నాడు వంతపాట.. నేడు సంతర్పణట?  | Eenadu Ramoji Rao Fake News On YSRCP Andhra Pradesh Govt | Sakshi
Sakshi News home page

నాడు వంతపాట.. నేడు సంతర్పణట? 

Published Mon, Jun 20 2022 3:47 AM | Last Updated on Mon, Jun 20 2022 1:19 PM

Eenadu Ramoji Rao Fake News On YSRCP Andhra Pradesh Govt - Sakshi

రాజకీయ పార్టీలకు భూములు కేటాయించేందుకు 2016 జూలై 21న టీడీపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో , రాజకీయ పార్టీలకు భూములు కేటాయించే జీవోలో లీజు కాలాన్ని 33 ఏళ్లుగా నిర్ధారిస్తూ పేర్కొన్న అంశం

ఒక ప్రభుత్వం చేసిన పని సరైనదయినపుడు... అదే పని మరో ప్రభుత్వం చేస్తే తప్పెలా అవుతుంది? ఒక పార్టీ అధికారంలో ఉన్నపుడు తన కార్యాలయాలకు స్థలాలు కేటాయిస్తూ జీవో ఇచ్చింది. ఆ జీవో ప్రకారమే... అధికారంలోకి వచ్చిన మరో పార్టీ తన కార్యాలయాలకు స్థలాలు కేటాయించింది. మరి అప్పట్లో తప్పు కానపుడు ఇప్పుడు తప్పెలా అవుతుంది? పార్టీ ఏదైనా విధానమొకటే కదా? అప్పట్లో సమర్థించి ఇప్పుడు మాత్రం వ్యతిరేకిస్తే ఎలా? ఎందుకీ రెండు నాల్కల రాతలు రామోజీరావు గారూ? ‘ఈనాడు’కు పాఠకులంటే అంత చులకనా? చంద్రబాబుపై మీకున్న ప్రేమ మరొకరిపై ద్వేషంలా మారితే ఎలా? తెలుగుదేశం పార్టీ కార్యాలయాలకు స్థలాలు కేటాయిస్తూ చంద్రబాబు జీవో ఇచ్చినపుడు మీరు వ్యతిరేకించలేదెందుకు? ఆ జీవో ప్రకారమే... ఆ జీవోలోని మార్గదర్శకాలను అనుసరించే ఇప్పుడు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పార్టీకి స్థలాలు కేటాయిస్తుంటే అది ‘సంతర్పణ’ అయిపోయిందా? మీది పాత్రికేయమా? రాజకీయమా? తానిచ్చిన జీవోను ఉల్లంఘించి కూడా అప్పట్లో చంద్రబాబు కొన్ని కేటాయింపులు చేస్తే... అది కూడా ‘ఈనాడు’కు తప్పు అనిపించకపోవటమే ఘోరాతిఘోరం. ఇప్పుడు జీవోలోని మార్గదర్శకాల ప్రకారమే ఇస్తున్నా విషం చిమ్మటమే దారుణం. ‘సొంతానికి సంతర్పణ’ అంటూ పతాక శీర్షికల్లో ‘ఈనాడు’ వండి వార్చిన కథనంలో నిజానిజాలేంటో చూద్దాం...

మంగళగిరిలో టీడీపీ జాతీయ కార్యాలయానికి 3.65 ఎకరాలు కేటాయిస్తూ 2017 జూన్‌ 22న జారీ చేసిన జీవో. 2016లో తాను జారీ చేసిన కేటాయింపు విధానానికి విరుద్ధంగా ఈ భూమిని 33 ఏళ్లకు కాకుండా 99 ఏళ్లకు లీజుకు ఇచ్చిన అంశం (కింది భాగం) 

పార్టీ కార్యాలయాలు లేని జాతీయ రాజకీయ పార్టీలు, గుర్తింపు పొందిన రాష్ట్ర రాజకీయ పార్టీలకు భూములు కేటాయించేందుకు 2016లో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు ఓ కొత్త విధానాన్ని తెచ్చారు. 2016 జూలై 21న విడుదలైన జీఓ నెంబర్‌ 826 ప్రకారం... రాజధానిలో మూడు కేటగిరీలుగా భూములు కేటాయించవచ్చు. 

మొదటి కేటగిరీలో జాతీయ రాజకీయ పార్టీ/ గుర్తింపు పొందిన రాష్ట్ర రాజకీయ పార్టీకి అసెంబ్లీలో 50 శాతానికిపైగా బలం ఉంటే 4 ఎకరాలు కేటాయించాలి. అప్పుడు టీడీపీ అధికారంలో ఉండడంతో పాటు అసెంబ్లీలో ఆ పార్టీకి ఆ విధమైన బలం ఉంది. 

రెండో కేటగిరీ కింద అసెంబ్లీలో 25 నుంచి 50 శాతం బలం ఉన్న పార్టీలకు అర ఎకరం కేటాయించాలి. మూడో కేటగిరీలో 25 శాతం కంటే తక్కువ ఉన్న పార్టీలకు వెయ్యి గజాల స్థలం కేటాయించాలి. 

దీని ప్రకారం అప్పట్లో టీడీపీకి 4 ఎకరాలు, 67 స్థానాలతో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్‌సీపీకి అర ఎకరం పొందే అర్హత వచ్చింది. జిల్లా కేంద్రాల్లోనూ ఇదే విధానం ప్రకారం మొదటి కేటగిరీలో ఉన్న పార్టీలకు 2 ఎకరాలు, రెండో కేటగిరీలో ఉన్న పార్టీలకు వెయ్యి గజాలు, మూడో కేటగిరీలో ఉన్న పార్టీలకు 300 గజాలు ఇవ్వాలన్నది జీవో సారాంశం. ఏడాదికి వెయ్యి రూపాయల చొప్పున 33 ఏళ్ల లీజుకు ఈ విధానంలో భూములు కేటాయించాలని నిర్ణయించారు. నియోజకవర్గ కేంద్రాల్లోనూ ఇదే విధానం ప్రకారం 30 సెంట్లు కేటాయించాలని 2017 డిసెంబర్‌ 8న మరో జీఓ–340 జారీ చేశారు. 

వెనువెంటనే కేటాయింపులు... రామోజీ సంబరాలు
ఈ విధానం ప్రకారం రాజధానితోపాటు జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ కార్యాలయాల కోసం చంద్రబాబు వరసగా భూములు కేటాయించుకున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుల పేరిట ఈ భూములు కేటాయిస్తూ ప్రత్యేకంగా జీఓలు జారీ చేశారు. 175 నియోజకవర్గాల్లో సొంత పార్టీ కార్యాలయాలు కట్టేందుకు ప్రణాళిక వేసి... చాలాచోట్ల భూములు కేటాయించి... ఆగమేఘాల మీద భవనాలు కూడా కట్టేశారు. విచిత్రమేంటంటే బాబు ప్రకటించిన విధానం ప్రకారం 33 ఏళ్ల లీజుకు భూములు కేటాయించాలి. కానీ తాను పెట్టిన నిబంధనను కొన్నిచోట్ల తానే ఉల్లంఘించారు. ఏకంగా 99 ఏళ్ల పాటు లీజుకు కేటాయించేసుకున్నారు.

ఇలా ఉల్లంఘించినా కూడా రామోజీ పెన్నెత్తి రాస్తే ఒట్టు. మంగళగిరి, కాకినాడ, శ్రీకాకుళం మూడు చోట్లా ఇలాగే 99 ఏళ్ల లీజుకు తీసేసుకున్నా... ‘ఈనాడు’ అక్షరం ముక్క కూడా రాయలేదు. ఎందుకంటే రామోజీకి అది తప్పుగా అనిపించలేదు. ముఖ్యమైన నగరాలు, పట్టణాల్లో ఎంతో విలువైన భూముల్లో పార్టీ కార్యాలయాల కోసం భూములు కేటాయించుకుని... వాటిల్లో ఆగమేఘాల మీద పార్టీ కార్యాలయాలు నిర్మించి ఇప్పుడు అక్కడి నుంచే నడిపిస్తున్నా... ఏనాడూ అది ‘ఈనాడు’కు సంతర్పణలా కనిపించలేదు. అదే జీవో ప్రకారం ఇపుడు వివిధ జిల్లాల్లో 33 ఏళ్ల కాలానికి లీజుకు తీసుకున్నా కూడా... వైఎస్సార్‌ సీపీ చేసింది కాబట్టి వ్యతిరేకించాలన్నట్టుగా దగుల్బాజీ రాతలకు దిగుతోంది. 

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ నుంచి మొదలు!!
చంద్రబాబు– రామోజీ ద్వయం దుర్మార్గం తెలియాలంటే ఓ పాతికేళ్లు వెనక్కెళ్లినా కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో అత్యంత ఖరీదైన ఎకరా స్థలాన్ని రాత్రికి రాత్రే చంద్రబాబు కేటాయించుకున్న తీరు అప్పట్లో ఓ చరిత్ర. కమర్షియల్‌ స్థలంగా హైదరాబాద్‌ పట్టణాభివృద్ధి సంస్థ (హుడా) చేతిలో ఉన్న ఆ స్థలాన్ని 1997 ఏప్రిల్‌ 30న జూబ్లీహిల్స్‌ మున్సిపాలిటీ నుంచి షేక్‌పేట ఎమ్మార్వోకు బదలాయించటం... ఆయన అదే రోజు డి.శ్రీనివాసరావు అనే ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్టీకి బదలాయించటం.. అదే రోజున ఆ ట్రస్టుకు స్థలాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం జీవో ఇవ్వటం గంటల వ్యవధిలో జరిగిపోయాయి.

అది కూడా.. నెలకు రూ.7,500 అద్దెకు. ఇక ఆ తరవాత హైటెక్‌ సిటీని కట్టిన ఎల్‌ అండ్‌ టీ సంస్థే ఈ స్థలంలో అత్యాధునిక హంగులతో తెలుగుదేశం పార్టీ ఆఫీసునూ కట్టింది. ఆ భవనాన్ని ఎన్టీఆర్‌ ట్రస్టు పేరిటే ఉంచి... టీడీపీ వాడుకుంటోంది. దీనికి చంద్రబాబు చెప్పిన భాష్యమేంటో తెలుసా? ఎక్కడైనా ఇలా ట్రస్టుల ఆస్తులు పార్టీలు వాడుకోవటం సహజమేనట!!. పాపం... రామోజీరావుకు కూడా ఇది అత్యంత సహజంగానే కనిపించింది. అందుకే వ్యతిరేకంగా ఒక్క వార్త కూడా ఏనాడూ రాయలేదు. 

ఏది నిజం ?
అలాంటి చంద్రబాబు 2014లో ఆంధ్రప్రదేశ్‌ సీఎం అయ్యాక... 2016లో ఇచ్చిన జీవోను కూడా ఎక్కడెక్కడ ఉల్లంఘించారో తెలుసా?

మంగళగిరి... 75 కోట్లు: 
ప్రస్తుతం చంద్రబాబు, టీడీపీ నేతలు సకల విలాసాలతో దర్జాగా మీడియా, పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్న పార్టీ కార్యాలయ స్థలం కోల్‌కతా–చెన్నై హైవేను ఆనుకునే ఉంది. మంగళగిరిలోని ఈ 3.65 ఎకరాల స్థలం విలువ 75 కోట్లపైనే ఉంటుంది. ఈ భూమిలో వాగు పోరంబోకు, కాలువ భూమి, రైతులకు కేటాయించిన డి పట్టా భూములూ ఉన్నాయి. కాలువను పూడ్చి... పోరంబోకు భూమిని ఆక్రమించి... రైతుల భూములను కబ్జా చేసి మరీ పార్టీ కార్యాలయం కట్టారు. 99 ఏళ్ల లీజుకు కేటాయించుకున్న ఈ స్థలానికి ఏడాదికి చెల్లించేది ఎకరాకు 1,000 రూపాయలు.


నిజానికి ఆ భూమికి సంబంధించి 1974లోనే బొమ్ము రామిరెడ్డి పేర 0.65 సెంట్లు, కొల్లా రాఘవరావు పేరిట 1.75 ఎకరాలు, కొల్లా భాస్కరరావు పేరిట 1.75 ఎకరాలను డి పట్టాలు ఇచ్చారు. వారిని బలవంతంగా తరిమేసి వారు సాగు చేస్తున్న పంటను పొక్లెయిన్లతో దున్నేసి రాత్రికి  రాత్రే స్వాధీనం చేసుకున్నారు. వారు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నా పట్టించుకోకుండా చంద్రబాబు పార్టీ భవనం కట్టేశారు. ఆ రైతుల తరఫున మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం విచారణకే తిరస్కరించింది. ఆర్కే సుప్రీంకోర్టుకు వెళ్లడంతో అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. అయినా టీడీపీ లెక్క చేయలేదు. అదీ కథ. వ్యవస్థల్ని అడ్డం పెట్టుకుని చెలరేగిపోయిన చంద్రబాబు దాష్టీకాలు రామోజీ కంటికి అద్భుతాల్లా కనిపించాయేమో!!

గుంటూరులో అయితే లీజు+ఆక్రమణ 
మంగళగిరి టీడీపీ కార్యాలయం నిర్మించకముందు గుంటూరు అరండల్‌పేటలోని పిచుకులగుంటలో 2015లో టీడీపీ రాష్ట్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. వెయ్యి గజాల స్థలాన్ని కార్పొరేషన్‌ నుంచి లీజుకు తీసుకుని అదనంగా పక్కనే ఉన్న మరో 1,500 గజాల స్థలాన్ని ఆక్రమించి ఈ భవనాన్ని నిర్మించారు. మున్సిపల్‌ స్థలాలను లీజుకు ఇచ్చే పరిస్థితి లేకపోయినా చంద్రబాబు బలవంతంగా ఈ భూమిని లీజుకు తీసుకున్నారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి కౌన్సిల్‌లో తీర్మానం చేసి ఆక్రమించిన స్థలంతో కలిపి 2,500 గజాల స్థలాన్ని క్రమబద్ధీకరించుకుని భవనం కట్టేశారు.

దళితుల ఇళ్ల స్థలాల కోసం సేకరించిన భూమిలో...!
ఎస్సీల ఇళ్ల స్థలాల కోసం సాంఘిక సంక్షేమ శాఖ సేకరించిన భూమిని శ్రీకాకుళంలో టీడీపీ కార్యాలయానికి తీసేసుకున్నారు. అంతేకాదు ఉడా, కార్పొరేషన్‌ అధికారుల అనుమతి లేకుండా భవనం నిర్మించారు. అంతటితో ఆగకుండా పక్కనే ఉన్న మరికొంత స్థలాన్ని ఆక్రమించేశారు. ప్రధాన 80 అడుగుల రోడ్డులో ఇచ్చిన ఈ స్థలం విలువ 2017లోనే అనధికారికంగా రూ.20 కోట్లు. ఏడాదికి రూ.25 వేల చొప్పున 99 సంవత్సరాల లీజుకు తీసుకున్న ఈ స్థలంలో భవనం నిర్మించటంతో పాటు... 2019 ఎన్నికలకు 4 నెలల ముందు స్వయంగా చంద్రబాబే ప్రారంభించారు. ఈ ఉల్లంఘనలపై ఒక్క అక్షరాన్ని కూడా ఎన్నడూ రామోజీ విదిలించలేదు.

► ​​​​​​​కాకినాడలో జెడ్పీ స్థలం! 
కాకినాడలో విలువైన జిల్లా పరిషత్‌ స్థలాన్ని టీడీపీ కార్యాలయానికి కేటాయించుకున్నారు. అందులో విలాసవంతమైన భవనాన్ని కట్టారు. మేడలైన్‌ ఆఫ్‌ కాకినాడ ప్రాంతంలో 2 వేల గజాలను 99 ఏళ్ల లీజుకి జిల్లా పరిషత్‌ ద్వారా టీడీపీ పరం చేశారు. 2014లో జెడ్పీలో ఈ స్థలం టీడీపీ కార్యాలయానికి ఇవ్వాలని తీర్మానం చేశారు. 2016 నవంబర్‌ 1న ఈ భూమిని కేటాయిస్తూ జీఓ జారీ చేశారు. దీని విలువ రూ.10 కోట్లకు పైమాటే.

​​​​​​​విజయవాడ నడిబొడ్డున రూ.40 కోట్ల స్థలంలో...
విజయవాడ నడిబొడ్డున ప్రజావసరాలకు ఉపయోగపడే విలువైన భూమిని అప్పటి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ ఒత్తిడితో టీడీపీ కార్యాలయానికి అప్పగించారు. గుణదల పరిధిలోకి వచ్చే ఆటోనగర్‌–గురునానక్‌ కాలనీకి ఆనుకుని ఇరిగేషన్‌ శాఖకు ఈ 95 సెంట్ల భూమి ఉంది. ఇరిగేషన్‌ విభాగ స్టోరేజి, ఇతర పనుల కోసం దీన్ని వినియోగించేవారు.

ఇందులో కార్యాలయం కూడా ఉండేది. టీడీపీ ఆఫీసు కోసం దీన్ని ఇవ్వాల్సిందేనని అధికార యంత్రాంగంపై ఒత్తిడి తేవడంతో ఆ కార్యాలయాన్ని కూల్చేశారు. ఇరిగేషన్‌ మెటీరియల్, యంత్రాలను మరోచోటకు తరలించారు. అన్ని అభ్యంతరాలనూ తోసిరాజని... 99 ఏళ్ల లీజుకిచ్చేశారు. ఆటోనగర్‌ పరిధిలో ఉన్న ఈ స్థలాన్ని పారిశ్రామిక అవసరాలకు మాత్రమే వాడాలనే నిబంధన ఉన్నా ఐలా పాలకవర్గాన్ని బెదిరించి నోరు మూయించారు. వాణిజ్య భూమిగా కన్వర్షన్‌ చేసి పార్టీ కార్యాలయం నిర్మించుకున్నారు. దీనివిలువ రూ.40 కోట్లకు పైమాటే.

► ​​​​​​​విశాఖలో దసపల్లా కొండను తొలచి..
విశాఖపట్నంలో దసపల్లా కొండను తొలచి మరీ టీడీపీ కార్యాలయాన్ని కట్టేశారు. దసపల్లా భూముల్లో 2 వేల గజాల్ని 33 ఏళ్ల పాటు ఏడాదికి రూ.25 వేలు లీజు చొప్పున 2002లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం టీడీపీకి కేటాయించింది. కానీ కార్యాలయం నిర్మించలేదు. ఆ స్థలంతోపాటు పక్కనే ఉన్న కొండను (మరో వెయ్యి గజాల మేర) కూడా ఆక్రమించి 2016లో టీడీపీ ఆఫీసు నిర్మించారు.

టౌన్‌ ప్లానింగ్‌ అనుమతులు లేకుండానే... జీ+3 భవనం నిర్మించి 2018లో లోకేష్‌ ప్రారంభించారు. విచిత్రమేంటంటే ఇవేవీ ‘ఈనాడు’కు ఉల్లంఘనల్లా కనిపించకపోవటం. ఉల్లంఘనలేవీ లేకుండా నాటి జీవో ప్రకారమే వైఎస్సార్‌ సీపీ స్థలాలు కేటాయిస్తున్నా... ఏదో అక్రమం చేసేస్తున్నట్లుగా గుండెలు బాదుకుని విషం చిమ్మటం. ఇంకెన్నాళ్లు రామోజీ ఈ ముసుగు పాత్రికేయం? 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement