సాక్షి, అమరావతి: అదిగో పులి.. అంటే, ఇదిగో తోక.. అన్నట్లుంది ఈనాడు తీరు. అసలు టెండర్లే ఖరారు కాని స్మార్ట్ మీటర్లపై అప్పుడే ప్రజలపై భారం మోపేసినట్లు ఇష్టారాజ్యంగా కట్టుకథలు అల్లేస్తోంది. నిజానికి.. రాష్ట్రంలో దాదాపు 1.96 కోట్ల మంది విద్యుత్ వినియోగదారులుంటే వాణిజ్య, పరిశ్రమ, ప్రభుత్వ సంస్థలకు, ట్రాన్స్‌ఫార్మర్లకు, 11 కేవీ ఫీడర్లకు కలిపి 42 లక్షల మీటర్లకు మాత్రమే టెండర్లు పిలిచారు.
ఇందులో తొలివిడతలో ఏపీఈపీడీసీఎల్ పరిధిలో 8,04,864 స్మార్ట్ మీటర్లు, ఏపీసీపీడీసీఎల్ పరిధిలో 9,77,288 స్మార్ట్ మీటర్లు, ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో 9,85,894 స్మార్ట్ మీటర్లు ఉన్నాయి. అవికూడా ఇంకా చర్చల దశలోనే ఉన్నాయి. కానీ, ఈనాడు మాత్రం రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారుల సర్వీసులన్నింటికీ స్మార్ట్‌మీటర్లు పెట్టి, ప్రతినెలా గృహ వినియోగదారులపై నెలకు రూ.153.40 భారం మోపనున్నారని అదానీ ‘స్మార్ట్’ షాక్ అంటూ అడ్డగోలు రాతలు అచ్చేసింది. ఈనాడు రాసిన అబద్ధాల వెనుక అసలు నిజాలు ఇవీ..
ఆరోపణ: స్మార్ట్ మీటర్ల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ వినియోగదారులపై రూ.29 వేల కోట్ల భారంవేసి, భారీగా బాదేసేందుకు సిద్ధమైంది.
వాస్తవం: ఇది పూర్తిగా పచ్చి అబద్ధం. పదేళ్ల పాటు స్మార్ట్‌మీటర్ల ఏర్పాటు, నిర్వహణకు రూ.5 వేల కోట్ల వరకు వ్యయం అవుతుందని విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు అంచనా వేశాయి. అది వదిలేసి రూ.29వేల కోట్లని కాకిలెక్కలతో పచ్చపత్రిక పిచ్చిరాతలు రాసింది. విద్యుత్ పంపిణీ నష్టాలను తగ్గించే చర్యలలో భాగంగా డిస్కంల పునర్‌వ్యవస్థీకరణ పథకం (ఆర్‌డీఎస్‌ఎస్) ద్వారా 2025 నాటికి ప్రతి విద్యుత్ సర్వీసు, ట్రాన్స్‌ఫార్మర్లు, ఫీడర్లకు స్మార్ట్‌మీటర్స్ అమర్చాలని కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీలు నిబంధన విధించాయి.
ఈ ఆదేశాలను అనుసరించి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల డిస్కంలు ఈ పనులు చేపట్టాయి. ఏదో ఏపీ మాత్రమే చేస్తున్నట్లు చెప్పడం ప్రజలను ఏమార్చే ప్రయత్నమే ఇది. వినియోగదారులపై ఎటువంటి అదనపు భారంలేకుండా స్మార్ట్‌మీటర్ల ఏర్పాటువలన కలిగే ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించింది. దీని ద్వారా మీటరుకు రూ.1,350 వరకు గ్రాంట్ పొందే వెసులుబాటు కల్పించింది.
దానితోపాటు ఇతర రాష్ట్రాల్లో ఖరారుచేసిన రేట్లను దృష్టిలో పెట్టుకుని, నోడల్ ఏజెన్సీ అయిన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్‌సీ) ఆమోదం, రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం తీసుకున్న తరువాతే టెండర్లు ఖరారుచేస్తారు. ఈ విషయాన్ని దాచి, టెండరు ఖరారు కాకుండానే ప్రతినెలా రూ.153.40 భారం అని ప్రచురించటం పూర్తిగా అవాస్తవం.
ఆరోపణ: టెండర్ల వివరాలను డిస్కంలు అత్యంత రహస్యంగా ఉంచాయి.
వాస్తవం : ప్రస్తుత టెండర్లను 42 లక్షల మీటర్లకు మాత్రమే డిస్కంలు పిలిచాయి. ఇందులో వినియోగదారుల మీటర్లతో పాటు ఫీడర్ మీటర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల (డీటీఆర్) మీటర్లు, ఎల్‌టీ, సీటీ మీటర్లు, సీటీ, పీటీ మీటర్లు ఉన్నాయి. టెండర్ డాక్యుమెంట్లను న్యాయ సమీక్షకు పంపించిన తరువాతే ఏపీ ఈ–ప్రొక్యూర్‌మెంట్ వెబ్‌సైట్ ద్వారా పారదర్శకంగా టెండర్లు పిలిచింది. ఇందులో టెండర్ల వ్యవహారం గుట్టుగా జరిగిందేమీలేదు.
ఆరోపణ : ప్రజలపై పడే భారాన్ని లెక్కచేయకుండా ప్రభుత్వం ముందుకెళ్తోంది.
వాస్తవం : స్మార్ట్‌మీటర్ల ద్వారా విద్యుత్ కనెక్షన్ల వినియోగం, ఇతర సర్వీస్ వినియోగ వివరాలను ఆన్‌లైన్ ద్వారా రియల్ టైం డేటాను పొందే సౌలభ్యం ఉంటుంది. అందువల్ల మీటర్ రీడింగ్ లను మనుషుల అవసరం లేకుండా తీసుకోవచ్చు. ఎనర్జీ ఆడిటింగ్, అకౌంటింగ్ వ్యవస్థను పటిష్టవంతం చేయడం ద్వారా విద్యుత్ నష్టాల తగ్గింపు, బిల్ తీసేందుకు అయ్యే ఖర్చులో మిగులు, ముందుస్తు చెల్లింపు వంటి ప్రయోజనాలు ఉంటాయి.
ఇలా మిగిలిన దాని నుంచే గుత్తేదారు సంస్థకు డిస్కం నేరుగా ఏర్పాటు, నిర్వహణ ఖర్చులు చెల్లిస్తుంది. వినియోగదారులు ఆఫ్ పీక్ సమయాలలో విద్యుత్‌ను ఉపయోగించినప్పుడు అదనపు రాయితీని పొందవచ్చు. మొబైల్ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు విద్యుత్ వినియోగం తెలుసుకుని అవసరమైన మేర రీచార్జ్ చేసుకోవటం ద్వారా పొదుపును పాటించవచ్చు.
కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం ప్రతి వినియోగదారునికీ స్మార్ట్‌మీటర్ అమర్చాలని నిబంధనలున్నా, రాష్ట్రంలో మన డిస్కంలు ప్రస్తుతం వినియోగంలో ఉన్న ఐఆర్‌డీఏ మీటర్ల ద్వారా వినియోగదారులు సకాలంలో బిల్లులు చెల్లించడంలో దేశంలోనే ఉత్తమంగా ఉండడంతో, కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించి వాటిని స్మార్ట్ మీటర్ల ఏర్పాటు నుంచి మినహాయించాయి. ఇవన్నీ వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చేసినవే.
Comments
Please login to add a commentAdd a comment