fact check: అయినవారికి కాదు రామోజీ.. అర్హతలున్నవారికే టెండర్లు  | Sakshi
Sakshi News home page

fact check: అయినవారికి కాదు రామోజీ.. అర్హతలున్నవారికే టెండర్లు 

Published Sun, Feb 4 2024 4:50 AM

Ramoji Rao Eenadu Fake News on Smart Meters - Sakshi

సాక్షి, అమరావతి: పాడిందే పాడరా పాచిపళ్ల దాసుడా అన్నట్టు పదే పదే ఒక అబద్ధాన్ని తన విషపుత్రిక ఈనాడులో అచ్చేయడం, ప్రభుత్వంపై యధారీతిన దు్రష్పచారం చేయడం లక్ష్యంగా మరోసారి రామోజీరావు చెలరేగిపోయారు. ఇందులో భాగంగానే శనివారం ఈనాడులో ‘అయినవారి కోసం.. ‘అన్న’ స్మార్ట్‌ టెండర్‌’ అంటూ ఒక విష కథనాన్ని అచ్చే­శారు. ఇందులో ఒక్క అక్షరమైనా నిజం లేకుండా.. ప్రభుత్వంపైన ఇష్టారీతిన బురదజిమ్మారు.

అన్ని అర్హతలున్నవారికే పారదర్శకంగా టెండర్లు అప్పగిస్తున్నా.. టెండరుదారులు ఎక్కువ మొత్తం కోట్‌ చేస్తే మళ్లీ రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లినా రామోజీకి మాత్రం ఇదంతా బూటకంలా కనిపిస్తోంది. అందుకే తనకు కావాల్సినవారికే ప్రభుత్వం స్మార్ట్‌ మీటర్ల టెండర్లను కట్టబెట్టిందంటూ పచ్చి అబద్ధాలను వల్లె వేశారు. ఈ నేపథ్యంలో ఈనాడు విషకథనంపై ఆంధ్రప్రదేశ్‌ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థల సీఎండీలు పృధ్వీతేజ్, సంతోషరావు వివరణ ఇచ్చారు.

ఈనాడు కథనంలో అణువంతైనా నిజం లేదని.. ఏకపక్షంగా టెండర్లు కట్టబెట్టడం లేదని అర్హతలు ఉన్నవారికే పారదర్శకంగా టెండర్లు దక్కుతున్నాయని తేల్చిచెప్పారు. రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) మార్గదర్శకాలకు అనుగుణంగానే స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. స్మార్ట్‌ మీటర్లతో విద్యుత్‌ వినియోగదారులపై ఎలాంటి భారం పడదని కుండబద్దలు కొట్టారు. పైగా నాణ్యమైన విద్యుత్‌ను అందించడం వల్ల విద్యుత్‌ బిల్లు తగ్గే అవకాశం ఉందన్నారు. పృధ్వితేజ్, సంతోషరావు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి..   

ఈ–పోర్టల్‌ ద్వారా అత్యంత పారదర్శకంగా టెండర్లు 
విద్యుత్‌ పంపిణీ పునర్వ్యవస్థీకరణ పథకం (ఆర్డీఎస్‌ఎస్‌)లో భాగంగా స్మార్ట్‌ మీటర్లను 2025 మార్చిలోపు ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ సూచనలకు అనుగుణంగానే డిస్కంలు స్మార్ట్‌ మీటర్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్‌) పరిధిలో 12.08 లక్షల ప్రీ–పెయిడ్‌ మీటర్లను అమరుస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌ మధ్యప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్‌) పరిధిలో 15.78 లక్షల ప్రీపెయిడ్‌ మీటర్లు పెడుతున్నారు.

అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్‌) పరిధిలో 9.97 లక్షల ప్రీపెయిడ్‌ మీటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం డిస్కంలు టెండర్లను ఆహా్వనిస్తూ తెలుగు, ఇంగ్లిష్‌ దినపత్రికల్లో ప్రకటన జారీ చేశాయి. టెండరు ప్రక్రియను ఏపీ–ఈ ప్రొక్యూర్మెంట్, జెమ్‌ పోర్టల్‌ ద్వారా చేపట్టారు. ఈ ప్రక్రియలో దేశవ్యాప్తంగా గుత్తేదారులు ఎవరైనా ఐచ్చికంగా పాల్గొనవచ్చు. టెండర్ల ఎంపిక అత్యంత పారదర్శకంగా ఉంటుంది. ఈ టెండర్ల ఎంపిక ప్రక్రియలో గుత్తేదారులను తొలగించడానికి విద్యుత్‌ సంస్థలకు ఎటువంటి అధికారాలు కూడా ఉండవు.   

మొదటి దశలో ఇలా
దక్షిణ ప్రాంతం డిస్కం పరిధిలో మొదటి విడతలో 8.75 లక్షల సింగిల్‌ ఫేజ్‌ మీటర్లు, త్రీ–ఫేజ్‌ మీటర్లను ఏర్పాటు చేస్తున్నారు. మధ్య ప్రాంత డిస్కం పరిధిలో 8.32 లక్షల మీటర్లను, తూర్పు ప్రాంత డిస్కంలో 7.24 లక్షల మీటర్లను అమర్చుతున్నారు. అయితే ఒక్కో స్మార్ట్‌ మీటర్‌కు రూ.17.41 అధికంగా మొత్తం కలిపి రూ.95.99 అదాని సంస్థకు చెల్లిస్తున్నట్లు ఈనాడు తన కథనంలో అబద్ధాలను అచ్చేసింది. నిజానికి.. ఒక్కో సింగిల్‌ ఫేజ్‌ మీటర్‌కు నెలకు రూ.86.32 చొప్పున, త్రీ–ఫేజ్‌ మీటర్‌కు రూ.176.02 చెల్లించాల్సి ఉంటుంది. ఆ మేరకు దక్షిణ ప్రాంత డిస్కంలో సింగిల్‌ ఫేజ్‌ మీటర్లకు రూ.496.91 కోట్లు, త్రీ–ఫేజ్‌ మీటర్లకు రూ.419.50 కోట్లను చెల్లించాలి.

ఇందులో రూ.118.12 కోట్లను కేంద్ర ప్రభుత్వం గ్రాంటు రూపంలో సంస్థకు అందిస్తుంది. అలాగే మధ్య ప్రాంత డిస్కంలో సింగిల్‌ ఫేజ్‌ మీటర్లకు రూ.496.91 కోట్లు, త్రీ–ఫేజ్‌ మీటర్లకు రూ.178.96 కోట్లను చెల్లించాలి. ఇందులో రూ.74.91 కోట్లను కేంద్రం ఇస్తుంది. ఇక తూర్పు ప్రాంత డిస్కంలో సింగిల్‌ ఫేజ్‌ మీటర్లకు రూ.543.85 కోట్లు, త్రీ–ఫేజ్‌ మీటర్లకు రూ.250.27 కోట్లను చెల్లించాలి. ఇందులో కేంద్రం గ్రాంటుగా రూ.82 కోట్లు వస్తుంది.

ఈ చెల్లింపులన్నింటికీ 93 నెలల కాల వ్యవధి ఉంటుంది. ఇలాగే రెండో దశలోనూ ఆయా డిస్కంల పరిధిలో మీటర్లను అమరుస్తారు. వీటికి సైతం కేంద్రం గ్రాంటును అందిస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా టెండర్ల ప్రక్రియలో అర్హత సాధించిన సంస్థలకు పనులను అప్పగించామని సీఎండీలు స్పష్టం చేశారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement