భారతదేశంలో నేటివరకూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయని కొన్ని ప్రాంతాలు ఉన్నాయని తెలిస్తే ఎవరికైనాసరే ఆశ్చర్యం కలుగుతుంది. కానీ ఇది నిజం.. ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్ ప్రభావిత బస్తర్ ప్రాంతంలోని 13 గ్రామాల్లో నేటి వరకూ జాతీయ జెండాను ఎగురవేయలేదు. ఈరోజు (పంద్రాగస్టు) ఈ గ్రామాల్లో మువ్వన్నెల జండా రెపరెపలాడనుంది.
ఈ వివరాలను రాష్ట్ర పోలీసు అధికారులు మీడియాకు తెలియజేశారు. ఈ గ్రామాల్లో నూతన భద్రతా బలగాల శిబిరాలు ఏర్పాటు చేసిన దరిమిలా అభివృద్ధికి మార్గం సుగమమైందన్నారు. బస్తర్ రీజియన్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పీ సుందర్‌రాజ్ ఈరోజు (గురువారం) నెర్‌ఘాట్ (దంతెవాడ జిల్లా), పానిదోబిర్ (కంకేర్), గుండం, పుట్‌కేల్, చుత్వాహి (బీజాపూర్), కస్తూర్‌మెట్ట, మస్పూర్, ఇరాక్‌భట్టి, మొహంది (నారాయణపూర్), టేకలగూడెం, పువర్తి, లఖపాల్, పూలన్‌పాడ్ (సుక్మా) గ్రామాల్లో తొలిసారిగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయనున్నారు.
గత ఏడాది గణతంత్ర దినోత్సవాల అనంతరం ఈ ప్రాంతాల్లో భద్రతా శిబిరాలను ఏర్పాటు చేసినట్లు సుందర్‌రాజ్ మీడియాకు తెలిపారు. కొత్త క్యాంపుల ఏర్పాటు తర్వాత ఈ ప్రాంతానికి కొత్త గుర్తింపు వచ్చింది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాజధాని రాయ్‌పూర్‌తో సహా అన్ని జిల్లాల్లో సన్నాహాలు పూర్తి చేశారు. గురువారం ఉదయం రాయ్‌పూర్‌లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి జాతీయ జెండాను ఎగురవేయనున్నారని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment