సాక్షి, హైదరాబాద్: జీవో 111 రద్దు అమలుపై స్తబ్ధ త నెలకొంది. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జంట జలాశయాల పరిరక్షణకు ఉద్దేశించిన 111 జీవోను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది ఏప్రిల్‌లో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో కొన్ని అభ్యంతరాలు రావడంతో ప్రభుత్వం నిబంధనల సడలింపులపై అధ్యయనం చేసేందుకు జీవో 69ను జారీ చేస్తూ, ప్రత్యేకంగా ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది.
ఆ కమిటీ నివేదిక అందించే దాకా 111 జీవో పరిధిలోని ప్రాంతాల్లో నిబంధనలు కొనసాగుతాయని ప్రభుత్వం హైకోర్టుకు స్పష్టం చేసింది. దీంతో 111జీవో పరిధిలోని 84 గ్రామాల్లో మళ్లీ స్తబ్ధత నెలకొంది. అయితే ప్రభుత్వం విధించిన ఆంక్షలు కేవలం సామాన్యులకే పరిమితమవుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల చేయి తడిపే అక్రమార్కుల నిర్మాణాలు మాత్రం జోరుగా సాగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి.
కాలయాపన కమిటీ..
హైదరాబాద్‌కు తాగునీరు అందించేందుకు ఉద్దేశించిన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జంట జలాశయాల పరిధిలో సుమారు 1.32 లక్షల ఎకరాలలో భూమి ఉంది. ఇక్కడ 84 గ్రామాలకు కొత్త మాస్టర్ ప్లాన్‌ను రూపొందించి ప్రణాళిక ప్రకారం హరిత నగరాన్ని నిర్మించాలని ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగానే 111 జీవోను రద్దు చేసింది. అయితే ఈ జలాశయాల పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై మార్గదర్శకాలు రూపొందించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు.
మున్సిపల్, ఆర్థిక, నీటిపారుదల శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, జలమండలి ఎండీ, కాలుష్య నియంత్రణ బోర్డు సభ్య కార్యదర్శి, హెచ్‌ఎండీఏ డైరెక్టర్ (ప్లానింగ్) సభ్యులుగా ఉండే ఈ కమిటీలో.. ఏయే అంశాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలన్న దానిపై విధివిధానాలను ప్రభుత్వం ఖరారు చేసింది. అయితే కమిటీ ఏర్పాటై నెలలు గడుస్తున్నా నేటికీ ఎలాంటి విధానాలను రూపొందించకపోవడం గమనార్హం.
ఆగని నిర్మాణాలు..
ఇప్పటికే 111 జీవో పరిధిలోని భూముల్లో సంపన్న వర్గాలు, పారిశ్రామికవేత్తలు, సినీ, రాజకీయ ప్రముఖులు, బ్యూరోక్రాట్స్ తక్కువ ధరకే పెద్ద ఎత్తున స్థలాలను కొనుగోలు చేసి, ఫామ్‌హౌస్‌లు, రిసార్ట్‌లను నిర్మించుకున్నారు. శంషాబాద్, మెయినాబాద్, రాజేంద్రనగర్, చేవెళ్ల, షాబాద్, కొత్తూరు శంకర్‌పల్లి మండలాల పరిధిలో అక్రమంగా లగ్జరీ విల్లాలు, హైరైజ్ నిర్మాణాలు జరుగుతున్నాయి.
111 జీవో ఎత్తివేశాక ఒక్క శంషాబాద్ పట్టణంలో దాదాపు 400 అక్రమ నిర్మాణాలు చేపట్టారని అంచనా. మొయినాబాద్ మండలంలో కొందరు రియల్టర్లు భూములను 10, 25 గుంటల చొప్పున ఫామ్ ల్యాండ్లుగా విక్రయిస్తున్నారు. వీటిని కొనుగోలు చేసిన చాలా మంది ఆయా ఫామ్ ల్యాండ్లలో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని తెలుస్తోంది. వీటిని ఫామ్ హౌస్, వీకెండ్ హోమ్స్‌గా మార్చేసి అద్దెకు ఇస్తున్నారని స్థానికులు చెపుతున్నారు.
రేటు పెట్టి మరీ వసూళ్లు..
అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు వస్తే నోటీసులు జారీ, క్షేత్ర స్థాయిలో విచారించి చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నా.. అవి అంతంతమాత్రమేనని విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే 111 జీవో పరిధిలో చాలా వరకు అక్రమ నిర్మాణాలు నేతలు, ప్రముఖులవే కావడంతో అధికారులు సైతం ఏమీ చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు స్థానిక మున్సిపల్ అధికారుల చేతులు తడపడంతో వారూ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఒక్కో భవనానికి రూ.2–5 లక్షల వరకు మున్సిపల్ అధికారులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
జీవో రద్దు తర్వాత రియల్ బూమ్..
జీవో111 పరిధిలోని పాత వెంచర్లలో గజం ధర రూ.3–4 వేల వరకు ఉండేది. కాగా, ఈ జీవోను రద్దు చేశాక ధరలు ఒక్కసారిగా గజానికి రూ.12 వేలకు పైగానే చెబుతున్నారు. శంషాబాద్ మండల కేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న భూములు ఎకరం ధర రూ.8 కోట్లకు పైగానే చెబుతున్నారు. విమానాశ్రయానికి దగ్గర్లోని గ్రామాల్లో ఎకరం రూ.3–5 కోట్ల వరకు పలుకుతున్నాయని చెపుతున్నారు.
సాంకేతికతను వినియోగించుకోవాలి
నీటి వనరుల సంరక్షణ పేరుతో అభివృద్ధికి అడ్డుకట్ట వేయకూడదు. జలాశయాల ఆక్రమణలు, కాలుష్య నియంత్రణకు సాంకేతికతను వినియోగించుకోవాలి. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినచర్యలు తీసుకుంటే వ్యవస్థ బాగుంటుంది. – కంచర్ల సంతోష్ రెడ్డి, సీఎండీ, డ్రీమ్ వ్యాలీ గ్రూప్
Comments
Please login to add a commentAdd a comment