ఆదివాసీ దినోత్సవంలో విల్లంబులు ఎక్కుపెట్టిన మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాస్, పుష్పశ్రీవాణి
సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గిరిజనుల పక్షపాతి అని, గిరిజనుల అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టారని ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి కొనియాడారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విశాఖ జిల్లా అరకు లోయలో శుక్రవారం రాష్ట్ర స్థాయి ఉత్సవాన్ని ఆమె ప్రారంభించారు. అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పుష్పశ్రీవాణి మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వచ్చాక నాలుగున్నరేళ్ల వరకూ గిరిజనులకు మంత్రి పదవి కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇచ్చిన దుర్మార్గ ప్రభుత్వం కూడా చంద్రబాబుదేనని దుయ్యబట్టారు. తనకు వెన్నుదన్నుగా ఉన్న గిరిజనులకు సీఎం వైఎస్ జగన్ అండగా నిలిచారని తెలిపారు. రూ.66 కోట్లను కేటాయించి పాడేరుకు వైద్య కళాశాలను బహుమతిగా ఇచ్చారన్నారు. 2019–20 బడ్జెట్‌లో రూ.4,988 కోట్లు కేటాయించారని చెప్పారు. ప్రతి గిరిజన పోస్టుమెట్రిక్ విద్యార్థికి భోజనం, వసతి కోసం ఏటా రూ.20 వేల చొప్పున అందించేందుకు రూ.132.11 కోట్లు కేటాయించారన్నారు.
45 ఏళ్ల వయసు దాటిన గిరిజన మహిళలకు నాలుగు దశల్లో రూ.75 వేల మొత్తాన్ని అందించేందుకు రూ.971 కోట్ల నిధులు ఇచ్చారని వెల్లడించారు. షెడ్యూల్డ్ తెగల ప్రాంతాల్లో గిరిజన యువతకు నూరు శాతం రిజర్వేషన్లను వర్తింపజేసి గ్రామ సచివాలయాల్లో దాదాపు 4,706 పోస్టులను వారికే కేటాయించారన్నారు. వివాహం చేసుకునే గిరిజన వధువులకు రూ.లక్ష చొప్పున సహాయం చేస్తామన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజనులకు రూ.100 కోట్ల మేర ఆర్థిక సహాయాన్ని పుష్పశ్రీవాణి అందజేశారు. రూ.43 కోట్ల అంచనా వ్యయంతో తలపెట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆమె ప్రారంభించారు. రాష్ట్ర పర్యాటక, యువజన సరీ్వసుల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ అరకు, పాడేరు ప్రాంతాలను పర్యాటక ప్రదేశాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజన ఆశ్రమ పాఠశాలలు, గురుకుల విద్యాలయాల విద్యార్థినులు ప్రదర్శించిన జానపద, గిరిజన నృత్య రూపకాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, పాడేరు ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ, మాజీ మంత్రి మత్స్యరాస మణికుమారి, మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు, జిల్లా కలెక్టర్ వి.వినయ్‌చంద్, ఐటీడీఏ పీవో డీకే బాలాజీ, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
పాడేరులో గిరిజన వైద్య కళాశాల
ఆదివాసీలకు సీఎం జగన్ శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: ఆదివాసుల కోసం పాడేరులో గిరిజన వైద్య కళాశాల ఏర్పాటు చేస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీ గిరిజనులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ.. ఈ విషయాన్ని వెల్లడించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ట్విట్టర్‌లో పేర్కొంది. ‘ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివాసీ గిరిజనులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఆదివాసుల కోసం పాడేరులో గిరిజన మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నామని, ఎన్నికల ముందు చెప్పిన ప్రతి హామీ అమలు దిశగా అడుగులేస్తున్నామన్నారు’ అని సీఎంవో ట్వీట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment