు ఉపక్రమించిన రైతులకు వాతావరణం అంతంతమాత్రం గానే అనుకూలించింది. జిల్లాలో రెండు లక్షల హెక్టార్లలో పంటలు సాగవుతాయని భావించిన జిల్లా వ్యవసాయశాఖ.. ఆ మేరకు చర్యలు చేపట్టింది. కానీ జూన్, జులై నెలల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా సాగుపనులు మందకొడిగా సాగాయి.
ఆగస్టు తొలివారంలో మాత్రం వర్షాలు కొంత ఊరట ఇచ్చాయి. దీంతో ఖరీఫ్ సీజన్‌లో 1,55,370 హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. జిల్లాలో ఖరీఫ్ సాధార ణ విస్తీర్ణం 1,84,778 హెక్టార్లుకాగా.. సీజన్ చివ రినాటికి 84శాతం విస్తీర్ణంలో వివిధ పంటలు సాగవుతున్నట్లు వ్యవసాయశాఖ గణాంకాలు చెబుతున్నాయి.
ఆశాజనకంగా ఆ రెండు పంటలు
సాగునీటి ప్రాజెక్టులు లేని కారణంగా జిల్లా రైతాంగానికి వర్షాధార పంటలే కీలకం. దీంతో ఖరీఫ్ సీజన్‌లో వాణిజ్యపంటల వైపే రైతులు మొగ్గు చూపుతున్నారు. ఈక్రమంలో మొక్కజొన్న, కంది, పత్తితో పాటు జొన్న పంటలు అధిక విస్తీర్ణంగా సాగవుతాయి. తాజా ఖరీఫ్ సీజన్లో రైతులు భారీ అంచనాలతో సాగుపనులు చేపట్టినప్పటికీ తీవ్ర వర్షాభావం కారణంగా పంటల విస్తీర్ణం భారీగా పడిపోయింది. అయితే జులై చివరివారం, ఆగస్టు తొలివారంలో కురిసిన వర్షాల వల్ల మెట్టపంటల సాగు పుంజుకుంది.
పత్తి, మొక్కజొన్న పంటలు కొంత ఆశాజనకంగా సాగయ్యాయి. సాధారణ విస్తీర్ణాన్ని దాటుకుని కొంత మెరుగుపడ్డాయి. మొక్కజొన్న సాధారణ విస్తీర్ణం 35,729 హెక్టార్లకుగాను 38,159 హెక్టార్లలో సాగైంది. అదేవిధంగా పత్తి సాధారణ విస్తీర్ణం 44,084 హెక్టార్లకుగాను 49,335 హెక్టార్లలో సాగైనట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. కానీ గతేడాదితో పోలిస్తే ఈ విస్తీర్ణం తక్కువే. గత ఖరీఫ్ సీజన్లో ఈ రెండు పంటలు సాధారణ విస్తీర్ణాన్ని దాటుకుని అదనంగా 40శాతం విస్తీర్ణం పెరగగా.. ప్రస్తుతం సాధారణ విస్తీర్ణంతోనే సరిపెట్టుకోవల్సి వచ్చింది. అయితే సీజన్ ప్రారంభంలో కొందరు రైతులు ఉత్సాహంగా విత్తనాలు వేసినప్పటికీ.. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో పలు హెక్టార్లలో విత్తనాలు నేలలోనే మురిగిపోయాయి. ఈ నేపథ్యంలో కొంత నష్టం జరిగినట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.
నిరాశే మిగిలింది..
పత్తి, మొక్క జొన్న పంటలు మినహాయిస్తే మిగతా పంటల సాగులో రైతులకు నిరాశే మిగిలింది. కీలకమైన కందిపంట విస్తీర్ణం భారీగా తగ్గింది. అదేవిధంగా వరి సాధారణ విస్తీర్ణం 27,199 హెక్టార్లకు గాను కేవలం 16,794 హెక్టార్లు మాత్రమే సాగైంది. వరి విస్తీర్ణం భారీగా తగ్గడం ఈ సారి బియ్యం ధరలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇక జొన్న తదితర పంటలన్నీ తగ్గుముఖం పట్టడంతో రైతులు ఈ సీజన్‌లో కూడా నష్టాల్నే చవిచూడాల్సి వచ్చింది. అధికారుల గణాంకాల ప్రకారం ఇప్పటివరకు 1,55,370 హెక్టార్లలో పంటలు సాగైనప్పటికీ.. ఇది జిల్లాలోని పరిస్థితులను ఎలా అధిగమిస్తోందో చూడాలి.
సాగు 84శాతమే!
Published Mon, Sep 8 2014 10:31 PM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM
Advertisement
Advertisement