వరుణుడు కరుణించడంతో గ్రేటర్ దాహార్తిని తీర్చే జలాశయాలు కళకళలాడుతున్నాయి. గతేడాదితో పోలిస్తే జంటజలాశయాలు మినహా..
సాక్షి, సిటీబ్యూరో: వరుణుడు కరుణించడంతో గ్రేటర్ దాహార్తిని తీర్చే జలాశయాలు కళకళలాడుతున్నాయి. గతేడాదితో పోలిస్తే జంటజలాశయాలు మినహా.. సింగూరు, మంజీరా, అక్కంపల్లి, నాగార్జునసాగర్ జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి. నాగార్జునసాగర్, మంజీరా జలాశయాలు పూర్తిస్థాయి నీటి మట్టం సంతరించుకోగా, సింగూరు, అక్కంపల్లి జలాశయాల్లో ఎగువ ప్రాంతాల నుంచి వచ్చి చేరుతున్న ఇన్‌ఫ్లోతో మరికొద్ది రోజుల్లో నిండుకుండలుగా మారడం తథ్యమని జలమండలి అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
కాగా ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జంట జలాశయాలు మా త్రం ఇప్పటివరకు గరిష్ట మట్టాన్ని చేరుకోకపోవడం గమనార్హం. ఎగువ ప్రాంతాల్లోని ఆక్రమణలు, ఇసు క, మట్టి తవ్వకాలు, అక్రమ నిర్మాణాల కారణంగానే ఈ జలాశయాల్లోకి ఆశించిన స్థాయిలో ఇన్‌ఫ్లో రావ డం లేదని జలమండలి వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి.
నగర అవసరాలకు ఓకే
నగర తాగునీటి అవసరాలకు మరో ఏడాది పాటు (365రోజులు) ఢోకాలేదని జలమండలి వర్గాలు తెలిపాయి. కాగా గండిపేట్ (ఉస్మాన్‌సాగర్) జలాశయం నిల్వలు 270 రోజులు, హిమాయత్‌సాగర్‌లోని నీటి నిల్వలు 221 రోజులపాటు నగర అవసరాలకు సరిపోతాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ రెండు జలాశయాల నుంచి రోజువారీగా 20 మిలియన్ గ్యాలన్ల నీటిని సేకరిస్తున్న విషయం విదితమే. ఇక సింగూరు గరిష్ట మట్టం 1717.850 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం1713.010 అడుగులకు చేరుకుంది. మంజీరా గరిష్ట మట్టం 1651.750 అడుగులు కాగా..ప్రస్తుతం పూర్తిస్థాయిలో జలకళ సంతరించుకుంది.
ఈ రెండు జలాశయాల నుంచి నిత్యం 100 మిలియన్ గ్యాలన్ల నీటిని సేకరిస్తున్నారు. అక్కంపల్లి గరిష్ట మట్టం 245 మీటర్లు కాగా ఈ జలాశయం ప్రస్తుతం 240.200 మీటర్ల నీటిమట్టంతో కళకళలాడుతోంది. నాగార్జున సాగర్‌లోనూ కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. జలాశయం గరిష్ట నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం ఎగువ నుంచి వచ్చి చేరుతున్న వరదనీటితో పూర్తిస్థాయిలో నిండింది. కాగా అక్కంపల్లి నుంచి రోజువారీగా కృష్ణా మొదటి, రెండవ దశల ద్వారా రోజువారీగా 180 మిలియన్ గ్యాలన్ల నీటిని మహా నగరానికి తరలిస్తున్నారు. మొత్తంగా ఆయా జలాశయాల నుంచి నగరానికి 300 మిలియన్ గ్యాలన్ల నీటిని గ్రేటర్‌కు తరలిస్తున్న విషయం విదితమే.