ప్రమాద స్థాయిలో రిజర్వాయర్లు | The risk level reservoirs | Sakshi
Sakshi News home page

ప్రమాద స్థాయిలో రిజర్వాయర్లు

Published Fri, Sep 27 2013 1:36 AM | Last Updated on Fri, Sep 1 2017 11:04 PM

The risk level reservoirs

సీలేరు/ముంచంగిపుట్టు, న్యూస్‌లైన్: జల విద్యుత్కేంద్రాల రిజర్వాయర్లలో నీటి మట్టాలు ప్రమాద స్థాయికి చేరాయి. దీంతో సీలేరు కాంప్లెక్స్ పరిధిలోని అన్ని జలాశయాలు నిండుగా ఉన్నాయి. సరిహద్దు ఒడిశాలో భారీ వర్షాలతో ఇన్‌ఫ్లో పెద్ద ఎత్తున వచ్చిపడుతోంది. పరిస్థితి చేయి దాటిపోతే నీటిని వృథాగా విడుదల చేయకతప్పని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తికి డిమాండ్ లేకపోవడం, కొన్ని కేంద్రాల్లో యూనిట్‌లు పని చేయకపోవడంతో రిజర్వాయర్లలో నీరు ప్రమాద స్థాయికి చేరుకుంటోంది. డొంకరాయిలో పూర్తిస్థాయి నీటిమట్టం 1037 అడుగులకు ప్రస్తుతం 1036 అడుగులకు చేరింది.

దీంతో మరో రెండు మూడు అడుగులు చేరితే నీరు వృథాగా విడుదల చేయవలసి వస్తుంది. అలాగే మోతుగూడెంలో 9030 అడుగులకు అక్కడ ఉన్న నాలుగు యూనిట్ల ద్వారా గురువారం నాటికి ఒక యూనిట్ మాత్రమే పనిచేయడంతో 9026.8 అడుగుల నీటిమట్టం చేరింది. విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కలగడంతో ఇక్కడ కూడా ఏఈపీ ద్వారా నీరు విడుదల చేయాల్సి ఉంది. మాచ్‌ఖండ్ జలవిద్యుత్కేంద్రానికి నీరందించే జోలాపుట్టు ప్రధాన రిజర్వాయర్ పూర్తి సామర్ధ్యం 2750 అడుగులు కాగా గురువారం నాటికి 2746.55 అడుగుల నీరు నిల్వ ఉంది.

ప్రస్తుతం ఉన్న నీటితో వచ్చే జూన్ వరకు  విద్యుత్ ఉత్పత్తికి ఎటువంటి ఢోకా ఉండదని ప్రాజెక్టు అధికారులు పేర్కొంటున్నారు. ఆరు జనరేటర్లకు రెండు మూలకు చేరగా ప్రస్తుతం 1,2,4,5 నంబర్ల జనరేటర్లతో 76 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. మోతుగూడెం జలాశయంలో 9030 అడుగులకు గాను 9026 అడుగుల నీటిమట్టం ఉంది. అయితే ఇక్కడ నాలుగు యూనిట్లలో రెండు మాత్రమే వినియోగంలోఉండడంతో 110 మెగావాట్ల ద్వారా 2.756 మిలియన్‌ల విద్యుత్ ఉత్పత్తి జరగుతోంది.

మరోవైపు మాచ్‌ఖండ్, సీలేరు, డొంకరాయి, మోతుగూడెం విద్యుత్ కేంద్రాల్లో వెరసి 1.4 మిలీనియం యూనిట్లు (ఎంయూ) విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అయితే హైదరాబాద్ అధికారులు ఆదేశాలతో ఇక్కడ అడపాదడపా విద్యుత్‌ను తయారు చేస్తున్నారు. రాష్ట్రంలో సమైక్యాంధ్ర ఉద్యమంతో పలు చోట్ల విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కలుగుతున్నప్పటికీ ఈ కేంద్రాల్లో విద్యుత్ డిమాండ్ అంతంతమాత్రంగా ఉంది. మరోవైపు జోలాపుట్టులో పూర్తిస్థాయి నీటిమట్టం 2750 అడుగులకు 2746.5 అడుగులకు చేరింది. బలిమెలలో 1513 అడుగుల నీటిమట్టంలో ప్రస్తుతం 1511.8 అడుగులుంది. డొంకరాయి జలాశయంలో 1037 అడుగులకు 1036.4 అడుగుల నీటి నిల్వ ఉంది. ఇక్కడ ఒక యూనిట్ ద్వారా 25 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిలో ప్రస్తుతం 20 మెగావాట్లు మాత్రమే తయారవుతోంది.   
 
ఎంత అడిగినా ఇవ్వడానికి సిద్ధం

 బలిమెలలో రాష్ట్ర వాటా నీరు ఎక్కువగా ఉండడంతో సీలేరు కాంప్లెక్స్ నాలుగు జలవిద్యుత్ కేంద్రాల్లో ఎంత విద్యుత్ అడిగిన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని జెన్‌కో అధికారులు చెబుతున్నారు. రిజర్వాయర్‌లో నీటిమట్టాలు మూడొంతులకు పైగా ఉండడంతో ఈ కాంప్లెక్స్‌లో రోజుకు 10.4 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి రాష్ట్రానికి వెలుగులు నింపేందుకు సిద్ధంగా ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement