అవిగో..! ఆహారశుద్ధి కేంద్రాలు | First phase food processing units Andhra Pradesh Govt | Sakshi
Sakshi News home page

అవిగో..! ఆహారశుద్ధి కేంద్రాలు

Published Sun, Sep 18 2022 6:10 AM | Last Updated on Sun, Sep 18 2022 8:07 AM

First phase food processing units Andhra Pradesh Govt - Sakshi

ఒప్పంద పత్రం మార్చుకుంటున్న చిరంజీవి చౌదరి, రాజేంద్ర ప్రసాద్‌ తదితరులు

సాక్షి, అమరావతి: వ్యవసాయ ఉత్పత్తులకు నిరంతర డిమాండ్‌ కల్పించడం ద్వారా రైతులకు అదనపు లబ్ధి చేకూర్చే లక్ష్యంతో అందుబాటులోకి తెస్తున్న ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటు ప్రక్రియ వేగం పుంజుకుంది. తొలిదశ యూనిట్ల ఏర్పాటుకు ఆర్థిక చేయూత అందించేందుకు ముందుకొచి్చన స్మాల్‌ ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (సిబ్డీ) మంగళవారం ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. నెలాఖరులోగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి వచ్చే నెలలో పనులను పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. 

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పాలసీ మేరకు.. 
ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పాలసీలో భాగంగా రూ.3,726.16 కోట్ల అంచనా వ్యయంతో పార్లమెంటరీ నియోజకవర్గాల స్థాయిలో ఆహార శుద్ధి యూనిట్లు ఏర్పాటవుతున్నాయి. తొలిదశలో రూ.1,148.11 కోట్లతో పది పార్లమెంటరీ నియోజకవర్గాల స్థాయిలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను, రూ.66.92 కోట్లతో 13 మిల్లెట్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను నెలకొల్పనున్నారు.

రెండో దశలో రూ.2,511.13 కోట్లతో 16 ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు అందుబాటులోకి రానున్నాయి. వీటి ద్వారా పంటలను శుద్ధిచేసి అదనపు విలువను జోడించడం, వృథాను తగ్గించడం, ఎగుమతి సామర్థ్యంతో పాటు బేరసారాల శక్తిని పెంపొందించడం ద్వారా రైతులకు అదనపు ప్రయోజనాలను కల్పించాలని నిర్ణయించారు.

తద్వారా వినియోగదారులకు సరసమైన ధరలకు నాణ్యమైన ఆహార ఉత్పత్తులను అందించాలన్నది ప్రభుత్వ ధ్యేయం. అవసరమైన ముడి సరుకును రైతులు, రైతు ఉత్పాదకత సంఘాలు, మార్క్‌ఫెడ్, ఆర్బీకేల ద్వారా సమకూర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఏపీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ పర్యవేక్షణలో స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ (ఎస్పీవీ) ఏర్పాటు చేయగా రాష్ట్ర పట్టణ మౌలిక సదుపాయాలు, ఆస్తుల నిర్వహణ సంస్థ (ఏపీ యూఐఎఎంఎల్‌)తో పాటు నాబ్కాన్స్‌ సంస్థలు డీపీఆర్‌ రూపొందించాయి. 

24 యూనిట్లకు భూసేకరణ పూర్తి 
పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిలో 24 యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన 325.39 ఎకరాల భూసేకరణ ఇప్పటికే పూర్తైంది. 23 చోట్ల 295.39 ఎకరాల భూమిని ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీకి ఇప్పటికే అప్పగించారు. 13 మిల్లెట్‌ యూనిట్ల కోసం 13 ఎకరాల భూసేకరణ కూడా పూర్తైంది. అంచనా వ్యయంలో 90% రుణంగా సేకరించనుండగా మిగిలిన 10% రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుంది.

వీటి నిర్వహణకు 118 జాతీయ, అంతర్జాతీయ బహుళజాతి సంస్థలు ముందుకొచ్చాయి. తొలిదశ యూనిట్ల ఏర్పాటుకు రూ.1,000 కోట్ల రుణం అందించేందుకు సిబ్డీ ముందుకొచ్చింది. ఈ మేరకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. సచివాలయంలో మార్కెటింగ్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ చిరంజీవి చౌదరి, ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి కె.ఆదినారాయణ సమక్షంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సీఈవో శ్రీధర్‌రెడ్డి, సిబ్డీ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ పి.రాజేంద్రప్రసాద్‌ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఏపీయూఐ ఎఎంఎల్‌ సీనియర్‌ ఆఫీసర్లు రాహుల్‌రెడ్డి, సుదీష్‌ పాల్గొన్నారు. 

3.25 శాతం స్వల్ప వడ్డీతో రుణం 
ఈ ఒప్పందం ప్రకారం 3.25 శాతం వడ్డీతో రూ.1,000 కోట్లను సిబ్డీ రుణంగా  అందించనుంది. ఈ మొత్తానికి ప్రభుత్వం మరో రూ.215 కోట్లు మ్యాచింగ్‌ గ్రాంట్‌ సమకూర్చనుంది. తొలిదశ యూనిట్ల కోసం నెలాఖరులోగా టెండర్లు పిలిచేందుకు ఫుడ్‌  ప్రాసెసింగ్‌ సొసైటీ సన్నాహాలు చేస్తోంది.

అక్టోబర్‌లో భూమిపూజ చేసి పనులు ప్రారంభించి మార్చి కల్లా పూర్తి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రెండో దశ ఆర్థిక సాయం కోసం నాబార్డు, అప్కాబ్‌తో పాటు పలు వాణిజ్య బ్యాంకులతో సంప్రదింపులు జరుగుతున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement