Project Officers
-
అర్జీల పరిష్కారానికి అందుబాటులో ఉంటా
సాక్షి, ఉట్నూర్(ఖానాపూర్): సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారిగా నాలుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత గిరిజనుల సంపూర్ణ అభివృద్ధికి అందుబాటులో ఉంటూ గిరిజన సంక్షేమానికి కృషి చేస్తానని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి భవేశ్ మిశ్రా అన్నారు. శనివారం సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ 53వ ప్రాజెక్టు అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రాజెక్టు అధికారిగా ఏజెన్సీ ప్రాంత గిరిజనులందరికీ అందుబాటులో ఉంటూ విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల గిరిజనుల అభివృద్ధి కేంద్రంగా ఉన్న ఐటీడీఏ ద్వారా గిరిజనుల సంపూర్ణ అభివృద్ధికి పాటుపడుతానని చెప్పారు. అన్నీ శాఖల అధికారుల సమన్వయంతో ముందుకు సాగుతానని చెప్పారు. గతంలో భద్రాచలం షెడ్యూల్ ప్రాంతంలో విధులు నిర్వహించిన అనుభవంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ ఫలాలు అర్హులకు అందిస్తానన్నారు. గిరిజన సమస్యలపై ఏ సమయంలోనైనా ఫోన్, వాట్సాఫ్ ద్వారా ఎవరైన సంప్రదించవచ్చన్నారు. ప్రభుత్వ ఆర్థిక చేయూత పథకాల ఫలాలు గిరిజన లబ్ధిదారులకు అందించడంతో పాటు అర్జీదారుల సమస్యలు పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఐటీడీఏలో ఆయా విభాగాల అధికారులు సమయపాలనా పాటిస్తూ విధులు సక్రమంగా నిర్వహించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఉద్యోగి బయో మెట్రిక్ పాటించడంతో పాటు తమ ఐడీ కార్డుల్లో బ్లడ్ గ్రుప్‌తో సహా వివరాలు అన్ని పొందుపర్చుకోవాలని తెలిపారు. అటవీ హక్కుల చట్టం హక్కు పత్రాలపై అధికారులతో సమీక్షా అనంతరం అర్హులకు న్యాయం జరిగేలా చర్యలుంటాయన్నారు. అనంతరం ఐటీడీఏ కార్యాలయంలోని పలు విభాగాలను పరిశీలించారు. ఆయా కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న అధికారుల పనుల తీరుపై ఆరా తీశారు. నూతన పీవో రావడంతో ఐటీడీఏ, వివిధ విభాగాల అధికారులు పీవోకు స్వాగతం పలుకుతూ పుష్పగుచ్ఛం అందించారు. -
లీకేజీల పరిశీలనకు వైజాగ్ డైవర్లు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్వహిస్తున్న ట్రయల్‌రన్ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోంది. నందిమేడారం పంప్‌హౌజ్‌లోని సర్జ్‌పూల్‌ని నీటితో నింపి లీకేజీలను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం సర్జ్‌పూల్‌ను 124.5 మీటర్ల వరకు నీటితో నింపి లీకేజీలను గుర్తించేందుకు ప్రాజెక్టు అధికారులు వైజాగ్ షిప్ యార్డ్ నుంచి నైపుణ్యంగల డైవర్లను రంగంలోకి దింపారు. 8 మంది డైవర్ల బృందం నీటిలోకి దిగి సర్జ్‌పూల్‌నుంచి డ్రాఫ్ట్ ట్యూబ్‌ల్లోకి నీరు ఎక్కడైనా చేరుతోందా అన్నది పరిశీలించారు. సర్జ్పూల్కు ఉన్న ఏడు గేట్ల పరిధిలో మూడు గేట్ల లీకేజీలను శనివారం తనిఖీ చేశారు. మిగతా నాలుగు గేట్ల పరిశీలన ఆదివారం కొనసాగనుంది. ఇప్పటివరకు ఎలాంటి లీకేజీలు గుర్తించలేదని ప్రాజెక్టు అధికారులు ప్రకటించారు. ప్రభుత్వ ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డి, ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు, ఈఈ నూనె శ్రీధర్ల నేతృత్వంలో పరిశీలన కొనసాగుతోంది. ఈనెల 24న మోటార్లకు వెట్‌రన్ నిర్వహించనున్నారు. ఈ మోటార్ల వెట్‌రన్ జరిగితే ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ఏడు డెలివరీ సిస్టర్న్‌ల ద్వారా నీరు బయటకు వచ్చేలా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఒక్కో డెలివరీ సిస్టర్న్ నుంచి 3,200 క్యూసెక్కుల నీరు ప్రవహించే అవకాశం ఉంది. మొత్తంగా 22,400 క్యూసెక్కుల (2 టీఎంసీ) నీటి ప్రవాహం ఉండనుంది. 24న ‘కాళేశ్వరం’పై సీఎం ఏరియల్ సర్వే? కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లిలోని మేడిగడ్డ పంపుహౌస్, గ్రావిటీకాల్వ, అన్నారం బ్యారేజీ నిర్మాణాలపై సీఎం కేసీఆర్ నెల 24న ఏరియల్ సర్వే చేయనున్నట్టు సమాచారం. సీఎం ఆ రోజు ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి మహదేవపూర్ మండలంలో నిర్మిస్తున్న మేడిగడ్డ బ్యారేజీ, మహారాష్ట్ర భూభాగంలో పోచంపల్లి వైపు ఏరియల్ సర్వే చేయనున్నారు. అలాగే కన్నెపల్లి పంపుహౌస్ వద్ద నిర్మిస్తున్న అప్రోచ్ కెనాల్ పనులు, పంపుల ద్వారా నీటిని తరలించే గ్రావిటీకాల్వ, అన్నారం బ్యారేజీ పనులను వీక్షించనున్నట్లు ఇరిగేషన్‌శాఖ అధికారుల ద్వారా తెలిసింది. అలాగే ఈనెల 26, 27 తేదీల్లో కన్నెపల్లిలోని మోటార్లకు వెట్‌రన్ నిర్వహించనున్న నేపథ్యంలో సీఎం మరో సారి ఏరియల్ సర్వే చేస్తారని సమాచారం. -
ఎట్టకేలకు ‘మెయింటెనెన్స్’కు మోక్షం!
బాల్కొండ : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ వరద గేట్ల నిర్వహణ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. మరో రెండు రోజుల్లో పనులను ప్రారంభించనున్నట్లు ప్రాజెక్ట్ ఉన్నతాధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ డ్యాం వద్ద మొత్తం 42 వరద గే ట్లు ఉన్నాయి. అలాగే కాకతీయ కాలువ హెడ్ రెగ్యులేటర్ గేట్లు నాలుగు, లక్ష్మీ కాలువ గేట్లు రెండు, సరస్వతి కాలువ గేట్లు రెండు వీటన్నింటితో పాటు ప్రస్తుత సంవత్సరం వ రద కాలువ ఆరు గేట్లకు ప్రతి ఏటా వేసవి కాలంలో ప్రాజెక్ట్ అధికారులు నిర్వహణ (మెయింటెనెన్స్) పనులు చేపడతారు. దీనికి సుమారు 10 లక్షల బడ్జెట్ అవసరం ఉండగా, గేట్లకు గ్రీస్, గేట్ల రోప్‌కు ఆయిల్, ప్యూజ్‌లు తదితర పనులు చేయాల్సి ఉంటుంది. అయితే మే 20 వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో గేట్ల నిర్వహణ పనులకు ఏఎంఏ ( ఏన్యువల్ మెయింటెనెన్స్ ఎస్టిమేట్) మంజూరు కాలేదు. రెండు రోజుల క్రితం గేట్ల నిర్వహణకు బడ్జెట్ మంజూరు చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు ప్రాజెక్ట్ ఈఈ రామారావు తెలిపారు. గతేడాది చేపట్టిన నిర్వహణ పనులకు సంబంధించిన బిల్లులు ఇప్పటి వరకు చెల్లించలేదు. దీంతో ప్రస్తుత సంవత్సరం పనులు చేపట్టడానికి కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. దీంతో గేట్ల ‘నిర్వహణ’ ఆలస్యమైంది. ప్రభుత్వాల నిర్లక్ష్యం ప్రాజెక్ట్‌పై డ్యాం నిర్వహణకు ఏఎంఏ మంజూరుకు ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కించడంవల్ల వేసవి కాలంలో చేపట్టాల్సిన నిర్వహణ పనులను వర్షకాలంలో చేపట్టాల్సిన దుస్థితి నెలకొంది. వర్ష కాలంలో పనులు చేపట్టిన వెంటనే వర్షం కురిస్తే ప్రయోజనం శూన్యమని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ పనులు చేపట్టకుంటే గేట్ల పరిస్థితిని ఊహించడం కష్టంగానే ఉంటుందనే అభిప్రాయాన్ని కూడా వారే వ్యక్తం చేస్తున్నారు. ముందస్తుగా ఏఎంఏ మంజూరు చేసి ఉంటే ఇప్పటి వరకు నిర్వహణ పూర్తయ్యేదని రైతులు అంటున్నారు. ప్రాజెక్ట్ నుంచి ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరదలు వచ్చి ప్రాజెక్ట్ నిండు కుండలా మారితే వరద గేట్ల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇది వరకే ప్రాజెక్ట్ వరద గేట్లు (18, 19 ) టన్బక్కెల్ చెడిపోయి పని చేయడం లేదు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలని రైతులు కోరుతున్నారు. ప్రతి ఏటా సీజన్‌కు ముందు.. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కు జూన్ మధ్యలో నుంచి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరదలు వచ్చి చేరుతాయి. నీటి మట్టం ఆధారంగా ప్రాజెక్ట్ నుంచి వరద గేట్ల ద్వా రా నీటి విడుదలను అధికారులు గోదావరిలోకి విడుదల చేపడతారు. ప్రతి ఏట సీజన్‌కు ముందు గేట్ల మరమ్మతులు, నిర్వహణ పనులు చేపడతారు. సీజన్లో అత్యవసరంగా గేట్లను ఎత్తి నప్పుడు ఎలాంటి సమస్య తలెత్తకుండా గేట్ల మెయింటెనెన్స్ చేపడుతారు. అంతేకాకుండా గేట్లను ఎత్తడానికి ఉప యోగించే క్రేన్ రోప్ కు కూడా మెయింటెనెన్స్ చేపడతారు. ఇవన్నీ ప్రస్తుత సంవత్సరం సీజన్లో జరిగే అవకాశం ఉంది. -
ఏకేబీఆర్ గేట్లకు మరమ్మతులేవీ?
