మూడు గంటల్లో మమ..!
సీతంపేట: ప్రతిసారీ ఉదయం నుంచి సాయంత్రం వరకు సుదీర్ఘంగా జరిగే సీతంపేట ఐటీడీఏ(సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ) పాలకవర్గ సమావేశం ఆదివారం మాత్రం మొక్కుబడిగా జరిగింది. సంస్థ పరిధిలో అమలవుతున్న అన్ని పథకాలు, శాఖల పనితీరుపై సమగ్రంగా చర్చించాల్సిన ఈ సమావేశాన్ని మూడంటే మూడు గంటల్లో ముగించేశారు. ఉదయం 11.30కు మొదలై మధ్యాహ్నం 2.30 గంటలకు ముగిసింది. ఎమ్మెల్యేలతో సమానంగా ప్రశ్నించే హక్కు ఉన్న ఎంపీపీలు, జెడ్‌పీటీసీలకు మాట్లాడే అవకాశమే లేకుండా పోయింది. తాము ఎన్నికైన తర్వాత తొలిసారి జరుగుతున్న ఈ సమావేశంలో తమ పరిధిలోని ప్రజల సమస్యలు ప్రస్తావించాలని ఎంతో ఉత్సాహంతో హాజరైన వీరంతా సమావేశం జరిగిన తీరుతో నిరుత్సాహం చెందారు. తక్కువ వ్యవధిలోనే సమావేశాన్ని ముగించడంపై ఎమ్మెల్యే కలమట వెంకటరమణ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందిస్తూ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వెళ్లాల్సి ఉన్నందున ఒక్కపూటకే పరిమితం చేశామని, ఇక ముందు రెండుపూటలా నిర్వహించడానికి చర్యలు తీసుకుంటామన్నారు.
టీడీపీ ఎమ్మెల్యేల గైర్హాజరు
సమావేశానికి టీడీపీ ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. జిల్లాలో పది నియోజకవర్గాలుండగా రాజాం, శ్రీకాకుళం ఎమ్మెల్యేలు తప్ప మిగతా వారందరూ హాజరు కావాల్సి ఉంది. కానీ టీడీపీకి చెందిన ఇచ్ఛాపురం, ఎచ్చెర్ల, నరసన్నపేట, పలాస ఎమ్మెల్యేలు బి.అశోక్, కళా వెంకట్రావు, బగ్గు రమణమూర్తి, గౌతు శివాజీలు రాలేదు. గిరిజన మంత్రి కిశోర్‌బాబు, కార్మిక మంత్రి కె.అచ్చెన్నాయుడు, విప్ కూన రవికుమార్, అరుకు ఎంపీ కొత్తపల్లి గీతలు మాత్రమే హాజరయ్యారు. ఫలితంగా ఆయా నియోజకవర్గాల సమస్యలు ప్రస్తావనకు నోచుకోలేదు. ఎమ్మెల్సీలు కూడా గైర్హాజరయ్యారు. వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన పాతపట్నం, పాలకొండ ఎమ్మెల్యేలు కలమట వెంకటరమణ, విశ్వాసరాయి కళావతిలు మాత్రమే హాజరై తమ నియోజకవర్గాల పరిధిలోని సమస్యలపై స్పందించారు. అధికారులను ప్రశ్నించారు.
కొన్ని శాఖలపై చర్చే లేదు
సమయాభావం కారణంగా కొన్ని శాఖలపై చర్చే జరగలేదు. కీలకమైన ట్రాన్స్‌కో, చిన్న నీటివనరులు, మలేరియా విభాగం, గిరిజన సహకార సంస్థ, హౌసింగ్ తదితర శాఖలు అసలు ప్రస్తావనకే రాలేదు. వ్యవసాయం, గిరిజన సంక్షేమం, ఇంజనీరింగ్ విభాగం, వైద్యశాఖలపైనే చర్చ సాగింది. అది కూడా నామమాత్రంగానే జరిగింది. కాగా ఇటీవల మంత్రి అచ్చెన్న జరిపిన సమీక్షలో తీసుకున్న నిర్ణయాల అమలుపై కొంత చర్చ జరిగింది. ఆ నిర్ణయాలు పూర్తిస్థాయిలో అమలు కాకపోవడంపై మంత్రులు అసహనం వ్యక్తం చేశారు.