సాక్షి, అమరావతి: ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ప్రకృతి వ్యవసాయాన్ని ఏజెన్సీలోని అన్ని గ్రామాలకూ దశలవారీగా విస్తరించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఇందుకోసం మూడేళ్ల పాటు పక్కా ప్రణాళికను అమలు చేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ ప్రోత్సాహంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోని పలు గ్రామాలు సహజసిద్ధమైన సాగు పద్ధతులను అనుసరిస్తున్నాయి.
ఈ ఐదు జిల్లాల్లోని 42 ఏజెన్సీ మండలాల్లో ఉన్న 424 గ్రామాల్లో ఇప్పటికే 1.64 లక్షల ఎకరాల్లో 76,329 మంది గిరిజన రైతులను ప్రభుత్వం ప్రకృతి సేద్యం వైపు ప్రోత్సహించింది. తాజాగా చేపట్టిన మూడేళ్ల ప్రణాళికతో మరో 530 గిరిజన గ్రామాల్లో 1.75 లక్షల మంది రైతులు పూర్తిస్థాయి ప్రకృతి సేద్యం చేయనున్నారు. తద్వారా 4.25 లక్షల ఎకరాల్లో రసాయన ఎరువులు, పురుగుమందుల సాగుకు చెల్లుచీటి పలకనున్నారు. వీరిని ప్రకృతి సేద్యం వైపు ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రూ.187 కోట్లు ఖర్చు చేయనుంది.
ప్రకృతి సేద్యం ఏజెన్సీకి వరం..
విపత్తులు, పర్యావరణ మార్పుల వల్ల సున్నితమైన గిరిజన ప్రాంతాల్లో పంటలు దెబ్బతింటుంటాయి. దీనికితోడు రసాయన ఎరువులు, పురుగు మందులకు అధిక పెట్టుబడులు పెట్టి సాగు చేస్తే.. గిరిజన రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముంది. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడిని తగ్గించే ప్రకృతి సేద్యం వీరికి నిజంగా వరమేనని ప్రకృతి సాగు నిపుణులు చెబుతున్నారు..
సీఎం జగన్ దార్శనికతకు ఇదో నిదర్శనం
ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించి గిరిజన రైతులను పంట నష్టాల నుంచి గట్టెక్కించడమే కాకుండా మేలైన ఉత్పత్తులు సాధించేలా చర్యలు చేపట్టిన సీఎం వైఎస్ జగన్ దార్శనికతకు ఇది మరో నిదర్శనం. ఏజెన్సీలోని వ్యవసాయ, అటవీ ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా డిమాండ్ ఉంది. ఈ ప్రాంతంలో ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో గిరిజన ప్రాంతాల్లోని వ్యవసాయ ఉత్పత్తులకు కూడా మరింత క్రేజ్ ఏర్పడుతుందనడంలో సందేహంలేదు.
– పాముల పుష్ప శ్రీవాణి, ఉప ముఖ్యమంత్రి
ప్రకృతి సేద్యంతో మేలైన ఫలితాలు
రైతులను రసాయన ఆధారిత సాగు నుంచి ప్రకృతి సేద్యం వైపు ప్రోత్సహించడంలో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉంది. రాష్ట్రంలో 7.50 లక్షల ఎకరాలకు సంబంధించి సుమారు 6,50,000 మంది రైతులు ప్రకృతి సేద్యం చేసేందుకు నమోదు చేసుకున్నారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లోనూ ప్రకృతి సేద్యం విస్తరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రైతు సాధికార సంస్థ, ఆర్బీకేలు, స్థానిక సంస్థలను సమన్వయం చేసి ఏజెన్సీ గ్రామం, మండలం, జిల్లా యూనిట్‌లుగా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాం. ప్రకృతి సేద్యానికి గిరిజన రైతులను సన్నద్ధం చేసేలా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ నిధులను ఖర్చు చేయనున్నాం.
– టి.విజయకుమార్, రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment