- పాడేరు ఏఎస్పీ బాబూజీ
- గిరిజనుల మేలు కోరితే జనజీవన స్రవంతిలో కలవాలి
- లొంగిపోతే జీవనానికి పోలీసుశాఖ సహాయం
- ఏజెన్సీలో ప్రతి ఫిర్యాదుకూ సకాలంలో న్యాయం
పాడేరు: విశాఖ ఏజెన్సీలో గిరిజనుల అభివృద్ధికి మావోయిస్టులే అడ్డంకిగా మారారని పాడేరు ఏఎస్పీ అట్టాడ బాబూజీ విమర్శించారు. ఆంధ్రా-ఒడిశా రాష్ట్రాల సరిహద్దు సురక్షిత ప్రాంతం కావడంతో అక్కడ నుంచే మావోయిస్టులు కార్యకలాపాలు సాగిస్తున్నారని చెప్పారు. పాడేరు ఏఎస్పీగా గురువారం ఆయన విధుల్లో చేరారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ గిరిజనాభివృద్ధికి పూర్వం నుంచి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నా మావోయిస్టులు అడ్డుకుంటున్నారని చెప్పారు.
ఈ అడ్డంకి లేకపోతే ఈపాటికే ఏజెన్సీ రూపురేఖలన్నీ మారిపోయి గిరిజనులు అభివృద్ధి పథంలో పయనించేవారని అభిప్రాయపడ్డారు. నిజంగా గిరిజనుల సంక్షేమాన్నే మావోయిస్టులు కోరుకుంటే వెంటనే జనజీవన స్రవంతిలో కలవాలని ఆయన సూచించారు. మావోయిస్టులు, మిలీషియా సభ్యులు లొంగిపోతే వారి జీవనానికి పోలీసుశాఖ అన్ని ఏర్పాట్లు చేస్తుందని అభయమిచ్చారు.
మారుమూల ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టే కాంట్రాక్టర్లను, గిరిజనుల నుంచి అటవీ, వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేసే వ్యాపారులను మావోయిస్టులు బెదిరించి ఇబ్బందులకు గురి చేయడం భావ్యం కాదన్నారు. ఏజెన్సీలో మావోయిస్టులతో పాటు అసాంఘిక శక్తుల కార్యకలాపాలను ఉపేక్షించబోమన్నారు. గంజాయి వ్యాపారాన్ని పూర్తిగా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. పోలీసులు స్నేహపూర్వకంగానే వ్యవహరిస్తారని, ఏ కష్టమొచ్చినా గిరిజనులు వారికి చెప్పుకోవాలని సూచించారు. ప్రతి ఫిర్యాదుకూ సకాలంలో న్యాయం జరుగుతుందన్నారు. గిరిజన యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు.
బాలికలు, మహిళల రక్షణకు చర్యలు చేపడతామని ఏఎస్పీ చెప్పారు. పర్యాటకులకు కూడా సౌకర్యాలు మెరుగుపర్చడంతోపాటు భద్రతా చర్యలను చేపడతామని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రైవేటు వాహనాల ఆపరేటర్లు, డ్రైవర్లకు అవగాహన సద స్సులు నిర్వహిస్తామని వివరించారు. పాడేరు పోలీసు సబ్ డివిజన్‌లోని ప్రజలంతా పోలీసుశాఖ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఏఎస్పీ కోరారు.