దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపధ్యంలో సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) శుభవార్త చెప్పింది. గత ఏడాది సెప్టెంబర్ తర్వాత దేశంలోని ప్రధాన జలాశయాల నీటిమట్టం తొలిసారిగా పెరిగిందని సీడబ్ల్యూసీ పేర్కొంది. అయితే స్వల్పంగానే నీటిమట్టం పెరగడంతో జలమండలి ఆందోళన వ్యక్తం చేస్తోంది.
భారతదేశంలోని 150 రిజర్వాయర్లను పర్యవేక్షించే సీడబ్ల్యూసీ తాజా సమాచారాన్ని మీడియాకు వెల్లడించింది. 150 రిజర్వాయర్లలో 20 జలవిద్యుత్ ప్రాజెక్టులకు ఉపయుక్తమవుతున్నాయి. వీటి మొత్తం నిల్వ సామర్థ్యం 35.30 బిలియన్ క్యూబిక్ మీటర్లు (బీసీఎం. గత సంవత్సరం ఇదే కాలంలో అందుబాటులో ఉన్న నిల్వ 44.06 బీసీఎం. సాధారణ నిల్వ స్థాయి 50.422 బీసీఎం. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్‌లలో మొత్తం 19.663 బీసీఎం నిల్వ సామర్థ్యంతో 10 రిజర్వాయర్‌లు ఉన్నాయి. ఇవి సీడబ్ల్యూసీ పర్యవేక్షణలో ఉన్నాయి.
అసోం, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, త్రిపుర, నాగాలాండ్, బీహార్‌లతో సహా తూర్పు ప్రాంతంలో 23 రిజర్వాయర్లు ఉన్నాయి. వీటి మొత్తం నిల్వ సామర్థ్యం 20.430 బీసీఎం. ప్రస్తుత నిల్వ 3.979 బీసీఎం (19 శాతం). ఇది గత సంవత్సరం కంటే 20 శాతం తక్కువ. గుజరాత్, మహారాష్ట్రలోని పశ్చిమ ప్రాంతంలో 49 రిజర్వాయర్లు ఉన్నాయి. వీటి మొత్తం నిల్వ సామర్థ్యం 37.130 బీసీఎం. ప్రస్తుతం నిల్వ 7.949 బీసీఎం (21 శాతం). గత సంవత్సరం ఇది 27 శాతం. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ సహా మధ్య ప్రాంతంలో 26 రిజర్వాయర్లు ఉన్నాయి. వీటిలో 48.227 బీసీఎం నిల్వ సామర్థ్యం ఉంది. ప్రస్తుత నిల్వ 12.26 బీసీఎం(25 శాతం). గత సంవత్సరం ఇది 35 శాతం.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడుతో సహా దక్షిణ ప్రాంతంలో 42 రిజర్వాయర్లు ఉన్నాయి. మొత్తం నిల్వ సామర్థ్యం 53.334 బీసీఎం. నిల్వ ఇప్పుడు 10.152 బీసీఎం (19.03 శాతం) వద్ద ఉంది. గత సంవత్సరం 19.43 శాతం. తాద్రీ నుంచి కన్యాకుమారి వరకు బ్రహ్మపుత్ర, సబర్మతి, పశ్చిమాన ప్రవహించే నదులలో సాధారణ నీటి నిల్వ కంటే మెరుగ్గా ఉన్నాయి. సింధు, సువర్ణరేఖ, మహి తదితర నదుల్లో నీటి నిల్వలు సాధారణ స్థాయికి చేరువలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మహానది, కావేరి, బ్రాహ్మణి, వైతరణి నదులో తక్కువ నీటి నిల్వలు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment