సాక్షి, అమరావతి: కల్లు తాగిన కోతి వనమంతా చెరచినట్లుగా ఇతర రాష్ట్రాల్లో మద్యం కుంభకోణాలు బయటపడితే ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకు కేసులు పెట్టరంటూ గగ్గోలు పెట్టడం రామోజీరావు మానసిక స్థితిపై సందేహాలను రేకెత్తిస్తోంది! నేరం జరిగిన చోట.. అభియోగాలు నమోదైన చోట కేసులు పెడతారుగానీ మీ కడుపుమంట తీరేందుకు కేసులు పెట్టాలంటే ఎలా? ఒకపక్క తాను చంకనెక్కించుకునే చంద్రబాబును ప్రజలు ప్రతిసారీ తిరస్కరిస్తున్నారు.. మరోపక్క చిట్‌ఫండ్స్ ముసుగులో నిర్మించుకున్న అక్రమ సౌథం పునాదులు కదిలిపోతుండటంతో తాగుబోతు కథనాలకు తెగబడ్డారని స్పష్టమవుతోంది!
ఏమైనా పోలిక ఉందా?
ఢిల్లీ, చత్తీస్‌గఢ్‌లో సీఐబీ, ఈడీ నమోదు చేసిన కేసులతో ఏపీకి ఎలాంటి సంబంధం లేదు. ఇంకా చెప్పాలంటే అసలు వాటి మద్యం విధానాలతో మన రాష్ట్రానికి పోలికే లేదు. ఢిల్లీలో మద్యం దుకాణాలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు టెండర్లు నిర్వహించారు. అందులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో సీబీఐ కేసు నమోదు చేసింది. ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గతంలో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్న మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేసింది. ధనార్జనకు దూరంగా ప్రభుత్వమే పరిమిత వేళల్లో ఆంక్షలతో వీటిని నిర్వహిస్తోంది.
అలాంటప్పుడు అక్రమాలకు తావు లేదన్నది సుస్పష్టం. అయినప్పటికీ ఢిల్లీతో ముడిపెట్టాలని రామోజీ ప్రయత్నించడం బరి తెగింపు కాదా? ఇక ఛత్తీస్‌గఢ్‌లో మద్యం వ్యవహారాలపై ఈడీ నమోదు చేసిన కేసు వ్యవహారాలు పూర్తి భిన్నం. అక్కడ కొందరు నాయకులు సిండికేట్‌గా ఏర్పడి మద్యం దుకాణాలను తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. అనధికారికంగా తయారైన మద్యాన్ని విక్రయించడంతోపాటు డిస్టిలరీల నుంచి కొనుగోలు చేసే మద్యాన్ని ప్రభుత్వ గిడ్డంగులకు కాకుండా నేరుగా దుకాణాలకు సరఫరా చేస్తున్నారని అభియోగాలు నమోదయ్యాయి.
ఇక్కడ అసలు అలాంటి పరిస్థితే లేదని అందరికీ తెలుసు. రాష్ట్రంలో మద్యం తయారు చేస్తున్న 20 డిస్టిలరీలన్నీ గతంలో చంద్రబాబు, అంతకు ముందు ప్రభుత్వాల హయాంలో అనుమతి ఇచ్చినవే. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక కొత్తగా ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వకపోవడం గమనార్హం.
నాడు మూడు డిస్టిలరీలకే 47.09 శాతం ఆర్డర్లు
► 74 శాతం మద్యం కొనుగోళ్లు 16 డిస్టిలరీలకే ఇచ్చారంటూ ఈనాడు గగ్గోలు పెట్టింది. వాస్తవం ఏమిటంటే రాష్ట్రంలో ఉన్నవే 20 డిస్టిలరీలు. వాటిలో 16 డిస్టిలరీలకు 74 శాతం ఆర్డర్లిచ్చారు. సగటున ఒక్కో డిస్టిలరీకి దాదాపు ఐదు శాతం ఇచ్చినట్లు. దీన్ని తప్పంటే ఎలా? మిగిలిన నాలుగు డిస్టిలరీలకు 26 శాతం ఆర్డర్లు వచ్చినట్లేగా? సగటున ఇది 6 శాతం కన్నా ఎక్కువే కదా?. మరి వీళ్లకు అన్యాయం జరిగినట్లా?
► చంద్రబాబు హయాంలో కేవలం 5 డిస్టిలరీల నుంచే 50 శాతం కన్నా ఎక్కువ మద్యం కొన్నారు. అంటే సగటున ఒక్కో డిస్టిలరీకీ 10 శాతం ఇచ్చారు. మిగిలిన 15 డిస్టిలరీలకూ కలిపి 50 శాతం. అంటే దాదాపుగా 3 శాతం. ఇదీ.. అసలు కథ!
► టీడీపీ హయాంలో 2017–18లో మొత్తం రూ.8,106 కోట్ల విలువైన మద్యం ఆర్డర్లు ఇచ్చారు. వాటిలో ఐదు కంపెనీలకే ఏకంగా రూ.4,122.28 కోట్ల విలువైన ఆర్డర్లు ఇచ్చారు. ఇందులో పెర్ల్ డిస్టిలరీస్‌కు ఒక్కదానికే రూ.1,374.79 కోట్లు, పెర్నోడ్ రిచర్డ్ ఇండియా లిమిటెడ్‌కు రూ.548.03 కోట్లు, ఎస్వీయార్ డిస్టిలరీస్‌కు రూ.395.1 కోట్లు, అలైడ్ బ్లెండర్స్ డిస్టిలరీస్‌కు రూ.457.86 కోట్లు, ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌కు రూ.319.57 కోట్ల మద్యం ఆర్డర్లు ఇచ్చారు. అంటే ఐదు కంపెనీలకు 50 శాతం కంటే ఎక్కువ ఆర్డర్లిచ్చారు. సగటున వీటికి 10 శాతం కంటే ఎక్కువే.
► చంద్రబాబు హయాంలో 2018–19లో మొత్తం రూ.4,765.75 కోట్ల విలువైన మద్యం ఆర్డర్లివ్వగా 3 డిస్టిలరీలకు ఏకంగా రూ.2,244.44 కోట్ల విలువైన ఆర్డర్లివ్వటం గమనార్హం. పెర్ల్ డిస్టిలరీస్‌కు రూ.1,462.41 కోట్లు, సెంటినీ బయో ప్రొడక్ట్స్‌కు రూ.638.52 కోట్లు, ఎస్పీవై ఆగ్రోప్రొడక్సŠట్‌కు రూ.143.51కోట్లు ఆర్డర్లు ఇచ్చారు. అంటే ఈ మూడు డిస్టిలరీలకు ఏకంగా 47.09 శాతం. ఒక్కోదానికీ 15 శాతం కంటే ఎక్కువే. దీన్ని ఏమంటారు రామోజీ?
‘అదాన్’ అంటూ వక్రభాష్యం...
అదాన్ డిస్టిలరీ నుంచే ఎక్కువగా మద్యం కొనుగోలు చేస్తున్నారంటూ ఈనాడు కన్నీళ్లు కార్చింది. నిజమేంటంటే... అసలు అదాన్ డిస్టిలరీస్ అనేదే లేదు. దానికి ప్రభుత్వం ఎలాంటి ఆర్డరూ ఇవ్వలేదు. టీడీపీ సీనియర్‌నేత అయ్యన్నపాత్రుడి కుమారుడు, ఆయన భాగస్వాములు కలిసి విశాఖ డిస్టిలరీస్ ఏర్పాటు చేశారు. గతేడాది అయ్యన్న కుమారుడు ఆ సంస్థ నుంచి బయటికొచ్చేశారు.
మిగతా భాగస్వాములు దాన్ని అదాన్ కంపెనీకి సబ్ లీజుకు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అదీ కథ. పైపెచ్చు ఈ కంపెనీకి అడ్డగోలుగా ఆర్డర్లు ఇచ్చేశారన్నది కూడా పచ్చి అబద్ధమే. వైఎస్సార్ సీపీ పాలనలో ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఇప్పటిదాకా రూ.17,570 కోట్ల విలువైన మద్యానికి ఆర్డర్లిస్తే అందులో విశాఖ డిస్టిలరీస్‌కు ఇచ్చింది రూ.1,164 కోట్లు. అంటే 6 శాతం. మొత్తం డిస్టిలరీలు 20 ఉన్నపుడు అందులో ఒక డిస్టిలరీకి 6 శాతం ఆర్డర్లిస్తే అది అడ్డగోలుగా ఇవ్వటం ఎలా అవుతుందో రామోజీరావే చెప్పాలి.
మద్యం దందాకు చెక్ పడటంతో
చంద్రబాబు హయాంలో యథేచ్చగా సాగిన మద్యం దందాకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అడ్డుకట్ట వేసిందనే వాస్తవాన్ని ఈనాడు పత్రిక తట్టుకోలేకోతోంది. గతంలో మద్యం దుకాణాలన్నీ టీడీపీ నేతలు సిండికేట్ గుప్పిట్లో పెట్టుకుని దాదాపు 24 గంటలపాటు నిర్వహిస్తూ 25 శాతం అధిక ధరలకు విక్రయిస్తూ దోపిడీకి పాల్పడ్డారు. ఈ దందాకు రామోజీ వత్తాసు పలికేవారు. ఎందుకంటే బాబు – రామోజీ మధ్య ఉన్నది మద్యం బంధమే అన్న వాస్తవం బహిరంగ రహస్యం.
1989–94లో అధికార కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దింపడం, తమ పోటీ పత్రిక ‘ఉదయం’ ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు రామోజీరావు సంపూర్ణ మద్య నిషేధం ఉద్యమాన్ని ప్రోత్సహించారు. ఎన్టీరామారావు అధికారంలోకి రాగానే సంపూర్ణ మద్య నిషేధాన్ని విధించారు. ఆ తర్వాత ఎన్టీరామారావుకు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు సీఎం అయ్యారు. వెంటనే రామోజీరావు ఏమాత్రం సిగ్గూఎగ్గూ లేకుండా ప్లేటు ఫిరాయించి సంపూర్ణ మద్య నిషేధం విధానానికి టాటా చెప్పారు. అంతే.. నిషేధాన్ని చంద్రబాబు ఎత్తేశారు. అప్పుడే రామోజీ ఫిల్మ్‌సిటీ నిర్మాణం చేపట్టారు. అందులోని స్టార్‌హోటళ్లలో మద్యం విక్రయాల కోసం రామోజీరావు ప్రజల రక్తమాంసాలతో వ్యాపారం చేశారు.
నేడు సమర్థంగా మద్యం విధానం
మద్యం మాఫియా అరాచకాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే ముగింపు పలికారు. ప్రైవేట్ మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేస్తూ తీసుకున్న ఒక్క విధాన నిర్ణయంతో విప్లవాత్మక సంస్కరణకు శ్రీకారం చుట్టారు. 2019 అక్టోబరు 1 నుంచి మద్యం దుకాణాలన్నీ ప్రభుత్వపరం చేశారు. మద్యం మాఫియాను తుడిచిపెట్టేశారు. దశలవారీగా నియంత్రించేందుకు కఠిన నిర్ణయాలు తీసుకున్నారు.
దుకాణాల వేళలు కుదింపు
టీడీపీ హయాంలో ప్రైవేట్ మద్యం దుకాణాలు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు విక్రయాలు సాగించేవి. అనధికారికంగా 24 గంటలూ విక్రయిస్తూ ఉండేవి. ఇప్పుడు సమయాన్ని కుదించి కచ్చితంగా అమలు చేస్తున్నారు. ఉదయం 10 నుంచి రాత్రి 9 గంటల వరకే విక్రయాలను అనుమతించారు.
బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్‌లు రద్దు
చంద్రబాబు హయాంలో ప్రైవేటు మద్యం దుకాణాలకు అనుబంధంగా 43 వేల బెల్ట్ దుకాణాలు ఉండేవి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాగానే బెల్ట్ దుకాణాలను పూర్తిగా తొలగించింది. గతంలో మద్యం దుకాణాలకు అనుబంధంగా పర్మిట్ రూమ్‌లను అనుమతించారు. అవి అనధికారికంగా బార్లగా చలామణి అయ్యేవి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాగానే ఇవీ రద్దయ్యాయి.
దుకాణాలు కుదింపు
టీడీపీ హయాంలో 4,380 మద్యం దుకాణాలు ఉండగా ఇప్పుడు 2,934కి తగ్గిపోయాయి. ఈ సంఖ్యను ఇంకా తగ్గించే ఉద్దేశంలో ప్రభుత్వం ఉంది. ఇక బార్ల సంఖ్యను పెంచలేదు. 2019లో ఖరారు చేసిన 840 బార్లే ఉన్నాయి. కొత్త బార్లకు లైసెన్సులు ఇవ్వలేదు.
భారీగా తగ్గిన అమ్మకాలు
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయి. రాష్ట్రంలో మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గాయి. టీడీపీ హయాంతో పోలిస్తే రాష్ట్రంలో ప్రస్తుతం మద్యం విక్రయాలు సగానికి పడిపోయాయి. అందుకు గణాంకాలే తార్కాణం.
షాక్ కొట్టేలా ధరలు..
మద్యం విక్రయాలను నిరుత్సాహపర్చడమే తమ పార్టీ విధానమని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల చాలాసార్లు స్పష్టంగా చెప్పారు. విక్రయాలను ప్రోత్సహించి సొమ్ము చేసుకోవడం తమ లక్ష్యం కాదని స్పష్టంచేశారు. అందుకే అధికారంలోకి వచ్చాక మద్యం ధరలను షాక్ కొట్టేలా పెంచారు. అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ (ఏఆర్‌ఈటీ) పన్నునూ విధించారు. దీంతో మద్యం ధరలు పెరిగాయి. మద్యపాన వ్యసనాన్ని నిరుత్సాహ పరిచేందుకు విధించిన ఏఆర్‌ఈటీ పన్నుతో రాబడి పెరుగుతున్నట్లు కనిపిస్తున్నా వాస్తవానికి మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గాయి. పేదలు ఈ వ్యసనానికి క్రమంగా దూరమవుతున్నారు.
తగ్గిన విక్రయాలు కనపడలేదా?
మద్యం ద్వారా ఆదాయం పెరిగింది కాబట్టి మద్యం ఏరులైపారుతోందంటూ ఈనాడు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తోంది. వాస్తవం ఏమిటంటే... పేదలకు అందుబాటులోలేకుండా చేసేందుకు మద్యం ధరలు పెంచడంతోనే ఆదాయం పెరిగినట్టు కనిపిస్తోంది. మద్యం విక్రయాల పరిమాణం మాత్రం గణనీయంగా తగ్గింది. చంద్రబాబు సీఎంగా ఉండగా 2018– 19లో రాష్ట్రంలో 384.31 లక్షల మద్యం కేసులు, 277.1 లక్షల బీర్ కేసులు విక్రయాలు జరిగాయి.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత 2019–20లో మద్యం కేసులు 308.49 లక్షలు, బీరు కేసులు 212.91లక్షల కేసులే విక్రయించారు. 2020–21లో అయితే మద్యం కేసులు 187.55 లక్షలు, బీరు కేసులు 56.97 లక్షలతో విక్రయాలు తగ్గిపోయాయి. ఇక 2021–22లో మద్యం కేసులు 266.08 లక్షలు, బీరు కేసులు 81.67 లక్షలు విక్రయాలు జరిగాయి. 2022–23లో మద్యం కేసులు 335.98 లక్షలు, బీరు కేసులు 116.76 లక్షల కేసులే విక్రయించారు. మరి ఎలా చూసినా గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే విక్రయాలు తగ్గిపోవడం ఈనాడుకు కనపడకపోవటాన్ని ఏమనుకోవాలి?
Comments
Please login to add a commentAdd a comment