ఏది నిజం?: కూటమి ‘స్మార్ట్‌’ నాటకం! | Fact Check: Eenadu Fake News On Smart Meter Tenders, Check Out The Details | Sakshi
Sakshi News home page

ఏది నిజం?: కూటమి ‘స్మార్ట్‌’ నాటకం!

Published Wed, Aug 7 2024 7:57 AM | Last Updated on Wed, Aug 7 2024 1:50 PM

Fact Check: Eenadu Fake News On Smart Meter Tenders

రివర్స్‌ టెండరింగ్, న్యాయ సమీక్షతో అత్యంత పారదర్శకంగా స్మార్ట్‌ మీటర్ల టెండర్లు

కేంద్రం మార్గదర్శకాలు..  విద్యుత్‌ నియంత్రణ మండలి అనుమతితోనే మొత్తం ప్రక్రియ 

టెండర్‌ నిబంధనల మేరకే బిల్లులు చెల్లించిన విద్యుత్‌ పంపిణీ సంస్థలు 

ప్రతి పైసా ప్రభుత్వమే భరిస్తుందని జీఓ 22తో స్పష్టం చేసిన గత సర్కార్‌ 

నిర్ణీత  సమయంలో ఎంత  సామగ్రినైనా తనిఖీ చేసే సామర్థ్యం విద్యుత్‌ వ్యవస్థకు ఉంది 

ప్రతి పరికరం నాణ్యత, సంఖ్య లెక్కించాకే బిల్లులు సమర్పించిన కన్‌స్ట్రక్షన్‌ విభాగం అధికారులు 

వాటి ఆధారంగానే అకౌంట్స్‌ విభాగంలో టెండర్‌ నిబంధనల మేరకు బిల్లులు మంజూరు 

వాస్తవాలు ఇంత స్పష్టంగా ఉన్నా గత సర్కారుపై బురద జల్లడమే పనిగా ‘ఈనాడు’ తప్పుడు రాతలు   

‘అలవిగాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ‘సూపర్‌ సిక్స్‌’ పథకాలను అమలు చేయలేక కుప్పిగంతులు వేస్తోంది.  ప్రజలను ఏమార్చేందుకు అబద్ధాలు, మోసాలతో మాయా నాటకాన్ని మొదలుపెట్టింది. అందులో భాగంగా ఏపీలో రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ తమకు గిట్టని అధికారులపై కక్ష సాధిస్తోంది. వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులకు తెగబడుతోంది.

హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తోంది. మరోవైపు తన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వ విభాగాల్లో డబ్బులు లేవంటూ శ్వేతపత్రాల పేరుతో కాలం వెళ్లదీస్తోంది. తప్పుడు లెక్కలు చూపిస్తూ ఖజానా ఖాళీగా ఉందంటూ బేలతనాన్ని ప్రదర్శిస్తోంది. తాను అమలు చేయాల్సిన పథకాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు గత ప్రభుత్వంలో అవినీతి జరిగిందంటూ దుష్ప్రచారం చేస్తోంది.  ఈ క్రమంలోనే స్మార్ట్‌ మీటర్ల టెండర్లపై  ఎల్లో మీడియాతో కలిసి విషం చిమ్ముతోంది’’

సాక్షి, అమరావతి: వ్యవసాయ మోటార్లకు స్మార్ట్‌ మీటర్లు అమర్చే కాంట్రాక్టును దక్కించుకున్న సంస్థకు గత ప్రభుత్వంలో అడ్డగోలుగా చెల్లింపులు జరిగాయంటూ ‘స్మార్ట్‌ దోపిడీపై ఆడిట్‌’ శీర్షికన ఓ అసత్య కథనాన్ని సీఎం చంద్రబాబు డైరెక్షన్‌లో ఈనాడు సోమవారం ప్రచురించింది. రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) మార్గదర్శకాలకు అనుగుణంగా, న్యాయ సమీక్ష ద్వారా అనుమతి పొందిన టెండర్లపై అడ్డగోలుగా అసత్యాలు అచ్చేసింది. జరగని దోపిడీపై ఆడిట్‌కు ఎన్డీయే ప్రభుత్వం సిద్ధమవుతోందంటూ చెప్పుకొచ్చింది.

నిజానికి వ్యవసాయ విద్యుత్‌ మోటార్లకు స్మార్ట్‌ మీటర్లు అమర్చే టెండర్లు, ఆ టెండర్లు దక్కించుకున్న సంస్థకు బిల్లులు చెల్లింపుల్లో గత ప్రభుత్వం, విద్యుత్‌ సంస్థలు అత్యంత పారదర్శకంగా వ్యవహరించాయి. ఇందులో ఎలాంటి దాపరికం, నిబంధనల ఉల్లంఘన జరగలేదు. రైతులకు ఎప్పటికీ పగటి పూటే 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను హక్కుగా ఇచ్చేందుకు జరుగుతున్న యత్నాన్ని టీడీపీ మొదటి నుంచీ వ్యతిరేకించడమే పనిగా పెట్టుకుంది.

స్మార్ట్‌ మీటర్లకు సంబంధించిన లెక్కలన్నీ పక్కాగా ఉన్నాయని, అన్నీ నిబంధన మేరకే జరిగాయని ఇంధన శాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అలాంటప్పుడు గత ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తే తప్పేముంది? అసలు ఈనాడు, చంద్రబాబు బాధేమిటో అర్ధం కాదు. బిల్లులు చెల్లిస్తే చెల్లించేశారంటూ ఏడుపు..! చెల్లించకపోతే ఇంకా చెల్లించలేదంటూ గగ్గోలు పెట్టడం ఎల్లో మీడియా, కూటమి ప్రభుత్వానికి పరిపాటిగా మారింది.

ఇంత పెద్ద వ్యవస్థలో తనిఖీ కష్టమా?
నిర్ణీత సమయంలో ఎంత సామగ్రినైనా తనిఖీ చేసే సామర్ధ్యం రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్‌ వ్యవస్ధకు ఉంది. విద్యుత్‌ సంస్థలకు రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ ఉద్యోగులున్నారు. ఇలాంటి తనిఖీల కోసమే ప్రతి విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లో కన్‌స్ట్రక్షన్‌ విభాగం ఉంటుంది.

అందులోని అధికారులు స్టోర్స్‌కి మెటీరియల్‌ రాగానే స్వయంగా పరిశీలిస్తారు. ప్రతి పరికరం నాణ్యత ప్రకారం ఉందోలేదో తనిఖీ చేస్తారు. పరికరాల సంఖ్య కూడా లెక్కిస్తారు. ఈ వివరాలన్నీ నమోదు చేసుకున్న తరువాత మాత్రమే బిల్లులను అకౌంట్స్‌ విభాగానికి సమర్పిస్తారు. కన్‌స్ట్రక్షన్‌ విభాగం నుంచి వచ్చిన బిల్లుల ఆధారంగా టెండర్‌లో పొందుపరిచిన నిబంధనలకు అనుగుణంగా అకౌంట్స్‌ విభాగం అధికారులు బిల్లులు మంజూరు చేస్తారు. స్మార్ట్‌ మీటర్ల విషయంలో ఈ ప్రక్రియ మొత్తం పూర్తిగా, సక్రమంగా జరిగింది. అందువల్లే  డిస్కంలు బిల్లులు చెల్లించాయి. 

