State Power
-
రాజ్యాధికారమే లక్ష్యం కావాలి
కోరుట్ల: రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు సాగాలని పద్మశాలీ ఆత్మగౌరవ సభలో వక్తలు పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఆదివారం జరిగిన పద్మశాలీ ఆత్మగౌరవ యుద్ధభేరి సభకు ప్రముఖ కవి గుంటుక నరసయ్య పంతులు ప్రాంగణంగా నామకరణం చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 50 వేల మంది కులబాంధవులు తరలివచ్చారు. తొలుత ముఖ్య అతిథిగా హాజరైన మధ్యప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి (చీఫ్ సెక్రటరీ) పరికిపండ్ల నరహరి మాట్లాడుతూ, పద్మశాలీలు ఐక్యంగా ముందుకు సాగితే సాధించలేనిదేదీ లేదని, చట్టసభల్లో ప్రాతినిధ్యం సాధించడంపై దృష్టి పెట్టాలని కోరారు. పిల్లలు ఉన్నత చదువులు చదివి సంఘం ఐక్యతకు కృషి చేయాలన్నారు. పద్మశాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామ శ్రీనివాస్ మాట్లాడుతూ, రాజకీయాల్లో ప్రాధాన్యత సాధించేవరకూ పద్మశాలీలు విశ్రమించవద్దని కోరారు. అందరూ ఏకమై ‘మనఓటు మనకే’ నినాదంతో ముందుకు రావాలని కోరారు.కర్నూలు ఎంపీ సంజయ్ మాట్లాడుతూ, పద్మశాలీలు ఎక్కడున్నా జన్యుపరమైన సంబంధం కలుపుతుందన్నారు. ఏపీలో పద్మశాలీలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని గుర్తుచేశారు. ఎంపీగా పార్లమెంట్లో పద్మశాలీలకు చెందిన రెండు వీవర్స్ బిల్లులు ప్రవేశపెట్టడానికి కృషి చేశానని తెలిపారు. రాజ్యసభ మాజీ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ మాట్లాడుతూ, పద్మశాలీ కులశక్తి విచ్ఛిన్నం కాకుండా పోరాటం చేస్తే సత్ఫలితాలు ఉంటాయన్నారు. ఎమ్మెల్సీ ఎల్.రమణ మాట్లాడుతూ, రాజకీయ పార్టీ ఏదైనా పద్మశాలీలు ఐక్యంగా ఉండాలని సూచించారు. వరంగల్ మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ, రాజకీయ అస్థిత్వాన్ని సాధించే దిశ గా ఏర్పాటు చేసిన ఈ సభకు వేలాదిగా పద్మశాలీ లు తరలిరావడం అభినందనీయమన్నారు. ఆత్మ గౌరవ యుద్ధభేరి సభ కమిటీ రాష్ట్ర చైర్మన్ బసవ లక్ష్మీనర్సయ్య మాట్లాడుతూ, చట్టసభల్లో ప్రాతి నిధ్యం ఉంటేనే పద్మశాలీల సమస్యలకు పరిష్కారం దక్కుతుందన్నారు. బీసీల్లో అతిపెద్ద సామాజికవర్గంగా ఉన్నా.. చట్టసభల్లో ఆశించిన రీతిలో ప్రాతినిధ్యం దక్కడం లేదని ఆవేదన చెందారు. మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, జగిత్యాల జిల్లా పద్మశాలీ సంఘం అధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి, పద్మశాలీ సంఘం రాష్ట్ర నాయకులు గజ్జెల శ్రీనివాస్, జక్కుల ప్రసాద్ పాల్గొన్నారు. -
మహానేత స్వప్నం.. కృష్ణపట్నం
నేడు జాతికి అంకితం కృష్ణపట్నం నుంచి సాక్షి ప్రతినిధి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కలల ప్రాజెక్టు ‘కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ కేంద్రం’ వెలుగులు విరజిమ్మబోతోంది. అవిభక్త రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చాలన్న సంకల్పంతో కేంద్రంతో పోరాడి అనుమతులు తెచ్చిన ఈ ప్రాజెక్టుకు వైఎస్సార్ చేతుల మీదుగానే పునాది పడింది. దేశంలో మరెక్కడా లేని విధంగా 1,600 మెగావాట్లతో (ఒక్కొక్కటీ 800 మెగావాట్లు) సూపర్ క్రిటికల్ థర్మల్ ప్రాజెక్టును విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించారు. వైఎస్ కాలంలోనే రెండు యూనిట్ల పనులన్నీ దాదాపు పూర్తయ్యాయి. గతేడాది వాణిజ్య ఉత్పత్తిలోకి అడుగు పెట్టిన ఈ ప్రాజెక్టులను శనివారం సీఎం చంద్రబాబు జాతికి అంకితం చేయనున్నారు. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్, ఏపీ జెన్కో ఎండీ విజయానంద్ తదితరులు హాజరవుతున్నారు. ఈ ప్రాజెక్టుతో రాష్ట్రానికి అదనంగా రోజుకు 39 మిలియన్ యూనిట్లు అందుబాటులోకి రాబోతున్నాయి. -
పొంచి ఉన్న విద్యుత్ సంక్షోభం
వర్షాభావం జల విద్యుదుత్పాదనకు అటంకాలు తాగునీటికీ కటకటే కొనసాగుతున్న వేసవిలోని పరిస్థితి సాక్షి ప్రతినిధి, బెంగళూరు : నైరుతి రుతు పవనాలు ముఖం చాటేస్తుండడంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులు వ్యవసాయ రంగాన్నే కాకుండా విద్యుదుత్పత్తి రంగాన్ని కూడా ఆందోళనకు గురి చేస్తున్నాయి. రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో 23 శాతం సమకూర్చే శరావతి జల విద్యుదుత్పాదన ప్రాజెక్టులో ఉత్పత్తి కుంటు పడే పరిస్థితి ఏర్పడనుంది. శివమొగ్గ జిల్లా సాగర తాలూకాలోని లింగనమక్కి జలాశయం క్యాచ్మెంట్ ఏరియాలో భారీ వర్షాలు లేకపోవడంతో ఇప్పటికే విద్యుత్ కొరతను ఎదుర్కోవాల్సి వస్తోంది. వర్షాలు రాకుండా ప్రస్తుత నీటి మట్టం మరింతగా తగ్గిపోతే విద్యుదుత్పత్తికి ఆటంకం కలగడం ఖాయం. జలాశయంలో నీటి నిల్వ 1,743 అడుగులకు తగ్గిపోతే విద్యుదుత్పాదన సాధ్యం కాదు. ఈ ప్రాంతంలో శరావతి ప్లాంటులో 1,035 మెగావాట్లు, మహాత్మా గాంధీ విద్యుత్కేంద్రంలో 139, లింగనమక్కి జలాశయంలో 55, కాలి పవర్ ప్రాజెక్టులో 1,420, గెరుసొప్పలో 240 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. 35 శాతం కొరత రాష్ర్టంలోకి రుతు పవనాల ప్రవేశం ఆలస్యం కావడంతో ఇప్పటికే 35 శాతం మేరకు వర్షాభావం నెలకొంది. జూన్ ఒకటో తేది నుంచి ఇప్పటి వరకు 89.4 మి.మీ. వర్షపాతానికి గాను 57.7 మి.