మన్యంలో యాక్షన్‌ టీం? | Police Getting Doubt On Maoist Action Team In Warangal | Sakshi
Sakshi News home page

మన్యంలో యాక్షన్‌ టీం?

Published Fri, Jun 28 2019 12:35 PM | Last Updated on Fri, Jun 28 2019 12:37 PM

Police Getting Doubt On Maoist Action Team In Warangal - Sakshi

సాక్షి, మహబూబాబాద్‌: కొన్ని నెలలుగా  ప్రశాంతంగా ఉన్న జిల్లాలో చాలా రోజుల తరువాత మావోలు వచ్చారనే చర్చ సాగుతోంది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతం విస్తరించి ఉండటం, చత్తీస్‌ఘడ్‌ అటవీ ప్రాంతం నుంచి నేరుగా జిల్లాలోకి వచ్చే అవకాశాలు ఉండటంతో మావోయిస్టు యాక్షన్‌ టీం వచ్చినట్లు చర్చ సాగుతోంది. ఇదిలా ఉంటే యాక్షన్‌ టీం సభ్యులు మండలాల్లో సంచరిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. మండలంతో సంబంధం లేని వ్యక్తులు వచ్చి ఇక్కడి ఆర్‌ఎంపీ డాక్టర్‌ వద్ద చికిత్స చేయించుకున్నారని సమాచారం. యాక్షన్‌ టీంలు వస్తే ఎందుకు వచ్చారు? ఇన్‌ఫార్మర్‌లుగా పనిచేసే వారిని గాని, అధికార పార్టీ నాయకులను గానీ టార్గెట్‌ చేసేందుకు వచ్చారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది.

టార్గెట్‌గా ఉన్న రాజకీయ నాయకులను, ఇన్‌ఫార్మర్‌లను కొద్ది రోజుల పాటు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని పోలీసులు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఛత్తీస్‌ఘడ్‌ నుంచి మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్, భద్రన్న, ధర్నన్న తదితరులతో కూడిన యాక్షన్‌ టీం కొత్తగూడ, గంగారం మండలాల్లో సంచరిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దశలో రెండు రోజులుగా పోలీసులు మావోయిస్టు సానుభూతి పరులు, మద్దతు దారులను, అనుమానాస్పద వ్యక్తులను పోలీసులు విచారించి, వివరాలు సేకరిస్తున్నారు. ఈనేపథ్యంలో ప్రశాంతంగా ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో మావోల కదలికలతో కలకలం కొనసాగుతోంది.

హరిభూషణ్‌ వచ్చాడా..
గంగారం మండలంలోని మడగూడ గ్రామానికి చెందిన మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి యాప నారాయణ ఆలియాస్‌ హరిభూషణ్, భద్ర న్న, ధర్మన్నలు వారి యాక్షన్‌ టీంతో జిల్లాలోకి వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. గంగారం మండలంలోని మడగూడెం గ్రామానికి చెందిన మావోయిస్ట్‌ అగ్ర నాయకుడు యాప నారాయణ అలియాస్‌ హరిభూషణ్‌ 40మంది మావోలతో కలసి కోమట్లగూడెం, జంగాలపల్లి గ్రామాల మధ్య అటవీ ప్రాంతానికి వచ్చినట్లు చర్చ సాగుతోంది.