న్యాయ సమీక్షకు టెండర్లు..
ఏ సంస్థ అయినా స్మార్ట్‌ మీటర్ల బిడ్లలో పాల్గొనేలా నిబంధనలున్నాయి. స్మార్ట్‌ మీటర్ల టెండర్లను ఆహ్వానిస్తూ డిస్కంలు తెలుగు, ఇంగ్లీషు దినపత్రికల్లో ప్రకటన కూడా జారీ చేశాయి. ప్రధానంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు టెండర్లలో అక్రమాలను అరికట్టడానికి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. రివర్స్‌ టెండరింగ్, న్యాయ సమీక్ష అనే విధానాలను ప్రవేశపెట్టి పక్కాగా అమలు చేశారు. ఈ వినూత్న నిర్ణయాలతో రూ.100 కోట్లు దాటిన ప్రతి టెండర్‌ న్యాయ సమీక్షకు వెళుతుంది. అక్కడ వెబ్‌సైట్‌లో 14 రోజుల పాటు ప్రజలకు అందుబాటులో టెండర్‌ డాక్యుమెంట్లను ఉంచి ప్రజల నుంచి అభ్యంతరాలను, సలహాలు, సూచనలను తీసుకుంటారు.

అదంతా ముగిసిన తరువాతే అనుమతి లభిస్తుంది. స్మార్ట్‌ మీటర్ల టెండరు ప్రక్రియ ఏపీ–ఈ–ప్రొక్యూర్మెంట్, జెమ్‌ పోర్టల్‌ ద్వారా జరిగింది. ఎంపిక అత్యంత పారదర్శకంగా జరిగింది. అందువల్ల ఏదైనా సంస్థ పూర్తి అర్హతలతో పారదర్శకంగా నిబంధనల ప్రకారం కాంట్రాక్టులు, ప్రాజెక్టులు పొందితే దానికి లబ్ధి చేకూర్చేలా నిబంధనలు మార్చేశారనడంలో అర్ధం లేదు. ఒకసారి టెండర్‌ ఖరారయిన తరువాత అందులోని నిబంధనలు మార్చకూడదు. అలాంటిదేమీ ఇక్కడ జరగలేదు. గతేడాది పిలిచిన టెండర్‌ నిబంధనలే ఈ ఏడాదీఉండాలని, ఒక టెండర్‌లో ఉన్నట్లుగానే మరో టెండర్‌లో నిబంధనలు పెట్టాలని ఏ చట్టం చెబుతుందో ఈనాడుకే తెలియాలి.

రివర్స్‌ టెండరింగ్‌తో 15.75 శాతం తగ్గిన ధర
వ్యవసాయానికి పగటిపూట 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ అందించడం, మీటర్లు కాలిపోకుండా, రైతులు ప్రమాదాల బారిన పడకుండా కాపాడటంతోపాటు మోటార్, డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్ల భద్రతను దృష్టిలో పెట్టుకుని స్మార్ట్‌ మీటర్లను రక్షణ పరికరాలతో ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం ఆదేశించింది. ఈ–ప్రొక్యూర్‌మెంట్‌ ద్వారా డిస్కంలు టెండర్లను పిలిచాయి. ఎల్‌ 1గా నిలిచిన కాంట్రాక్టర్‌కు టెండర్‌ను అప్పగించాయి. అయితే టెండర్‌ ధర  అధికంగా రావటాన్ని గమనించిన గత ప్రభుత్వం టెండర్ల ప్రక్రియను రద్దు చేయాలని ఆదేశించింది. దీంతో తొలి టెండర్‌ రద్దు అయింది. అనంతరం రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా టెండర్ల ధర  మొదటిసారి కంటే 15.75 శాతం తగ్గింది. తద్వారా ప్రజాధనాన్ని ఆదా చేశారు. 

ఇక మీటర్‌ గ్యారంటీ సమయం 10 ఏళ్లకు పెరిగింది. నిర్వహణ సమయం పెంచడం వల్ల డిస్కంలకు వ్యయంలో 2 శాతం ఆదా అవుతుంది. అంటే డిస్కంలకు ఆర్ధికంగా కొన్ని కోట్ల రూపాయలు మిగులుతాయి. అదీగాక ప్రతి టెండర్‌ నిబంధన న్యాయ సమీక్షకు వెళ్లింది. ఆ తరువాతే ఖరారైంది. అంతేకాకుండా ఏపీఈఆర్‌సీ అనుమతి కూడా పొందింది. ఇందులో ఎలాంటి ఉల్లంఘనగానీ, ఒకరికి ఉద్దేశపూర్వకంగా మేలు చేయడంగానీ లేదు.

నిబంధన మేరకే బిల్లులు..
గుత్తేదారు సంస్థ బిల్లులు పంపడమే ఆలస్యం డిస్కంలు చకచకా రూ.1,828 కోట్లు చెల్లించాయని సమాచారమంటూ ఈనాడు చెప్పుకొచ్చింది. వ్యవసాయ స్మార్ట్‌ మీటర్లకు అయ్యే ఖర్చులో ప్రతి పైసాను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని నాడు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ‘జి.ఓ.ఎం.ఎస్‌. 22, తేదీ:01.09.2020’ ద్వారా స్పష్టం చేసింది. అందుకు  అనుగుణంగానే డిస్కంలు టెండర్లు పిలిచాయి. తాము కాంట్రాక్టు సంస్థకు చెల్లించిన డబ్బును తిరిగి తమకు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరాయి. అందుకు గత ప్రభుత్వం అంగీకరించింది.

ఈలోగా ఎన్నికల కోడ్‌ రావడంతో ఆ ప్రక్రియ ఆగింది. కూటమి ప్రభుత్వంగానీ ఈనాడుగానీ గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే.. కాంట్రాక్టర్‌తో పని చేయించుకుని బిల్లులు చెల్లించాల్సిన బాధ్యత ప్రాథమికంగా డిస్కంలదే. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయి. ఇందులో ఏ తప్పూ లేదు. ఇదేమీ కొత్తగా జరిగిందీ కాదు. సంక్షేమ పథకాల ద్వారా వివిధ వర్గాలకు విద్యుత్‌ రాయితీలు అందించే ప్రభుత్వం ఆ మొత్తాన్నీ ముందుగా డిస్కంలు భరిస్తే, ఆ తర్వాత రీయింబర్స్‌మెంట్‌ చేస్తుంటుంది. 2014–19 మధ్య టీడీపీ హయాంలో రైతులకు ఉచిత విద్యుత్‌కు సంబంధించిన ఖర్చును డిస్కంలు ముందుగా భరించాయి. ఆ బకాయిలు రూ.8,845 కోట్లు కాగా వాటిని ఇవ్వకుండా నాడు చంద్రబాబు ఎగవేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఆ మొత్తం బకాయిలను చెల్లించింది.

రాష్ట్రపతి అవార్డు అందుకున్న సంస్థపై ఎందుకీ కక్ష?
మూడు డిస్కమ్‌ల పరిధిలో వ్యవసాయ మోటార్లకు స్మార్ట్‌ మీటర్ల కాంట్రాక్టు పొందిన షిర్డీ సాయి సంస్థ చిన్న సంస్థ ఏమీ కాదు. 25 ఏళ్లుగా విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లను తయారు చేస్తూ సుదీర్ఘ అనుభవం, సామర్థ్యం ఉన్న కంపెనీగా పేరు పొందింది. ట్రాన్స్‌ఫార్మర్ల తయారీలో 2022కిగానూ ప్రతిష్టాత్మక రాష్ట్రపతి అవార్డు కూడా దక్కించుకుంది. ఎనర్జీ కన్జర్వేషన్‌ (ఇంధన పొదుపు) అవార్డును కేంద్రం నుంచి రెండు సార్లు అందుకుంది. అండర్‌ స్టాండింగ్‌ ప్రొడక్షన్‌ లింక్డ్‌ ఇన్సెంటివ్‌ (పీఎల్‌ఐ) స్కీమ్‌కు కూడా ఈ సంస్థ అర్హత సాధించింది.