మీ. మాత్రమే నమోదైంది. సాధారణంగా జూన్ అయిదో తేదీన రుతు పవనాలు రాష్ట్రంలో ప్రవేశిస్తాయి. ఈపాటికి రాష్ట్రమంతా రుతు పవనాలు విస్తరించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు సగానికి సగం జిల్లాల్లో వర్షం జాడే లేదు. కోస్తా, మలెనాడు తదితర జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో ఈ సమయానికి చల్లటి వాతావరణం ఏర్పడాల్సి ఉండగా, ఇప్పటికీ వేసవిని తలపిస్తోంది. హైదరాబాద్-కర్ణాటక జిల్లాల్లో 35 నుంచి 37 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతోంది. నీటికీ సంక్షోభమే నైరుతి రుతు పవనాలు కోస్తాకే పరిమితం కావడంతో మిగిలిన జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులను నెలకొంటున్నాయి. ఆకాశం మేఘావృత్తమై, కొద్ది సేపటికి మబ్బులు విడిపోతుండడంతో చినుకు రాలడం లేదు. ఇదే పరిస్థితి మరో 15-20 రోజులు కొనసాగితే బెంగళూరులో నీటికి హాహాకారాలు మిన్ను ముట్టే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది. మండ్య జిల్లాలోని కేఆర్ఎస్ నుంచి నగరానికి తాగు నీరు అందాల్సి ఉంది. ఆ జలాశయం నిండాలంటే కొడగు జిల్లాలో విస్తృతంగా వర్షాలు పడాలి. అయితే చినుకులు తప్ప భారీ వర్షాలు లేకపోవడంతో జలాశయంలోకి ఇన్‌ఫ్లో అంతంత మాత్రంగానే ఉంది. కొడగు జిల్లాలో ఇప్పటికే సగటు కంటే 60 శాతం తక్కువగా వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం కేఆర్‌ఎస్‌లో 7.86 టీఎంసీలు, కబిని జలాశయంలో 8.38 టీఎంసీల నీటి నిల్వ ఉంది. అవసర సమయాల్లో కబిని నుంచి కూడా నగరానికి తాగు నీరు సరఫరా చేయవచ్చు. నగరానికి ఏటా 19 టీఎంసీల నీరు అవసరమవుతుంది. మధ్యలో మైసూరు, మండ్య, టీ.నరసీపుర, మళవళ్లిలకూ నీటిని అందించాల్సి ఉంటుంది. నగరానికి రోజూ 700 క్యూసెక్కుల నీరు అవసరం కాగా ప్రస్తుతం 650 క్యూసెక్కులు మాత్రమే అందుబాటులో ఉంది. గత అనుభవం 2012లో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో గత ఏడాది వేసవిలో నీటి కోసం నానా అగచాట్లు పడాల్సి వచ్చింది. కేఆర్ఎస్, కబినిలలో నీరు అడుగంటడంతో హేమావతి జలాశయం నుంచి తెప్పించాల్సి వచ్చింది. అనంతరం నైరుతి రుతు పవనాలు సకాలంలో రాష్ర్టంలోకి ప్రవేశించడం ద్వారా మంచి వర్షాలు పడడంతో సంక్షోభం తొలగిపోయింది. ఈసారి జూన్ ఆరో తేదీ నాటికే రుతు పవనాలు ప్రవేశించాయి. అయితే తుంపర్లు తప్ప భారీ వర్షాలు పడలేదు. కనుక వేసవిలో పరిస్థితే ఇంకా కొనసాగుతోంది. -
ప్రమాద స్థాయిలో రిజర్వాయర్లు
సీలేరు/ముంచంగిపుట్టు, న్యూస్‌లైన్: జల విద్యుత్కేంద్రాల రిజర్వాయర్లలో నీటి మట్టాలు ప్రమాద స్థాయికి చేరాయి. దీంతో సీలేరు కాంప్లెక్స్ పరిధిలోని అన్ని జలాశయాలు నిండుగా ఉన్నాయి. సరిహద్దు ఒడిశాలో భారీ వర్షాలతో ఇన్‌ఫ్లో పెద్ద ఎత్తున వచ్చిపడుతోంది. పరిస్థితి చేయి దాటిపోతే నీటిని వృథాగా విడుదల చేయకతప్పని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తికి డిమాండ్ లేకపోవడం, కొన్ని కేంద్రాల్లో యూనిట్లు పని చేయకపోవడంతో రిజర్వాయర్లలో నీరు ప్రమాద స్థాయికి చేరుకుంటోంది. డొంకరాయిలో పూర్తిస్థాయి నీటిమట్టం 1037 అడుగులకు ప్రస్తుతం 1036 అడుగులకు చేరింది. దీంతో మరో రెండు మూడు అడుగులు చేరితే నీరు వృథాగా విడుదల చేయవలసి వస్తుంది. అలాగే మోతుగూడెంలో 9030 అడుగులకు అక్కడ ఉన్న నాలుగు యూనిట్ల ద్వారా గురువారం నాటికి ఒక యూనిట్ మాత్రమే పనిచేయడంతో 9026.8 అడుగుల నీటిమట్టం చేరింది. విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కలగడంతో ఇక్కడ కూడా ఏఈపీ ద్వారా నీరు విడుదల చేయాల్సి ఉంది. మాచ్‌ఖండ్ జలవిద్యుత్కేంద్రానికి నీరందించే జోలాపుట్టు ప్రధాన రిజర్వాయర్ పూర్తి సామర్ధ్యం 2750 అడుగులు కాగా గురువారం నాటికి 2746.55 అడుగుల నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం ఉన్న నీటితో వచ్చే జూన్ వరకు విద్యుత్ ఉత్పత్తికి ఎటువంటి ఢోకా ఉండదని ప్రాజెక్టు అధికారులు పేర్కొంటున్నారు. ఆరు జనరేటర్లకు రెండు మూలకు చేరగా ప్రస్తుతం 1,2,4,5 నంబర్ల జనరేటర్లతో 76 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. మోతుగూడెం జలాశయంలో 9030 అడుగులకు గాను 9026 అడుగుల నీటిమట్టం ఉంది. అయితే ఇక్కడ నాలుగు యూనిట్లలో రెండు మాత్రమే వినియోగంలోఉండడంతో 110 మెగావాట్ల ద్వారా 2.756 మిలియన్ల విద్యుత్ ఉత్పత్తి జరగుతోంది. మరోవైపు మాచ్‌ఖండ్, సీలేరు, డొంకరాయి, మోతుగూడెం విద్యుత్ కేంద్రాల్లో వెరసి 1.4 మిలీనియం యూనిట్లు (ఎంయూ) విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అయితే హైదరాబాద్ అధికారులు ఆదేశాలతో ఇక్కడ అడపాదడపా విద్యుత్‌ను తయారు చేస్తున్నారు. రాష్ట్రంలో సమైక్యాంధ్ర ఉద్యమంతో పలు చోట్ల విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కలుగుతున్నప్పటికీ ఈ కేంద్రాల్లో విద్యుత్ డిమాండ్ అంతంతమాత్రంగా ఉంది. మరోవైపు జోలాపుట్టులో పూర్తిస్థాయి నీటిమట్టం 2750 అడుగులకు 2746.5 అడుగులకు చేరింది. బలిమెలలో 1513 అడుగుల నీటిమట్టంలో ప్రస్తుతం 1511.8 అడుగులుంది. డొంకరాయి జలాశయంలో 1037 అడుగులకు 1036.4 అడుగుల నీటి నిల్వ ఉంది. ఇక్కడ ఒక యూనిట్ ద్వారా 25 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిలో ప్రస్తుతం 20 మెగావాట్లు మాత్రమే తయారవుతోంది. ఎంత అడిగినా ఇవ్వడానికి సిద్ధం బలిమెలలో రాష్ట్ర వాటా నీరు ఎక్కువగా ఉండడంతో సీలేరు కాంప్లెక్స్ నాలుగు జలవిద్యుత్ కేంద్రాల్లో ఎంత విద్యుత్ అడిగిన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని జెన్కో అధికారులు చెబుతున్నారు. రిజర్వాయర్‌లో నీటిమట్టాలు మూడొంతులకు పైగా ఉండడంతో ఈ కాంప్లెక్స్‌లో రోజుకు 10.4 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి రాష్ట్రానికి వెలుగులు నింపేందుకు సిద్ధంగా ఉన్నారు.