హెడ్‌రెగ్యులేటర్ గేట్లకు రబ్బర్‌సీళ్లు అరిగిపోయి భారీగా లీకేజీలు - ఆనకట్టపై పూర్తిగా తొలగించని చెట్లు - పట్టింపులేని ప్రాజెక్టు అధికారులు పెద్ద అడిశర్లపల్లి, న్యూస్‌లైన్ అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (ఏకేబీఆర్) అధికారుల నిర్లక్ష్యంతో కునారిల్లుతోంది. హెడ్‌రెగ్యులేటర్‌కు ఏర్పాటు చేసిన షట్టర్లకు రబ్బరుసీళ్లు అరిగి పోయాయి. వాటికి కొత్తవి బిగించలేదు. దీంతో గేట్లు ఎత్తకుండానే సందుల్లోంచి భారీగా ప్రధానకాల్వలోకి నీళ్లు లీకవుతున్నాయి. నీటి విడుదల క్రమబద్ధీకరణ లేకుండానే నీటి విడుదల జరుగుతోంది. గేట్ల నిర్వహణ నుడివిజన్-4 అధికారులు ప్రైవేటు వ్యక్తులకు కాంట్రాక్టు ఇచ్చారు. వారు బిల్లులు డ్రా చేయడానికి ఇచ్చిన ప్రాధాన్యతను నిర్వహణకు ఇవ్వడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఏకేబీఆర్ గేట్లు పూర్తిగా మూసివేసి ప్రధానకాల్వకు నీటి విడుదల నిలిపివేయడం సాధ్యం కావడం లేదు. గత మార్చి 29న అక్కంపల్లికి చెందిన చెందిన తల్లీకొడుకులు రిజర్వాయర్‌లో బట్టలు ఉతకడానికి వెళ్లి నీళ్లలోపడిపోయిన సమయంలో గేట్లను మూయడానికి అధికారులకు సాధ్యపడలేదు. నీటి విడుదల జరుగుతుం డగా మృతదేహాలను వెతకడం కష్టసాధ్యమైంది. కాల్వలకు మరమ్మతుల సమయంలోనూ నీటి విడుదల ఆపివేయలేకపోతున్నారు. జంటనగరాలకు కోదండపురం ప్లాంటులో శుద్ధిచేసేందుకు ప్రతిరోజూ 350 క్యూసెక్కులు లీకేజీల నీటినే వాడుతున్నారు. రబ్బర్‌సీల్ బిగించి నీటి విడుదల క్రమబద్ధీకరించని పక్షంలో గేట్లు ఆపరేటింగ్ చేయడం భవిష్యత్తులో ఇబ్బందికరమే. ప్రమాదకర పరిస్థితుల్లో పూర్తిగా ఏకేబీఆర్ నుంచి నీటివిడుదల ఆపివేయడం సాధ్యంకాదు. అలాగే ఆనకట్టపై కంపచెట్లు పెరిగిపోతున్నా అధికారులు తొలగించడానికి చర్య లు తీసుకోవడంలేదు. రిజర్వాయర్ రక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్య త ఇచ్చి పటిష్టతకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు -
ప్రమాద స్థాయిలో రిజర్వాయర్లు
సీలేరు/ముంచంగిపుట్టు, న్యూస్‌లైన్: జల విద్యుత్కేంద్రాల రిజర్వాయర్లలో నీటి మట్టాలు ప్రమాద స్థాయికి చేరాయి. దీంతో సీలేరు కాంప్లెక్స్ పరిధిలోని అన్ని జలాశయాలు నిండుగా ఉన్నాయి. సరిహద్దు ఒడిశాలో భారీ వర్షాలతో ఇన్‌ఫ్లో పెద్ద ఎత్తున వచ్చిపడుతోంది. పరిస్థితి చేయి దాటిపోతే నీటిని వృథాగా విడుదల చేయకతప్పని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తికి డిమాండ్ లేకపోవడం, కొన్ని కేంద్రాల్లో యూనిట్లు పని చేయకపోవడంతో రిజర్వాయర్లలో నీరు ప్రమాద స్థాయికి చేరుకుంటోంది. డొంకరాయిలో పూర్తిస్థాయి నీటిమట్టం 1037 అడుగులకు ప్రస్తుతం 1036 అడుగులకు చేరింది. దీంతో మరో రెండు మూడు అడుగులు చేరితే నీరు వృథాగా విడుదల చేయవలసి వస్తుంది. అలాగే మోతుగూడెంలో 9030 అడుగులకు అక్కడ ఉన్న నాలుగు యూనిట్ల ద్వారా గురువారం నాటికి ఒక యూనిట్ మాత్రమే పనిచేయడంతో 9026.8 అడుగుల నీటిమట్టం చేరింది. విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కలగడంతో ఇక్కడ కూడా ఏఈపీ ద్వారా నీరు విడుదల చేయాల్సి ఉంది. మాచ్‌ఖండ్ జలవిద్యుత్కేంద్రానికి నీరందించే జోలాపుట్టు ప్రధాన రిజర్వాయర్ పూర్తి సామర్ధ్యం 2750 అడుగులు కాగా గురువారం నాటికి 2746.55 అడుగుల నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం ఉన్న నీటితో వచ్చే జూన్ వరకు విద్యుత్ ఉత్పత్తికి ఎటువంటి ఢోకా ఉండదని ప్రాజెక్టు అధికారులు పేర్కొంటున్నారు. ఆరు జనరేటర్లకు రెండు మూలకు చేరగా ప్రస్తుతం 1,2,4,5 నంబర్ల జనరేటర్లతో 76 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. మోతుగూడెం జలాశయంలో 9030 అడుగులకు గాను 9026 అడుగుల నీటిమట్టం ఉంది. అయితే ఇక్కడ నాలుగు యూనిట్లలో రెండు మాత్రమే వినియోగంలోఉండడంతో 110 మెగావాట్ల ద్వారా 2.756 మిలియన్ల విద్యుత్ ఉత్పత్తి జరగుతోంది. మరోవైపు మాచ్‌ఖండ్, సీలేరు, డొంకరాయి, మోతుగూడెం విద్యుత్ కేంద్రాల్లో వెరసి 1.4 మిలీనియం యూనిట్లు (ఎంయూ) విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అయితే హైదరాబాద్ అధికారులు ఆదేశాలతో ఇక్కడ అడపాదడపా విద్యుత్‌ను తయారు చేస్తున్నారు. రాష్ట్రంలో సమైక్యాంధ్ర ఉద్యమంతో పలు చోట్ల విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కలుగుతున్నప్పటికీ ఈ కేంద్రాల్లో విద్యుత్ డిమాండ్ అంతంతమాత్రంగా ఉంది. మరోవైపు జోలాపుట్టులో పూర్తిస్థాయి నీటిమట్టం 2750 అడుగులకు 2746.5 అడుగులకు చేరింది. బలిమెలలో 1513 అడుగుల నీటిమట్టంలో ప్రస్తుతం 1511.8 అడుగులుంది. డొంకరాయి జలాశయంలో 1037 అడుగులకు 1036.4 అడుగుల నీటి నిల్వ ఉంది. ఇక్కడ ఒక యూనిట్ ద్వారా 25 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిలో ప్రస్తుతం 20 మెగావాట్లు మాత్రమే తయారవుతోంది. ఎంత అడిగినా ఇవ్వడానికి సిద్ధం బలిమెలలో రాష్ట్ర వాటా నీరు ఎక్కువగా ఉండడంతో సీలేరు కాంప్లెక్స్ నాలుగు జలవిద్యుత్ కేంద్రాల్లో ఎంత విద్యుత్ అడిగిన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని జెన్కో అధికారులు చెబుతున్నారు. రిజర్వాయర్‌లో నీటిమట్టాలు మూడొంతులకు పైగా ఉండడంతో ఈ కాంప్లెక్స్‌లో రోజుకు 10.4 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి రాష్ట్రానికి వెలుగులు నింపేందుకు సిద్ధంగా ఉన్నారు.