విశాఖ దసపల్లా భూముల్లో టీడీపీ కార్యాలయం
సిగ్గూఎగ్గూ లేని రాతలు కాకపోతే... అక్కడి భూముల వ్యవహారం కోర్టులో ఉండగానే తాను ముఖ్యమంత్రిగా ఉంటూ... తన పార్టీకే కేటాయించేసుకుని అన్ని తీర్పులనూ బేఖాతరు చేసి పార్టీ కార్యాలయాన్ని నిర్మించేసుకున్న తెలుగుదేశం... దాని అధిపతి చంద్రబాబు నాయుడు మీ దృష్టిలో అత్యుత్తములు!!.
ఆ భూములపై వివాదం ఉందని, కోర్టులో వివాదం తేలేదాకా ఎవ్వరూ శాశ్వత నిర్మాణాలు చేపట్టవద్దని గతంలో అప్పటి కలెక్టరు చెప్పటం అబద్ధమా? కలెక్టరు ఈ రకమైన ఉత్తర్వులు ఇచ్చాక... అవన్నీ ప్రయివేటు వ్యక్తులకే చెందుతాయని దిగువ కోర్టు స్పష్టంగా తీర్పు చెప్పటం నిజం కాదా? అలా తీర్పునిచ్చాక తెలుగుదేశం పార్టీ అందులో దాదాపు అర ఎకరం భూమిని తనకు తనే కేటాయించేసుకుని పార్టీ ఆఫీసు పేరిట శాశ్వత నిర్మాణం కట్టేయటం ఎలాంటి న్యాయం రామోజీరావుగారూ? తెలుగుదేశం పార్టీకి భూమిని అప్పగించమంటూ 2001లో నాటి కలెక్టరుకు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చినప్పటికి ‘సాక్షి’ లేకపోవచ్చు. కానీ ఒక పత్రికగా ఈ దారుణాన్ని మీరు ప్రశ్నించలేదెందుకు? మీ చంద్రబాబు కాబట్టి ఏం చేసినా చెల్లిపోతుందనేగా?
ఇప్పుడు ప్రభుత్వం ఎలాంటి తప్పూ చేయకున్నా సరే... ప్రజల్లో వ్యతిరేకత పెంచడానికి ప్రభుత్వంపై బురద జల్లేలా కథనాలు రాయగలుగుతున్నారంటే మిమ్మల్ని ఏమనుకోవాలి? ఇక్కడ ప్రజలందరికీ తెలియాల్సిందేమిటంటే... గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ప్రభుత్వం అక్కడి భూ యజమానులకు అనుకూలంగా వ్యవహరించాల్సి వస్తోందని. ఎందుకంటే హైకోర్టుతో సహా దిగువ కోర్టులన్నీ ఆ భూములు ప్రయివేటు వ్యక్తులవేనని తీర్పునిచ్చాయి. మునుపటి ప్రభుత్వాలు దీనిపై చివరికి సుప్రీంకోర్టులో అప్పీలు చేశాయి.
సుప్రీం కోర్టు కూడా ఆ అప్పీలును కొట్టేసింది. దాన్ని వ్యతిరేకిస్తూ అదే కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలైంది. దాన్ని కూడా కొట్టేయటంతో చిట్ట చివరి అస్త్రంగా ప్రభుత్వం ‘క్యూరేటివ్’ పిటిషన్‌ను దాఖలు చేసింది. దాన్ని కూడా సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏ ప్రభుత్వమైనా ఏం చేస్తుంది? విధిలేని పరిస్థితుల్లో నాటి చంద్రబాబు ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ అభిప్రాయాన్ని కూడా అడిగింది. సుప్రీంకోర్టు క్యూరేటివ్ పిటిషన్‌ను కూడా కొట్టేసిన తరవాత ఆ తీర్పు ప్రకారం నడవటం తప్ప ప్రభుత్వం చేయగలిగిందేమీ లేదని ఏజీ వేణుగోపాల్ కూడా లిఖితపూర్వకంగా చెప్పారు.
ఈ ప్రభుత్వం వచ్చాక కూడా ఇప్పటిదాకా తీర్పును అమలు చేయలేదు. అలా చేయనందుకు కోర్టు ధిక్కార పిటిషన్లు వేశారు. చివరికి ఇద్దరు అధికారులకు జైలు శిక్ష కూడా పడింది. ఇంకా ఏం చేయాలి? మరింత మంది అధికారులకు కోర్టు ధిక్కార శిక్షలు పడితే మీరు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పండగ చేసుకుంటారా? అధికారులను కాపాడటం లేదని ప్రభుత్వంపై విమర్శలు చేస్తారా? ఎందుకీ దిగజారుడు తనం.
2001లో టీడీపీ ప్రభుత్వ ఆదేశాల మేరకు విశాఖ జిల్లా కలెక్టర్ దసపల్లా భూముల్లో టీడీపీ కార్యాలయ ఏర్పాటుకు అనుమతిస్తూ జారీ చేసిన ఉత్తర్వులు
భూ యజమానుల్లో మీ వియ్యంకుడూ ఉన్నారుగా?
అత్యున్నత స్థాయి వరకూ కోర్టు తీర్పులు అనుకూలంగా ఉన్నాయి కనకే భూ యజమానులు డెవలపర్లతో ఒప్పందం చేసుకున్నారు. ఎవరికెంత శాతమన్నది ఆ ఇరుపక్షాల ఇష్టం తప్ప మీ ఇష్టానిష్టాలెవరికీ అవసరం లేదక్కడ. అయినా డెవలపర్లతో ఒప్పందం చేసుకున్న భూ యజమానుల్లో మీ కుమారుడి వియ్యంకుడు కూడా ఉన్నారుగా? ఒకవేళ వాళ్లకు తక్కువ వాటా వచ్చిందని వాళ్లు కూడా మీలా ఆలోచిస్తే మీ వియ్యంకుడెందుకు ఒప్పందం చేసుకున్నట్టు? వాళ్లందరికీ నచ్చబట్టేగా!!. ఇవన్నీ వదిలేసి ప్రతిరోజూ దసపల్లా అంటూ మీరు చేతికొచ్చినట్లు రాయటం... ఆ పనికి మాలిన అబద్ధాలు పట్టుకుని మిగిలిన ఎల్లో తోకలు రెచ్చిపోవటం!!. వీటినే మళ్లీ చంద్రబాబు వల్లెవేయటం!!. 1983 నుంచీ అమలు చేస్తున్న మీ స్కీమ్ ఇంకా జనానికి అర్థం కాలేదనే అనుకుంటున్నారా?
Comments
Please login to add a commentAdd a comment