- వర్షాభావం
- జల విద్యుదుత్పాదనకు అటంకాలు
- తాగునీటికీ కటకటే
- కొనసాగుతున్న వేసవిలోని పరిస్థితి
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : నైరుతి రుతు పవనాలు ముఖం చాటేస్తుండడంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులు వ్యవసాయ రంగాన్నే కాకుండా విద్యుదుత్పత్తి రంగాన్ని కూడా ఆందోళనకు గురి చేస్తున్నాయి. రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో 23 శాతం సమకూర్చే శరావతి జల విద్యుదుత్పాదన ప్రాజెక్టులో ఉత్పత్తి కుంటు పడే పరిస్థితి ఏర్పడనుంది.
శివమొగ్గ జిల్లా సాగర తాలూకాలోని లింగనమక్కి జలాశయం క్యాచ్‌మెంట్ ఏరియాలో భారీ వర్షాలు లేకపోవడంతో ఇప్పటికే విద్యుత్ కొరతను ఎదుర్కోవాల్సి వస్తోంది. వర్షాలు రాకుండా ప్రస్తుత నీటి మట్టం మరింతగా తగ్గిపోతే విద్యుదుత్పత్తికి ఆటంకం కలగడం ఖాయం. జలాశయంలో నీటి నిల్వ 1,743 అడుగులకు తగ్గిపోతే విద్యుదుత్పాదన సాధ్యం కాదు. ఈ ప్రాంతంలో శరావతి ప్లాంటులో 1,035 మెగావాట్లు, మహాత్మా గాంధీ విద్యుత్కేంద్రంలో 139, లింగనమక్కి జలాశయంలో 55, కాలి పవర్ ప్రాజెక్టులో 1,420, గెరుసొప్పలో 240 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది.
35 శాతం కొరత
రాష్ర్టంలోకి రుతు పవనాల ప్రవేశం ఆలస్యం కావడంతో ఇప్పటికే 35 శాతం మేరకు వర్షాభావం నెలకొంది. జూన్ ఒకటో తేది నుంచి ఇప్పటి వరకు 89.4 మి.మీ. వర్షపాతానికి గాను 57.7 మి.మీ. మాత్రమే నమోదైంది. సాధారణంగా జూన్ అయిదో తేదీన రుతు పవనాలు రాష్ట్రంలో ప్రవేశిస్తాయి. ఈపాటికి రాష్ట్రమంతా రుతు పవనాలు విస్తరించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు సగానికి సగం జిల్లాల్లో వర్షం జాడే లేదు. కోస్తా, మలెనాడు తదితర జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో ఈ సమయానికి చల్లటి వాతావరణం ఏర్పడాల్సి ఉండగా, ఇప్పటికీ వేసవిని తలపిస్తోంది. హైదరాబాద్-కర్ణాటక జిల్లాల్లో 35 నుంచి 37 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతోంది.
నీటికీ సంక్షోభమే
నైరుతి రుతు పవనాలు కోస్తాకే పరిమితం కావడంతో మిగిలిన జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులను నెలకొంటున్నాయి. ఆకాశం మేఘావృత్తమై, కొద్ది సేపటికి మబ్బులు విడిపోతుండడంతో చినుకు రాలడం లేదు. ఇదే పరిస్థితి మరో 15-20 రోజులు కొనసాగితే బెంగళూరులో నీటికి హాహాకారాలు మిన్ను ముట్టే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది. మండ్య జిల్లాలోని కేఆర్‌ఎస్ నుంచి నగరానికి తాగు నీరు అందాల్సి ఉంది.
ఆ జలాశయం నిండాలంటే కొడగు జిల్లాలో విస్తృతంగా వర్షాలు పడాలి. అయితే చినుకులు తప్ప భారీ వర్షాలు లేకపోవడంతో జలాశయంలోకి ఇన్‌ఫ్లో అంతంత మాత్రంగానే ఉంది. కొడగు జిల్లాలో ఇప్పటికే సగటు కంటే 60 శాతం తక్కువగా వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం కేఆర్‌ఎస్‌లో 7.86 టీఎంసీలు, కబిని జలాశయంలో 8.38 టీఎంసీల నీటి నిల్వ ఉంది. అవసర సమయాల్లో కబిని నుంచి కూడా నగరానికి తాగు నీరు సరఫరా చేయవచ్చు. నగరానికి ఏటా 19 టీఎంసీల నీరు అవసరమవుతుంది. మధ్యలో మైసూరు, మండ్య, టీ.నరసీపుర, మళవళ్లిలకూ నీటిని అందించాల్సి ఉంటుంది. నగరానికి రోజూ 700 క్యూసెక్కుల నీరు అవసరం కాగా ప్రస్తుతం 650 క్యూసెక్కులు మాత్రమే అందుబాటులో ఉంది.
గత అనుభవం
2012లో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో గత ఏడాది వేసవిలో నీటి కోసం నానా అగచాట్లు పడాల్సి వచ్చింది. కేఆర్‌ఎస్, కబినిలలో నీరు అడుగంటడంతో హేమావతి జలాశయం నుంచి తెప్పించాల్సి వచ్చింది. అనంతరం నైరుతి రుతు పవనాలు సకాలంలో రాష్ర్టంలోకి ప్రవేశించడం ద్వారా మంచి వర్షాలు పడడంతో సంక్షోభం తొలగిపోయింది. ఈసారి జూన్ ఆరో తేదీ నాటికే రుతు పవనాలు ప్రవేశించాయి. అయితే తుంపర్లు తప్ప భారీ వర్షాలు పడలేదు. కనుక వేసవిలో పరిస్థితే ఇంకా కొనసాగుతోంది.