ఇన్‌చార్జీలు @ ఐటీడీఏ | target of tribal development of district | Sakshi
Sakshi News home page

ఇన్‌చార్జీలు @ ఐటీడీఏ

Published Sun, Jul 20 2014 12:27 AM | Last Updated on Sat, Sep 2 2017 10:33 AM

ఇన్‌చార్జీలు @ ఐటీడీఏ

ఇన్‌చార్జీలు @ ఐటీడీఏ

రెగ్యులర్ అధికారుల్లేక కుంటుపడుతున్న పాలన
* గిరిజనులకు అందని సంక్షేమ ఫలాలు
* దీర్ఘకాలిక సెలవులో పీవో
* ఇన్‌చార్జి పీవో ఆసిఫాబాద్‌కే పరిమితం
* ముందుకు కదలని అభివృద్ధి ఫైళ్లు
* ఆందోళనలో గిరి‘జనం’
ఉట్నూర్ : జిల్లా గిరిజనం అభివృద్ధే లక్ష్యంగా ఐటీడీఏ ఏర్పాటు చేసినా..వారికి సంక్షేమ ఫలాలు అందించాలనే లక్ష్యంగా ప్రత్యేక శాఖ రూపొందించినా.. గిరిజనులకు మాత్రం సంక్షేమ ఫలాలు అందకుండా పోతున్నాయి. నిత్యం అందుబాటులో ఉండి.. గిరిజనుల అభివృద్ధికి తోడ్పడాల్సిన అధికారుల పోస్టులు ఖాళీగా ఉండడంతో పథకాల ఉనికి ప్రశ్నార్థకమైంది. ఐటీడీఏకు పెద్ద సారైన ప్రాజెక్టు అధికారి (పీవో) జనార్దన్ నివాస్ దీర్ఘకాలిక సెలవులపై వెళ్లడంతో పాలనా వ్యవస్థను పర్యవేక్షించే వారు కరువయ్యారు. ముఖ్యమైన శాఖల ఇన్‌చార్జి బాధ్యతలన్నీ ఒకే అధికారికి ఉండడంతో ఆయన ఏ శాఖకూ పూర్తి న్యాయం చేయలేకపోతున్నారు. దీనికితోడు ఐటీడీఏ ఇన్‌చార్జి పీవోగా బాధ్యతలు స్వీకరించిన ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ ఇక్కడి పాలనా వ్యవహారాలపై దృష్టి సారించకపోవడం అభివృద్ధికి అవరోధంగా నిలిచింది.
 
44 మండలాలు.. 4.95 లక్షల జనాభా..
జిల్లావ్యాప్తంగా 44 మండలాల్లో 4,95,794 మంది గిరిజనులు నివసిస్తున్నారు. వీరందరి అభివృద్ధికి బాటలు వేయాల్సిన బాధ్యత ఐటీడీఏపై ఉంది. ఇలాంటి ఉన్నతమైన కార్యాలయం ప్రస్తుతం ఇన్‌చార్జి అధికారులతో కాలం వెళ్లదీస్తుండడం శోచనీయం. పలు విభాగాలకు పూర్తిస్థాయి అధికారులు లేకపోవడం.. ఉన్న ఇన్‌చార్జి అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో గిరిజనాభివృద్ధి కుంటుపడుతోంది. అధికారులు, సిబ్బంది ఇష్టారీతిన వ్యవహరిస్తురనే ఆరోపణలు ఉన్నాయి. గతేడాది జూన్‌లో పీవోగా బాధ్యతలు తీసుకన్న జనార్దన్ నివాస్ విధి నిర్వహణలో కఠినంగా వ్యవహరిస్తారనే పేరు తెచ్చుకున్నారు. అందుకనుగుణంగా ఐటీడీఏ పాలనపైనా పట్టుసాధించి తనదైన రీతిలో దూసుకెళ్తూ పాలనను గాడిలో పెట్టారు. అయితే.. ఆయన గత జూన్ నుంచి రెండు నెలల పాటు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు.
 
ఇన్‌చార్జీలే దిక్కు..
ప్రస్తుతం ఐటీడీఏ ఇన్‌చార్జి అధికారుల పాలనకు కేరాఫ్‌గా మారింది. పీవో మొదలుకొని డీడీటీడబ్ల్యూ, డీఈవో, ఏడీఎమ్‌అండ్‌హెచ్‌వో, ఎస్‌డీసీ, ఏపీవో(జనరల్), ఏఏవో, సీఏఫ్‌సీ ఇలా ముఖ్య విభాగాల్లో ఇన్‌చార్జి అధికారులు విధులు నిర్వహిస్తుండడంతో అభివృద్ధి ఫైళుల ముందుకు కదలడం లేదు. ఐటీడీఏ పరిపాలనాధికారిగా విధులు నిర్వర్తిస్తున్న పెందోర్ భీంకు ఏపీవో(జనరల్)గా, డీడీటీడబ్ల్యూగా, ఏఏవోగా, వాంకిడి సీఎఫ్‌సీగా నాలుగు ముఖ్య విభాగాలకు ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు.

వీటితోపాటు ఐటీడీఏ పరిపాలనాధికారిగా విధులు నిర్వర్తించాల్సి రావడంతో ఆయన ఏ విభాగానికీ పూర్తిస్థాయిలో న్యాయం చేయలేని పరిస్థితి నెలకొంది. అదీగాక కొన్ని రోజుల క్రితం ఆయన అనారోగ్యానికి గురికావడంతో ఐటీడీఏలో పాలన ఎటు పోతోందో తెలియని పరిస్థితి. ఇన్‌చార్జి పీవో ఐటీడీఏకు రాక పలు అభివృద్ధి పనుల ఫైళ్లు ఆసిఫాబాద్ తీసుకెళ్లి తీసుకురావడం ఇబ్బందిగా మారడమే కాకుండా సమయం కూడా వృథా అవుతోందని పలువురు అధికారులు వాపోతున్నారు.

ఆర్థిక ఫలాల జాడే లేదు
2013-14 అర్థిక సంవత్సరం ముగిసి మూడు నెలలు కావస్తోంది. గత అర్థిక సంవత్సరంలో ట్రైకార్ యాక్షన్ ప్రణాళిక ద్వారా గిరిజనుల అభివృద్ధికి 893 రకాల యూనిట్లు మంజూరు చేస్తూ దాదాపు రూ.10.51 కోట్ల ప్రణాళికలు చేసి ఐటీడీఏ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. అయితే.. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ ప్రణాళికల మొత్తం విడుదల నిలిచింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర పాలనలోనైనా నిధులు విడుదల చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement