అంతా తాగునీటికే | reservoir water to be used drinking purpose | Sakshi
Sakshi News home page

అంతా తాగునీటికే

Published Tue, Aug 26 2014 2:09 AM | Last Updated on Sat, Sep 2 2017 12:26 PM

అంతా తాగునీటికే

అంతా తాగునీటికే

 రిజర్వాయర్లలో నీటి వినియోగంపై టీ సర్కారు సూత్రప్రాయ నిర్ణయం!
 
 సాక్షి, హైదరాబాద్: తీవ్ర వర్షాభావ పరిస్థితులు.. ఒక్క చుక్క వానకోసం ఎదురుచూపులు.. ఖాళీగా బోసిపోతున్న రిజర్వాయర్లు.. వ్యవసాయానికే కాదు, తాగునీటికీ కటకట తప్పదేమోనన్న ఆందోళన.. వెరసి రాష్ట్రంలో సాగుకు నీటిని విడుదల చేయవద్దని తెలంగాణ సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించింది. రిజర్వాయర్లలో ఉన్న కాసిన్ని నీళ్లను తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని యోచిస్తోంది. రిజర్వాయర్లలో ఉన్న కొద్దిపాటి నీటిని వచ్చే జూన్ వర కు కాపాడాలన్న ఉద్దేశంతో.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్కారు పేర్కొంటోంది. ఇకపై సాగుకు నీటిని విడుదల చేయాలంటూ కోరవద్దని ప్రజా ప్రతినిధులకు, రైతులకు సూచిస్తోంది. అంతేకాదు ప్రధాన రిజర్వాయర్ నాగార్జునసాగర్ మినహా ఇతర రిజర్వాయర్ల నుంచి ఇకపై సాగుకు నీటి విడుదలను పూర్తిగా నిలిపివేయాలని కూడా అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఎగువ నుంచి ఇన్‌ఫ్లో పెరగకుంటే సాగర్ ఆయకట్టుకు ఇస్తున్న నీటిని సైతం నిలిపివేయాలని ఇప్పటికే ఆదేశాలు వెళ్లినట్లుగా తెలిసింది. ఇదే సమయంలో ప్రజల, పశువుల తాగునీటి అవసరాలకు అనుగుణంగా చిన్న నీటి కాలువలకు నీటిని వదులుతూ దాహార్తిని తీర్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
 రాష్ట్రంలో సరిగా వర్షాలు కురవకపోవడంతో ప్రాజెక్టులు వేటిలోకి కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో నీరు చేరలేదు. నాగార్జునసాగర్, జూరాల మినహా ఇతర ప్రధాన ప్రాజెక్టులు శ్రీరాంసాగర్, లోయర్ మానేరు, కడెం, నిజాంసాగర్, సింగూరుల్లో నీటినిల్వ దారుణంగా తగ్గిపోయింది. ప్రస్తుతం ప్రాజెక్టుల్లో ఉన్న నీటిలో మరో 40 నుంచి 50 టీఎంసీల నీటిని తాగు అవసరాలకు, చెరువులు నింపేందుకు వినియోగించాల్సి ఉంటుందని నీటి పారుదల శాఖ అధికారులు లెక్కలు వేశారు. దీంతో ప్రస్తుతం రిజర్వాయర్లలో ఉన్న నీటిని వచ్చే ఏడాది జూన్ వరకు క్రమపద్ధతిలో వాడుకోవాల్సి ఉన్నందున సాగుకు పూర్తిగా నీటి కేటాయింపులను నిలిపివేసి... తాగునీటికే పరిమితం చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
 
 చెరువులు నింపేందుకు కసరత్తు..
 
 మరోవైపు గ్రామాల్లో నెలకొన్న తీవ్ర నీటిఎద్దడిని నివారించేందుకు, అక్కడి ప్రజలకు, పశువులకు నీటి కొరత లేకుండా చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రధాన కాలువల ద్వారా చెరువులు నింపే వీలున్న చోట ఈ పనిని వేగవంతం చేసింది. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలోని లక్ష్మి కెనాల్ ద్వారా 42 చెరువులు, నిజాంసాగర్ కింద 10 చెరువులు, నల్లగొండలోని ఏఎంఆర్‌పీ ద్వారా 38 చెరువులు నింపిన నీటి పారుదల శాఖ... సోమవారం దేవాదుల రెండో దశ ద్వారా సలివాగు నుంచి భీమ్ ఘణపూర్ వరకు సుమారు 10 చెరువులను నింపేందుకు నీటిని విడుదల చేసింది. ఒకటి రెండు రోజుల్లో ఆదిలాబాద్ జిల్లాలోని సరస్వతి కెనాల్ ద్వారా 30 నుంచి 40 చెరువులను నింపాలని కూడా నిర్ణయించారు. ఇక మహబూబ్‌నగర్‌లోని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయల్‌సాగర్ ప్రాజెక్టుల ద్వారా ఇప్పటికే సాగు, తాగునీటి అవసరాలకు నీటి విడుదల కొనసాగుతోంది. అయితే.. కొన్ని చోట్ల ఇప్పటికే వేసిన నారుమళ్లకు సాగు నీరు అందించాలని రైతులు, ప్రజాప్రతినిధుల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి వస్తోంది. కానీ నారుమళ్లకు ప్రస్తుతానికి నీరందిస్తే పంట పొట్ట దశలో నీరెలా? అప్పుడు రైతుల నుంచి వచ్చే ఒత్తిళ్లను ఎలా అధిగమిస్తాం? పంటలపై రైతులు పెట్టిన పెట్టుబడికి ఎవరు బాధ్యులు? అన్న ప్రశ్నలు ప్రభుత్వం నుంచి ప్రజా ప్రతినిధులకు ఎదురవుతున్నాయి. అందువల్ల ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సాగుకు నీరివ్వాలని కోరవద్దని, సర్కారుకు సహకరించాలని ప్రభుత్వ పెద్దలు విజ్ఞప్తి చేస్తున్నారు.
 
 పడిపోయిన నీటిమట్టాలు..
 
 రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన రిజర్వాయర్లలో నీటి నిల్వలు చాలా దారుణంగా పడిపోయాయి. గత కొన్నేళ్లలో ఎన్నడూ లేనంత స్థాయికి నీటి మట్టం తగ్గిపోవడంతో.. పరిస్థితి ఆందోళనకరంగా మారింది. శ్రీరాంసాగర్‌లో 90 టీఎంసీల సామర్థ్యానికిగాను 22.7 టీఎంసీలు, సింగూరులో 30 టీఎంసీలకు 11.57, కడెంలో 7.6 టీఎంసీలకు 3.66, లోయర్ మానేరులో 24.07 టీఎంసీలకు 9.02, నిజాంసాగర్‌లో 17.08 టీఎంసీలకు 4.99, సాగర్‌లో 312.64 టీఎంసీలకు 200.19 టీఎంసీల నీరు ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఇందులో ప్రస్తుతం ఒక్క నాగార్జునసాగర్ కింద మాత్రమే సుమారు 4 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుండగా.. సింగూరు నుంచి ఘణపూర్ ఆయకట్టుకు 2 టీఎంసీలు, నిజాంసాగర్ కింది ఆయకట్టుకు మరో 3 టీఎంసీల నీటిని విడుదల చేశారు. మిగతా ఏ ప్రాజెక్టుల నుంచి సాగుకు నీరు ఇవ్వనే లేదు. ఇంతేకాదు.. ఎగువ నుంచి ఇన్‌ఫ్లో పెరగకుంటే సాగర్ ఆయకట్టుకు ఇస్తున్న నీటిని సైతం నిలిపివేయాలని ఇప్పటికే ఆదేశాలు వెళ్లినట్లుగా సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement