Santhosh Reddy
-
111 జీవో రద్దు అమలుపై స్తబ్ధత
సాక్షి, హైదరాబాద్: జీవో 111 రద్దు అమలుపై స్తబ్ధ త నెలకొంది. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జంట జలాశయాల పరిరక్షణకు ఉద్దేశించిన 111 జీవోను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది ఏప్రిల్‌లో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో కొన్ని అభ్యంతరాలు రావడంతో ప్రభుత్వం నిబంధనల సడలింపులపై అధ్యయనం చేసేందుకు జీవో 69ను జారీ చేస్తూ, ప్రత్యేకంగా ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఆ కమిటీ నివేదిక అందించే దాకా 111 జీవో పరిధిలోని ప్రాంతాల్లో నిబంధనలు కొనసాగుతాయని ప్రభుత్వం హైకోర్టుకు స్పష్టం చేసింది. దీంతో 111జీవో పరిధిలోని 84 గ్రామాల్లో మళ్లీ స్తబ్ధత నెలకొంది. అయితే ప్రభుత్వం విధించిన ఆంక్షలు కేవలం సామాన్యులకే పరిమితమవుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల చేయి తడిపే అక్రమార్కుల నిర్మాణాలు మాత్రం జోరుగా సాగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. కాలయాపన కమిటీ.. హైదరాబాద్‌కు తాగునీరు అందించేందుకు ఉద్దేశించిన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జంట జలాశయాల పరిధిలో సుమారు 1.32 లక్షల ఎకరాలలో భూమి ఉంది. ఇక్కడ 84 గ్రామాలకు కొత్త మాస్టర్ ప్లాన్‌ను రూపొందించి ప్రణాళిక ప్రకారం హరిత నగరాన్ని నిర్మించాలని ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగానే 111 జీవోను రద్దు చేసింది. అయితే ఈ జలాశయాల పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై మార్గదర్శకాలు రూపొందించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. మున్సిపల్, ఆర్థిక, నీటిపారుదల శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, జలమండలి ఎండీ, కాలుష్య నియంత్రణ బోర్డు సభ్య కార్యదర్శి, హెచ్ఎండీఏ డైరెక్టర్ (ప్లానింగ్) సభ్యులుగా ఉండే ఈ కమిటీలో.. ఏయే అంశాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలన్న దానిపై విధివిధానాలను ప్రభుత్వం ఖరారు చేసింది. అయితే కమిటీ ఏర్పాటై నెలలు గడుస్తున్నా నేటికీ ఎలాంటి విధానాలను రూపొందించకపోవడం గమనార్హం. ఆగని నిర్మాణాలు.. ఇప్పటికే 111 జీవో పరిధిలోని భూముల్లో సంపన్న వర్గాలు, పారిశ్రామికవేత్తలు, సినీ, రాజకీయ ప్రముఖులు, బ్యూరోక్రాట్స్ తక్కువ ధరకే పెద్ద ఎత్తున స్థలాలను కొనుగోలు చేసి, ఫామ్‌హౌస్‌లు, రిసార్ట్‌లను నిర్మించుకున్నారు. శంషాబాద్, మెయినాబాద్, రాజేంద్రనగర్, చేవెళ్ల, షాబాద్, కొత్తూరు శంకర్పల్లి మండలాల పరిధిలో అక్రమంగా లగ్జరీ విల్లాలు, హైరైజ్ నిర్మాణాలు జరుగుతున్నాయి. 111 జీవో ఎత్తివేశాక ఒక్క శంషాబాద్ పట్టణంలో దాదాపు 400 అక్రమ నిర్మాణాలు చేపట్టారని అంచనా. మొయినాబాద్ మండలంలో కొందరు రియల్టర్లు భూములను 10, 25 గుంటల చొప్పున ఫామ్ ల్యాండ్లుగా విక్రయిస్తున్నారు. వీటిని కొనుగోలు చేసిన చాలా మంది ఆయా ఫామ్ ల్యాండ్లలో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని తెలుస్తోంది. వీటిని ఫామ్ హౌస్, వీకెండ్ హోమ్స్‌గా మార్చేసి అద్దెకు ఇస్తున్నారని స్థానికులు చెపుతున్నారు. రేటు పెట్టి మరీ వసూళ్లు.. అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు వస్తే నోటీసులు జారీ, క్షేత్ర స్థాయిలో విచారించి చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నా.. అవి అంతంతమాత్రమేనని విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే 111 జీవో పరిధిలో చాలా వరకు అక్రమ నిర్మాణాలు నేతలు, ప్రముఖులవే కావడంతో అధికారులు సైతం ఏమీ చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు స్థానిక మున్సిపల్ అధికారుల చేతులు తడపడంతో వారూ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఒక్కో భవనానికి రూ.2–5 లక్షల వరకు మున్సిపల్ అధికారులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. జీవో రద్దు తర్వాత రియల్ బూమ్.. జీవో111 పరిధిలోని పాత వెంచర్లలో గజం ధర రూ.3–4 వేల వరకు ఉండేది. కాగా, ఈ జీవోను రద్దు చేశాక ధరలు ఒక్కసారిగా గజానికి రూ.12 వేలకు పైగానే చెబుతున్నారు. శంషాబాద్ మండల కేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న భూములు ఎకరం ధర రూ.8 కోట్లకు పైగానే చెబుతున్నారు. విమానాశ్రయానికి దగ్గర్లోని గ్రామాల్లో ఎకరం రూ.3–5 కోట్ల వరకు పలుకుతున్నాయని చెపుతున్నారు. సాంకేతికతను వినియోగించుకోవాలి నీటి వనరుల సంరక్షణ పేరుతో అభివృద్ధికి అడ్డుకట్ట వేయకూడదు. జలాశయాల ఆక్రమణలు, కాలుష్య నియంత్రణకు సాంకేతికతను వినియోగించుకోవాలి. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినచర్యలు తీసుకుంటే వ్యవస్థ బాగుంటుంది. – కంచర్ల సంతోష్ రెడ్డి, సీఎండీ, డ్రీమ్ వ్యాలీ గ్రూప్ -
గుండెపోటుతో తమ్ముడు.. పెద్ద కర్మరోజు అన్నకు కూడా..
కరీంనగర్: తమ్ముడి మృతి ని తట్టుకోలేక అన్న గుండె ఆగింది. తమ్ముడు గుండెపోటుతో మృతిచెందగా.. పెద్దకర్మరోజు అన్న కూడా గుండెపోటుతో కుప్పకూలాడు. చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశాడు. ఈ విషాద ఘటన తిమ్మాపూర్ మండలం రేణికుంటలో జరిగింది. రేణికుంటకు చెందిన ఉమ్మెంతల చంద్రారెడ్డికి ఇద్దరు కొడుకులు సంతోష్‌రెడ్డి(30), మధుకర్‌రెడ్డి(26) ఉన్నారు. పెద్దకొడుకు సంతోష్‌రెడ్డి కరీంనగర్లో, మధుకర్‌రెడ్డి హైదరాబాద్‌లో ప్రయివేటు ఉద్యోగం చేస్తున్నారు. ఇద్దరికీ పెళ్లికాలేదు. 20 రోజుల క్రితం మధుకర్‌రెడ్డికి జ్వరం వచ్చింది. హైదరాబాద్‌లోనే ఓ ఆస్పత్రిలో చేరగా రక్తకణాలు తగ్గినట్లు డాక్టర్లు చెప్పారు. చికిత్స తీసుకుంటున్న క్రమంలో గుండెపోటుకు గురై ఈనెల 3న మృతిచెందాడు. తమ్ముడి పెద్ద కర్మరోజు సంతోష్ రెడ్డి గుండెపోటుకు గురయ్యాడు. ఆయనను కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్ తీసుకెళ్లారు. చికిత్సకు సుమారు రూ.20 లక్షలకు పైగా ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పడంతో నిమ్స్‌కు తరలించారు. పరిస్థితి విషమించడంతో బుధవారం సంతోష్ మృతిచెందాడు. పక్షం రోజుల వ్యవధిలో ఇద్దరు కొడుకులు మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
వార్డు మెంబర్‌గా ఓడి.. ఎమ్మెల్యేగా గెలిచి..
సాక్షి, ఆర్మూర్ (నిజామాబాద్) : తన సొంత గ్రామమైన సిరికొండ మండలం ముచ్కూర్‌లో వార్డు మెంబర్‌గా ఓటమి పాలైన శనిగరం సంతోష్ రెడ్డి తరువాతి కాలంలో రాష్ట్రంలో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్ర కేబినెట్లో అత్యున్నతమైన మంత్రి పదవులను నిర్వహించారు. కళాశాల విద్యనభ్యసిస్తున్న రోజుల్లోనే విద్యార్థి నాయకుడిగా తనదైన ప్రత్యేక గుర్తింపును సాధించుకున్న శనిగరం సంతోష్‌రెడ్డి తరువాత కాలంలో నాలుగు పర్యాయాలు ఆర్మూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్ర కేబినెట్లో ఉన్నత పదవులను అలకరించి రాజకీయ చతురుడిగా, మృదు స్వభావిగా గుర్తింపు సాధించుకున్నారు. 1964–65లో కళాశాల విద్యనభ్యసిస్తున్న రోజుల్లో నిజామాబాద్ గిరిరాజ్ కళాశాల జనరల్ సెక్రెటరీగా సంతోష్‌రెడ్డి ఎన్నికయ్యారు. 1966–67లో కళాశాల అధ్యక్షుడిగా కొనసాగారు. బడుగు, బలహీనవర్గాల నేత, మాజీ మంత్రి అర్గుల్ రాజారాం, సంతోష్‌రెడ్డి బావ అయిన స్వాతంత్ర సమరయోధుడు బీఆర్ గంగారెడ్డి స్ఫూర్తి, ప్రోద్భలంతో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. 1969లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమంలో అర్గుల్ రాజారాంతో కలిసి పాల్గొన్ని జైలుకు సైతం వెళ్లారు. 1970లో తన స్వస్థలమైన భీమ్‌గల్ మండలం ముచ్కూర్ గ్రామ పంచాయతీ మెంబర్‌గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1971లో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా, నిజామాబాద్ బీడీ మజ్దూర్ సంఘ్ జనరల్ సెక్రెటరీగా ఎన్నుకోబడ్డారు. 1975లో యువజన కాంగ్రెస్ స్టేట్ కౌన్సిల్ మెంబర్‌గా నియమింపబడ్డారు. తన రాజకీయ గురువుల సహకారంతో 1978లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆర్మూర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. నాటి నుంచి ఇక ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అదే ఏడాది మొట్టమొదటి సారిగా శాసనసభకు ఎన్నిక కావడం విశేషం. 1983లో సినీ నటుడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన తరువాత జరిగిన ఎన్నికల్లో రాష్ట్రమంతా తెలుగుదేశం అభ్యర్థులు అధిక సంఖ్యలో గెలుపొందారు. ఆ సమయంలో సంతోష్‌రెడ్డి ఆర్మూర్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొంది చరిత్ర సృష్టించారు. 1985లో టీడీపీ అభ్యర్థి ఏలేటి మహిపాల్‌రెడ్డి చేతుల్లో ఓటమి పాలయ్యారు. 1989లో టీడీపీ అభ్యర్థి వేముల సురేందర్‌రెడ్డిపై విజయం సాధించి మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1990 – 91 వరకు రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా, 1991– 92 వరకు నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి కేబినెట్లో ఆర్థిక శాఖ మంత్రిగా, 1992–93 వరకు కోట్ల విజయభాస్కర్‌రెడ్డి కేబినెట్లో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 1994లో టీడీపీ అభ్యర్థి ఏలేటి అన్నపూర్ణపై ఓటమి పాలయ్యారు. 1999లో నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి 3,500 స్వల్ప ఓట్లతో ఓటమి పాలయ్యారు. తన రాజకీయ జీవితం ముగిసిందన్న సమయంలో మంత్రి చెన్నారెడ్డితో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో జైలు జీవితం గడిపిన అనుభవంతో అదే నినాదంతో ఆవిర్భవించిన టీఆర్ఎస్లో చేరి 2001లో భీమ్‌గల్ జెడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొందారు. మెజార్టీ సభ్యుల బలంతో నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. 2004 ఎన్నికల్లో జెడ్పీ చైర్మన్ పదవికి రాజీనామా సమర్పించి టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆర్మూర్ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసి భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీఆర్ఎస్లో అసమ్మతి బాట పట్టి కాంగ్రెస్ వాదిగా కొనసాగారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేశారనే ఆరోపణలు ఎదుర్కొన్న ఆయన తన పదవీ కాలం ముగియకముందే రాజీనామా సమర్పించారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో ఇకముందు ఎలాంటి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనని సంతోష్‌రెడ్డి ఇదివరకే ప్రకటించారు. తాను కాంగ్రెస్‌లో చేరకున్నప్పటికీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో ఉన్న సత్సంబంధాలతో తన తనయుడు శనిగరం శ్రీనివాస్‌రెడ్డి(వాసు)ని 2009 ఎన్నికల్లో బాల్కొండ నియోజకవర్గం నుంచి పోటీకి నిలిపారు. శ్రీనివాస్ రెడ్డి ఓటమి పాలవడంతో అమెరికాకు వెళ్లిపోయాడు. అయినా సంతోష్ రెడ్డి తన అనారోగ్యాన్ని లెక్క చేయకుండా ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డితో విభేదించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో తిరిగి దిగ్విజయ్ సింగ్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తుతం ఆరోగ్యం సహకరించకపోవడంతో నియోజకవర్గ రాజకీయాలకు దూరంగా ఉంటూ చికిత్స చేయించుకుంటున్నారు. -
లారీ, బైక్ ఢీ: ఇద్దరికి తీవ్రగాయాలు
హైదరాబాద్: వేగంగా వెళ్తున్న ద్విచక్రవాహనం ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు యువకులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోని ఆటోనగర్ ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి దాటాక చోటుచేసుకుంది. వివరాలు.. హయత్ నగర్‌కు చెందిన సంతోష్‌రెడ్డి (28) తన స్నేహితుడితో కలిసి బైక్‌పై హయత్‌నగర్ నుంచి పనామాకు వస్తున్న సమయంలో ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టారు. దీంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కాగా.. సంతోష్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
అక్బరుద్దీన్ ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వం అనుమతి
హైదరాబాద్: మత విద్వేషాలను రెచ్చగొట్టి శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా ప్రసంగం చేసినందుకు 2004లో చాంద్రాయణగుట్ట పోలీసులు నమోదు చేసిన కేసులో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీని ప్రాసిక్యూట్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి సంతోష్‌రెడ్డి శుక్రవారం ఉత్తర్వు జారీ చేశారు. 2004 ఎన్నికల సమయంలో హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్ట పరిధి గ్రాండ్ సర్కిల్ హోటల్ వద్ద జరిగిన సభలో అక్బరుద్దీన్ మత విద్వేషాలను రెచ్చగొట్టేలా మాట్లాడి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నించారంటూ పోలీసులు 2.4.2004న ఐపీసీ సెక్షన్ 153-ఎ, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 125 కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో అక్బరుద్దీన్‌ను ప్రాసిక్యూట్ చేసేందుకు పోలీసులు ప్రభుత్వ అనుమతిని కోరారు. ఈ కేసుకు సంబంధించిన రికార్డులను పరిశీలించిన ప్రభుత్వం, ఆయున ప్రాసిక్యూషన్‌కు అనుమతిస్తూ ఉత్తర్వు జారీ చేసింది. -
తెలంగాణ ఏర్పడగానే సీఎంపై సీబీఐ విచారణ: హరీష్‌రావు
పాలకుర్తి, న్యూస్‌లైన్ : ముఖ్యమంత్రిగా అవినీతికి పాల్పడిన కిరణ్‌కుమార్‌రెడ్డితోపాటు ఆయన తమ్ముడు సంతోష్‌రెడ్డిపై తెలంగాణ ఏర్పడగానే సీబీఐ విచారణ జరిపించి జైలుకు పంపిస్తామని టీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్‌రావు స్పష్టం చేశారు. వరంగల్ జిల్లా పాలకుర్తిలో గురువారం జరిగిన నియోజకవర్గస్థారుు టీఆర్ఎస్ కార్యకర్తల శిక్షణ శిబిరంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రకటన రాగానే సీఎం చిత్తూరు జిల్లాకు రూ.7,200 కోట్ల నిధులతో హడావుడిగా శంకుస్థాపనలు చేశారన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్న మెడికల్ కాలేజీలు మూతపడుతుంటే.. చిత్తురు జిల్లాలో రూ.120 కోట్లతో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నారని ధ్వజమెత్తారు.