ఆదివాసీల అభివృద్ధికి కృషి: స్వామిగౌడ్
సాక్షి, హైదరాబాద్ : టీఆర్‌ఎస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పినట్లుగా ఆదివాసీల అభివృద్ధికి కృషి చేస్తుందని శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ తెలిపారు. శనివారం బంజారా భేరి వ్యవస్థాపక అధ్యక్షులు ఎమ్మెల్సీ ఎస్. రాములు నాయక్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులు, ఆదివాసీలు, లంబాడీలు, చెంచులు.. అంత రించి పోయే దశలో ఉన్న అవూయుక గిరిజన జాతుల అభివృద్ధి కోసం కంకణబద్ధులై పని చేస్తామన్నారు. గిరిజన గ్రామాలను పంచాయతీలను చేసి సీఎం కేసీఆర్ మాట నిలబెట్టుకున్నారని చెప్పారు. ఎంపీ సీతారాం నాయక్ మాట్లాడుతూ గిరిజన, ఆదివాసీ జాతుల్లోని అన్ని తెగలవారం ఒక్కటి కాకపోతే జాతి క్షమించదని, ఏదీ సాధించలేమని అన్నారు.
ప్రపంచంలో పన్నెండున్నర కోట్ల మంది మాట్లాడే భాష ఒక్క బంజారా భాషేనని చెప్పారు. హైదరాబాద్ పాలనాధికారాలు గవర్నర్‌కు కట్టబెట్టే ప్రయత్నాలు తిప్పికొడదామన్నారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ ప్రభుత్వం, పాలకుల కుట్రలో భాగమే పోలవరం అని చెప్పారు. 400 గూడేల జీవనం పోలవరంతో విచ్ఛిన్నం అవుతుందన్నారు. టీఆర్‌ఎస్ నేత నోముల నరసింహయ్య మాట్లాడుతూ మేధోమథనం ద్వారా అణగారిన వర్గాల వారికి సహాయం చేద్దామన్నారు. బంజారా జాతికి చెందిన ఆచార్యులందరికీ సన్మానం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎస్. రాములు నాయక్, ప్రొఫెసర్ సూర్య ధనంజయ్, గిరిజన విద్యార్థి నేతలు కృష్ణా నాయక్ పాల్గొన్నారు.