సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయ భూములకిచ్చే పాస్‌పుస్తకాల ముద్రణ టెండర్లలో గోల్‌మాల్ జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. టెండర్ నిబంధనలకు విరుద్ధంగా కనీసం సాంకేతిక బిడ్‌లో అర్హత కూడా సాధించని ఏజెన్సీలకు, ఏపీ ప్రభుత్వం బ్లాక్‌లిస్టులో పెట్టిన ఏజెన్సీకి ముద్రణ బాధ్యతలివ్వడం విమర్శలకు తావిస్తోంది. అత్యంత పకడ్బందీగా, సెక్యూరిటీ ఫీచర్లతో ఇవ్వాల్సిన పాస్ పుస్తకాల ముద్రణకు టెండర్లను ఇటు అర్హత, అటు అనుభవమూ లేని కంపెనీలకు ఇష్టారాజ్యంగా కట్టబెట్టడం విమర్శలకు తావిస్తోంది.
ఎడాపెడా కట్టబెట్టారు
రాష్ట్రంలో 65 లక్షల కమతాలకు పాస్ పుస్తకాలివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు రెండుసార్లు టెండర్లు పిలిచినా ఏ కంపెనీ ముందుకు రాకపోవడంతో నామినేషన్ విధానంలో కేంద్ర అధీనంలోని సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్‌కు బాధ్యతలిచ్చింది. అయితే అన్ని లక్షల పుస్తకాలను తాము హడావుడిగా ముద్రించలేమని, ఏప్రిల్ నెలాఖరుకల్లా వీలవుతుందని ప్రెస్ అధికారులు చెప్పడంతో ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. మళ్లీ టెండర్లు పిలవగా 9 ఏజెన్సీలు టెండర్లు వేశాయి. వీటి ఖరారులో నిబంధనలను పాటించలేదనే ఆరోపణలొస్తున్నాయి. 9 టెండర్లు వస్తే అందులో 8 ఏజెన్సీలకు ముద్రణ బాధ్యతలివ్వడం గమనార్హం! టెండర్ నిబంధనల ప్రకారం ఎల్1 ఏజెన్సీకి 50 శాతం ముద్రణ బాధ్యతలివ్వాలి.
మిగతా 50 శాతం పుస్తకాలను 20:20:10 నిష్పత్తిలో మరో మూడు ఏజెన్సీలకు ఎల్1 కోట్ చేసిన ధరకే ఇవ్వాలి. కానీ ఎల్1గా వచ్చిన మద్రాస్ సెక్యూరిటీ ప్రింటర్స్‌కు కేవలం 10.70 లక్షల (15 శాతం) పుస్తకాల ముద్రణ అప్పగించారు! పైగా సాంకేతిక బిడ్‌లో అర్హత పొందని వాటికీ టెండర్ ఖరారు చేశారు. అంతేగాక మీసేవల విషయంలో ఏపీ బ్లాక్‌లిస్టులో పెట్టిన మరో ఏజెన్సీని పట్టించుకోకుండా ఎంపిక చేశారు! పైగా దానికి ఎల్1తో సమానంగా పుస్తకాల ముద్రణ బాధ్యతలిచ్చారు! సాంకేతిక బిడ్‌లో బోర్లా పడ్డ మరో ఏజెన్సీకి ఓ మంత్రి, మరో ఎమ్మెల్సీ సిఫార్సుతో ఒక జిల్లాలోని 1.5 లక్షల పుస్తకాల ముద్రణ అప్పగించారు. ఇలా 8 ఏజెన్సీలకు పాస్ పుస్తకాల ముద్రణ అప్పగించి, ఏ జిల్లాలో పుస్తకాలను ఎవరు ముద్రించాలో జాబితా తయారు చేశారు. మంగళవారం నుంచే ముద్రణ మొదలైనట్టు తెలుస్తోంది.
‘సెక్యూరిటీ’ ప్రధానం కాదట!
ఇదిలా ఉంటే, పాస్ పుస్తకాల ముద్రణ బాధ్యతల నుంచి తామెందుకు తప్పుకోవాల్సి వచ్చిందనే దానిపై కేంద్ర అధీనంలోని సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ కొత్త ట్విస్ట్ ఇచ్చింది. ముందుగా అనుకున్న ధరకు కాకుండా ఒక్కో పుస్తకానికి రూ.250 అడిగినందుకు ఒప్పందం రద్దు చేసుకున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం తెలిసిందే. కానీ, సెక్యూరిటీ విషయంలో రాజీ పడకూడదనే ఆలోచనతోనే ముద్రణ బాధ్యతల నుంచి తాము తప్పుకున్నామని ప్రెస్ జనరల్ మేనేజర్ రమాకాంత్ దీక్షిత్ స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి మార్చి 24న ఆయన లేఖ కూడా రాశారు. అంతేకాదు, ‘‘పాస్ పుస్తకాల ముద్రణలో మాకు సెక్యూరిటీ ప్రధానం కాదు. అవసరమైతే కొన్ని సెక్యూరిటీ ఫీచర్లను తగ్గించుకుని వీలైనంత త్వరగా పుస్తకాలను మాకు అందుబాటులోకి తెండి’’ అని ఫిబ్రవరి 22న జరిగిన సమావేశంలో టీఎస్‌టీఎస్ ఎండీ చెప్పారంటూ ఆ లేఖలో ఆయన పేర్కొనడం గమనార్హం!!
Comments
Please login to add a commentAdd a comment