స్మార్ట్‌ మీటర్లతో జవాబుదారీతనం
ఒకప్పుడు వ్యవసాయ విద్యుత్తు సర్వీసులకు మీటర్ల ద్వారా వినియోగం జరిగేది. ఆ తర్వాత మోటార్‌ హార్స్‌ పవర్‌ ప్రాతిపదికన వినియోగాన్ని లెక్కించడంతో మీటర్ల వాడకం తగ్గింది. విద్యుత్‌ సంస్థలు కెపాసిటర్లను విడతలవారీగా వినియోగదారులకు అందించినప్పటికీ కాలక్రమేణా వాటిని రైతులే తీసేశారు. దీంతో సరఫరాలో హెచ్చుతగ్గులు వచ్చి ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌ మోటార్లు కాలిపోతున్నాయి. ఇలాంటి సమస్యలను తీర్చడంతో పాటు విద్యుత్‌ పంపిణీ నష్టాల తగ్గింపు, పారదర్శకత కోసం స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. రైతు ఖాతాలో నెలవారీ వినియోగ చార్జీలను డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌(డీబీటీ) ద్వారా ప్రభుత్వం జమ చేసేలా రైతుల బ్యాంకు ఖాతాలను కూడా సేకరించింది. రైతులే ఆ మొత్తాన్ని డిస్కంలకు చెల్లించడం ద్వారా జవాబుదారీతనం పెరుగుతుందని భావించింది.

నాణ్యమైన విద్యుత్‌
స్మార్ట్‌ మీటర్లతో పాటు అనుబంధ పరికరాలైన పీవీసీ వైరు, ఎంసీబీ, కెపాసిటర్, మీటరు బాక్సులను ఏర్పాటు చేస్తున్నారు.  ఏటా సగటున 45,098 వ్యవసాయ విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయి. వాటి మరమ్మతుల కోసం ఏటా రూ.102 కోట్ల వ్యయాన్ని డిస్కంలు భరించాల్సి వస్తోంది. వీటివల్ల ఆ ఖర్చు తప్పుతుంది. కెపాసిటర్లను అమర్చడం ద్వారా నాణ్యమైన ఓల్టేజ్‌తో రైతులకు విద్యుత్‌ సరఫరా చేయవచ్చు.

కేంద్రమే చెప్పింది
కేంద్ర ప్రభుత్వ విద్యుత్‌ మంత్రిత్వ శాఖ ప్రతిపాదిత రీ వ్యాంప్డ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సెక్టార్‌ స్కీమ్‌ (ఆర్‌డిఎస్‌ఎస్‌)లో భాగంగా  స్మార్ట్‌మీటర్ల ఏర్పాటు దేశంలోని అనేక రాష్ట్రాలతో జరుగుతోంది. ‘ఆర్డీఎస్‌ఎస్‌’లో భాగంగా 2025 మార్చి నాటికి దేశం 
అంతటా అన్ని రాష్ట్రాలూ స్మార్ట్‌ విద్యుత్‌ మీటర్లు పెట్టాలని కేంద్రం ఇచ్చిన ఆదేశాల మేరకు 2019లోనే సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఒక రెగ్యులేషన్‌ ఇచ్చింది. దాని ప్రకారం రాష్ట్రంలో 18.58 లక్షల వ్యవసాయ సర్వీసులకు స్మార్ట్‌ మీటర్లు అమర్చాలని 2020లో విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లకు గత ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.

దేశ వ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో స్మార్ట్‌ మీటర్ల ప్రక్రియ 50 శాతం నుంచి 100 శాతం వరకూ పూర్తవుతోంది. స్మార్ట్‌ మీటర్ల వల్ల విద్యుత్‌ నష్టాలను అరికట్టవచ్చని, సరఫరా వ్యయాన్ని తగ్గించవచ్చని కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ కూడా వెల్లడించింది. ఈ మీటర్లను పెట్టడం వల్ల ఎనర్జీ ఆడిటింగ్, అకౌంటింగ్‌కు అవకాశం ఉంటుందని తెలిపింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement