సాక్షి, అమరావతి: సంప్రదాయేతర ఇంధన ప్రాజెక్టుల కేటాయింపు మొదలుకుని వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు, డిస్కంలకు ట్రాన్స్‌ఫార్మర్ల సరఫరా కాంట్రాక్టు ఖరారుతో సహా అన్ని అంశాల్లో పూర్తి పారదర్శకతతో వ్యవహరిస్తున్నాయి రాష్ట్ర విద్యుత్ సంస్థలు. కానీ, వైఎస్సార్ జిల్లా సంస్థలుగానీ, ఆ జిల్లా వ్యక్తులుగానీ కాంట్రాక్టులు పొందడం, వ్యాపారం చేయడం తప్పనే విధంగా విషపత్రిక ఈనాడు పిచ్చి రాతలు రాస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వంపై ఏదో విధంగా బురద జల్లాలనే ఏకైక లక్ష్యంతో అడ్డగోలు కథనాలను అచ్చేస్తోంది. తాజాగా.. ‘జగన్ + విశ్వేశ్వరరెడ్డి = 92 వేల కోట్లు’ శీర్షికతో కుట్రపూరిత కథనాన్ని శనివారం ప్రచురించింది. ఇలాగైతే.. రామోజీ + చంద్రబాబు = 6లక్షల కోట్లు అనొచ్చు కదా? అలాగే, రామోజీ ఆస్తులు చంద్రబాబువి.. చంద్రబాబు ఆస్తులు రామోజీవి అయిపోతాయా? అసలు ఈనాడు కథనంలో పేర్కొన్నట్లు ఎక్కడా ఆశ్రిత పక్షపాతానికి చోటివ్వలేదని, అన్ని ప్రక్రియల్లో పకడ్బందీగా నిబంధలను పాటించామని ఇంధన శాఖ, డిస్కంల తరఫున ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్) సీఎండీ జె. పద్మాజనార్ధనరెడ్డి స్పష్టంచేశారు.
ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయాలనే ఉద్దేశంతో పదే పదే ఈనాడు ఇలాంటి అసత్య కథనాలు రాస్తోందని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం, నెడ్‌క్యాప్, ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల ద్వారా ఆయన వెల్లడించిన వాస్తవాలిలా ఉన్నాయి..
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో వివిధ సంస్థలు దక్కించుకున్న సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు
ఆరోపణ : ‘షిర్డీ సాయి’ చెప్పిందే వేదం. ఏం కావాలన్నా ఆ సంస్థ తెచ్చుకుంటోంది.
వాస్తవం : ఏదైనా సంస్థ పూర్తి అర్హతలతో పారదర్శకంగా నిబంధనల ప్రకారం కాంట్రాక్టులు, ప్రాజెక్టులు పొందితే అది చెప్పిందే వేదంగా నడుస్తోందనడం ఏ విధంగా సబబు? వ్యవసాయ మీటర్లకు స్మార్ట్ మీటర్లు, విడిభాగాల అమరిక, తొమ్మిదేళ్ల నిర్వహణ కాంట్రాక్టును నిబంధనల ప్రకారమే షిర్డీసాయి ఎలక్ట్రికల్స్, దాని అనుబంధ సంస్థ (విక్రాన్ మహారాష్ట్ర) కైవసం చేసుకున్నాయి.
ఆరోపణ : షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ చిన్న సంస్థ. అయినా దానికే అన్ని పనులు..
వాస్తవం : స్థానికంగా ఉన్న షిర్డీసాయి ఎలక్ట్రికల్స్, వెంకటేశ్వర ఎలక్ట్రికల్స్, బీఎస్‌ఆర్ ట్రాన్స్‌ఫార్మర్స్ అనే మూడు సంస్థలే కాకుండా హైదరాబాద్‌కు చెందిన తొషిబా ఎలక్ట్రికల్స్, ట్రాన్స్‌కామ్, కన్యకాపరమేశ్వరీ, హైపవర్ అని మొత్తం రెండు రాష్ట్రాల్లో ఏడు కంపెనీలు డిస్కంలకు ట్రాన్స్‌ఫార్మర్లు సరఫరా చేస్తున్నాయి. వీటిలో షిర్డీసాయి ట్రాన్స్‌ఫార్మర్ల రంగంలో ప్రముఖ సంస్థ అనే విషయం కాదనలేని సత్యం.
ఆరోపణ : చిన్న కంపెనీల వైండింగ్ వైరు యజమానులకు పనిలేక హైదరాబాద్‌కు తరలిపోతున్నారు..
వాస్తవం : డిస్కంల సామర్థ్యం పెరగడంతో దొంగతనాలవల్ల కాపర్ ట్రాన్స్‌ఫార్మర్లకు ప్రాధాన్యం పూర్తిగా తగ్గింది. దీంతో కాపర్ వైండింగ్‌తో పనిలేదు. దీనికి షిర్డీసాయికి, డిస్కంలకు లింకేంటి?
ఆరోపణ : ట్రాన్స్‌ఫార్మర్‌పై రూ.69 వేల నుంచి రూ.75 వేల అదనపు బాదుడు..
వాస్తవం : ఒక్కో ట్రాన్స్‌ఫార్మర్‌పై రూ.69 వేల నుంచి రూ.75 వేలు అదనపుభారం అనేది పూర్తిగా అసత్యం. క్షేత్రస్థాయి అవసరాలను బట్టి డిస్కంలు టెండర్ల ద్వారా పారదర్శకంగా ట్రాన్స్‌ఫార్మర్లను కొంటున్నాయి. ఐదేళ్ల నిర్వహణ బాధ్యతలను కూడా సరఫరా సంస్థకే అప్పగిస్తున్నాయి. దక్షిణ హరియాణ బిజిలీ వితరణ్ నిగమ్ లిమిటెడ్ రూ.70,967లు, ఉత్తర హరియాణా బిజిలీ వితరణ్ నిగమ్ లిమిటెడ్ రూ.65,010 ధరతో ట్రాన్స్‌ఫార్మర్లను కొనుగోలు చేస్తున్నాయి. ఇదే రకమైన ట్రాన్స్‌ఫార్మర్లను ఏపీసీపీడీసీఎల్ అన్ని ఖర్చులతో కలిపి రూ.64,300 ధరతో కొనుగోలు చేస్తోంది. అంటే భారం తగ్గినట్లేగానీ పెరిగినట్లు కాదు కదా.
ఆరోపణ : రాష్ట్రంలో 18.58 లక్షల వ్యవసాయ మోటర్లకు స్మార్ట్ మీటర్లు అమర్చే కాంట్రాక్టును కనీవినీ ఎరుగని ధరకు షిర్డీసాయికి కట్టబెట్టేందుకు ప్రభుత్వం పెద్ద కథే నడిపినట్లు తెలిసింది..
వాస్తవం : దేశంలో వ్యవసాయ మీటర్లకు స్మార్ట్ మీటర్లు అమర్చే తొలి ప్రాజెక్టు మనదే. అందువల్ల ఎక్కువ ధరలు అనడానికి వీల్లేదు. ఈ టెండర్ల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా సాగింది. ఏ సంస్థ అయినా బిడ్లలో పాల్గొనేలానే నిబంధనలున్నాయి. షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ సంస్థ ఎల్–1గా నిలిచి టెండరు దక్కించుకుంది. అనుబంధ పరికరాల అమరిక కాంట్రాక్టును టెండరు, రివర్స్ టెండర్ ద్వారానే ‘విక్రాన్’ కంపెనీ దక్కించుకుంది. దీనిలో ఎక్కడా దాపరికంలేదు.
ఆరోపణ : ముఖ్యమంత్రి దగ్గరవారికి చెందిన సంస్థ అయినందున షిర్డీసాయి, అనుబంధ సంస్థలకు ఆశ్రిత పక్షపాతంతో కీలక ప్రాజెక్టులు ఇచ్చారు.
వాస్తవం : సంప్రదాయేతర విద్యుత్ ప్రాజెక్టుల కేటాయింపులన్నీ పూర్తి చట్టబద్ధంగా, విధివిధానాల ప్రకారమే జరిగాయి. ప్రభుత్వం రూపొందించిన పాలసీ ప్రకారం ప్రైవేటు సంస్థలతో పాటు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు కూడా సర్కారు పలు ప్రాజెక్టులను మంజూరు రేసింది. ఎన్‌హెచ్‌పీసీ, ఎన్‌టీపీసీలు కూడా రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్న విషయం మర్చిపోయారా?
ఆరోపణ : నెల్లూరు జిల్లా రామాయపట్నం దగ్గర ఇండోసోల్ సంస్థ సౌర విద్యుత్ ప్యానళ్ల తయారీ ప్లాంటు ఏర్పాటుకు 5,147 ఎకరాలను సేకరించేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఇది కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ప్రాజెక్టే అయినా భూమి సమకూర్చడం, రాష్ట్ర పారిశ్రామిక విధానం ప్రకారం ప్రోత్సాహకాలు ఇవ్వడం లాంటివి రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది.
వాస్తవం : షిర్డీసాయి చిన్నసంస్థ కాదని, కేంద్ర ప్రభుత్వమే గుర్తించిన పెద్ద సంస్థ అనడానికి ఇది నిదర్శనం. రాష్ట్ర పారిశ్రామిక విధానం ప్రకారమే ప్రభుత్వం భూమి సమకూర్చనుంది. ఇందులో తప్పేంటి?
ఆరోపణ : ఏడాది కాలంలో షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌కు జగన్ సర్కారు కట్టబెట్టిన కాంట్రాక్టులు, ప్రాజెక్టుల విలువ అక్షరాలా రూ.92 వేల కోట్లు..
వాస్తవం : డిస్కంలు నిర్వహించిన పారదర్శక టెండర్ విధానంలో పాల్గొని షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ సంస్థ కాంట్రాక్టులు దక్కించుకుంటే తప్పెలా అవుతుంది. దీనికీ, జగన్ సర్కారుకు లింకేమిటి?
ఆరోపణ : వైకాపా అధికారంలోకి వచ్చేవరకూ షిర్డీసాయి కేవలం విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల తయారీ సంస్థ మాత్రమే. మరిప్పుడు దీని మాటే వేదం..
వాస్తవం : విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల తయారీ రంగంలో 25 ఏళ్లుగా ఉన్న సంస్థ ఆ అనుభవంతో మరో రంగంలోకి ప్రవేశించకూడదా? అలాగైతే ఈనాడు అధినేత రామోజీ వివిధ రంగాల్లోకి ఎలా వెళ్లారు? అదీ తప్పేగా?
ఆరోపణ : సీఎం జగన్‌కు షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ యజమాని సన్నిహితుడు, ఒకే జిల్లా వాసి కావడంవల్ల విద్యుత్ ప్రాజెక్టుల్లో ఎక్కువ ఆయన సంస్థే కైవసం చేసుకుంటోంది..
వాస్తవం : ఇరవై ఐదేళుŠాల్గ విశ్వేశ్వరరెడ్డి షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌ను అంచెలంచెలుగా పెంచుకుంటూ వచ్చారు. అర్హతలు, టెండర్ల ద్వారా ప్రాజెక్టులు పొందుతున్నారు. దీనికీ, జగన్‌కు సంబంధం ఏమిటి? వైఎస్సార్ జిల్లా వాసి అయితే టెండర్లలో పాల్గొనకూడదనా ఈనాడు ఉద్దేశ్యం?
ఆరోపణ : కడపలో 49.8 ఎకరాలను కేవలం రూ.42.48 కోట్లకే షిర్డీసాయి సంస్థకు ప్రభుత్వం కట్టబెట్టింది. దీనివిలువ ఇప్పుడు రూ.150 కోట్లు..
వాస్తవం : పరిశ్రమల స్థాపన కోసం ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) ద్వారా ప్రభుత్వం భూములు కేటాయించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగానే షిర్డీసాయి సంస్థకు భూమిని కేటాయించడం తప్పెలా అవుతుంది? కేటాయించినప్పటితో పోలిస్తే ఇప్పుడు ధర పెరిగి ఉండవచ్చు. పైగా పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించడం ద్వారా ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వాస్తవ ధర కంటే తక్కువ రేటుకే భూములు కేటాయిస్తోంది. ఇందులో ఈ సంస్థ పట్ల చూపిన ప్రత్యేక ప్రేమ ఏమీలేదు.
అంతా పాలసీ ప్రకారమే..
పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటును ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం, ఇంధన శాఖ 2020 జూలై 17న ‘ఏపీ పునరుత్పాదక ఇంధన ఎగుమతి విధానం–2020’ పేరిట జీఓంఎస్ నంబరు–20ను జారీచేసింది. దీని ప్రకారం.. రాష్ట్రంలో 33,400 మెగావాట్ల పంప్డ్ స్టోరేజి హైడ్రోపవర్ ప్రాజెక్టుల (పీఎస్‌పీ) ఏర్పాటుకోసం 29 అనువైన ప్రాంతాలను ‘నెడ్‌క్యాప్’ గుర్తించింది.
ఆయా ప్రాంతాల్లో వీటి ఏర్పాటుకు సంబంధించి సాంకేతిక, ఆర్థిక సాధ్యాసాధ్యాలపై నివేదికలు (టెక్నో కమర్షియల్ ఫీజిబులిటీ రిపోర్టులు) తయారుచేసింది. దీని ప్రకారం.. ఆసక్తిగల ప్రైవేటు సంస్థలేవైనా ‘నెడ్‌క్యాప్’ను సంప్రదిస్తే పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను మంజూరు చేస్తోంది.
ఇదే విధానంలో ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ 3,500 మెగావాట్ల సోలార్ పవర్, 1,500 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టులు పొందింది. ఇలాగే నెడ్‌క్యాప్ సంస్థకు దరఖాస్తు చేసుకుని మరికొన్ని సంస్థలు కూడా ఇలాంటి ప్రాజెక్టులను మంజూరు చేయించుకున్నాయి. అలాగే, ఏపీ పంప్డ్ స్టోరేజీ పవర్ పాలసీ–2022ని ప్రకటించి అనువైన ప్రదేశాల్లో ప్రైవేట్ సంస్థలకు పంప్డ్ స్టోరేజి ప్రాజెక్టులను మంజూరు చేస్తోంది.
ఈ పాలసీలో భాగంగానే ఇండోసోల్ సోలార్ సంస్థకు వైఎస్సార్ జిలాŠల్ పైడిపాలెం వద్ద 2,200 మెగావాట్ల సామర్థ్యం గల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు మంంజూరైంది. షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌కు కూడా వైఎస్సార్ జిల్లా సోమశిల వద్ద 2,100 మెగావాట్లు, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని యర్రవరం వద్ద 1,200 మెగావాట్ల పీఎస్పీలు మంజూరయ్యాయి.
రాష్ట్రపతి అవార్డు అందుకున్న సంస్థకు ఇస్తే ఈర్ష్య ఎందుకు?
మూడు డిస్కంల పరిధిలో 18.58 లక్షల వ్యవసాయ మోటర్లకు స్మార్ట్ మీటర్ల కాంట్రాక్టు షిర్డీసాయి సంస్థ టెండర్ల ద్వారా కైవసం చేసుకుంటే ఏదో అన్యాయం జరిగినట్లు ‘ఈనాడు’ గుండెలు బాదుకుంటోంది. రూ.6,888 కోట్ల కాంట్రాక్టు షిర్డీసాయికే కట్టబెట్టడం వెనుక పెద్దకథ నడిచిందని ఆరోపించింది. షిర్డీసాయి చిన్న సంస్థ అన్నట్లు ‘ఈనాడు’ పేర్కొంది.
అయితే షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ అనేది చిన్న సంస్థ ఏమీకాదు. ఈ సంస్థ 25 ఏళ్లుగా విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను తయారుచేస్తూ అత్యధిక అనుభవం, సామర్థ్యం గలదిగా ప్రసిద్ధి చెందింది. ట్రాన్స్‌ఫార్మర్ల తయారీలో ఈ సంçస్థ 2022 సంవత్సరానికి ప్రతిష్టాత్మక రాష్ట్రపతి అవార్డు కూడా పొందింది.
– జె. పద్మాజనార్థనరెడ్డి, సీఎండీ, ఏపీసీపీడీసీఎల్.
Comments
Please login to add a commentAdd a comment