సభలో అభివాదం చేస్తున్న ఎల్.రమణ, గుండు సుధారాణి, రాపోలు ఆనందభాస్కర్ తదితరులు
కోరుట్ల: రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు సాగాలని పద్మశాలీ ఆత్మగౌరవ సభలో వక్తలు పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఆదివారం జరిగిన పద్మశాలీ ఆత్మగౌరవ యుద్ధభేరి సభకు ప్రముఖ కవి గుంటుక నరసయ్య పంతులు ప్రాంగణంగా నామకరణం చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 50 వేల మంది కులబాంధవులు తరలివచ్చారు. తొలుత ముఖ్య అతిథిగా హాజరైన మధ్యప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి (చీఫ్ సెక్రటరీ) పరికిపండ్ల నరహరి మాట్లాడుతూ, పద్మశాలీలు ఐక్యంగా ముందుకు సాగితే సాధించలేనిదేదీ లేదని, చట్టసభల్లో ప్రాతినిధ్యం సాధించడంపై దృష్టి పెట్టాలని కోరారు. పిల్లలు ఉన్నత చదువులు చదివి సంఘం ఐక్యతకు కృషి చేయాలన్నారు.
పద్మశాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామ శ్రీనివాస్ మాట్లాడుతూ, రాజకీయాల్లో ప్రాధాన్యత సాధించేవరకూ పద్మశాలీలు విశ్రమించవద్దని కోరారు. అందరూ ఏకమై ‘మనఓటు మనకే’ నినాదంతో ముందుకు రావాలని కోరారు.కర్నూలు ఎంపీ సంజయ్ మాట్లాడుతూ, పద్మశాలీలు ఎక్కడున్నా జన్యుపరమైన సంబంధం కలుపుతుందన్నారు. ఏపీలో పద్మశాలీలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని గుర్తుచేశారు. ఎంపీగా పార్లమెంట్‌లో పద్మశాలీలకు చెందిన రెండు వీవర్స్ బిల్లులు ప్రవేశపెట్టడానికి కృషి చేశానని తెలిపారు. రాజ్యసభ మాజీ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ మాట్లాడుతూ, పద్మశాలీ కులశక్తి విచ్ఛిన్నం కాకుండా పోరాటం చేస్తే సత్ఫలితాలు ఉంటాయన్నారు. ఎమ్మెల్సీ ఎల్.రమణ మాట్లాడుతూ, రాజకీయ పార్టీ ఏదైనా పద్మశాలీలు ఐక్యంగా ఉండాలని సూచించారు.
వరంగల్ మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ, రాజకీయ అస్థిత్వాన్ని సాధించే దిశ గా ఏర్పాటు చేసిన ఈ సభకు వేలాదిగా పద్మశాలీ లు తరలిరావడం అభినందనీయమన్నారు. ఆత్మ గౌరవ యుద్ధభేరి సభ కమిటీ రాష్ట్ర చైర్మన్ బసవ లక్ష్మీనర్సయ్య మాట్లాడుతూ, చట్టసభల్లో ప్రాతి నిధ్యం ఉంటేనే పద్మశాలీల సమస్యలకు పరిష్కారం దక్కుతుందన్నారు. బీసీల్లో అతిపెద్ద సామాజికవర్గంగా ఉన్నా.. చట్టసభల్లో ఆశించిన రీతిలో ప్రాతినిధ్యం దక్కడం లేదని ఆవేదన చెందారు. మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, జగిత్యాల జిల్లా పద్మశాలీ సంఘం అధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి, పద్మశాలీ సంఘం రాష్ట్ర నాయకులు గజ్జెల శ్రీనివాస్, జక్కుల ప్రసాద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment