శ్రీశైలం ప్రాజెక్టు (కర్నూలు) : గిరిజనాభివృద్ధి కాగితాలకే పరిమితమైందని శాసనసభ్యులు, గవర్నింగ్ బాడీ కమిటీ సభ్యులు ఆరోపించారు. శ్రీశైలం ఐటీడీఏ కార్యాలయంలోని సీఎంఆర్‌సీ భవనంలో శనివారం రాష్ట్రస్థాయి గవర్నింగ్‌బాడీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ ఉదయలక్ష్మి, ప్రకాశం, కర్నూలు జిల్లాల ఎమ్మెల్యేలు హాజరయ్యారు. పలు అంశాలపై సమావేశంలో వాడివేడిగా చర్చ సాగింది. ట్రైబల్స్ సబ్‌ప్లాన్ కింద గూడేల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని చెంచులు కోరారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్లు, వైద్యసిబ్బంది నిరంతరం సేవలందించే విధంగా చర్యలు చేపట్టాలని, అదేవిధంగా అదనపు అంబులెన్స్‌లు ఏర్పాటు చేయాలని అన్నారు. సామాజిక పింఛన్లను గూడేల్లో పంపిణీ చేయాలన్నారు. ప్రాథమిక పాఠశాలలను అప్‌గ్రేడ్ చేయడంతోపాటు టీచర్లను నియమించాలన్నారు. దీనిపై స్పందించిన కమిషనర్.. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు గిరిజన ప్రాథమిక పాఠశాలల్లో టెట్ పాసైన గిరిజనులనే నియమించాల్సి ఉందన్నారు.
అర్హత కలిగినవారు లేకపోవడంతో పోస్టులను భర్తీ చేయలేకపోతున్నామన్నారు. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని అన్ని గిరిజన గూడేల్లో మంచినీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రకాశం జిల్లాలోని 11 గూడేలకు త్వరలోనే విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. కొన్ని గూడేల్లో విద్యుద్ధీకరణ చేపట్టేందుకు, రోడ్లు నిర్మించేందుకు అటవీశాఖ అనుమతి రావాల్సి ఉందన్నారు.
చెంచు గిరిజనులకు వయోపరిమితి లేకుండా సామాజిక పింఛన్ ఇవ్వాలని, వికలాంగులకు పూర్తిశాతం అంగవైకల్యం లేకున్నా.. రూ.1,500 పింఛన్ ఇవ్వాలని గవర్నింగ్‌బాడీ కమిటీ సభ్యులు అంజయ్య, కొండయ్య, మూగన్న కోరారు. ఇళ్లు లేనివారికి తక్షణం గృహాలు నిర్మించాలని, పశువుల మేతకు ప్రత్యేక నిధులు కేటాయించాలన్నారు. దీనిపై స్పందించిన అధికారులు గిరిజనులకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ప్రకాశం జిల్లా పాలుట్ల గూడేనికి రోడ్డు సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, ఐజయ్య, డేవిడ్‌రాజు, అశోక్‌రెడ్డి, జంకె వెంకటరెడ్డి అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ప్రాజెక్టు అధికారి ప్రభాకర్‌రెడ్డి, ఇంజినీర్ ఇన్‌చీఫ్ బాబు రాజేంద్రప్రసాద్, అన్ని జిల్లాల వైద్యారోగ్య శాఖాధికారులు, హౌసింగ్ అధికారులు, అటవీ అధికారులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. అనంతరం 26 మంది చెంచు గిరిజనులకు కమిషనర్ ఉదయలక్ష్మి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి ఏఏవై కార్డులు పంపిణీ చేశారు.
గిరిజనాభివృద్ధి కాగితాలకే పరిమితం
Published Sun, Jan 4 2015 4:04 AM | Last Updated on Sat, Sep 2 2017 7:10 PM
Advertisement
Advertisement