అక్బరుద్దీన్ ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వం అనుమతి
హైదరాబాద్: మత విద్వేషాలను రెచ్చగొట్టి శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా ప్రసంగం చేసినందుకు 2004లో చాంద్రాయణగుట్ట పోలీసులు నమోదు చేసిన కేసులో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీని ప్రాసిక్యూట్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి సంతోష్‌రెడ్డి శుక్రవారం ఉత్తర్వు జారీ చేశారు. 2004 ఎన్నికల సమయంలో హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్ట పరిధి గ్రాండ్ సర్కిల్ హోటల్ వద్ద జరిగిన సభలో అక్బరుద్దీన్ మత విద్వేషాలను రెచ్చగొట్టేలా మాట్లాడి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నించారంటూ పోలీసులు 2.4.2004న ఐపీసీ సెక్షన్ 153-ఎ, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 125 కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో అక్బరుద్దీన్‌ను ప్రాసిక్యూట్ చేసేందుకు పోలీసులు ప్రభుత్వ అనుమతిని కోరారు. ఈ కేసుకు సంబంధించిన రికార్డులను పరిశీలించిన ప్రభుత్వం, ఆయున ప్రాసిక్యూషన్‌కు అనుమతిస్తూ ఉత్తర్వు జారీ చేసింది.