ఈ ప్రాంతంలో స్వగ్రామమైన మడగూడెం వస్తున్నాడని, వచ్చి వెళ్లారని రక రకాల వాదనలు వినిపిస్తున్నాయి.10సంవత్సరాల క్రితం గ ట్టి నిర్భందం సమయంలో పెద్దఎల్లాపూర్‌ గ్రామంలో ఒక భూ వివాదాన్ని పరిష్కరించడానికి రాష్ట్ర కార్యదర్శి హోదాలో 200మంది మావోలతో గ్రా మాన్ని చుట్టుముట్టి హరిభూషణ్‌ సమస్యపై ప్రజా దర్భార్‌ నిర్వహించి సంచలనం  సృష్టించారు. కేంద్ర కమిటీ నాయకుడిగా ఎదిగిన హరిభూషణ్‌ కొత్తగూడకు వచ్చే అవకాశాలు తక్కువనే మరో చర్చ కొనసాగుతోంది. ఈ చర్చ ఎంత వరకు వాస్తవం అనేది తేలాల్సి ఉంది. ఒక వేళ హరిభూషణ్‌ వస్తే ఎందుకు, ఏ విషయంపై వచ్చాడని, సాధారణంగా అతడు ఈ ప్రాంతానికి రాడు అని సమాచార సేకరణలో నిమగ్నమయ్యారు.

కొత్త రిక్రూమెంట్‌ కోసమేనా..?
తెలుగు రాష్ట్రాలలో గతంలో జరిగిన వరుస ఎన్‌కౌంటర్‌లు, వరుస లొంగుబాట్లు మావోయిస్టు పార్టీకి నష్టం చేకూర్చాయి. ప్రపంచీకరణంతో పాటు, పోలీసుల నిఘా పెరగటం, తదితర కారణాలతో గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టు రిక్రూమెంట్‌ ఆగిపోయింది. దీంతో పార్టీ బలహీనంగా మారి, మావోయిస్టు ప్రభావం తగ్గిపోయింది. ఈ దశలో తిరిగి నూతన రిక్రూట్‌మెంట్‌ కోసం మావోయిస్టు యాక్షన్‌ టీం తిరిగి జిల్లాలోకి ప్రవేశించిందా..? లేకపోతే గత కొద్ది రోజులుగా ఏజెన్సీ ప్రాంతంలో పోడు సమస్యలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అలాగే ఖరీఫ్‌ సాగు ప్రారంభం కావటం, పోడు సాగు చేయకుండా అధికారులు అడ్డుకుంటున్నా రు. ఈ దశలో ఏజెన్సీ ప్రాంతంలో కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఇదే అదనుగా మావోలు మళ్లీ పూర్వ వైభవాన్ని సాధించుకునేందుకు యత్నిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఫారెస్ట్‌ దాడుల్లో భూములు కోల్పోయిన వారిని దళంలో చేర్చుకుని బలాన్ని పెంచుకునే ప్రయత్నంలో మావోలు ఉన్నట్లు ఇంటిలిజెన్స్‌ వర్గాల సమాచారం.  ఇదే  రిక్రూట్‌మెంట్‌కు మంచి సమయం అని మావోయిస్టు యాక్షన్‌ టీం ఏజెన్సీ గ్రామాల్లోకి ప్రవేశించిందని పోలీసులు భావిస్తున్నారు.

డేగ కన్నులతో.. 
యాక్షన్‌ టీం జిల్లాలో ప్రవేశించిందనే సమాచారంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.  రెండు రోజులుగా ఏజెన్సీ ప్రాంతంలో పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు చేపడుతున్నారు. గతంలో పార్టీలో పనిచేసిన వారు, సానూభూతి పరులను విచారిస్తున్నారు. వారి పై నిఘా పెట్టి ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారు. ఈ దశలో ఏ క్షణంలో ఏమి జరుగునోనని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

సాధారణ తనిఖీలు చేస్తున్నాం
ఏజెన్సీ మండలాల్లో మావోయిస్టు యాక్షన్‌ టీం ప్రవేశించినట్లు ఎటువంటి సమాచారం లేదు. అలాంటివి అన్ని ఊహాగానాలే.  నెల రోజులుగా ఏజెన్సీలో సాధారణ తనిఖీలు చేపడుతున్నాం.  అనుమానాస్పద వ్యక్తుల సంచారం ఉంటే మీ దగ్గరిలోని పోలీసులకు సమాచారం అందించండి.
–నంద్యాల కోటిరెడ్డి, ఎస్పీ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement