అభివృద్ధా... అణచివేతా? | Opinion on Tribal Development in india by V.Shanthi Prabodha | Sakshi
Sakshi News home page

అభివృద్ధా... అణచివేతా?

Published Thu, Jan 12 2017 12:31 AM | Last Updated on Tue, Sep 5 2017 1:01 AM

అభివృద్ధా... అణచివేతా?

అభివృద్ధా... అణచివేతా?

విశ్లేషణ

ఆర్థికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా దేశంలో మొదటి వరుసలో నిలబెట్టాలంటే కొందరు త్యాగాలు చేయక తప్పదంటున్నారు పాలకులు. కానీ అభివృద్ధి అంటే కార్పొరేట్‌ సంస్థలకు పట్టంగట్టి ఆదివాసులను తుడిచిపెట్టేయడం కాదుగా...

భూమి గుండ్రంగా ఉందన్నట్లు ప్రపంచంలో ఏమూలకు పోయినా ఇదే పరిస్థితా.. ప్రపంచంలో ఏమూల విలువైన ఖనిజ సంపద, సహజ వనరులు ఉంటే అక్కడ వాలిపోయే కార్పొరేట్‌ గుత్తా్తధిపత్య సంస్థల ఏలు బడిలోని ప్రభుత్వాల చేతిలో అక్కడి ప్రజలు మాడిమసై పోవలసిందేనా.. మరీ ముఖ్యంగా మూలవాసులు..

మూలవాసులు, ఆదివాసులు, గిరిజనులు.. మనం ఎలా పిలుస్తున్నప్పటికీ రానురానూ వారి జీవనం, వారి భూమి ప్రమాదాల్లోకి వెళ్ళిపోతోంది. ఆయా తెగల జీవన శైలులు ప్రమాదపుటంచున కొట్టుమిట్టాడుతున్నాయి. సహజవనరుల వినియోగం కోసం పెట్టుబడి సంస్థలు మూలవాసుల జీవన ప్రదేశాలపై కన్నేశాయి. ప్రభుత్వాలు కార్పొరేట్‌ సంస్థల చేతుల్లో కీలుబొమ్మలుగా మారాయి. మూలవాసుల వైవిధ్య జీవన విధానంలోకి, జీవన ప్రదేశాల్లోకి చొచ్చుకొచ్చే గద్దలు, డేగలు వారిని కబళించేస్తున్నాయి. వారిని అభివృద్ధి పథకాల కోసం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి బలవంతంగా తరలించినప్పుడు సాంస్కృతికంగా, సమాజపరంగా కొత్త చోట ఉన్న సమూహాలతో, సమాజాలతో కలిసిపోవడానికి ఎంత ఒత్తిడి ఎదుర్కోవలసి వస్తోందో వారిమాటల్లోనే చూద్దాం. సెప్టెంబర్‌ 12వ తేదీ ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక తరఫున 45 మంది రచయిత్రుల బృందం పోలవరం ముంపు, పునరావాస గ్రామాలను సందర్శించింది. ఈ సందర్భంగా మేం పర్యటించిన కొత్త దేవరగొండు, కొత్త రామయ్యపేట, తదితర గ్రామాలలో పిన్నలను పెద్దలను పలకరించాము..

‘ఉన్న ఊళ్ళో వ్యవసాయము చేసుకునే వాళ్ళము..  ఆప రాలూ అవీ ఇవీ పండిచ్చుకు తినేవాల్లము సంతకెళ్తే ఉల్లిపా యలూ.. అప్పుడప్పుడూ పచ్చి మిరపకాయలూ కొనుక్కునే వాళ్ళం. ఇప్పుడు అన్నీ కొనుక్కోవటమేగా.. వాళ్ళిచ్చే వెయ్యి రూపాయలు దేనికొత్తయ్యి.. ఉప్పు, పప్పు, కూరగాయలు, పుల్లలు అన్నీ కొనుక్కోవటమేగా.. కొండకెల్లి పండో.. పచ్చ నాకో తెచ్చుకునేవాళ్లం.. ఇప్పుడేదీ.. అన్నిటికీ కరువేగా..’‘ఆ ఎలచ్చన్లప్పుడోత్తారు అదిచ్చేత్తాం పెద్దమ్మా ఇది చేత్తాం పెద్దమ్మా అంటూ.. ఈ తడవ రానీ చెప్తా.. నా అసొంటోళ్లేవయి పొవాల్నో అడ్గుతా.. వాళ్ళిచ్చే వెయ్యిరూపాయిలు నా మందు లకే సాలట్లా.. ఇక్కడ ఓ ఆకా.. పసరా.. అన్నిటికీ దిక్కు మాలిన మందులేగా.. అంది దాదాపు డెబ్బయ్యేళ్లున్న నర్సమ్మ, కొత్త దేవరగొందు ‘దూడలు మేపుకునే వాళ్ళము.. కొండెక్కి అటూ ఇటు తిరిగొచ్చేయి.. కోళ్ళు, మేకలూ అన్నీ అమ్మేసుకుచ్చేసాం. ఏవీ లేకపోతే కొండకొమ్ములు, వెదురు బియ్యం అయినా తెచ్చుకునే వాళ్ళం. ఈడతిని కూకుంటే ఎక్కడనుంచొత్తయి.. వాళ్ళిచ్చిన సొమ్ములు నిండుకున్నాయి. ‘సుబ్బరంగా పడగొట్టేశారు సీతా ఫలం మొక్కలూ, ఇంతింత లావు మామిడి మొక్కలూ.. అన్ని టిమీదా.. ఇళ్లమీదా మట్టోసేసారు.. మట్టి దిబ్బనాగుందిప్పుడు మా ఊరు’–సింగారమ్మ, కొత్తదేవరగొందు.

‘ఏవేవో ఇచ్చేత్తావని నమ్మిచ్చి గొంతుకోశారు. వచ్చాక అడిగితే సమాధానం లేదు.  ఎవడి దగ్గరకెళ్ళినా ఒక రూపాయి పుట్టట్లేదు. ఇల్లు మాత్రం ఇచ్చింది. ఇల్లొకటి ఉంటే సరిపోతదా .. ఎంత బాధ.. ఖర్మ.. ఏమ్చేత్తాం.. కాలం ఎటు తీసుకుపో తుందో..’ – ఓ రైతు, కొత్తరామయ్యపేట. నర్మదానదిపై కట్టిన సర్దార్‌ సరోవర్‌ ప్రాజెక్టు కింద 1000 ఆదివాసీ గూడేలు జల సమాధి అయితే పోలవరం కింద 3 లక్షల మంది ఆదివాసీల జీవనశైలి, సంస్కృతి జలసమాధి అవుతున్నాయి. అదే విధంగా గత జనవరిలో పీఓడబ్ల్యూతో కలసి కొత్తగూడెం సమీపంలోని మొండి చెలక, బంగారు చెలక వంటి గిరిజన గ్రామాలకు వెళ్లాము. విమానాశ్రయం కోసం 2500 ఎకరాలలో సర్వే నిర్వ హిస్తున్న అధికారులు, పోలీసు బృందంతో అక్కడి మహిళలు మాట్లాడిన మాటలు విందాం.

ఇది నా పిల్లలు పుట్టిన గడ్డ, నేను పుట్టిన మట్టి, మేమే కాదు నా తల్లిదండ్రులు, వారి తల్లిదండ్రులు, వాళ్ళ తాత ముత్తాతలు.. ఇంకా ముందటి నుండి మేం బతుకుతున్న నేల, గాలి ఇదే.. ఇది మీది కాదు సర్కారుదే అంటే మేమెట్లా ఒప్పు తం. ఇదే మా గుర్తింపు. మీరిప్పుడొచ్చిన్రు. కానీ మేమట్లా కాదు.. ఆ... ఈ జల్‌  జంగల్, జమీన్‌ మాది అంటూ ఎలాంటి భయం లేకుండా పోలీసు అధికారులను నిలదీసింది ఓ యువతి. రెండేళ్ల క్రితం అరకులోయలో బాక్సైట్‌ నిధుల కొండ గాలికొండకు ప్రరవే తరఫున వెళ్ళాం. అక్కడా అంతే.

1940లో హైమండార్ఫ్‌ అనే యూరోపియన్‌ ఆంథ్రో పోలో జిస్ట్‌ మొదట మనదేశపు కొన్ని మూలవాసుల తెగలపై పరి శోధన చేశారు. ఆ తర్వాత 1970లో కూడా అయన పరిశోధన కొనసాగించారు. స్వాతంత్య్రానికి ముందు స్వాతంత్య్రానం తరం ఆయన చేసిన పరిశోధన తేల్చిందేమంటే వారి జీవన స్థితి గతులు దిగజారిపోయాయని. ఇప్పుడు నూతన ఆర్థిక విధా నాల్లో  అధఃపాతాళంలోకి జారాయని చెప్పొచ్చు.
రాజ్యాంగ స్ఫూర్తికి  విరుద్ధంగా ఆదివాసీలను ప్రాంతాల వారీగా విడగొట్టి వారి హక్కుల్ని కాలరాస్తూ, వారి ఐక్యతను చిన్నాభిన్నం చేస్తూ,  అభివృద్ధిపేరిట ఆదిమ జాతులను అంతం చేస్తూ వారి సమాధులపై నిర్మించే అభివృద్ధిని దేశప్రజలు కోరు కోవడంలేదని సర్కారుకు తెలియనిదా..?

ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి పేరిట జరుగుతున్న మైనింగ్, ప్రాజెక్టులు , పరిశ్రమలకు వ్యతిరేకంగా  విధ్వంసానికి  గురవుతున్న నేటివ్‌ ప్రజలు తమ హక్కులను కాపాడుకోవడం కోసం ఆందోళనలు, పోరాటాలు చేయడం జరుగుతూనే ఉంది. అయితే, జీవన విధ్వంసానికి గురవుతున్న మూలవాసుల పక్షాన అండగా నిలబడిన వారిని దేశద్రోహులుగా పరిగణిం చడం లేదా చట్టవ్యతిరేక కార్యక్రమాలు నెరపుతున్నారన్న నెపం వేసి అరెస్ట్‌ చేసి జైళ్లలో కుక్కడం లేదా నక్సలైట్‌  మావోయిస్టు  ముద్రవేసి ఎన్‌కౌంటర్‌ పేరుతో మట్టుపెట్టడం లేదా మాయం చేయడం  మాత్రం మనదేశంలోనే జరుగుతోంది.

 
(వ్యాసకర్త వి. శాంతిప్రబోధ ప్రరవే జాతీయ సమన్వయకర్త  
ఈమెయిల్‌ : vsprabodha@gmail.com)

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement