సాక్షి, అమరావతి: ఆర్థిక శాఖ అంటే ప్రభుత్వంలో భాగం కాదా? ఇంధన శాఖ అంటే ప్రభుత్వంలో భాగం కాదా? మరి ప్రభుత్వం కుంభకోణానికి ప్రయత్నిస్తే ఆర్థిక శాఖ, ఇంధన శాఖ ఆపటమేంటి? అసలు ఇలాంటి కథనానికి అర్థమేమైనా ఉందా? ‘స్మార్ట్ మేతకు ఎత్తు’ అంటూ గురువారం ‘ఈనాడు’ ప్రచురించిన వార్త ఇలాంటిదే. ప్రభుత్వం కుంభకోణానికి ప్రయత్నిస్తే, ‘ఇంధన, ఆర్థిక శాఖలు తీవ్ర అభ్యంతరం’ వ్యక్తం చేయడంతో ఆ ప్రయత్నం ఫలించలేదన్నది వార్త సారాంశం.
స్మార్ట్ మీటర్ల విషయంలో ఆర్థిక శాఖ లేవనెత్తిన అంశాలను పరిశీలించి, తగిన వివరణ ఇవ్వాలంటూ డిస్కంలకు ఇంధనశాఖ కార్యదర్శి మూడు నెలల క్రితం రాసిన లేఖల అర్థ్ధాన్నే మార్చేసి... ఇప్పుడేదో జరిగిపోతున్నట్లుగా కథనాన్ని వండేసింది. విచిత్రమేంటంటే టెండర్లను పిలిచింది ప్రభుత్వమే. శ్రీకాకుళంలో స్మార్ట్ మీటర్లను ప్రయోగాత్మకంగా పరిశీలించిన మీదట... అక్కడ దాదాపు 20 శాతం విద్యుత్ వినియోగం తగ్గింది.
పైపెచ్చు విద్యుత్ పంపిణీ సంస్థలను (డిస్కం) చంద్రబాబునాయుడు ఏకంగా రూ.21,000 కోట్ల అప్పుల్లో ముంచి దిగిపోవటంతో వాటి ఆర్థిక పరిస్థితి దారుణంగా దెబ్బతింది. వాటిని గాడిలో పెట్టాలంటే వాటికీ కాస్త జవాబుదారీ తనం పెరగాలి. మరోవంక మీటర్ల వల్ల రైతులు తాము వాడిన విద్యుత్తుకు ప్రభుత్వం నుంచి సబ్సిడీ రూపంలో అందుకున్న సొమ్మును తామే నేరుగా డిస్కమ్‌లకు చెల్లిస్తారు. వారికి నాణ్యమైన విద్యుత్తును అడిగే హక్కుంటుంది.
ఈ కారణాలతో స్మార్ట్ మీటర్లకు ప్రభుత్వం ముందడుగు వేసింది. కాకపోతే కోవిడ్ సమయంలో సరఫరా వ్యవస్థలు దెబ్బతిని... ప్రతి వస్తువు ధరా దారుణంగా పెరిగిన విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అప్పట్లో పిలిచిన టెండర్లు కావటంతో.. ముందుకొచ్చిన కంపెనీలు అప్పటికి తగ్గట్టు రేట్లు కోట్ చేశాయి. రకరకాల కారణాలతో టెండర్లు ఆలస్యం కావా? చివరకు కోవిడ్ తగ్గి పరిస్థితులు మామూలు స్థాయికి రావటంతో పరికరాల ధరలూ తగ్గుముఖం పట్టాయి.
ఇది గమనించబట్టే ప్రభుత్వం టెండర్లను రద్దు చేసి... ప్రస్తుత ధరలతో పిలిస్తే కొంత ఆదా అవుతుందని భావించింది. అందుకే ప్రభుత్వమే టెండర్లను రద్దు చేసింది. మరి దీన్లో కుంభకోణమేంటో.. ప్రభుత్వమే స్కామ్ చెయ్యబోతే దాన్ని ఇంధన శాఖ ఆపేయటమేంటో... రామోజీరావే చెప్పాలి.
ఇప్పుడైనా మీరు టెండర్లు వేయొచ్చు కదా?
ప్రతిసారీ ప్రభుత్వం చెబుదున్నదొకటే. పనికిమాలిన ఆరోపణలు చేసే బదులు... అలాంటి టెండర్లలో మీరూ పాల్గొనవచ్చు కదా... అని!!. ఎందుకంటే అత్యంత పారదర్శకంగా రివర్స్ టెండరింగ్ పద్ధతిలో వీటికి ప్రభుత్వం టెండర్లు పిలవనుంది. దాన్లో ఎవరైనా పాల్గొనవచ్చు.ఎవరు తక్కువకు కోట్‌చేస్తే... వారికే పని దక్కుతుంది.
రకరకాల రాష్ట్రాల పేర్లు చెబుతూ ఎక్కడెక్కడ ఎంత తక్కువో చెబుతున్న రామోజీరావు... వారితో ఒప్పందం చేసుకుని తానే టెండర్లు వేయొచ్చు కదా? లేకపోతే రామోజీకి తందానతాన పలికే చంద్రబాబునాయుడే టెండర్లు వేయొచ్చు కదా? మీరు తక్కువ కోట్ చేస్తే మీకే వస్తుంది కదా? ఎందుకీ పనికిమాలిన ఆరోపణలు?. అయినా కేంద్ర ప్రభుత్వం ఈ మీటర్లకు గ్రాంటు ఇస్తూ... వీటి ఏర్పాటుకు రకరకాల నిబంధనలు పెట్టింది. ఆ మార్గదర్శకాలకు లోబడే ఎవరైనా చెయ్యాలి. అలాంటి వాస్తవాలు రాయనే రాయరు. ఇంకా ‘ఈనాడు’ రాసిన ఈ దిగజారుడు కథనంలో అసలు నిజాలేంటంటే...
ఆరోపణ: ఇతర రాష్ట్రాల్లో వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు అమర్చే ఒక్కో స్మార్ట్ మీటర్ (3 ఫేజ్)కు రూ.3,500 వ్యయం
వాస్తవం: ఇది పచ్చి అబద్ధం. ఇప్పటిదాకా ఏ రాష్ట్రంలోనూ వ్యవసాయ మీటర్లకు టెండర్ల ప్రక్రియ పూర్తికాలేదు. దీనికితోడు కాంట్రాక్టు సంస్థలకు నిర్వహణ వ్యయాన్ని ప్రభుత్వం ముందే చెల్లించేస్తుందంటూ ‘ఈనాడు’ రాయటం కూడా పచ్చి అబద్ధమే. ఎందుకంటే నిర్వహణ వ్యయంలో మాత్రం 40 శాతాన్ని కాంట్రాక్టు సంస్థకు ప్రభుత్వం చెల్లిస్తుంది.
మిగిలిన 60 శాతాన్ని ఏడేళ్ల వ్యవధిలో చెల్లిస్తుంది. కానీ మొత్తం 100 శాతాన్నీ కాంట్రాక్టు సంస్థకు ప్రభుత్వం ముందే చెల్లించేస్తుందంటూ ‘ఈనాడు’ రాయటాన్ని ఏమనుకోవాలి? అయినా టెండర్ల ప్రక్రియే పూర్తికాకుండా... దానికి ఎక్కువ పెట్టేశారని ఒకసారి... ఇంధన శాఖ అడ్డుకోవటంతోనే రద్దు చేశారని మరోసారి... ఇలాంటి రాతలను ఏమనుకోవాలి రామోజీరావు గారూ?
ఈనాడు’ ఆరోపణ: మహారాష్ట్ర కంటే ఆంధ్రప్రదేశ్‌లో మూడు రెట్లు ఎక్కువ
వాస్తవం: రాష్ట్రంలో ఒక్కో స్మార్ట్ మీటర్ ఏర్పాటు, నిర్వహణకు నెలకు రూ.581.16 పైసలు అవుతుందనడం అబద్ధం. అసలు టెండర్లే ఖరారు కానపుడు రేట్లెలా నిర్ధారిస్తారు? ఇంకా విచిత్రమేంటంటే మహారాష్ట్రలోని మీటర్లతో వీటిని పోల్చటం. మహారాష్ట్రలో బెస్ట్ కంపెనీ స్మార్ట్ మీటర్లను అమర్చింది ప్రధానంగా అర్బన్ ప్రాంతంలోని ఇళ్లకు. 80 శాతం సింగిల్ ఫేజ్, 20 శాతం త్రీఫేజ్ మీటర్లు.
నిర్వహణ కాల వ్యవధి ఏడున్నరేళ్లు. ఈ వ్యవధిలో కాంట్రాక్టరుకు చెల్లించాల్సిన మొత్తం మీటరుకు రూ.18,690. కానీ మన రాష్ట్రంలో అమరుస్తున్నది గ్రామాల్లో.. అది కూడా వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు. అన్నీ త్రీఫేజ్ మీటర్లే. మరి వాటికీ వీటికీ పోలిక ఎక్కడ? పైపెచ్చు మన రాష్ట్రంలో టెండర్లు పిలిచే నాటికి ఎక్కడా గ్రామీణ ప్రాంతాల్లో వీటిని అమర్చిన సందర్భాల్లేనందున దీనికి బెంచ్‌మార్క్ ధరంటూ లేదు. అయినా సరే.. కాంట్రాక్టు సంస్థలు కోట్ చేసిన ధర ఎక్కువని ప్రభుత్వమే భావించినందున ప్రభుత్వమే రద్దుచేసి మళ్లీ పిలుస్తోంది. కానీ ‘ఈనాడు’ వంకర రాతలే పనిగా పెట్టుకుంది.
‘ఆరోపణ: స్మార్ట్ మీటర్లలో ఫీచర్లు ఎక్కువ ఉన్నంత మాత్రన అంత ధరలా?
వాస్తవం: ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఐఆర్డీఏ మీటర్లను మీటరు బోర్డుపై అమర్చారు. మీటర్ రీడర్లు ఐఆర్డీఏ పోర్టు ద్వారా రీడింగ్ తీయాలి. వేర్వేరు ప్రాంతాల్లోని ఈ వ్యవసాయ సర్వీసులన్నింటికీ రీడింగ్ తీయడం కష్టమైది. మీటరు బోర్డుకు ఎటువంటి అనుబంధ, భద్రతా పరికరాలను అమర్చలేదు. వ్యవసాయ పంపుసెట్లకు దగ్గరగా బహిరంగ ప్రదేశంలో వీటిని అమర్చడంతో ఎండ, వర్షాలకు పరికరాలు దెబ్బతింటున్నాయి. దీంతో మీటర్లను మార్చాల్సిన పరిస్థితొస్తోది. రీడింగ్ తీయడానికి కూడా ఏజెన్సీలు ముందుకు రావడం లేదు.
విద్యుత్ శాఖ సిబ్బందితోనే ప్రస్తుతం రీడింగ్ తీస్తుండటంతో సాదారణ విధులకు ఆటంకమేర్పడుతోంది. రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్ పంపు సెట్లకు ప్రస్తుతం అనుబంధ, భద్రత పరికరాలు ఏమీ లేవు. దీంతో భద్రతా పరికరాలైన కెపాసిటర్లు (నాణ్యమైన ఓల్టేజ్, పంపిణీ నష్టాలు తగ్గింపునకు), సర్వీసు వైరు, పీవీసీ వైరు, ఎర్తింగ్, ఎంసీబీ(ఓవర్ లోడ్ ప్రొటెక్షన్, విద్యుత్ భద్రతా చర్యల బలోపేతానికి) కూడా చేర్చారు. ఈ ఎస్‌ఎంసీ బాక్స్‌లో మీటర్లను ఏర్పాటు చేస్తారు కనక వివిధ వాతావరణ పరిస్థితుల్లో వాటికి భద్రత ఉంటుంది. రైతులకి విద్యుత్ ప్రమాదాల నుంచి రక్షణా ఉంటుంది.
యంసీబీ ద్వారా ట్రాన్స్ ఫార్మర్ ఫెయిల్యుర్నూ తగ్గించొచ్చు. ప్రస్తుతం ఏటా సగటున 45,098 వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోతున్నాయి. వాటి మరమ్మతు కోసం ఏటా రూ.102 కోట్లు భరించాల్సి వస్తోంది. అందుకే ఈ పరికరాలన్నిటినీ చేరిస్తే... ఇవన్నీ అనవసరమైనవంటూ తేల్చేశారు ఘనత వహించిన రామోజీరావు!!. అదీ ‘ఈనాడు’ పాఠకుల దౌర్భాగ్యం.
Comments
Please login to add a commentAdd a comment